టూరిస్టు బస్సులకు నేషనల్ పర్మిట్!
టూరిస్టు బస్సులకు నేషనల్ పర్మిట్!
Published Tue, Sep 19 2017 3:07 AM | Last Updated on Thu, May 24 2018 1:57 PM
- అమలుపై కేంద్ర ప్రభుత్వ యోచన
- గుజరాత్‌లోని వడోదరలో నేడు కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: సరుకు రవాణా వాహనాల తరహాలో టూరిస్టు బస్సులకు కూడా నేషనల్ పర్మిట్ విధానాన్ని అమలులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో పన్ను చెల్లిస్తూ నడుస్తున్న బస్సులు.. కొత్త విధానంతో ఏదైనా ఓ రాష్ట్రంలో పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అక్కడ జారీ అయ్యే నేషనల్ పర్మిట్‌తో దేశంలో ఎక్కడికైనా వెళ్లి రావచ్చు. మధ్యలో మళ్లీ ఎక్కడా పన్ను చెల్లించాల్సిన పని ఉండదు. దీనికి సంబంధించి కొంతకాలంగా కసరత్తు చేస్తున్న కేంద్ర ఉపరితల రవాణా శాఖ నేడు కీలక నిర్ణయం తీసుకోబోతోంది. మంగళవారం గుజరాత్‌లోని వడోదరలో జరిగే జాతీయ రవాణా అభివృద్ధి మండలి సమావేశంలో ప్రధాన ఎజెండాగా దీనిపై చర్చించనుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, అధికారులు, కేంద్ర ఉపరితల రవాణా శాఖ కార్యదర్శి పాల్గొననున్నారు.
ఆర్టీసీలకు ఉరి..
అసలే దివాలా దిశలో ఉన్న ప్రభుత్వ రవాణా సంస్థలకు ఈ నిర్ణయం శరాఘాతం కాబోతోంది. చాలా రాష్ట్రాల్లో రవాణా సంస్థలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. ఆర్థిక సంక్షోభంలో కునారిల్లుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేని సంగతి తెలిసిందే. టూరిస్టు పర్మిట్లు పొంది అక్రమంగా స్టేజీ క్యారియర్లుగా తిరుగుతున్న బస్సుల వల్ల ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతున్నా వాటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రావటం లేదు. ఇప్పుడు కేంద్రం ఏకంగా టూరిస్టు బస్సులకు లారీల తరహాలో నేషనల్ పర్మిట్లు ఇస్తే ఆర్టీసీ మరింత సంక్షోభంలో పడిపోతోందని రవాణా రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రైవేటుకు పండుగ.. ప్రమాదంలో భద్రత
ఇప్పటికే ప్రైవేటు బస్సులు అక్రమంగా స్టేజీ క్యారియర్లుగా తిరుగుతూ ఆర్టీసీని దెబ్బకొడుతున్నాయి. బస్సుల్లో బెర్తులు వేసుకోవటానికి, పన్ను చెల్లించకుండా రాష్ట్రాల మధ్య తిరిగేందుకు నిబంధనలు అడ్డువస్తుండటంతో కొద్దోగొప్పో అవి తటపటాయిస్తున్నాయి. ఇప్పుడు నేషనల్ పర్మిట్ ఇచ్చి తలుపులు బార్లా తెరిస్తే వాటికి ఇక పట్టపగ్గాలు ఉండవు. ఏమాత్రం అనువుగా లేని డొక్కు బస్సులకు పర్మిట్లు పొంది దూరప్రాంతాలకు తిరిగి ప్రయాణికుల ప్రాణాలనూ పణంగా పెడతాయి. వాటిని పర్యవేక్షించటం రవాణా శాఖకు సాధ్యమయ్యే పనికాదు. కమీషన్లకు కక్కుర్తి పడి తనిఖీ లేకుండా వదిలేసే సిబ్బంది సంఖ్య ఆర్టీఏలో ఎక్కువగా ఉందన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. పైగా సిబ్బంది లేక తనిఖీలు కూడా సరిగా జరగటం లేదు. నిబంధనలను ఖాతరు చేయని బస్సులకు ప్రభుత్వమే స్వేచ్ఛ ఇస్తే ఇక అడ్డు అదుపు ఉండదు. ఫిట్‌నెస్ లేకున్నా రాష్ట్రాల మధ్య తిరిగితే ప్రమాదాల సంఖ్య ఎక్కువయ్యే వీలుంది.
వడోదర బస్‌పోర్టును సందర్శించనున్న మహేందర్‌రెడ్డి
జీఎస్టీ తర్వాత పెరిగిన పన్నుల ప్రభావం, జాతీయ స్థాయిలో లైసెన్సుల జారీ, ఆటోమే టెడ్ డ్రైవింగ్ ట్రాక్‌ల ఏర్పాటు తదితర అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. వడోదరలో అత్యాధునికంగా నిర్మించిన బస్‌పోర్టును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ సందర్శించనున్నారు. అదే తరహాలో తెలంగాణలో నిర్మించే అంశాన్ని పరిశీలించనున్నారు.
Advertisement
Advertisement