పాత వస్తువుల అనుబంధాన్ని పలకరిద్దామా.. | Daily Using Old Objects In Home Cover Story In Telugu | Sakshi
Sakshi News home page

పాత వస్తువుల అనుబంధాన్ని పలకరిద్దామా..

Published Sun, Apr 25 2021 9:55 AM | Last Updated on Sun, Apr 25 2021 10:56 AM

Daily Using Old Objects In Home Cover Story In Telugu - Sakshi

ఆధునాతన సౌకర్యం పాత కష్టాన్ని మరిపిస్తుండొచ్చు.. కానీ ఆ కష్టంతో ముడిపడి ఉన్న వస్తువులను కాదు.. అవి కనుమరుగైనా.. కొత్తరూపంతో జీవనశైలిలో భాగమైనా.. జ్ఞాపకాలుగా గుర్తుకొస్తునే ఉంటాయి..  ఆ టైమ్‌ను ఆస్వాదిస్తూ ఆ అనుబంధాన్ని పలకరిద్దాం...

సాయం కాలం బడి  నుంచి రాగానే చేద బావి.. ఆ గచ్చు మీదున్న ఇత్తడి కొప్పెర గంగాళం, సిమెంట్‌ తొట్టి ఎదురు చూస్తూండేవి. నీళ్లు తోడి వాటి కడుపు నింపి ఆ పూట పనిలో అమ్మకు ఎంతో సాయం చేసినట్టు  హీరోయిక్‌ పోజుతో బయటకు తుర్రుమని ఆటల్లో పడిపోతే.. మళ్లా ఎప్పుడో ఆకాశంలో చుక్కలు తేలాకే ఇంటిదారి పట్టడం. హడావిడిగా హోమ్‌ వర్క్‌ చేసేసి.. వేడివేడిగా భోజనం ముగించేసరికి దొడ్లో చిట్టు పొయ్యి.. వేడి నీళ్ల బాయిలర్‌ దగ్గర గొడవపడుతూ కనిపించే వాళ్లు అక్క, చెల్లి.. పని వంతులేసుకోవడంలో పేచీ వచ్చి. పొట్టు పొయ్యిలో పొట్టు నింపడం అక్కకు మహా చిరాకు.. అలాగని బాయిలర్‌లో నీళ్లు నింపడాన్నేమీ ఇష్టపడేది కాదు. అలా పోట్లాడి  ఆ రెండు పనులూ తన మీదే వేసి చల్లగా జారుకుంటుందని చెల్లి షికాయతు.

ఆ అలకలు, అరచుకోవడాలతో పొయ్యిలో పొట్టు నింపే బాధ్యత నానమ్మకు చేరేది. రాత్రి ఆ వాకిట్లో 60 వాల్ట్స్‌ బల్బు వెలుతురులో పొయ్యిలో రోకలి కర్ర పెట్టి నానమ్మ పొట్టు కూరుతుంటే నాన్న బాయిలర్‌ నింపేవాడు తెల్లవారి వేడినీళ్ల స్నానాల కోసం. ఈ యాది తడమని చలికాలం ఉండదు. వానాకాలం జ్ఞాపకంలోని చెమ్మ ఇగిరిపోలేదు. చూరు కింద నుంచి వాన నీళ్లు జారుతుంటే.. వసారాలో కూర్చోని.. చురుకులు అంటుతున్నా లెక్కచేయకుండా కుంపట్లోంచి వేడివేడి మొక్క జొన్న కంకులను మొక్క జొన్న బూరులో చుట్టి జల్లును చూస్తూ కంకులను తినే గుర్తూ మెదడును మరిపిస్తూనే ఉంటుంది. పొట్టు పొయ్యి, కుంపటి కనిపించకుండా పోయినా..బాయిలర్‌ అపురూపమైనా.. కొప్పెర, గంగాళం మాత్రం ఇండోర్‌ ప్లాంట్స్‌కి పాట్స్‌గా మారి ఇంటికి అలంకారంగా మెరుస్తున్నాయి. 

ట్రింగ్‌ ట్రింగ్‌..
సెల్‌ఫోన్‌లు పుట్టక ముందు కథ. టెలిఫోన్ల కాలం అది. మనకు కావల్సిన కాంటాక్ట్‌ చెప్పి కనెక్ట్‌ చేయమని ఎక్స్‌చేంజ్‌కి (చాలా వరకు జిల్లా కేంద్రాల్లో ఇలాంటి వెసులుబాటే ఉండేదప్పట్లో)చెప్పి ట్రింగ్‌ ట్రింగ్‌ అంటూ అది పిలిచే వరకు వేచి చూడాల్సి వచ్చేది. మనం ఎవరితోనైనా మాట్లాడాలనుకున్నా.. మనతో ఎవరైనా మాట్లాడాలనుకున్నా ఎక్స్‌చేంజే నంబర్లు కలిపే రాయబారి. తర్వాత కొన్నాళ్లకు మన ఫోన్‌ నుంచే నేరుగా నంబర్లు కలుపుకొనే సౌకర్యం పొందినా బయటి ఊళ్లకు మాట్లాడే ట్రంక్‌ కాల్‌కి ఎక్స్‌చేంజే ఆధారం. గంటల తరబడి వెయిటింగ్‌ తరవాత కలిసే బలహీనమైన లైన్‌లో గొంతు చించుకొని అరిస్తే కాని అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు మాటలు బదిలీ అయ్యేవి కావు. ఎస్‌టీడీ కోడ్‌ ఎంటర్‌ అయ్యాక చెవుల్లోనే కబుర్లు చెప్పుకునే స్థాయికి తగ్గింది స్వరం. సున్నా నుంచి తొమ్మిది అంకెలను డయల్‌ సర్కిల్‌లో సర్ది, మౌత్‌ పీస్, రిసీవర్‌ ఉన్న హ్యాండిల్‌ను వినమ్రంగా సెట్‌ చేసి స్టాండ్‌ మీది మ్యాటీ ఎంబ్రాయిడరీ గుడ్డ పైన ఒద్దికగా తాను ఒదిగి డ్రాయింగ్‌ రూమ్‌ కళను పెంచింది.. కాలనీలో ఆ ఇంటికి ప్రత్యేక హోదాను తెచ్చింది టెలిఫోన్‌. ఇప్పుడు దాని ఉపయోగం ఇంటర్‌కమ్‌కే పరిమితమైనా గత వైభోగం మాత్రం ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతూనే ఉంది. 

ఎక్కా వెలుతురులో ఎక్కాలు
నలభై ఏళ్ల కిందటి వరకూ కరెంటు లేని ఊళ్లెన్నో ఈ దేశంలో. ఆ సమస్యనూ అద్భుతమైన జ్ఞాపకంగా వెలిగిస్తోంది ఎక్కా దీపం(కిరోసిన్‌ బుడ్డి).. లాంతర్‌ లైట్‌. మొన్నటి మొన్నటి దాకా అంటే చార్జింగ్‌ లైట్ల కాంతి ప్రసరించే దాకా కూడా కరెంట్‌ పోతే వెలుగు రేఖలను అప్పిచ్చిన సాధనాలు ఎక్కా, లాంతర్లే. ఆ దీపాల కిందే ఎక్కాలను బట్టీ వేసిన బాల్యాన్ని ఎవరు మరిచిపోతారు? ఆ దీపాల కిందే చదువుకొని ఇంతవాళ్లమయ్యామని చెప్పుకునే పెద్దవాళ్ల అనుభవాలను గౌరవం నటిస్తూ విన్న రోజులను ఎలా డిలీట్‌ చేయగలం? సాయంకాలానికి ముందే లాంతరు, ఎక్కా గాజు బుగ్గలను చక్కగా తుడిచి... వత్తిని సరి చేసి.. సంధ్యవేళ కల్లా సిద్ధం చేసే అమ్మ శ్రద్ధ మరుపు తెప్పించేదా? సిరా బుడ్డీ ఖాళీ అయితేనో.. టానిక్‌ అయిపోతేనో.. వాటిని పడేయకుడా శుభ్రంగా కడిగి.. పొడిపొడిగా తుడిచి.. అందులో కిరసనాయిలు పోసి.. పాత గుడ్డ పీలకను.. దీపం వత్తిగా మలిచి సీసా మూతకు రంధ్రం చేసి అందులో ఈ వస్త్రవత్తిని బిగించి.. ఎక్కాలా మార్చిన అక్కది మామూలు క్రియేటివిటీనా? రాత్రి గాలి వానకు కరెంటు పోతే .. సైకిల్‌మీద నాన్న ఎలా వస్తున్నాడోనని లాంతరు పట్టుకొని గుమ్మం ముందు కాపుకాసే నానమ్మ ఆత్రం ఇప్పటికీ మనసును తడి చేయదా? వీటన్నిటితో ముడిపడి ఉన్న ఆ రెండూ జీవితాంతం గుర్తుండవూ! ఈ కోవలోనిదే పెట్రోమ్యాక్స్‌.. ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బిజిలీగా పరిచయం. పెళ్లిళ్లు. జాతర్లు, ఊళ్లో ఉత్సవాల్లో ఇవే దారి చూపే టార్చి లైట్లు. సీరియల్‌ బల్బ్‌ సెట్లు వాటి స్థానాన్ని అక్రమించడంతో అవి మసకబారిపోయాయిప్పుడు. 

