
రవాణాశాఖ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట రూరల్: తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు రుణాలు నిలిపివేయడంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాపై కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. గురువారం సూర్యాపేటలో రవాణా శాఖ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
17 వేల మెగా వాట్లకుపైగా విద్యుత్ డిమాండ్ వచ్చినా సరఫరాకు సిద్ధంగా ఉన్నామన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో ముందు వరుసలో ఉన్న తెలంగాణను ప్రోత్సహించాల్సిన కేంద్రం, వివక్ష చూపెడుతోందని దుయ్యబట్టారు. విద్యుత్‌కు అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. ఇతర సంస్థలు తెలంగాణకు విద్యుత్ విక్రయించవద్దంటూ కేంద్రం బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు.
కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణ రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీల పాపం కేంద్రానిదేనని అన్నారు. బొగ్గు దిగుమతుల ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో పాటు, కేంద్రం అడ్డగోలుగా పన్నులు విధించడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చిందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ వెంకట్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ జీడి భిక్షం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment