
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అమలుచేసిన తొలి పథకం ‘వైఎస్సార్ వాహన మిత్ర’ కింద అందించిన ఆర్థిక సాయాన్ని ఈ ఏడాది కూడా ఇచ్చేందుకు రంగం సిద్ధంచేసింది. ఇందులో భాగంగా.. సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లున్న డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. జూన్ 4న సీఎం వైఎస్ జగన్ ఈ పథకం కింద ఆన్‌లైన్ చెల్లింపులు చేయనున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని రవాణా శాఖ కమిషనరేట్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఈ నెల 18 నుంచి 26వ తేదీలోగా తమ దరఖాస్తులను గ్రామ/వార్డు సచివాలయాల్లో అందించాలన్నారు. జూన్ 1వ తేదీలోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామన్నారు. గత ఏడాది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, వారికి కేవలం సోషల్ ఆడిట్ మాత్రమే జరుగుతుందన్నారు. ఈ ఏడాది మే 17 వరకు రవాణా శాఖలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆటో/ట్యాక్సీ/మ్యాక్సీ క్యాబ్‌ల యజమాని కమ్ డ్రైవర్లు ఈ పథకానికి అర్హులని మంత్రి చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
► ఆర్టీసీలో ఒక్క ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని కూడా తొలగించలేదు. తొలగించినట్లు ఆధారాలు ఉంటే చూపించాలి. లేదంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
► ప్రజా రవాణాపై సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటారు. ఆయన నుంచి ఆదేశాలు రాగానే 24 గంటల్లో బస్సు సర్వీసులను పునఃప్రారంభించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది.
► కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ప్రయాణికుడు మాస్క్ ధరించాలి. విధిగా శానిటైజర్లు వాడాలి. అలాగే, భౌతిక దూరం పాటించాలి.
► బస్సుల్లో నగదు రహిత కార్యకలాపాల్ని నిర్వహించేందుకు కండక్టరు లేకుండా సర్వీసులు తిప్పుతాం.
► ముందుగా విజయవాడ, విశాఖల్లో ప్రయోగాత్మకంగా అమలుచేసి ఆ తర్వాత రాష్ట్రం మొత్తం అమలుచేస్తాం.
గత లబ్ధిదారుల్లో అధిక సంఖ్యలో బీసీలే..
కాగా, ఈ పథకం కింద గత ఏడాది ఎంపికైన మొత్తం 2,36,334 మంది లబ్ధిదారుల్లో 54,485 మంది ఎస్సీలు, 1,05,932 మంది బీసీలు, 13,091 మంది ఓసీలు, 27,107 మంది కాపులు.. 8,762 మంది ఎస్టీలు.. 25,517 మంది మైనార్టీలు.. 509 బ్రాహ్మణ, 931 మంది క్రైస్తవులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment