‘శిద్ధా’ ప్రకటనలు శుద్ధ దండగ
‘‘ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ప్రైవేటు ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తప్పవు. ఆర్టీసీలో వసూలు చేస్తున్న ఛార్జీలనే ప్రైవేటు ఆపరేటర్లు వసూలు చేయాలని చెప్పాం. ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీపై రవాణా శాఖ అధికారులతో ఆకస్మిక దాడులు జరిపించి బస్సు పర్మిట్లు రద్దు చేస్తాం.’’
- మూడు రోజుల క్రితం రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పిన మాటలివి. గతేడాది పండగ సీజన్లలోనూ ప్రైవేటు దోపిడీపై మంత్రి ఈ తరహా ప్రకటనలు చేసినా ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు బేఖాతరు చేశారు. ఈ ఏడాదీ అంతే. దీంతో మంత్రి శిద్ధా రాఘవరావు ప్రకటనలన్నీ శుద్ధ దండగని తేలిపోయింది.
* యథేచ్ఛగా దోచుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు
* నిర్భయంగా ఆన్‌లైన్‌లో అధిక ధరలతో టిక్కెట్లు
* ఒక్కరిపైనా దాడులు చేయని రవాణాశాఖ
* ఇరువురు ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు
* మంత్రి ఆదేశాలు బేఖాతరు.. సంక్రాంతి ప్రయాణం భారం
సాక్షి, హైదరాబాద్: ఏపీ నుంచి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేందుకు హైదరాబాద్ వచ్చిన మధ్యతరగతి వర్గాలు దాచుకున్న డబ్బంతా కరిగించేసింది ఈ సంక్రాంతి ప్రయాణం. హైదరాబాద్ నుంచి ఏపీలోని ఏ ప్రాంతానికి వెళదామన్నా రూ.వేలల్లోనే ఛార్జీలు ఉండటం.. ప్రభుత్వం తమ ప్రయాణానికి తగ్గట్లు ఏర్పాటు చేయకపోవడంతో ఇక్కట్లు తప్పలేదు.
సొంతూరులో పండగ చేసుకునే సెంటిమెంట్‌కు ప్రైవేటు ట్రావెల్స్ సొమ్ము చేసుకున్నాయి. ఈ నెల 18 వరకు ప్రైవేటు ఆపరేటర్ల దూకుడు తగ్గేట్లుగా లేదు. ప్రయాణికుల అవసరాలను గరిష్టంగా దోపిడీ చేస్తూ ప్రైవేటు ఆపరేటర్లు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు ధరలు పెట్టి మరీ బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సుల్ని తిప్పుతున్నా చోద్యం చూస్తున్న ప్రభుత్వం ఈ దోపిడీకి వత్తాసు పలుకుతోంది. రూ.వేలు పెట్టి టిక్కెట్లు కొని సొంత ఊళ్లకు చేరినవారు తిరిగి ఎలా చేరుకోవాలోనని మథనపడుతున్నారు.
కడప, కర్నూలు, విశాఖలకు రూ.2 నుంచి రూ.3 వేల వరకు టిక్కెట్లు రేట్లు పెట్టి ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల జేబులు కొల్లగొట్టారు. మళ్లీ తిరుగు ప్రయాణంలోనూ ప్రైవేటు ఆపరేటర్లు ఇదే తరహా బాదుడుకి సిద్ధం కావడం గమనార్హం. ప్రైవేటు ఆపరేటర్లు అధిక శాతం అధికారపార్టీకి చెందినవారే కావడంతో ప్రభుత్వం కూడా యధోచితంగా సహకరిస్తోంది. రవాణా శాఖ ఈ పది రోజుల్లో రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్‌పై ఒక్క కేసైనా నమోదు కూడా చేయలేదంటే ఆపరేటర్లకు ఎంతటి సహకారం ఉందో తెలుసుకోవచ్చు.
ముందస్తు ఏర్పాట్లలో ప్రభుత్వ వైఫల్యం
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి ప్రయాణానికి ముందస్తు ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం చెందింది. ఆర్టీసీ ఈ సీజన్‌లో 2,700 బస్సుల్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఆ మేరకు నడపడంలో విఫలమైంది. ఆన్‌లైన్ రిజర్వేషన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోలేదు. సిటీ బస్సుల్ని ప్రత్యేక బస్సులుగా నడపడం, అందులోనూ ప్రత్యేకమైన బోర్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేయలేదు.
రాష్ట్ర ప్రభుత్వం రైల్వేతో సంప్రదించి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కోరలేదు. రైల్వే కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికుల వెతలు అన్నీ ఇన్నీ కావు. సరిపడా బోగీలు లేక కాలుమోపే పరిస్థితి కానరాక ఊళ్లకు చేరడానికి నానా తంటాలు పడ్డారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జంటనగరాల్లో తిరిగే సిటీ బస్సులను కూడా సంక్రాంతి పండుగ కోసం ఆంధ్రా ప్రాంతానికి నడిపేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి ఆంధ్రా ప్రాంతానికి అదనపు బస్సులు నడపాల్సిందిగా తెలంగాణ సర్కారును కనీసం కోరలేదు.
ఇద్దరు ఉన్నతాధికారులకు భారీ ముడుపులు
అడ్డగోలుగా ప్రైవేటు ఆపరేటర్లు బస్సులు తిప్పుతున్నా.. అందిన కాడికి దోచుకుంటున్నా.. రవాణా శాఖ చేష్టలుడిగి చూడటం వెనుక రూ.కోట్లు చేతులు మారిన ట్లు ఆరోపణలున్నాయి. రవాణా శాఖలో ఇరువురు ఉన్నతాధికారులకు ప్రైవేటు ఆపరేటర్లు భారీగా ముట్టజెప్పడంతోనే ప్రైవేటు బస్సుల జోలికెళ్లవద్దని రవాణా వర్గాలకు అంతర్గత ఆదేశాలు జారీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు షిర్డీలో ఘోర ప్రమాదానికి గురై పదుల సంఖ్యలో మరణించినప్పుడు రవాణా శాఖ ప్రైవేటు ట్రావెల్స్‌పై వరుస దాడులు నిర్వహించి కట్టడి చేసింది.
అప్పట్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రోడ్డెక్కాలంటే భయపడే పరిస్థితి నెల కొంది. ఇప్పుడు మాత్రం రవాణా అధికారులు తామేం చేయలేమని చెప్పడం పరిశీలనాంశం. ఇటీవలే మంత్రి శిద్ధా రాఘవరావు రవాణా శాఖ అధికారులతో సమావేశమై కఠిన చర్యలు చేపట్టాలని సూచించినా ట్రావెల్స్ దోపిడీకి అడ్డుకట్ట పడలేదు. భారీగా పెంచిన టిక్కెట్ల ధరలను నిర్భయంగా ఆన్‌లైన్‌లో ఉంచారు. అయితే వెయిటింగ్ లిస్ట్ అని పేర్కొని ఆన్‌లైన్‌లో ఉంచిన రేట్ల కంటే రెట్టింపు ఛార్జీలు వసూలు చేయడం గమనార్హం.