► జిల్లా చేజారిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ?
► వంద కోట్ల ప్రాజెక్ట్‌ను దారి మళ్లించిన మంత్రి శిద్దా...
► పట్టించుకోని జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు
సాక్షి, గుంటూరు : రాష్ట్రంలోనే మొట్టమొదట ఏర్పాటు కానున్న అతి పెద్ద ప్రాజెక్ట్ అయిన ‘డ్రైవింగ్ శిక్షణ కేంద్రం’ను నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం జరగనున్న గుంటూరు జిల్లాలో ఏర్పాటుకు రవాణాశాఖ ఉన్నతాధికారులు ఆరు నెలల క్రితమే ప్రతిపాదనలు పంపారు. ఇందుకోసం గుంటూరులోని అడవితక్కెళ్లపాడు వద్ద ఐదెకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులతో కలసి అప్పటి డీటీసీ సుందర్ పరిశీలించారు. సుమారు రూ. వంద కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ కేంద్రాన్ని రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేస్తే రూ. వంద కోట్ల వ్యయంతో గుంటూరులో ఏర్పాటు కానున్న భారీ ప్రాజెక్టు ‘డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్’ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు దారి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు....ఇందులో ఆయన సఫలీకృతులవుతున్నట్టు ఆ శాఖ ఉన్నతాధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. ఆయన సొంత జిల్లా ప్రకాశంలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం నిర్మాణానికి మార్గం సుగమం అయినట్టేనని చెపుతున్నారు.
ఆంధ్రాలోని 13 జిల్లాలకు సౌకర్యంగా ఉంటుందనేది ఉన్నతాధికారుల ఉద్దేశం. దీనికి సంబంధించి నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. గుంటూరులో నెలకొల్పడం దాదాపు ఖాయమనుకుంటున్న తరుణంలో రాష్ట్ర రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావు మంత్రాంగం నడిపి తన సొంత జిల్లా అయిన ప్రకాశంకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం స్థలాన్ని సైతం సిద్ధం చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. మంత్రి స్వయంగా ప్రతిపాదనలు పంపించిన తరువాత ఉన్నతాధికారులు సైతం ఆయన మాట కాదనలేక గుంటూరు ఊసు ఎత్తడం లేదని తెలుస్తోంది.
గుంటూరులో ఏర్పాటుకు ప్రతిపాదనలు వెళ్లిన తరువాత మంత్రి దీనిని ప్రకాశం జిల్లాకు తరలిస్తున్నట్లు తె లిసి కూడా గుంటూరు జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు మిన్న కుండటం విమర్శలకు తావిస్తోంది. గుంటూరు జిల్లాలో రాజధానికి భూములు సమీకరించి ప్రాజెక్ట్‌లను మాత్రం లేకుండా చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తమ సొంత పనులు చూసుకోవడమే సరిపోతుందని, ఉపాధి కల్పించే ప్రాజెక్ట్‌లను జిల్లాకు తేవడంలో విఫలమౌతున్నారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఇప్పటికైనా మంత్రులు స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి శిక్షణ కేంద్రం ప్రకాశం జిల్లాకు తరలిపోకుండా చూడాలని కోరుతున్నారు.
డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగాలు ....
రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్మించే డ్రైవింగ్ శిక్షణ కేంద్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే ఉంటుంది. అత్యాధునిక హంగులతో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఐదు నుంచి పదెకరాల స్థలంలో సువిశాలంగా నిర్మించే ఈ కేంద్రంలో ఐదు హెవీ డ్రైవింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తారు. రోజుకు సుమారు 20 మందికి పైగా శిక్షణ పొందే విధంగా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్కరికీ వారం నుంచి పది రోజుల పాటు శిక్షణ ఇస్తారు.
కేంద్రంలో ఇన్‌బుల్ట్ కెమెరాలు ఏర్పాటు చేసి డ్రైవింగ్ నైపుణ్యాన్ని కంప్యూటర్‌లో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇక్కడ శిక్షణ పొందే వారికి వైద్య సేవలు అందించడంతోపాటు బీమా కూడా వర్తింపజేస్తారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అన్ని హంగులతో రూ. వంద కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న శిక్షణ కేంద్రం గుంటూరు నుంచి తరలివెళ్లనుందన్న వార్త జిల్లా ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది.
రూటు మారిందా.. గోవిందా..!
Published Sun, Apr 26 2015 12:22 AM | Last Updated on Thu, May 24 2018 1:57 PM
Advertisement
Advertisement