సాక్షి, అమరావతి: కాలుష్యాన్ని నివారించి అనుకూలమైన పర్యావరణాన్ని నెలకొల్పే చర్యల్లో భాగంగా 15 సంవత్సరాలకు పైగా వినియోగించిన రవాణా (ట్రాన్స్‌పోర్ట్) వాహనాలను ఫిట్‌నెస్ ఆధారంగా తుక్కు చేయడాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 20 ఏళ్లు పైబడి వినియోగించిన రవాణేతర (నాన్–ట్రాన్స్‌పోర్ట్) పాత వాహనాల ఫిట్‌నెస్ ఆధారంగా తుక్కు చేయించేలా వాటి యజమానులను ప్రోత్సహించాలని ప్రతిపాదించింది. ఇందుకోసం తొలి దశలో పాత వాహనాల ‘వలంటీరీ స్క్రాపింగ్’ (స్వచ్ఛందంగా తుక్కు చేసే) విధానాన్ని ప్రకటించింది. పాత వాహనాలను తుక్కు చేసి.. వాటి స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసే వారికి వాహన పన్నుల్లో రాయితీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇందుకోసం రవాణా, రవాణేతర రంగాల వాహనాలకు వేర్వేరుగా రాయితీలను ప్రకటించింది. ఇందుకోసం రిజిస్టర్డ్ వాహనాల స్క్రాపింగ్ ఫెసిలిటీలను (తుక్కు చేసే సదుపాయ కేంద్రాలు) ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించింది.
ఫెసిలిటీలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా రాయితీలిచ్చి ప్రోత్సహిస్తాయా అనే అంశంతో పాటు పాత వాహనాలను తుక్కు చేసి కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి ఇచ్చే రాయితీలపై కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు శుక్రవారం రాష్ట్రాల్లోని రవాణా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపులు జరిపారు. స్క్రాపింగ్ ఫెసిలిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాలు భూమిని రాయితీపై కేటాయించే అంశంపైనా కేంద్రం చర్చించింది. పాత వాహనాలను తుక్కు చేయాలంటే ఆ వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటే సంబంధిత వాహనాల పన్ను బకాయిలు గానీ, గ్రీన్ ట్యక్స్‌గానీ, చలానా బకాయిలు గానీ ఉండకూడదు. పాత వాహనాలను తుక్కు చేసేందుకు ముందుకొచ్చే వారిని ప్రోత్సహించేందుకు వీలుగా ఆ బకాయిలను ఏడాది పాటు రద్దు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది.
రాయితీల ప్రతిపాదన ఇలా..
► పాత వాహనాన్ని తుక్కు చేసినందుకు దాని విలువలో 5 శాతం నగదును వాహనదారుడికి చెల్లించాలని కేంద్రం సూచించింది.
► వాటి స్థానంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి ఆ వాహనాల ధరలో 5 శాతం రాయితీ ఇచ్చేలా సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్‌తో సంప్రదింపులు జరుపుతోంది.
► రాష్ట్రంలో మొత్తం 1,41,50,277 వాహనాలుండగా.. 15 ఏళ్ల వినియోగం దాటిన వాహనాలు వచ్చే ఏడాది మార్చి నాటికి 27,47,943 ఉంటాయని రాష్ట్ర రవాణా శాఖ లెక్క తేల్చింది.
► పాత వాహనాలను తుక్కు చేసిన సర్టిఫికెట్ చూపి కొత్తగా కొనుగోలు చేసే రవాణేతర (నాన్–ట్రాన్స్‌పోర్టు) వాహనాలకు 15 ఏళ్ల పన్నుపై 25 శాతం, రవాణా (ట్రాన్స్‌పోర్టు) వాహనాలకైతే 8 ఏళ్ల పన్నులో 15 శాతం రాయితీ ఇవ్వాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment