బ్యాటరీ బస్సుకు రైట్ రైట్!
⇒ అనుమతినిచ్చిన రవాణా శాఖ
⇒ సికింద్రాబాద్–ఎయిర్‌పోర్టు మార్గంలో నడిపేందుకు ఆర్టీసీ సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: పొగలు కక్కుతూ... పర్యావరణానికి హాని చేసే వాహన కాలుష్యాన్ని కొంతైనా తగ్గించేందుకు గ్రేటర్ ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నంలో మరో అడుగు ముందుకు పడింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బ్యాటరీ బస్సుకు ఎట్టకేలకు రవాణా శాఖ అనుమతి లభించింది. విద్యుత్‌తో చార్జింగ్ అయ్యే ఈ బస్సు తొలిసారిగా రాజధాని రోడ్లపై దూసుకుపోవడానికి సిద్ధమవుతోంది. నగరానికి చెందిన గోల్డ్‌స్టోన్ సంస్థ పది రోజుల క్రితం ఈ బస్సును పరిచయం చేసిన సంగతి తెలిసిందే. దీన్ని ప్రయోగాత్మ కంగా నడిపేందుకు గ్రేటర్ ఆర్టీసీకి అప్పగించింది.
నగరంలో వాహన కాలుష్యం ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన గ్రేటర్ ఆర్టీసీ... దాదాపు 125 సీఎన్‌జీ, మరికొన్ని బయోడీజిల్ బస్సులు నడుపుతోంది. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల అవసరం లేకుండా పూర్తిగా విద్యుత్‌తో నడిచే బ్యాటరీ బస్సును నడపాలని నిర్ణయించింది. దీనికి తాజాగా రవాణా శాఖ అనుమతి లభించడంతో... సికింద్రాబాద్– శంషాబాద్ అంతర్జా తీయ విమానాశ్రయ మార్గంలో నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. జేబీఎస్, కంటోన్మెంట్ డిపోల్లో దీనికి చార్జింగ్ సదుపాయం కల్పించారు. వచ్చే ఫలితాలను బట్టి మరిన్ని బ్యాటరీ ఆధారిత బస్సులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.
విశ్వనగరం దిశగా అడుగులు...
తాజాగా రోడ్డెక్కనున్న బ్యాటరీ బస్సు... విశ్వనగరం దిశగా ముందడుగు కాగలదని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఢిల్లీ వంటి నగరాల్లో కాలుష్య కారక వాహనాలను అరికట్టేందుకు సహజ, ప్రత్యామ్నాయ పర్యావరణహిత ఇంధన వనరులను ప్రోత్సహిస్తున్నారు. అదే తరహాలో హైదరాబాద్‌లోనూ ప్రత్యామ్నాయ ఇంధనాల వినియో గాన్ని పెంచేందుకు బ్యాటరీ బస్సులు దోహదం చేయగలవని అంచనా వేస్తున్నారు. ఈ బస్సు నిర్వహణ ఖర్చు కొద్దిగా ఎక్కువే అయినా.. వాహన కాలుష్యాన్ని అరికట్టడం, ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సదుపాయాలు కల్పించడంలో ఎలాంటి లోటూ ఉండదని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్ ‘సాక్షి’కి చెప్పారు.
ఓల్వో తరహా సదుపాయాలు...
► పూర్తిగా ఓల్వో బస్సుల తరహాలోనే రూపొందించిన ఈ బ్యాటరీ బస్సులో మొత్తం 36 సీట్లుంటాయి.
► ఏసీ లో కుదుపులు లేని ప్రయాణం
► ట్రాఫిక్ తక్కువగా ఉండే మార్గాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు.
► సుమారు రూ.2.56 కోట్ల ఖరీదైన ఈ బస్సును 6 గంటల పాటు చార్జింగ్ చేస్తే 8 గంటలు లేదా 250 కిలోమీటర్ల వరకు నడుస్తుంది.
► నగరంలో నడిచే ఆర్డినరీ బస్సుల అడుగు భాగం ఎత్తు 650 మిల్లీమీటర్లుండగా... బ్యాటరీ బస్సు 220 మిల్లీమీటర్ల ఎత్తులోనే ఉంటుంది.
ప్రత్యామ్నాయ ఇంధన ప్రోత్సాహం
నగరంలో ఆందోళన కలిగిస్తున్న వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించే దిశగా బ్యాటరీ బస్సుకు రవాణాపర మైన అనుమతులు ఇచ్చాము. ఈ బస్సును ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఏ మార్గం లోనైనా నడుపుకోవచ్చు.
– కె.వెంకటరమణ,ప్రాంతీయ రవాణా అధికారి, సికింద్రాబాద్