
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రహదారులు శరవేగంతో అభివృద్ధి చెందనున్నాయి. మొత్తం రూ.10,401 కోట్లతో 741 కిలోమీటర్ల మేర నిర్మించనున్న 31 రహదారులకు ఈ నెల 17న కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రూ.11,157 కోట్లతో ఇప్పటికే నిర్మించిన 20 రహదారులను ప్రారంభించబోతున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని 51 రహదారులకు మహర్దశ పడుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 17న విజయవాడ రానున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధిపై ఆయనతో చర్చించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా రాష్ట్రంలోని పోర్టులు, పర్యాటక ప్రదేశాలు, వెనుకబడిన ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ రహదారులను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు.
తద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధి వీలవుతుందని గడ్కరీ దృష్టికి తెచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించారు. వాటిలో కొన్ని నిర్మాణాలు ఇప్పటికే పూర్తవ్వగా, మరికొన్నింటిని నిర్మించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది.
ఈ నేపథ్యంలో ఒకేసారి రహదారులకు ప్రారంభోత్సవం, కొత్తగా నిర్మించనున్న వాటికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావించింది. నితిన్ గడ్కరీ పర్యటన నేపథ్యంలో ఈ మేరకు షెడ్యూల్ రూపొందించింది. ఈ నెల 17న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో గడ్కరీ, సీఎం వైఎస్ జగన్ తదితరులు పాల్గొననున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది.
భూమి పూజ చేయనున్న ప్రాజెక్టులివీ..
► రాష్ట్రంలో కొత్తగా 31 జాతీయ రహదారుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. రూ.10,401 కోట్లతో 741 కిలోమీటర్ల మేర వీటిని నిర్మించనున్నారు. వీటిలో కేంద్ర రోడ్డు, రవాణా శాఖ రూ.5,740 కోట్లతో 571 కిలోమీటర్ల మేర 24 ప్రాజెక్టులు నిర్మించనుంది. ఇక జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) రూ.4,661 కోట్లతో 170 కిలోమీటర్ల మేర ఏడు ప్రాజెక్టులు నిర్మిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment