ప్రయాణంతో చలి కాచుకుందాం! | Places to visit this winter | Sakshi
Sakshi News home page

ప్రయాణంతో చలి కాచుకుందాం!

Published Sun, Jan 7 2024 5:40 AM | Last Updated on Sun, Jan 7 2024 6:00 AM

Places to visit this winter - Sakshi

'One must travel to learn' అంటాడు మార్క్‌ ట్వయిన్‌.  'To travel is to evolve' అంటాడు పియర్‌ బెర్నార్డో.  ఎప్పటికప్పుడు కొత్త పరిసరాలు తద్వారా కొత్త విషయాలు తెలుస్తుంటేనే బుద్ధి వికసిస్తుంది.  దీనికి ప్రయాణాన్ని మించిన గురువు లేడు. భ్రమణ కాంక్షను మించిన సిలబస్‌ లేదు. వారం, వర్జ్యం, సౌకర్యం చూసుకోకుండా బ్యాక్‌ ప్యాక్‌తో ట్రావెల్‌ని ప్లాన్‌ చేసుకునేళ్లను మించిన అదృష్టవంతుల్లేరు. 


ఆర్ట్‌ మూవీ ప్లాట్‌కి ఆ లీడ్‌ లైన్స్‌ పక్కాగా సూట్‌ అవుతాయేమో కానీ..  స్కూల్స్, ఆఫీసెస్, టార్గెట్స్, అదర్‌ టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌ వంటి ప్రాక్టికల్‌ ఫ్రేమ్స్‌లో స్కెడ్యూల్‌ అయిన లైఫ్‌లో అస్సలు సాధ్యపడవు! కదా..!

అందుకేగా వెకేషన్స్‌ ఉన్నాయి! ఆ అకేషన్‌ బహానాతో పిల్లలు, పెద్దలు అందరూ వాళ్ల వాళ్ల అభిరుచికి అనుగుణంగా ట్రావెల్‌కి ట్రాన్స్‌పోర్ట్‌ వెదుక్కోవడమే! ‘అమ్మో చలిలోనా..’ అంటూ ముడుచుకోకండి. తేమ తుంపరలతో రొమాంటిక్‌ టచ్‌ని.. హేమంత తుషారాలతో చిలిపిదనాన్ని.. పొగమంచుతో దాగుడు మూతల అల్లరిని.. వణుకుతో ఆకతాయితనాన్ని తలపిస్తూ .. ఎంత గమ్మత్తుగా ఉంటుందని! ప్రయాణానికి ఇంతకు మించిన వాతావరణం ఉంటుందా?

పైగా మన దేశంలో ట్రావెల్‌కి అనుకూలమైన సమయం (సెప్టెంబర్‌ నుంచి ఎప్రిల్‌ అంటారు) కూడా ఇదే! వీపున బ్యాక్‌ ప్యాక్‌ చేర్చి .. తలను క్యాప్‌తో కవర్‌ చేసి .. చేతులను జర్కిన్‌లో దూర్చి.. పాదాలను షూతో కప్పి చక్కగా దొరికిన కమ్యూట్‌తో కమ్యూనికేట్‌ అయ్యి కోరుకున్న ప్లేస్‌కు చేరుకోవచ్చు!  ప్లేసెస్‌ ఏంటీ అంటారా? బ్యాగ్‌ నిండేన్ని! లిస్ట్‌ చూసుకుని.. సేవింగ్స్‌ అకౌంట్‌తో మ్యాచ్‌ అయ్యేలా కస్టమైజ్‌ చేసుకుని స్టార్ట్‌ అవడమే!

సెలవులంతా కాకుండా.. సంక్రాంతి పండగకల్లా మళ్లీ ఇల్లు చేరాలి అనుకుంటే.. ఆ లిమిటిడెట్‌ హాలిడేస్‌కి తెలంగాణ వాళ్లకు ఆంధ్రప్రదేశ్‌.. ఆంధ్రులకు తెలంగాణ పర్‌ఫెక్ట్‌ ప్లేసెస్‌. తెలంగాణలో హైదరాబాద్‌ చుట్టుపక్కనున్న అనంతగిరి, ఆమ్రబాద్, నాగార్జునసాగర్‌ నుంచి వరంగల్, యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తింపు పొందిన రామప్ప, ఆదిలాబాద్‌ కవ్వాల్‌ ఫారెస్ట్, కాళేశ్వరం, జోడే ఘాట్‌ వంటివెన్నో చూడొచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి నుంచి కోనసీమ, వైజాగ్, బొర్రా కేవ్స్, అరకులోయ, లంబసింగి, రాయలసీమ మహానంది, లేపాక్షి, యాగంటి, బెలూం కేవ్స్, గండికోట, హార్సిలీ హిల్స్‌ లాంటి పర్యాటక ప్రాంతాలెన్నో  ఉన్నాయి.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ చుట్టుపక్క రాష్ట్రాల్లో అయితే బోలెడున్నాయి. 


ముందు మహారాష్ట్రకి వెళితే..
వెస్టర్న్‌ ఘాట్స్‌ అందాలకు ముగ్ధులవొచ్చు. ఈ పశ్చిమ కనుమల ఒళ్లోని స్ట్రాబెరీ తోటల పంచ్‌గని, పూల వనం కాస్‌ ప్లాటూ, కృష్ణా నది జన్మస్థానం మహాబలేశ్వర్, లోనావాలా, పుణె, ముంబై, సముద్ర తీరాలు.. రాజ కోటల నిలయం అలీబాగ్‌.. జనవరిలో అక్కడ జరిగే నారియల్‌ పానీ మ్యూజిక్‌ ఫెస్టివల్, ద్రాక్ష తోటలతో.. వైన్‌ లవర్స్‌కి భూతల స్వర్గమైన నాసిక్,  ఔరంగాబాద్, దౌలతాబాద్‌  రంగుల కళ అజంతా, శిల్పాల ఎర ఎల్లోరా ఎట్‌సెట్రా అన్నీ పర్యటించాల్సిన ప్రాంతాలే. 

పుదుచ్చేరికి..
ఫ్రెంచ్‌ వీథులు, ఫ్రెంచ్‌ భవనాలు, ఫ్రెంచ్‌ సంస్కృతి, అరబిందో ఆశ్రమం, అందమైన బీచ్‌లతోపాటు పర్యాటకులను ప్రేమలో పడేసే మరెన్నో రొమాంటిక్‌ స్పాట్స్‌ ఉన్నాయిక్కడ. అంతేకాదు ఫ్రెంచ్‌ ఫుడ్‌.. వాటర్‌ స్పోర్ట్స్‌ మీ టైమ్‌ని క్వాలిటీగా మారుస్తాయి కచ్చితంగా! స్థానిక, వలస పక్షులకు నిలయమైన ఔస్టరీ (Ousteri Lake) లేక్‌ని అస్సలు మిస్‌ అవకూడదు. 

గోవాకు మళ్లితే.. 
సెలబ్రేషన్స్‌ కాపిటల్‌ ఆఫ్‌ ఇండియా ఇది. వార్మ్‌ వింటర్స్‌కి పర్‌ఫెక్ట్‌ అడ్రస్‌. అందుకే యూరప్‌ అంతా ఇక్కడే ఉన్నట్టుంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం.. ప్రశాంతమైన బీచులు.. సందడి చేసే నైట్‌క్లబ్‌లు.. పగళ్లను తలపించే రాత్రుళ్లతో నిత్యం ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉంటుంది.

లైఫ్‌ని ఒక సెలబ్రేషన్‌గా భావించేవాళ్లకు నచ్చకుండా ఉంటుందా గోవా! చలికాలమైతే అక్కడ పండగలే పండగలు.. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నుంచి క్రిస్మస్‌ దాటి హోలీ దాకా! ఈ ఎంజాయ్‌మెంట్‌ కావాలనుకుంటే వింటర్‌లో గోవాను కచ్చితంగా విజిట్‌ చేయాల్సిందే! అక్కడున్న ఏ బీచ్‌లో అయినా సన్‌రైజ్‌.. సన్‌సెట్‌ని మిస్‌ అవకూడదు!

