
సాక్షి, అమరావతి: ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయానికి ‘వైఎస్సార్ వాహన మిత్ర’గా నామకరణం చేసినట్లు రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ పథకం డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. అక్టోబర్ 5న లబ్ధిదారులకు నేరుగా చెల్లింపుల రశీదులు అందిస్తామని చెప్పారు. సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు నడుపుకునే డ్రైవర్లకు అందించే రూ.10 వేలు వాహన బీమా, ఫిట్‌నెస్, మరమ్మతులకు ఉపయోగపడతాయన్నారు. బుధవారం అర్ధరాత్రితో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిం దని.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా మొత్తం 1.83 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు.
ఈ దరఖాస్తుల్ని గ్రామ/వార్డు వలంటీర్లకు పంపించామని ఇప్పటి వరకు 74 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని చెప్పారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులపై పరిశీలన జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో అందిన దరఖాస్తుల్ని ఎంపీడీవోలు, పట్టణాలు, నగరాల్లో మున్సిపల్ కమిషనర్లు 45,223 దరఖాస్తుల్ని ఆమోదించారన్నారు. 17,230 దరఖా స్తులకు కలెక్టర్లు మంజూరు అనుమతులిచ్చారని వివరించారు. అధికంగా విశాఖపట్నం, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల నుంచి దరఖాస్తులు అందాయన్నారు. అక్టోబర్ 5న అర్హులైన డ్రైవర్లకు నగదు చెల్లింపుల రశీదులు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సందేశంతో కూడిన పత్రాన్ని గ్రామ/వార్డు వలంటీర్లు అందిస్తారని చెప్పారు.