క్షతగాత్రుడిని పరామర్శిస్తున్న ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రి ముత్తంశెట్టి
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: అనంతగిరి మండలం డముకు మలుపు వద్ద శుక్రవారం రాత్రి ప్రైవేటు బస్సు లోయలో పడిపోయిన ఘోర ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు కోలుకుంటున్నారు. హైదరాబాద్ షేక్‌పేటకు చెందిన 27 మంది పర్యాటకులు విహార యాత్రలో భాగంగా విశాఖ జిల్లా అరకు వచ్చి తిరిగి వెళ్తుండగా.. అనంతగిరి మండలం డముకు ఘాట్‌రోడ్డు మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు లోయలో పడిపోయిన విషయం విదితమే. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందగా, 23 మంది గాయాల పాలయ్యారు.
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు హుటాహుటిన రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీస్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో 16 మంది శనివారం నాటికి పూర్తిగా కోలుకున్నారు. మిగిలిన ఏడుగురికి కేజీహెచ్‌లోనే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నారు. ఆరుగురికి శస్త్ర చికిత్స చేయగా కోలుకుంటున్నారు. మరో మహిళ కొట్టం చంద్రకళ (50) పరిస్థితి కొంత విషమంగానే ఉంది. మరో 24 గంటలు గడిస్తేగాని చెప్పలేమని వైద్యులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన కొట్టం సత్యనారాయణ (61), నల్ల లత (45), సరిత (40), కొట్టం శ్రీనిత్య (8 నెలలు) మృతదేహాలను హైదరాబాద్‌కు తరలించారు.
16 మంది స్వస్థలాలకు పయనం
ప్రమాదంలో గాయపడి కోలుకున్న క్షతగాత్రుల్లో 16 మంది శనివారం హైదరాబాద్‌లోని స్వస్థలానికి బయలుదేరారు. విశాఖ జిల్లా అధికారులు తెలంగాణ ప్రభుత్వాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. గాయపడి పూర్తిగా కోలుకున్న 16 మందిని మరో రోజు వైద్యుల పరిశీలనలో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. క్షతగాత్రులు మాత్రం మృతదేహాల వెంట తాము కూడా హైదరాబాద్ వెళ్లిపోతామని అధికారులను కోరారు. దీనిపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చ సాగింది. ఇక్కడి వైద్యులు వెళ్లొద్దని వారించినా.. క్షతగాత్రులు మాత్రం వెళ్లేందుకు సిద్ధపడటంతో అధికారులు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. పరామర్శించేందుకు వచ్చిన బంధువులతో పాటు 16 మందిని రాత్రి 9 గంటలకు ఇక్కడి నుంచి పంపించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం
క్షతగాత్రులకు నాలుగు వైద్య బృందాల (ఆర్థో, న్యూరో, ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ సర్జరీ)తో మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల నాని చెప్పారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ వినయ్‌చంద్‌తో కలిసి శనివారం ఆయన పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను డ్రైవర్ శ్రీశైలం నుంచి తెలుసుకున్నారు. అనంతరం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన వారందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. క్షతగాత్రుల్లో 16 మంది పూర్తి సురక్షితంగా ఉన్నారని, ఆరుగురికి శస్త్ర చికిత్స చేయగా కోలుకుంటున్నారని, కొట్టం చంద్రకళ (50) పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెప్పారు. కొట్టం కల్యాణి (30)కి ప్లాస్టిక్ సర్జరీ చేయించామని చెప్పారు. ఈ ఘటనపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీ వేయనుందని తెలిపారు.
డ్రైవర్ నిద్రమత్తు వల్లే బస్సు ప్రమాదం
ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిద్రమత్తే కారణమని రవాణా శాఖ ప్రాథమికంగా తేల్చింది. అలసట కారణంగా డ్రైవర్ నిద్రమత్తుకు లోనవటంతో ఈ ప్రమాదం సంభవించిందని ప్రభుత్వానికి పంపిన ప్రాథమిక నివేదికలో అధికారులు పేర్కొన్నారు. బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం జరిగిందన్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు.
కోలుకుని హైదరాబాద్ పయనమైన వారి వివరాలు
కొట్టం లత (45), యు.కృష్ణవేణి (50), కొట్టం అరవింద్‌కుమార్ (35), కొట్టం నరేష్‌కుమార్ (38), కొట్టం స్వప్న (32), కొట్టం శివాని (07), కొట్టం దేవాన్‡్ష(05), కొట్టం శాన్వి (05), కొట్టం విహాన్ (03), కొట్టం ఇషా (05), అనూష(26), కొట్టం హితేష్ (17), కొట్టం మౌనిక (27), కొట్టం అనిత(50), కొట్టం శ్రీజిత్(14), లోఖిశెట్టి నందకిశోర్ (25)
కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారు
కొట్టం కల్యాణి (30), కొట్టం జ్యోతి (55), కొట్టం శైలజ (30), కొట్టం అభిరామ్ (07), మీనా (38), కొట్టం చంద్రకళ (50), బస్సు డ్రైవర్ సర్రంపల్లి శ్రీశైలం
ప్లాస్టిక్ సర్జరీతో పాతరూపు
అనంతగిరి మండలం డముకు మలుపు వద్ద బస్సు ప్రమాదంలో కొట్టం కల్యాణి (30)కి ముఖంపై తీవ్రగాయాలు కావడంతో ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ప్లాస్టిక్ సర్జరీ స్పెషలిస్ట్ డాక్టర్ పివీ సుధాకర్ ఆధ్వర్యంలోని బృందం ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేసింది. కల్యాణి ముఖాన్ని ప్రమాదానికి ముందు ఎలా ఉందో అలా తీర్చిదిద్దారు.
Comments
Please login to add a commentAdd a comment