చేయి తడిపితే నేపని....! | RTO office incessant danda | Sakshi
Sakshi News home page

చేయి తడిపితే నేపని....!

Published Thu, Jun 30 2016 2:20 AM | Last Updated on Thu, May 24 2018 1:57 PM

RTO office incessant danda

ఆర్టీఓ కార్యాలయంలో ఆగని దందా
 
అనంతపురం సెంట్రల్ : ఇతని పేరు నాగరాజు. పెద్దవడుగూరు మండలం తెలికి గ్రామం. ఇటీవల ఐచర్ వాహనం(ఏపీ02 టీఏ 6789) కొనుగోలు చేశాడు. తనపేరు మీద ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత ఆల్ ఇండియా పర్మిట్  అనుమతి కోసం ఈనెల 8న ఆర్టీఓ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. రూ. 2150 కట్టి అదే రోజు చలానా( నెంబర్ 5133396) తీశాడు. రెండ్రోజుల్లో  అనుమతి వస్తుందని భావించి కర్ణాటక మార్కెట్‌కు పత్తి తీసుకుపోయేందుకు లోడ్ చేశాడు. ఇప్పటికి 20 రోజులు గడిచింది. 

అనుమతి ఇవ్వరాలేదు. విసిగి వేసారిన ఆయన బుధవారం ఆర్‌టీఓ కార్యాలయంలో సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. వారు అది మా పని కాదు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ తేల్చిచెప్పారు. దీంతో నిరాశతో వెనుతిరిగాడు. 20 రోజుల నుంచి తిరుగుతున్నా పని కాలేదు. లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనం నిలబడిపోయింది అని నాగరాజు వాపోయాడు.


జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో నేరుగా ఎవరైనా పనులు చేసుకోవాలంటే నాగరాజుకు ఎదురైన పరిస్థితి తప్పదు. దళారీ వ్యవస్థను నిర్మూలించేశామని పైపైకి చెబుతున్నా... చాపకింద నీరులా దళారీ వ్యవస్థ కొనసాగుతోంది.

ఏజెంట్లు- అధికారులు కుమ్మక్కు
రవాణాశాఖలో ఏజెంట్ల వ్యవస్థ ఎప్పటి నుంచో వేళ్లూనుకొని పోయింది. ఒకప్పుడు 15 మందితో ప్రారంభమైన ఏజెంట్లు ప్రస్తుతం దాదాపు 75 మందికి పైగా ఉన్నారు.  ఎలాంటి సాయం కావాలన్నా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో సంప్రదించవచ్చు. కానీ హెల్ప్‌డెస్క్ అలంకార ప్రాయంగా మారింది. ఏజెంట్లలో సీనియర్‌లుగా చొప్పుకునే ముగ్గురు వ్యక్తులు నేటికీ ఆర్టీఓ కార్యాలయం వద్ద తిష్ట వేస్తున్నారు. ఓ జిరాక్స్ సెంటర్ కేంద్రంగా మంత్రాంగం నడుపుతున్నారు.

అక్కడ ప్రత్యేకంగా కోడ్ భాషను ఏర్పాటు చేసుకున్నారు.  కొందరు ఎంవీఐలతో ఒప్పందం కుదుర్చుకొని తమ దందాను కొనసాగిస్తున్నారు. డెరైక్ట్ వెళితే 20 రోజులైనా కాని పని... వీరిని కలిస్తే మాత్రం గంటలోనే అవుతుండటం విశేషం. మొత్తం లావాదేవీలన్నీ ఇక్కడి నుంచే నడిపిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement