సాక్షి, అమరావతి : ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10వేల ఆర్థికసాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకానికి తొలిరోజే అనూహ్య స్పందన లభించింది. మొదటి రోజు 7,559 మంది వాహన యజమానులు కమ్ డ్రైవర్లు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించారు. తన సుదీర్ఘ పాదయాత్రలో ఆటోడ్రైవర్ల ఆర్థిక స్థితిగతులను చూసి చలించిపోయిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే బీమా, ఫిట్‌నెస్, మరమ్మత్తుల కోసం ఏడాదికి రూ.10 వేలు అందిస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కాగానే ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారుచేశారు. అంతేకాక.. అన్ని జిల్లాల కలెక్టర్లు, రవాణా మంత్రి, అధికారులతో ఈ నెల 11న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ సాయంపై కాలపరిమితి నిర్ణయించారు.
ఈ నెల 14 నుంచి పథకానికి దరఖాస్తులను అందుబాటులోకి తీసుకురావాలని, ఇదే నెల 25న దరఖాస్తులు సమర్పించేందుకు ఆఖరు తేదీగా ఖరారు చేశారు. 30లోగా గ్రామ/వార్డు వలంటీర్లు ఈ దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అక్టోబర్ 1లోగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలతో పాటు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సందేశాన్ని అందిస్తారు. అక్టోబర్ 4 నుంచి లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించాలని సర్కారు ఆదేశాలు జారీచేసింది. దీంతో రవాణా శాఖ అధికారులు శనివారం నుంచి దరఖాస్తుల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దరఖాస్తులను రవాణా శాఖ వెబ్‌సైట్ (www. aptransport. org), అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు/ఆర్‌టీవోలు/ఎంవీఐ కార్యాలయాలతో పాటు మీసేవ, సీఎస్‌సీ (కామన్ సర్వీస్ సెంటర్) కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తు చేసుకునేందుకు, రుణం లేని బ్యాంకు పాస్ పుస్తకం పొందేందుకు దరఖాస్తుదారులకు గ్రామ/వార్డు వలంటీర్లకు సహకారం అందిస్తారు.
25లోగా రిజిస్ట్రేషన్ అయిన వాటికే వర్తింపు
ఇదిలా ఉంటే.. గ్రామ/వార్డు వలంటీర్లు దరఖాస్తుదారుడి నుంచి ఆధార్, తెల్ల రేషన్ కార్డులు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్సు, రుణం లేని బ్యాంకు పాస్ పుస్తకం మొదటి పేజీ, అకౌంట్ వివరాలు, కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ, మైనార్టీ అయితే) జిరాక్స్ కాపీలు తీసుకోవాలి. వీటన్నింటినీ పరిశీలించిన అనంతరం యజమాని వద్ద వాహనం ఉందో లేదో చూడాలి. ఆ తర్వాత దరఖాస్తులను ఎంపీడీవో/సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి/మున్సిపల్ కమిషనర్/బిల్ కలెక్టర్లకు పంపిస్తారు. కాగా, సొంత ఆటో/ట్యాక్సీ/మ్యాక్సీ క్యాబ్‌లు ఈ ఏడాది సెప్టెంబరు 25లోగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఓనర్ కమ్ డ్రైవర్‌గా ఉండే వారికి ఈ పథకం వర్తిస్తుందని రవాణా శాఖ పేర్కొంది. వాహనం భార్య పేరున ఉండి భర్త వాహనం నడుపుతుంటే సాయం భార్యకు వర్తిస్తుందని తెలిపింది.
అన్ని రవాణా కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు
కాగా, ఈ పథకం అమలుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు ప్రతి జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటుచేసినట్లు రవాణశాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. అలాగే, రాష్ట్ర స్థాయిలో రవాణా కమిషనర్ కార్యాలయంలోని సంయుక్త రవాణా కమిషనర్ (ఐటీ) నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్సు ఏర్పాటుచేశామన్నారు. ఎంతమంది అర్హులున్నప్పటికీ వారందరికీ ఈ ఆర్థికసాయం వర్తింపజేసేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలిచ్చినట్లు ఆయన చెప్పారు.
ఆటో డ్రైవర్ల ఆర్థిక సాయానికి.. భారీగా దరఖాస్తులు
Published Sun, Sep 15 2019 4:07 AM | Last Updated on Sun, Sep 15 2019 9:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment