ఇసుకపై నిరంతర నిఘా! | Continuous surveillance on the sand | Sakshi
Sakshi News home page

ఇసుకపై నిరంతర నిఘా!

Published Sat, Aug 31 2019 4:37 AM | Last Updated on Sat, Aug 31 2019 4:37 AM

Continuous surveillance on the sand - Sakshi

సాక్షి, అమరావతి: నిరంతర నిఘా ద్వారా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు పూర్తిగా చెక్‌ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క టన్ను ఇసుక కూడా దారిమళ్లడానికి, దుర్వినియోగానికి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని రీచ్‌లు, స్టాక్‌ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అధికారులు నిరంతర నిఘా కొనసాగించనున్నారు. అంతేకాకుండా ఇసుక తరలించే వాహనాలను నిరంతరం ట్రాకింగ్‌ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జీపీఎస్‌ పరికరాలు అమర్చిన వాహనాలను మాత్రమే ఇసుక రవాణాకు అనుమతించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వాహనాలను కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షించనుంది. కాగా, రాష్ట్రంలో అన్ని ఇసుక రేవులు, స్టాక్‌ యార్డుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ టెండర్లు నిర్వహించింది.

ఈ టెండర్లలో అతి తక్కువ మొత్తానికి రూ.58,970.5కు కోట్‌ చేసిన ఆర్యాస్‌ స్మార్ట్‌ సిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎల్‌–1గా నిలిచింది. ‘రూ.59,689.66కు బిడ్‌ వేసిన యాపిల్‌ విజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎల్‌–2గా, రూ.1,32,299కి కోట్‌ చేసిన బ్రిస్పతి అనే సంస్థ ఎల్‌–3గా నిలిచాయి. కెమెరా, స్తంభం, బ్యాటరీ, సోలార్‌ ప్యానల్, ఇన్‌స్టలేషన్‌ కలిపి సీసీ కెమెరా యూనిట్‌గా నిర్ణయించి 302 యూనిట్లకు టెండర్లు పిలవగా ఒక్కో యూనిట్‌కు రూ.58,970.5కు ఆర్యాస్‌ బిడ్‌ వేసింది. ఇదే తక్కువ మొత్తం కావడంతో ఈ సంస్థకే టెండరును ఖరారు చేశారు. అలాగే ఇసుక తవ్వకం (క్వారీల్లో ఇసుక తవ్వకం, కూలీలతో ట్రాక్టర్‌కు లోడింగ్, స్టాక్‌ యార్డుకు రవాణా, అన్‌ లోడింగ్, అక్కడ నుంచి వినియోగదారులకు రవాణా చేసేందుకు టిప్పర్‌కు లోడింగ్‌) కోసం తొమ్మిది షెడ్యూళ్లకు టెండర్లు పిలవగా 40 మంది బిడ్లు వేశారు. అంతకుముందు తొలి విడతలో 38 షెడ్యూళ్లకు టెండర్లు ఖరారు చేశారు.

రవాణా టెండర్లు రద్దు
స్టాక్‌ యార్డుల నుంచి వినియోగదారులకు ఇసుక రవాణా చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ జిల్లా యూనిట్‌గా పిలిచిన టెండర్లు రద్దు కానున్నాయి. జీపీఎస్‌ పరికరాలు అమర్చుకుని భూగర్భ గనుల శాఖలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వాహనాలన్నింటికీ స్టాక్‌ యార్డుల నుంచి వినియోగదారులు కోరిన చోటకు ఇసుక రవాణా చేసే అవకాశం కల్పించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ టెండర్లు రద్దయినట్టే. ప్రజలకు సరసమైన ధరలకు ఇసుకను తీసుకెళ్లే అవకాశం వాహన యజమానులందరికీ కల్పించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ అధికారులు వాహన యజమానుల అసోసియేషన్లతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి ఇసుక రవాణా ధరలను ఖరారు చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement