మద్యం అక్రమ తయారీ, నిరోధంపై గట్టి చర్యలు తీసుకోవాలి. నాటుసారా తయారీ వృత్తిగా కొనసాగిస్తున్న వారి జీవితాలను మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను వారికి అందుబాటులోకి తీసుకు రావాలి. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలి.
– సీఎం వైఎస్ జగన్
రిజిస్ట్రేషన్ ఆదాయాలపై ఐఏఎస్ అధికారులు కృష్ణబాబు, రజత్ భార్గవ, నీరబ్ కుమార్ ప్రసాద్, గుల్జార్ సభ్యులుగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి. రెండు వారాల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ అవసరమయ్యే సేవలు ఏమిటి? వాటివల్ల ఎలాంటి హక్కులు ఉంటాయి? దాని వల్ల ప్రజలకు ఏమి ఉపయోగం? అనే విషయాలపై అవగాహన కల్పించాలి. రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులోకి తీసుకురావాలి. ప్రొఫెషనల్ ఏజెన్సీల సహాయం తీసుకుంటూ నాన్ రిజిస్ట్రేషన్ పరిస్థితులను పూర్తిగా తొలగించాలి.
సాక్షి, అమరావతి: పన్ను చెల్లింపుదారులకు సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పన్నుల్లో ఎక్కడా లీకేజీలు (ఎగవేతలు, ఆదాయాన్ని తక్కువ చేసి చూపడం, తప్పుడు లెక్కలు) లేకుండా చూసుకోవాలని, వాటిని అరికట్టడానికి అవసరమైతే ప్రొఫెషనల్ ఇన్‌స్టిట్యూట్‌ల సహాయం తీసుకోవాలని స్పష్టం చేశారు. మద్యం అక్రమ తయారీ, విక్రయాలపై నిరంతరం నివేదికలు తెప్పించుకోవాలని చెప్పారు.
గ్రామాల్లో మహిళా పోలీసుల నుంచి తప్పనిసరిగా ప్రతి రోజూ నివేదికలు తీసుకుంటూ, వాటి ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వాణిజ్య, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, గనులు, అటవీ, రవాణా శాఖల కార్యకలాపాలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
అనుమతులు పొందిన లీజుదారులు మైనింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, వారికేమైనా ఇబ్బందులు ఉంటే తీర్చాలని ఆదేశించారు. రవాణా శాఖలో ఆదాయం పెంపుపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఆదాయాల ప్రగతి ఆశాజనకంగా ఉందని, జీఎస్టీ వసూళ్లు బాగున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం
► ఆస్తుల విలువ మదింపు, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై హేతుబద్ధత ఉండేలా చూడాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రజలకు సులభతరం చేసేందుకు, అందుకు తగిన చర్యలు తీసుకునేందుకు ప్రొఫెషనల్ ఏజెన్సీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలి.
► గ్రామ, వార్డు సచివాలయాల్లో సంపూర్ణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడిచేందుకు తగిన మార్గదర్శకాలను రూపొందించాలి. భూములు, ఆస్తులే కాకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోతగిన సేవల వివరాలను పోస్టర్ల రూపంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు, గ్రామ, వార్డు సచివాలయాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ ఫిర్యాదు నంబరు ఉంచాలి.
► మైనింగ్ కోసం ఇప్పటికే అనుమతులు పొందిన వారు, లీజు లైసెన్సులు పొందిన వారు మైనింగ్ ఆపరేషన్ కొనసాగించేలా చూడాలి. దీనివల్ల ఆదాయాలు పెరుగుతాయి. ఆపరేషన్‌లో లేని వాటిపై దృష్టి పెట్టి, లీజుదారులకున్న ఇబ్బందులను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలి.
► మైనింగ్ ఆపరేషన్ చేయకపోవడానికి కారణం ఏంటి? వారికున్న ఇబ్బందులు ఏంటి? వారికి చేదోడుగా ఎలా నిలవాలి? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రతి నెలా సమగ్ర సమీక్ష జరిపి, ఆదాయాలు వృద్ధి చెందేలా తగిన చర్యలు తీసుకోవాలి. లక్ష్యాలను చేరుకుంటున్నామా? లేదా? అన్న దానిపై నిరంతరం సమీక్ష చేయాలి.
► రవాణా శాఖలో ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలి. కేవలం పన్నులు పెంచడమే దీనికి పరిష్కారం కాదు. వినూత్న ఆలోచనలు చేయాలి. పక్క రాష్ట్రాలతో పోలిస్తే.. వాహనాల కొనుగోలుకు రాష్ట్రంలో తగిన సానుకూల పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి డీలర్లు డబ్బు తీసుకుని, వాహనాలు ఇవ్వని ఘటనలు వెలుగు చూశాయి. వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.
► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్ శాఖ) కె.నారాయణస్వామి, విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, అటవీ పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వై మధుసూధన్‌రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
లక్ష్యం దిశగా ఆదాయం
► ‘గనులు, ఖనిజాల నుంచి గతేడాది సెప్టెంబర్ వరకు రూ.1,174 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రూ.1,400 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా 19 శాతం పెరుగుదల నమోదైంది. మొత్తం ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 43 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేశాం’ అని అధికారులు సీఎంకు తెలిపారు. ‘ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో జీఎస్‌టీ వసూళ్లు సహా.. ఇతర ఆదాయాలు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువలో ఉన్నాయి. పారదర్శక విధానాలు, నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైంది. 2022 సెప్టెంబర్ వరకు లక్ష్యం రూ.27,445 కోట్లు కాగా, రూ.25,928 కోట్ల ఆదాయం వచ్చింది. 94.47% లక్ష్యం చేరుకున్నాం’ అని చెప్పారు.
► లీకేజీలను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టంను అభివృద్ధి పరిచామని, హెచ్‌ఓడీ కార్యాలయంలో డేటా అనలిటిక్స్ సెంటర్ ఏర్పాటు చేసి.. సిబ్బందిని కూడా నియమించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment