Transport department authorities
-
జేసీ ట్రావెల్స్ రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు
సాక్షి, విజయవాడ : దివాకర్ ట్రావెల్స్ పేరుతో జేసీ దివాకర్‌రెడ్డి అక్రమాలు బయటపడుతున్నాయి. రవాణాశాఖ జరుపుతున్న దర్యాప్తులో అనేక వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, నాగాలాండ్ రాష్ట్రాల్లో జేసీ ట్రావెల్స్ అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. అశోక్ లేలాండ్ వద్ద స్కాప్ లారీలను కొనుగోలు చేసిన జేసీ వాటిని బస్సులుగా మార్చినట్లు ఆయన తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లో స్కాప్ లారీలను బస్సులుగా రిజిస్టర్ చేయించారని, సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీ పేరుతో 43 వాహనాలు, జఠాథర కంపెనీ పేరుతో 26 వాహనాలు కొన్నట్లు రికార్డులు సృష్టించారని వెల్లడించారు. ఆరు వాహనాలను తనిఖీలు చేసినప్పుడు అక్రమాలు వెలుగు చూశాయని ప్రసాద్‌రావు తెలిపారు. రవాణాశాఖ ప్రత్యేక బృందం నాగాలాండ్‌లో కూడా దర్యాప్తు జరుపుతుందని, నాగాలాండ్‌లో కొన్నట్లు చూపిన బస్సులో కూడా బోగస్ సర్టిఫికెట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీస్ శాఖ ఇచ్చే నో క్లియరెన్స్ సర్టిఫికెట్లు కూడా బోగస్‌వే పెట్టారని తెలిపారు. ఇప్పటి వరకు 66 స్కాప్ లారీలను బస్సులుగా మర్చినట్లు గుర్తించారని, మరో 88 వాహనాలు కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. సుప్రీంకోర్టు చట్టాల ప్రకారం ఈ బస్సులకు అనుమతి లేదని, జేసీ ట్రావెల్స్‌లోని బస్సుల రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా సమాచారం ఇచ్చామని ,అక్కడ కూడా రిజిస్ట్రేషన్లు రద్దు అవుతాయన్నారు. తమ శాఖలో ఎవరి పాత్ర అయినా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జేసీ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేశామని, బోగస్ సర్టిఫికెట్లు పెట్టినందుకు పోలీస్ శాఖ కూడా కేసు నమోదు చేసిందని తెలిపారు. కేవలం జేసీ ట్రావెల్స్పైనే తనిఖీలు చేయలేదని, గత ఏడాది కాలంలో 14వేల కేసులు నమోదు చేశామని వెల్లడించారు. రూ.4కోట్లకుపైగా ఫైన్ వసూలు చేశామని ప్రసాద్‌రావు తెలిపారు. -
ఆటో డ్రైవర్ల ఆర్థిక సాయానికి.. భారీగా దరఖాస్తులు
సాక్షి, అమరావతి : ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10వేల ఆర్థికసాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకానికి తొలిరోజే అనూహ్య స్పందన లభించింది. మొదటి రోజు 7,559 మంది వాహన యజమానులు కమ్ డ్రైవర్లు ఆన్లైన్లో తమ దరఖాస్తులను సమర్పించారు. తన సుదీర్ఘ పాదయాత్రలో ఆటోడ్రైవర్ల ఆర్థిక స్థితిగతులను చూసి చలించిపోయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే బీమా, ఫిట్నెస్, మరమ్మత్తుల కోసం ఏడాదికి రూ.10 వేలు అందిస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కాగానే ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారుచేశారు. అంతేకాక.. అన్ని జిల్లాల కలెక్టర్లు, రవాణా మంత్రి, అధికారులతో ఈ నెల 11న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ సాయంపై కాలపరిమితి నిర్ణయించారు. ఈ నెల 14 నుంచి పథకానికి దరఖాస్తులను అందుబాటులోకి తీసుకురావాలని, ఇదే నెల 25న దరఖాస్తులు సమర్పించేందుకు ఆఖరు తేదీగా ఖరారు చేశారు. 30లోగా గ్రామ/వార్డు వలంటీర్లు ఈ దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అక్టోబర్ 1లోగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలతో పాటు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశాన్ని అందిస్తారు. అక్టోబర్ 4 నుంచి లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించాలని సర్కారు ఆదేశాలు జారీచేసింది. దీంతో రవాణా శాఖ అధికారులు శనివారం నుంచి దరఖాస్తుల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దరఖాస్తులను రవాణా శాఖ వెబ్సైట్ (www. aptransport. org), అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు/ఆర్టీవోలు/ఎంవీఐ కార్యాలయాలతో పాటు మీసేవ, సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్) కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తు చేసుకునేందుకు, రుణం లేని బ్యాంకు పాస్ పుస్తకం పొందేందుకు దరఖాస్తుదారులకు గ్రామ/వార్డు వలంటీర్లకు సహకారం అందిస్తారు. 25లోగా రిజిస్ట్రేషన్ అయిన వాటికే వర్తింపు ఇదిలా ఉంటే.. గ్రామ/వార్డు వలంటీర్లు దరఖాస్తుదారుడి నుంచి ఆధార్, తెల్ల రేషన్ కార్డులు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్సు, రుణం లేని బ్యాంకు పాస్ పుస్తకం మొదటి పేజీ, అకౌంట్ వివరాలు, కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ, మైనార్టీ అయితే) జిరాక్స్ కాపీలు తీసుకోవాలి. వీటన్నింటినీ పరిశీలించిన అనంతరం యజమాని వద్ద వాహనం ఉందో లేదో చూడాలి. ఆ తర్వాత దరఖాస్తులను ఎంపీడీవో/సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి/మున్సిపల్ కమిషనర్/బిల్ కలెక్టర్లకు పంపిస్తారు. కాగా, సొంత ఆటో/ట్యాక్సీ/మ్యాక్సీ క్యాబ్‌లు ఈ ఏడాది సెప్టెంబరు 25లోగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఓనర్ కమ్ డ్రైవర్‌గా ఉండే వారికి ఈ పథకం వర్తిస్తుందని రవాణా శాఖ పేర్కొంది. వాహనం భార్య పేరున ఉండి భర్త వాహనం నడుపుతుంటే సాయం భార్యకు వర్తిస్తుందని తెలిపింది. అన్ని రవాణా కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు కాగా, ఈ పథకం అమలుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు ప్రతి జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటుచేసినట్లు రవాణశాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. అలాగే, రాష్ట్ర స్థాయిలో రవాణా కమిషనర్ కార్యాలయంలోని సంయుక్త రవాణా కమిషనర్ (ఐటీ) నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ఫోర్సు ఏర్పాటుచేశామన్నారు. ఎంతమంది అర్హులున్నప్పటికీ వారందరికీ ఈ ఆర్థికసాయం వర్తింపజేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలిచ్చినట్లు ఆయన చెప్పారు. -
ఇసుకపై నిరంతర నిఘా!
సాక్షి, అమరావతి: నిరంతర నిఘా ద్వారా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు పూర్తిగా చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క టన్ను ఇసుక కూడా దారిమళ్లడానికి, దుర్వినియోగానికి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని రీచ్‌లు, స్టాక్ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అధికారులు నిరంతర నిఘా కొనసాగించనున్నారు. అంతేకాకుండా ఇసుక తరలించే వాహనాలను నిరంతరం ట్రాకింగ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జీపీఎస్ పరికరాలు అమర్చిన వాహనాలను మాత్రమే ఇసుక రవాణాకు అనుమతించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వాహనాలను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనుంది. కాగా, రాష్ట్రంలో అన్ని ఇసుక రేవులు, స్టాక్ యార్డుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లలో అతి తక్కువ మొత్తానికి రూ.58,970.5కు కోట్ చేసిన ఆర్యాస్ స్మార్ట్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్–1గా నిలిచింది. ‘రూ.59,689.66కు బిడ్ వేసిన యాపిల్ విజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్–2గా, రూ.1,32,299కి కోట్ చేసిన బ్రిస్పతి అనే సంస్థ ఎల్–3గా నిలిచాయి. కెమెరా, స్తంభం, బ్యాటరీ, సోలార్ ప్యానల్, ఇన్స్టలేషన్ కలిపి సీసీ కెమెరా యూనిట్‌గా నిర్ణయించి 302 యూనిట్లకు టెండర్లు పిలవగా ఒక్కో యూనిట్‌కు రూ.58,970.5కు ఆర్యాస్ బిడ్ వేసింది. ఇదే తక్కువ మొత్తం కావడంతో ఈ సంస్థకే టెండరును ఖరారు చేశారు. అలాగే ఇసుక తవ్వకం (క్వారీల్లో ఇసుక తవ్వకం, కూలీలతో ట్రాక్టర్‌కు లోడింగ్, స్టాక్ యార్డుకు రవాణా, అన్ లోడింగ్, అక్కడ నుంచి వినియోగదారులకు రవాణా చేసేందుకు టిప్పర్‌కు లోడింగ్) కోసం తొమ్మిది షెడ్యూళ్లకు టెండర్లు పిలవగా 40 మంది బిడ్లు వేశారు. అంతకుముందు తొలి విడతలో 38 షెడ్యూళ్లకు టెండర్లు ఖరారు చేశారు. రవాణా టెండర్లు రద్దు స్టాక్ యార్డుల నుంచి వినియోగదారులకు ఇసుక రవాణా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ జిల్లా యూనిట్‌గా పిలిచిన టెండర్లు రద్దు కానున్నాయి. జీపీఎస్ పరికరాలు అమర్చుకుని భూగర్భ గనుల శాఖలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలన్నింటికీ స్టాక్ యార్డుల నుంచి వినియోగదారులు కోరిన చోటకు ఇసుక రవాణా చేసే అవకాశం కల్పించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ టెండర్లు రద్దయినట్టే. ప్రజలకు సరసమైన ధరలకు ఇసుకను తీసుకెళ్లే అవకాశం వాహన యజమానులందరికీ కల్పించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ అధికారులు వాహన యజమానుల అసోసియేషన్లతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి ఇసుక రవాణా ధరలను ఖరారు చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. -
మూడో విడత ఫ్యాన్సీ నెంబర్ల వేలం
* నేటి నుంచి ప్రారంభం.. నెలాఖరు వరకు గడువు * ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ వేలంలో పేరు నమోదు న్యూఢిల్లీ : ఫ్యాన్సీ నెంబర్లు అవసరం ఉన్న వాహనదారులకు మరో అవకాశం లభించింది. ఫ్యాన్సీ నెంబర్ల కోసం మొదటి, రెండు దఫాల్లో నిర్వహించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో నెంబర్లు తీసుకోని వారికి ప్రభుత్వం మూడో విడత అవకాశాన్ని కల్పించింది. ఈ సారి ఈ -వేలం విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ తెలిపిన వివరాల ప్రకారం. 0001 రిజిస్ట్రేషన్ నెంబర్ అత్యంత ఆదరణ ఉంది. దీనికి రూ. 5లక్షలుగా ఫిక్స్‌డ్‌గా నిర్ణయించారు. రెండో ప్రాధాన్యతా నెంబర్ 0002-0009 రూ. ప్రారంభ ధర రూ. 3 లక్షలు, మూడో కేటగిరిలో 0010 నుంచి 009, 0786, 1000, 1111, 7777, 999 దీని ధరను రూ. 2 లక్షలుగా నిర్ణయించిన రవాణాశాఖాధికారులు పేర్కొన్నారు. ఈ వేలం ద్వారా నెంబర్లను కేటాయించే విధానం డిసెంబర్ 30 వరకు కొనసాగుతోంది. మూడో విడతలో 140 ఫ్యాన్సీ నెంబర్లను కేటాయించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నామని చెప్పారు. ఈ నెంబర్లను కావల్సి వాహనదారులు ‘ఆన్లైన్’లో రిజిస్ట్రేషన్ చేయించుకొని వేలంలో పాల్గొనవచ్చు. ఇంతకు ముందు నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో అత్యధికంగా 0001ను వాహనదారులు సొంత చేసుకొన్నారు. ఇందుకు రూ. 12.5ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. మొత్తం ఫ్యాన్సీ నెంబర్లకు రూ. 74 లక్షల ఆధాయం వచ్చింది. రెండో విడత నిర్వహించిన కార్యక్రమంలో రెండో కేటగిరికి చెందిన ఫ్యాన్సీ నెంబర్‌కు రూ. 7.5 లక్షల ఆదాయం వచ్చిందని సంబధిత అధికారి పేర్కొన్నారు.