కర్ణాటక చేరితే.. 
 చారిత్రక కట్టడాలకు.. అలనాటి వైభోగాల జ్ఞాపకాలకు నిలయంగా ఉంటుందీ రాష్ట్రం. పశ్చిమ కనుమల సోయాగాలు, సముద్ర తీరాలు అదనపు ఆకర్షణలు. ఇదీ వింటర్‌ డెస్టినేషనే. గోకర్ణ బీచులు, జోగ్‌ జలపాతాలు, దైనందిన జీవితంలోని ఒత్తిడిని దూరం చేసి మంచు తెరల మధ్య ప్రశాంత వాతావరణంతో సేదతీర్చి.. కాఫీ తోటలతో ఆర్గానిక్‌ ఆహ్లాదాన్ని పంచే కూర్గ్‌.. అక్కడి నాగర్‌హోల్‌ నేషనల్‌ పార్క్‌ను చూడకుండా రావొద్దు.

ఈ రాష్ట్రంలో.. యునెస్కో హెరిటేజ్‌ సైట్‌గా గుర్తింపు పొందిన హంపీ మిస్‌ అవకూడని ప్రాంతం. దీన్ని చూడ్డానికి అనువైన సమయం డిసెంబర్, జనవరి నెలలు. ఏటా జనవరిలో హంపీ మహోత్సవ్‌ జరుగుతుంది. తోలు బొమ్మలాట.. నాట్య, సంగీత ప్రదర్శనలు.. క్రీడల సమ్మేళనమే ఈ ఉత్సవం. ఇక్కడి విరూపాక్ష గుడి, మాతంగా హిల్, విఠ్ఠల మందిరం, హజారా రామ గుళ్లను తప్పక దర్శించాలి.

ఆ ఆనందంలో మైసూర్‌ని మరవొద్దు. నిజానికి దీన్ని దసరా సమయంలో చూడాలి. కానీ అప్పటి రద్దీని దృష్టిలో పెట్టుకుని వెళ్లని.. వెళ్లలేని వాళ్లు ఇప్పుడు ప్లాన్‌ చేసుకోవచ్చు. దేశంలోని రాయల్‌ సిటీస్‌లో ఇదొకటి. మైసూర్‌ ప్యాలెస్, కళాత్మకమైన పెయింటింగ్స్, మైసూర్‌ జూ, చాముండేశ్వరీ ఆలయం, జగన్‌మోహన్‌ ప్యాలెస్‌ నుంచి చవులూరించే మైసూర్‌ పాక్‌ దాకా దేన్నీ వదిలిపెట్టడానికి వీల్లేదిక్కడ. బెంగళూరు నుంచి మంగళూరు దాకా విస్టడోమ్‌ ట్రైన్‌లో జర్నీ ఆస్వాదించి తీరాల్సిందే!

తమిళనాడుకు వస్తే..
ఉక్కపోత, వేడికి పుట్టిల్లుగా ఉన్న తమిళనాడు చలికాలంలో పర్యాటకులకు వార్మ్‌ వెల్‌కమ్‌ చెబుతుంది. ఇండియా మొత్తానికి దీన్ని వింటర్‌ డెస్టినేషన్‌గా పేర్కొనొచ్చు. పశ్చిమ కనుమల్లో భాగమైన నీలగిరి కొండల్లోని మంచు ఛాయలు.. మధుమలై అడవులు.. ఏళ్లుగా కోలీవుడ్‌కే కాదు టాలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్‌తోపాటు బాలీవుడ్‌కీ సౌకర్యవంతమైన ఔట్‌డోర్‌ షూటింగ్‌ స్పాట్‌గా ఉంటూ..

సర్కారు బడుల నుంచి కార్పొరేట్‌ స్కూల్స్‌ వరకు అన్నిటికీ ఎక్స్‌కర్షన్‌లో భాగమైన ఊటీ.. అక్కడి బ్రిటిష్‌ కాలం నాటి సెయింట్‌ స్టీఫెన్స్‌ చర్చ్, కాఫీ తోటలు, పల్లవుల రాజధాని మహాబలిపురం.. అక్కడి శిల్పాలు, గుహలు, బీచ్‌లు, మొసళ్ల ఫామ్, చోళ దేవాలయా తంజావూరు, సముద్రంలో పంబన్‌ బ్రిడ్జి మీంచి రామేశ్వరానికి రైలు ప్రయాణం, దక్షిణ భారతంలో ఆఖరి ఊరు ధనుష్కోడి, కన్యాకుమారి.. ఎన్నని! పంబన్‌ బ్రిడ్జి మీంచి రైలు ప్రయాణం ఎంత ముఖ్యమో ఊటీకి టాయ్‌ ట్రైన్‌ జర్నీ అంతే ముఖ్యం.. మరువద్దు!

గాడ్స్‌ ఓన్‌ కంట్రీ కేరళలో..
.. ప్రతి ప్రాంతం ఒక మనోహర దృశ్యమే. చిరాకు తెప్పించే ఉక్కపోత కాకుండా.. ఎముకలు కొరికే చలీ లేకుండా ఈ సీజన్‌లో ఆహ్లాదంగా ఉంటాయి ఇక్కడి పర్యాటక కేంద్రాలు. బ్యాక్‌ వాటర్స్‌లో హౌస్‌ బోట్‌ షికార్లు.. వెంబనాడ్‌ లేక్, మారారి బీచ్‌.. అలెప్పుళ బీచ్‌ల తీరం.. ఆయుర్వేదిక్‌ స్పాల కేంద్రం అలెప్పీ (నవంబర్‌లో అయితే ఇక్కడ స్నేక్‌ బోట్‌ పోటీలను చూడొచ్చు), కళ్లు తిప్పుకోనివ్వని సీనరీ.. టీ తోటలు..

జలజలపారే జలపాతాలతో కశ్మీర్‌ ఆఫ్‌ ద సౌత్‌గా పేరున్న మున్నార్‌.. అక్కడి ఎకో పాయింట్, అనాముడి పీక్, టాటీ టీ మ్యూజియంలో వైవిధ్యమైన తేనీటి రుచులు, హోమ్‌ మేడ్‌ చాకొలేట్స్‌ పర్యాటకులను ఊరిస్తాయి. వాయనాడ్‌ ఏమన్నా తక్కువా? పశ్చిమ కనుమల్లోని డ్రీమ్‌ డెస్టినేషన్‌ ఇది. రెప్పవేయనివ్వని ప్రకృతి, ట్రెకింగ్, వాయనాడ్‌ వైల్డ్‌లైఫ్‌ శాంక్చురీ, ఎడక్కల్‌ కేవ్స్, వాయనాడ్‌ ఘనమైన చరిత్ర, అద్భుతమైన సంస్కృతి, డిలీషియస్‌ ఫుడ్‌ పర్యటనను ఎక్సైటింగ్‌గా మారుస్తాయి. కుమారకోమ్‌ గురించీ చెప్పాలి.

బ్యాక్‌ వాటర్స్‌ ప్రత్యేకత చూడాలంటే కుమార్‌కోమ్‌ వెళ్లాల్సిందే అంటారు పర్యాటకప్రియులు. చలికాలం వలస పక్షులకు నిలయం ఇది. ఇక్కడి కృష్ణపురం ప్యాలెస్, చంపకుళంలోని బెసిలికా ఆఫ్‌ సెయింట్‌ మేరీ మిస్‌ అవకూడదు. 


ఇవన్నీ బాగా ప్రాముఖ్యంలో ఉన్న మచ్చుకు కొన్ని పర్యాటక స్థలాలు మాత్రమే. కాస్త ఎక్కువ రోజులు.. ఇంకాస్త ఎక్కువ దూరాలు.. మరికాస్త ఎక్కువ బడ్జెట్‌ను భరించొచ్చు అనుకుంటే ఉత్తరాదిలోని ఈ ప్రాంతాలకూ వెళ్లొచ్చు. ఒక్కసారి లుక్కేసి తర్వాత ఐటినరీ ప్రిపేర్‌ చేసుకోండి! 

నిజానికి చలికాలం నార్త్‌ ఇండియా అంతటినీ వణికిస్తుంది. కానీ రాజస్థాన్‌ వెచ్చగా ఉంటుంది. ఇక్కడికి వెళ్లడానికి చలికాలమే కరెక్ట్‌ కాలం.  ఏమేం చూడొచ్చంటే.. 

జైపూర్‌
రాజస్థాన్‌ రాజధాని.. పింక్‌ సిటీగా పేరు. ఈ టైమ్‌లో ఇక్కడ లిటరేచర్‌ .. కైట్‌ ఫెస్టివల్స్‌ ఉంటాయి. హవా మహల్, ఆమేర్‌ ఫోర్ట్, జల్‌ మహల్, సిటీ ప్యాలెస్, జంతర్‌ మంతర్‌ వంటివి ఇక్కడి దర్శనీయ స్థలాలు. 

ఉదయ్‌పూర్‌
వెనీస్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ అంటారు దీన్ని. లేక్‌ ప్యాలెస్, ఫతేహ్‌ సాగర్‌ లేక్, జగ్‌ మందిర్, లేక్‌ పిఛోలా వంటివన్నీ ఉదయ్‌పూర్‌కి ప్రత్యేక శోభనిస్తూ ప్రపంచవ్యాప్త టూరిస్ట్‌లను ఆకర్షిస్తుంటాయి. ఇక్కడి లేక్స్, ఆరావలి పర్వతాలు.. ఉదయపూర్‌ వాతావరణాన్ని వెచ్చగా ఉంచి దీని పర్యటనకు చలికాలాన్ని పర్‌ఫెక్ట్‌గా మారుస్తున్నాయి. ఏటా చలికాలం ఇక్కడ ఆర్ట్స్, క్రాఫ్ట్స్‌కి సంబంధించిన ఉత్సవం జరుగుతుంది. ఆ టైమ్‌లో కళాప్రియులు ఈ ట్రిప్‌కి ప్లాన్‌ చేసుకోవచ్చు. 

రనక్‌పూర్‌
జైన్స్‌కి ముఖ్యమైన ప్రాంతం ఇది. ప్రశాతంతకు నిలయం ఈ పట్టణం. ప్రసిద్ధ చౌముఖ ఆలయం నెలవైందిక్కడే. దీని నిర్మాణ కళ అమోఘం. ఏడాది పొడుగునా భక్తుల రాకతో కళకళలాడుతూంటుంది. ఉదయ్‌పూర్‌కి దగ్గర్లో ఉంటుంది. కాబట్టి ఉదయ్‌పూర్‌కి వెళ్లినప్పుడు ఈ ఊరిదాకా ప్రయాణాన్ని పొడిగించుకోవచ్చు. 

జైసల్మేర్‌
ఈ డెజర్ట్‌ సిటీని చూడ్డానికి డిసెంబర్, జనవరి నెలలే బెస్ట్‌. ఇప్పుడెలాగూ సంక్రాంతి సెలవులే కాబట్టి చక్కగా ప్లాన్‌ చేసుకోవచ్చు. డెజర్ట్‌ క్యాంపింగ్, క్యామెల్‌ రైడ్స్, క్వాడ్‌ బైకింగ్, డ్యూన్‌ బాషింగ్, పారాసైలింగ్‌ .. ఇలా బోలెడు యాక్టివిటీస్‌తో జైసల్మేర్‌లో ఎంజాయ్‌ చేయొచ్చు.

అడ్వెంచరస్‌ యాక్టివిటీస్‌కి దూరంగా ఉండేవాళ్లు.. డెజర్ట్‌ ఫెస్టివల్, నెరాసీ (Nerasi) మ్యూజిక్‌ స్కూల్, కుల్‌ధారా విలేజ్, సోనార్‌ ఖిలా వంటి కల్చరల్‌ రైడ్‌ను ఆస్వాదించొచ్చు. ఫేమస్‌ లాంగేవాలా పోస్ట్‌కి డ్రైవ్‌ను మిస్‌ కావద్దు.

జోధ్‌పూర్‌
దీనికి బ్లూ సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌గా పేరు. 7 నుంచి 27 డిగ్రీల సెల్సియస్‌ టెంపరేచర్‌తో ఆహ్లాదంగా ఉంటుంది. మెహరంగఢ్‌ ఫోర్ట్, ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్, మహామందిర్‌ టెంపుల్‌ వంటి జోధ్‌పూర్‌ల్యాండ్‌మార్క్స్‌ని చక్కగా దర్శించొచ్చు. అక్టోబర్‌లో అయితే ఇక్కడ ఇంటర్నేషనల్‌ ఫోక్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది. వచ్చే ఏడాదికి ప్రణాళిక సిద్ధం చేసుకోండి. 


ఇసుక ఎడారి సరే ఉప్పు ఎడారీ చూడాలనుకుంటే గుజరాత్‌లోని రణ్‌ ఆఫ్‌ కచ్‌కి టికెట్స్‌ బుక్‌ చేసుకోవాలి.  నల్లటి ఆకాశంలో తెల్లగా మిలమిల మెరుస్తున్న చుక్కల కింద.. చల్లటి వాతావరణంలో తెల్లటి ఉప్పు తివాచీ మీద కూర్చుని.. క్యాంప్‌ ఫైర్‌తో చలి కాచుకుంటూ .. గుజరాత్‌ సంప్రదాయ ఫుడ్‌ను ఆస్వాదిస్తుంటే ఊహల్లోని స్వర్గం ఇదేనేమో అనిపిస్తుంది!

అంతేకాదు పీక్‌ వింటర్‌ రెండు నెలలు ఇక్కడ కల్చరల్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది.. రణ్‌ ఉత్సవ్‌ పేరుతో. దీన్నే కచ్‌ ఫెస్టివల్‌ అనీ పిలుస్తారు. అద్భుతమైన గుజరాతీ సంప్రదాయ ఫుడ్‌తోపాటు స్థానిక హ్యాండీక్రాఫ్ట్స్, డెజర్ట్‌ సఫారీలు మనసును దోచుకుంటాయి.

ఈ వేడుకను వీక్షించడానికి  ప్రపంచ నలుమూల నుంచీ లక్షల్లో పర్యాటకులు వస్తుంటారు. అందుకే ముందస్తుగా బుక్‌ చేసుకుంటే మంచిది. ధోర్డో గ్రామంలో క్యాంపింగ్‌ మరచిపోయేది కాదు.

కురిసే మంచును ఆస్వాదించాలనుకుంటే హిమాలయాల ఓడిలో మంచు ముసుగేసుకున్న ప్రాంతాలకు ప్రయాణమవాల్సిందే. థర్మల్స్, గ్లోవ్స్, షూస్‌.. కోల్డ్‌ క్రీమ్స్‌ మస్ట్‌! ఆ ప్రాంతాల్లో కొన్ని.. 
బిన్సర్‌
ఇది ఉత్తరాఖండ్‌లోని చిన్న హిల్‌ స్టేషన్‌. వింటర్‌లో తప్పక చూడాల్సిన జాబితాలో ఫస్ట్‌ పెట్టాల్సిన ప్లేస్‌. మబ్బులను ముద్దాడే కేదార్‌నాథ్, త్రిశూల్, నందా దేవి శిఖరాలు కళ్లు తిప్పుకోనివ్వవు. ఫొటోగ్రాఫర్స్‌కైతే ఇంచ్‌ ఇంచ్‌ అద్భుతమైన ఫ్రేమే! ఇక్కడి బిన్సర్‌ వైల్డ్‌లైఫ్‌ శాంక్చురీని పిల్లలకు చూపించాల్సిందే. ఇందులో అరుదైన పక్షి, జంతు జాతులను చూడొచ్చు. 

ఔలీ
ఇదీ ఉత్తరాఖండ్‌లోని ప్రాంతమే. దీనికి స్కైయింగ్‌ డెస్టినేషన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరు. అద్భుతమైన నందా దేవి, నీలకంఠ, మన పర్వత శిఖరాల మీదుగా స్కైయింగ్‌ చేస్తూ హిమాలయ అందాలను వీక్షించొచ్చు. చలికాలం వైవిధ్యమైన కళను సంతరించుకుంటుంది. మందంగా పరచుకున్న మంచు మీద స్కైయింగ్‌ చేయడానికి సాహసవంతులు ఉవ్విళ్లూరుతుంటారు. 

డల్హౌసీ
హిమాచల్‌ ప్రదేశ్‌లోని డిఫరెంట్‌ హిల్‌ స్టేషన్‌. ఇక్కడి ఇళ్లు.. రోడ్లు.. కూడళ్లలో బ్రిటన్‌ ఆనవాళ్లు  కనపడుతూంటాయి. కురుస్తున్న మంచులో ట్రెకింగ్‌ చేయాలనుకునే ఉత్సాహవంతులకు ఇది సరైన సమయమూ.. ప్రాంతమూ! నేషనల్‌ హిమాలయన్‌ వింటర్‌ ట్రెకింగ్‌ ఎక్సెపెడిషన్‌ని హోస్ట్‌ చేసేది డల్హౌసీనే!
ఈ జాబితాలో సిమ్లా, కులు, మనాలి, కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, మేఘాలయా, అరుణాచల్‌ ప్రదేశ్‌ వంటివాటినీ చేర్చుకోవచ్చు. 

గమనిక: పర్యటనకు కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకోగలరు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement