‘ఎక్స్‌ట్రా’ షోరూంలకు తాళం
♦ కొరడా ఝుళిపిస్తున్న రవాణా శాఖ
♦ అదనపు చార్జీలకు ముకుతాడు
సాక్షి, హైదరాబాద్: డీలర్లు కంపెనీ పేర్కొన్న ఎక్స్‌షోరూం రేటు కన్నా ఎక్కువ ధరలకు వాహనాలు విక్రయిస్తుండటాన్ని రవాణా శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. వాహన షోరూంలు నిబంధనలకు విరుద్ధంగా హ్యాండ్లింగ్ చార్జీ పేర రూ.8 వేలు, ఫెసిలిటేషన్ చార్జీ కింద 1,900, లాజిస్టిక్ పేరు తో రూ.800 అదనంగా వసూలు చేస్తున్నాయి. అవేంటని షోరూం నిర్వాహకులను అడిగితే... కంపెనీ నుంచి షోరూం వరకు కారు తేవటానికి అయ్యే ఖర్చని అంటున్నారు. దీనిపై కొనుగోలుదారులకు అవగాహన లేక డీలర్లు వారి జేబుకు చిల్లు పెడుతున్నారు. ఈ వ్యవహారంపై ఇంతకాలం కళ్లుమూసుకున్న రవాణా అధికారులు ఇప్పు డు డీలర్లపై కొరడా ఝుళిపిస్తున్నారు.
హైదరాబాద్‌లోని 4 షోరూంలపై ఇలాంటి ఫిర్యాదులు అందడంతో అధికారులు వాటికి తాళాలు వేసి వాహనాల అమ్మకంపై ఆంక్షలు విధిం చారు. పక్షం రోజుల పాటు కార్యకలాపాలు సాగకుండా చర్యలు తీ సుకున్నారు. కార్లు గానీ ద్విచక్రవాహనాలు గానీ ఏ ధరకు అమ్మాలో తయారీ కంపెనీ ఖరారు చేసిన ధరకే డీలర్లు విక్రయించాలి. ఈ విష యం నిబంధనల్లో స్పష్టంగా ఉంది. కానీ చాలామంది డీలర్లు కంపెనీలు రకరకాల పేర్లతో ఎక్కువ రుసుములను బిల్లుల్లో చేరుస్తున్నారు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు సహా మరికొన్ని న్యాయస్థానాలు ఈ వసూళ్లపై స్పందించడంతో రాష్ట్ర రవాణాశాఖ అధికారులు కళ్లుతెరిచారు. కంపెనీలతో చర్చించి అసలు ధరలెలా ఉండాలో తెలుసుకుని ప్రత్యక్ష చర్యలకు దిగారు.