సందుగ సంగతులు
‘దిల్‌ కీ సందూకోమే మేరే అచ్ఛే కామ్‌ రఖ్‌నా.. ’ అని  ‘అయ్‌ దిల్‌ హై ముశ్కిల్‌ ’ సినిమాలోని ‘అచ్ఛా చల్తా హూ దువావోమే యాద రఖనా’ అనే పాట పల్లవిలో వస్తుంది. అంటే ‘నీ మనసు పెట్టెలో నా మంచితనాన్ని పదిలం చెయ్‌’ అని అర్థం. పెట్టె అన్న పదం వింటే ఇప్పటికీ తరం అంతరం లేకుండా యాదికొచ్చేది సందుగ.. అంటే ఇనప్పెట్టే. అప్పటి పెళ్లిళ్లల్లో పుట్టింటి కట్నంలో భాగం.. చదువుకోవడానికి హాస్టల్‌కి వెళితే బట్టలతో సహా వస్తువులను భద్రపరిచే పరికరం.. ఇంకా చెప్పాలంటే  ప్రేమలేఖలతో సహా కోడలు పుట్టింటి నుంచి తెచ్చుకున్న అపురూపమైన సంగతులెన్నింటినో ఇంట్లోని అటక మీద దాచే రహస్యం.. ఈ సందుగ. ప్రస్తుతం దీనికి ప్రతిగా ఎన్నో రూపాలు వచ్చాయి.. అయినా దీనికి సాటిరానివవి. వెల ఎక్కువే అయినా దాని విలువ చేయనివవి. నేటికీ చాలా కుటుంబాల్లో పెళ్లి కూతురికి కూడా ఇచ్చి పంపిస్తున్నారు ఈ సందుగను. జ్ఞాపకంగానే కాదు సంప్రదాయంగానూ స్థిరపడిపోయిందిది. 

మామిడి పీట.. నూతిలో వేట
ఇప్పుడు ఊరగాయల సీజన్‌లో రైతు బజార్‌లో కాయలు కొట్టించుకోవడానికి బారులు తీరాల్సిన ఆగత్యం కాని.. అప్పుడైతే ఆ అవసరం లేదు. కాలనీలో ఏ ఉమ్మడి కుటుంబంలోనో ఊరగాయల కాయలు కొట్టే పీట ఉండేది. ఊరగాయల సీజన్‌ అంటే ప్రతి కాలనీకి పండగ కాలమే. ఏ ఇంట్లో ఏ రోజు ఊరగాయలు పెట్టుకోవాలో ముందే షెడ్యూల్‌ సిద్ధమేపోయేది. ఆ జాబితా ప్రకారం ఆ ఊరగాయలు కొట్టే పీట ఇల్లిల్లూ తిరిగేది. ఆ కాయ పులుపు ఊరగాయ ఉప్పులో ఊరకముందే రుచి చూసేది. కన్సూమరిజం వేళ్లూనూకోని.. అందరూ అన్ని వస్తువులనూ కొనుక్కోగల శక్తి లేని కాలమది. అవసరానికి తగ్గట్టుగా వస్తువులను ఇరుగుపొరుగు నుంచి అరువు తెచ్చుకునే పరిస్థితులవి. అలాంటి లిస్ట్‌లో ఊరగాయల పీట ఉన్నట్టే పాతాళ గరిగా ఉండేది. పాతాళ గరిగ తెలియాలంటే చేద బావి తెలుసుండాలి. ఇప్పటిలా ఇంటింటికీ బోర్‌వెల్‌ ఉండేదికాదప్పుడు. ఇంటింటికీ నుయ్యి ఉండడమూ గొప్పే. ఆ నుయ్యిలోంచి నీళ్లు తోడుకోవడానికి దానికో చేద.. అది బరువు కాకుండా ఉండడానికి బావికో గిలకా ఉండేవి.

మరి ఈ పాతాళ గరిగేంటీ? స్నానాల దగ్గర్నుంచి గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం వరకు అన్నీ బావి దగ్గరే జరిగేవి. కడిగిన గిన్నెలు బావి గట్టు మీదే బోర్లించడం, గుడ్డలు పిండుతూ బావి గట్టు మీదే పెట్టడం.. ఇలా ప్రతి పనికి తొలి ఆసరా నూతి గట్టే. అలా గట్టు మీద పెట్టిన ఆ వస్తువులు ఒక్కోసారి  చేయి తగిలి బావిలో పడిపోయేవి. నీటి చేద కూడా గిలక మీద నుంచి గిర్రునజారి నూతిలో పడిపోయేది. నీళ్లలోంచి వాటిని తీసే సాధనమే పాతాళ గరిగ. వస్తువులు కాని, చేద కాని బావిలో పడిందంటే ఇంట్లో పిల్లలకు మహా సరదా. సర్రున పక్కింటికి పరిగెత్తి.. పాతాళ గరిగను మోసుకొచ్చి ఇంట్లో పెట్టేవాళ్లు.

దానికి తాడు కట్టి.. బావిలోకి దింపితే నీళ్లలో మునిగిన వాటన్నిటినీ కొక్కాలకు తగిలించుకుని దర్జాగా పైగి వచ్చేది. ఈ తతంగాన్ని సంబరంగా తిలకించేవాళ్లు పిల్లలు. పైగా పాతాళ గరిగ నీటిలో మునగంగానే ఆకతాయిగా తమ వస్తువులనూ బావిలో వేసేవాళ్లు.. ‘అయ్యో నా బొంగరం పడిపోయింది..’, ‘ ఆ.. నా రబ్బర్‌ పడిపోయింది..’, ‘నా పెన్సిల్‌..’ అంటూ!  ఇప్పుడు ఇవన్నీ ఆ కాలంలోకి తీసుకెళ్లే టైమ్‌ మెషీన్‌ గుర్తులే. అలా వస్తువులను అరువు తెచ్చుకోవడం అప్పుడు నామోషీ కాదు. అదొక అనుబంధం. ఇరుగుపొరుగు మధ్య స్నేహాన్ని పెంచి మానవసంబంధాలను మెరుగుపరిచి.. కాలనీని ఓ కుటుంబంగా చేసిన ఆత్మీయ సాధనం. 

తిరగలి.. పొత్రం.. పొన్ను రోకలి
మధ్యాహ్నం భోజనం కోసం బడి నుంచి ఇంటికి రాగానే అరుగు మీద ఆడవాళ్లు తిరగలిలో మినుములో, శనగలో, గోధుమలో విసురుతూ కబుర్లాడే దృశ్యం కనిపించేది. ఎంత విసురుగా తిప్పినా లయబద్ధంగా తిరుగుతూ.. శ్రుతిలో సన్నగా సడి చేస్తూ ఉండేది తిరగలి. పొత్రం అలా కాదు... రోట్లో ఎంత మెత్తటి  వస్తువు వేసినా గరగరమంటూ నలగ్గొట్టడమే! రోకలి సంగతి వేరే చెప్పాలా? వడ్లు, పసుపు కొమ్ములు, మిరపకాయలు ఏవైనా సరే ‘ఆ.. హు’ అంటూ పడే దాని వేటుకు కొన్ని పొట్టు వదుల్చుకుంటే.. మరికొన్ని కాటుకలా మారేవి. టెక్నాలజీ కనిపెట్టిన  పిండి మర,  గ్రైండర్‌లలో  పడి కొన్నాళ్లు మాయమైనా అవి అలవాటు చేసిన టేస్ట్‌ ఈ ఎలక్ట్రానిక్‌  గూడ్స్‌ ఇవ్వకపోయేసరికి  రెట్రో ట్రెండ్‌గా మళ్లీ వాడకంలోకి వచ్చాయి. 

ఇంకా ఇవి కూడా... 
వేళకాని వేళ సైకిల్‌ మీద పోస్ట్‌ మ్యాన్‌ ఫాస్ట్‌గా వస్తున్నాడంటే గుండె దడదడలాడేది.‘సీరియస్‌ స్టార్ట్‌ ఇమ్మీడియెట్లీ’ అని రాసున్న కాగితాన్ని ‘టెలిగ్రామ్‌’ అంటూ చేతిలో పెడతాడేమోనని. ఆ కబురు ఇటీవలే ఆగిపోయింది అధికారికంగా. వేడివేడి టీని కప్పుల్లోకి వంపే ఇండాలియం లోహపు పాత్ర ‘టీ కెటిల్‌’, సోషల్‌ మీడియా ఆగమనంతో మార్కెటింగ్‌ స్టంట్‌గా వచ్చిన గ్రీటింగ్‌ కార్డ్స్, సినిమా ప్రొజెక్టర్, కాయిన్‌ బాక్స్‌ ఫోన్,  అయిదు, పది, ఇరవై, పావలా, యాభై పైసల బిళ్లలు, పందిరి మంచం, పడక్కుర్చీ, పాన్‌దాన్, ఇంటి ఆర్కిటెక్చర్‌లో భాగమైన పొగగొట్టం, కిరసనాయిలు స్టవ్‌ వంటివెన్నో  వాడకంలో లేకుండా నోస్టాల్జియా మ్యూజియంలో వస్తువులుగా కొలువుతీరాయి. జ్ఞాపకాల తీపి ఊటతో మనసును నింపుతున్నాయి.

స్మైల్‌ ప్లీజ్‌..
టకటకా ఫొటోలు తీసేసుకొని నచ్చినవి అట్టేపెట్టుకొని నచ్చనివి డిలిట్‌ చేసే అడ్వాంటేజ్‌ లేదు ఈ ‘స్మైల్‌ ప్లీజ్‌’కి. ఒకటికి పదిసార్లు బ్యాక్‌గ్రౌండ్,  సబ్జెక్ట్‌ను చెక్‌ చేసుకొని అప్పుడు ‘క్లిక్‌’ మనిపించాలి. ఫొటో తీశాక వెంటనే మానిటర్‌లో చూసుకునే వెసులుబాటూ ఉండదు. ఎందుకంటే అది డిజిటల్‌ యుగం కాదు. ఫిల్మ్‌ యుగం. ఆ రోల్‌ పూర్తయ్యాక మాత్రమే కెమెరాలోంచి తీసి స్టూడియోలో ఇస్తే డెవలప్‌ చేసి ఫొటోలుగా కవర్‌లో పెట్టి ఇచ్చేవారు. ఆ జ్ఞాపకాల ఆల్బంలోనే ఫ్రేమ్‌ అయింది ‘ఫిల్మ్‌ రోల్‌’ కూడా. 

గ్రామప్రజలకు తెలియజేయునది ఏమనగా..
... అంటూ దండోరాను ఈజీ చేసిన ఘనతనూ.. ఆ కొలువును తీసేసిన అప్రతిష్టనూ గొంతుక్కట్టుకున్నది మైకు. ఊళ్లోని పంచాయతీ ఆఫీస్‌ మీదనో... కూడలిలోని రావి చెట్టుకో వేళ్లాడుతూ ఉదయం సుప్రభాతం మొదలు గ్రామపంచాయతీ దండోరాలు, ఊరుమ్మడి పండగలు, జాతర్లలోని ప్రకటనలు, రేడియోలోని పాడిపంట, బాలానందం కార్యక్రమాల వరకు అన్నిటినీ గ్రామ ప్రజలకు వినిపించే ఆ మైక్‌ కూడా మూగపోయి అలంకారప్రాయమైందిప్పుడు. 

పాటలే కాదు సినిమానూ వినిపించింది
.. అనగానే స్ఫురణకు వచ్చేది టేప్‌రికార్డరే. ఇది ఏలిన కాలం అంతాఇంతా కాదు. చిన్నపిల్లల నుంచి వయసు పైబడ్డ వాళ్లందరి వరకు తన పాటలు, మాటలతో అందరినీ మురిపించింది. రికార్డింగ్‌ సెంటర్‌లు, క్యాసెట్‌ దుకాణాలకు జన్మనిచ్చింది. ఇష్టమైన పాటలను క్యాసెట్‌లో ‘‘నింపించుకోవడం’’ ఒక కార్యక్రమం. ఇంటికొచ్చి ఆ పాటలను వినడం ఒక వ్యాపకం. పాటలే కాదు.. సినిమాలకూ  క్యాసెట్స్‌ రూపం ఇచ్చింది ఇది. పండగలు, పబ్బాలు అయితే టేప్‌రికార్డర్లే అప్పటి డీజేలు. సాంకేతిక యుగంలో అత్యంత వేగంగా రూపాంతరం చెంది ఇప్పుడు యాప్స్‌గా కనిపిస్తోంది. కాని ఎక్కువ కాలం ఉనికిని వినిపించింది టేప్‌రికార్డరే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement