కవర్‌ స్టోరీ: ఏడాది@ ఇల్లేనా! | Students Are In Their Home For One Year Ago Due To Coronavirus And Lockdown | Sakshi
Sakshi News home page

కవర్‌ స్టోరీ: ఏడాది@ ఇల్లేనా!

Published Sun, Jun 13 2021 1:07 PM | Last Updated on Sun, Jun 13 2021 1:31 PM

Students Are In Their Home For One Year Ago Due To Coronavirus And Lockdown - Sakshi

‘నాన్నా... ఈ బిల్డింగ్‌ని ఎక్కడో చూసినట్టుంది.. దీని ముందు నుంచి వెళ్తుంటే ఏవేవో గుర్తొస్తున్నాయి’ అంటాడు ఓ పిల్లాడు. ‘ఒరేయ్‌.. అది నీ స్కూల్‌ రా.. ’ అని చెప్తాడు తండ్రి.ఇదొక  జోక్‌గా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది కానీ అదో విషాదం. పిల్లలకు శాపం. కారణం కరోనా అని ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. దాని ప్రభావం ఈ విద్యా సంవత్సరాన్ని గైర్హాజర్‌ చేసింది.. థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలతో వచ్చే విద్యా సంవత్సరానికీ సిక్‌ లీవ్‌ మంజూరు చేసే ప్రమాదాన్ని చూపిస్తోంది. మరి బడులు? ఆ ప్రాంగణంలో వికసించే బాల్యం? పాఠశాల అంటే నల్లబల్ల – సుద్దముక్క, బెంచీలు – టేబుళ్లు, టీచర్లు – పాఠాలే కాదుకదా! ఆట.. పాట.. అల్లరి..సరదా.. సంతోషం.. స్నేహం.. వైరం.. పోటీ.. ప్రయత్నం.. గెలుపు.. ఓటమి..ఫిర్యాదు – ప్రశంస.. వాదన – రాజీ.. సమ్మతి – వ్యతిరేకతలను నేర్పిస్తుంది కదా!

చూడబోయే ప్రపంచానికి కిటికీ.. సాధించబోయే పరిణతికి పలకా, బలపం అవుతుంది. కొత్త విషయాలను దిద్దిస్తుంది.. చేసిన తప్పులను చెరిపేయిస్తుంది...పుస్తకాల్లో ఉన్నదాంతో పరీక్షలకు సిద్ధం చేయిస్తే.. ఆవరణలో ఉన్న అంశాలతో జీవితానికి సంసిద్ధం చేయిస్తుంది!నేననే స్వార్థం.. నువ్వనే భేదం.. మనమనే ఐకమత్యం బోధపడేదక్కడే! ఆలోచన మొలకెత్తెదీ.. అభిప్రాయం విరిసేదీ ఆ తోటలోనే.. రహస్యాలను పొదగడం.. ఛేదించడం ఆరంభమయ్యేదీ ఆ ప్రహరీలోనే.. నమ్మకాలు పెంచుకునేది.. నమ్మకంగా నడిపించుకునేదీ ఆ వేదిక నుంచే మొదలు.. కలివిడితనం.. కలహించే ధైర్యం.. నిలబడే నాయకత్వం అలవడేది అక్కడే.. కలలను పరిచయం చేసి.. లక్ష్యాలను ఏర్పర్చుకునే సత్తానిచ్చేదీ అదేబతుకుసాగరంలో వేటకు  లౌక్యపు నావ.. ఇంత తత్వం.. జీవన శాస్త్రం ఒంటబట్టించే బడిని.. ఆరోగ్యకరంగా పెరిగే అవకాశాన్నీ శాసిస్తోంది కరోనా!

లాక్‌డౌన్‌తో విద్యా వ్యవస్థ మొత్తం గందరగోళంలో పడి పిల్లల మానసికస్థితి రోజురోజుకూ దిగజారుతోందని అనేక సర్వేలు చెబుతున్నాయి. మొదటిసారి బడిలో ప్రవేశం పొందాల్సిన పిల్లల దగ్గర నుంచి పరీక్షలు రాయకుండానే పాస్‌ అయిపోయిన విద్యార్థుల వరకు అందరి పరిస్థితి ఒకటే.  మన దేశంతోపాటు 188 పైనే దేశాలు బళ్లు మూసివేసి.. డిజిటల్, రేడియో వంటి పలు మాధ్యమాలతో విద్యను అందిస్తున్నాయి. ఈ సమయంలో ఇంటికే పరిమితమవుతున్న పిల్లలు చాలా ఒత్తిళ్లకు లోనవుతున్నారు. కరోనా కన్నా దాని ప్రభావిత బాధితుల్లో అధిక స్థానం పిల్లలదే అంటున్నారు మానసిక నిపుణులు. లాక్‌డౌన్‌లో వేధింపులు, వారి బాగోగులను పట్టించుకోని కారణంగా ఎంతోమంది చిన్నారులను  మానసిక సమస్యలు వెంటాడుతున్నాయని చెప్తున్నారు. 

మరింత శ్రద్ధ తప్పదు
తోటివిద్యార్థుల సాంగత్యం లేకపోవడంతో పిల్లలు తెలియకుండానే చిన్న చిన్న ఆనందాలను కోల్పోతున్నారు. డిజిటల్‌ పాఠాల విషయానికి వస్తే.. ఆన్‌ లైన్‌ క్లాసులకు, సాధారణ క్లాసులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రత్యక్ష తరగతి బోధనలో టీచర్‌ చెప్పే విషయాన్ని విద్యార్థి ఫాలో అవుతున్నాడో లేదో మనం గమనించి తర్పీదు ఇవ్వడానికి వీలు కలుగుతుంది. ఆన్‌లైన్‌లో అలా కుదరదు.

అది కూడా 50% విద్యార్థులు మాత్రమే వీటిని వినగలుగుతున్నారు. పైగా ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల వారు కావడంతో నెట్‌ వర్క్‌ సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఏం చేస్తాం? ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తప్ప మరో మార్గం లేదు. విద్యార్థుల  విషయంలో ఉపాధ్యాయులతో పాటు పేరెంట్స్‌ కూడా శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం. ఎప్పుడూ చదువు గురించే కాకుండా వాళ్లతో కాస్త సరదాగా గడపడం అవసరం.
పి. వి. రామరాజు, శ్రీ బాలాజీ కాన్వెంట్‌ 
హెడ్‌ మాస్టర్, ముమ్మిడివరం, తూర్పు గోదావరి

అన్ని కోణాల్లో చూడాలి
సాధారణంగా పిల్లలు హాలీడేస్‌ కోరుకుంటారు కాబట్టి లాక్‌ డౌన్‌ వాళ్లకు అసలు సమస్యే కాదు అనుకుంటాం. మొదట్లో సెలవు దినాల్లో ఉండే వినోదంతో పాటు.. అనువుగా ఉండే చదువు విధానాన్ని పిల్లలు ఆనందంగానే స్వీకరించారు. నెలలు గడుస్తున్న కొద్దీ క్రమంగా వాళ్లకి తెలియకుండానే అవాస్తవిక ప్రపంచంలోకి  వెళ్లిపోయారు. దాంతో లెర్నింగ్‌ మెకానిజం అంతా వర్చువల్‌ అయిపోయింది. నేర్చుకోవడం ఎలాగో తప్పుదు.. దానికి తోడు పెరుగుతున్న ఒత్తిడి, బయటికి వెళ్లేందుకు అవకాశం లేకపోవడం ఇదంతా కలిసి పిల్లల్లో డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్‌ కలిగిస్తున్నాయి.

ఇదివరకూ ఈ ఫ్రస్ట్రేషన్, ఈ డిప్రెషన్‌ కాస్తోకూస్తో ఉన్నా ఫ్రెండ్స్, ఆటపాటలు వంటి వాటితో సేద తీరేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. పిల్లల్లో విపరీతమైన కోపం, చిరాకు, చదువు మీద ఆసక్తి  తగ్గడం, మూడీగా ఉండటం, ఎదురు సమాధానాలు చెప్పడం, వద్దన్న పని చెయ్యడం, బిగ్గరగా అరవడం, చిన్నదానికే ఏడవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. పిల్లల ఈ తీరును  ‘ఈ మధ్య అల్లరి ఎక్కువైంది’ అని చాలా సింపుల్‌గా తీసుకుంటున్నాం. కానీ ఇదొక సమస్య. దీన్ని అడ్జెస్ట్‌మెంట్‌ డిజార్డర్‌ అంటారు. అంటే సానుకూలంగా అనిపించని ఒక పరిస్థితికి అడ్జెస్ట్‌ అవ్వడం. పిల్లలకు ఇబ్బందికరంగా మారినప్పుడు వారి మాటల్లో కంటే  చేతల్లోనే ఎక్కువ మార్పు కనిపిస్తుంది. ఈ గందరగోళ పరిస్థితుల్లో ‘ఎంతకాలం మేము ఈ నాలుగు గోడల మధ్యనే ఉండాలి?’ అనే ప్రశ్న పిల్లల్ని డిప్రెషన్‌ కి గురి చేస్తోంది. ఏవరేజ్, అబౌ ఏవరేజ్‌ పిల్లలతో పోలిస్తే బిలో ఏవరేజ్‌ పిల్లలకు.. ఆన్‌ లైన్‌ క్లాసుల సారాంశం 10 – 15 శాతం కూడా మైండ్‌కి ఎక్కదు.

దాంతో వాళ్లకి, వీళ్లకి మధ్య మానసికమైన చాలెంజ్‌తో పాటు అకడమిక్‌ ఇయర్‌ ల్యాగ్‌ అనేది ఏర్పడిపోతుంది. ఆ గ్యాప్‌ని కవర్‌ చేయడానికి ప్రత్యేకమైన క్లాసులు, ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. అయితే ఇప్పటి దాకా మనం తెలుసుకున్నది అడ్జెస్ట్‌మెంట్‌ ప్రాబ్లమ్స్‌. భవిష్యత్‌లో రి–అడ్జెస్ట్‌మెంట్‌ ప్రాబ్లమ్స్‌ కూడా తలెత్తుతాయి. అంటే ఇంత దీర్ఘకాలికంగా ఇంటిపట్టునే ఉండిపోతున్న ఈ పిల్లలు మళ్లీ రియల్‌ టైమ్‌ స్కూల్స్‌కి వెళ్లి, ఆ వాతావరణానికి అడ్జెస్ట్‌ అయ్యి, ఆ టీచర్స్, తోటివారిని చూస్తూ.. క్లాసులో కంటిన్యూగా కదలకుండా కూర్చోవడం కష్టమవుతుంది.  

ఇంట్లో ఉండి పాఠం వినేదానికి స్కూల్లో కూర్చునేదానికి తేడా ఉంటుంది. అప్పుడు కూడా పిల్లలు అంత పద్ధతిగా ఉండగలరా? అంటే కష్టమే. మళ్లీ దారిలో పడటానికి దగ్గరదగ్గరగా ఆరు నెలలు టైమ్‌ పడుతుంది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది  ఏంటంటే.. మనం ఎంత ఒత్తిడిలో ఉన్నా వాటిని పక్కనపెట్టి.. వాళ్లతో కూర్చుని కబుర్లు చెబుతుండాలి. వాళ్లు చేసిన పనిని వెంటనే తప్పుబట్టకుండా, మిగతా పిల్లలతో పోల్చకుండా రిలాక్స్‌డ్‌గా, బ్యాలెన్స్‌డ్‌గా నవ్వుతూ పిల్లలతో మెలిగితే వారి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అల్లరీ తగ్గుతుంది. వినే ఓపిక పెరుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లల సైకాలజీ.. పేరెంట్స్‌ సైకాలజీ, ప్రవర్తనలపై ఆధారపడి ఉంటుంది.
-డా. కళ్యాణ్‌ చక్రవర్తి
కన్సల్టెంట్‌ చైల్డ్‌ అండ్‌ 
అడల్ట్‌ సైకియాట్రిస్ట్‌


ఫ్రెండ్స్‌కి దూరమయ్యా.. 
ఈ ఏడాదే నాది టెన్త్‌ పూర్తి అయ్యింది. ఢిల్లీలోని హోలీ ఏంజెల్స్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌లో చదువుకున్నాను.  లాక్‌ డౌన్‌  వల్ల లాస్ట్‌ ఇయర్‌ అంతా  ఆన్‌ లైన్‌ క్లాసులతోనే  ముగిసింది. ఇదే చివరి ఏడాది కావడంతో అన్నేళ్ల పాటు కలిసి చదువుకున్న నా ఫ్రెండ్స్‌ అందరినీ  కలుసుకోకుండా,  కనీసం సెండాఫ్‌ కూడా  తీసుకోకుండానే మా ఊరికి వచ్చేయాల్సి వచ్చింది. వాళ్లంతా ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్నారు. ఆ రోజుల్ని  చాలా మిస్‌ అవుతున్నా. ఫేవరెట్‌ టీచర్, ఫేవరెట్‌ క్లాస్‌ ప్రతీది మిస్‌ అయ్యా. నేను టెన్త్‌కి రాగానే.. కాలేజ్‌ లైఫ్‌ గురించి చాలా ఊహించుకునేవాడ్ని. కొత్త వాతావరణం, కొత్త ఫ్రెండ్స్, ఫ్యూచర్‌ గోల్స్‌.. ఇలా చాలానే అనుకున్నాను. ఇప్పట్లో తీరేలా లేవు.  – బుద్దుల సాయి గణేష్, స్టూడెంట్, ఖాజురు (శ్రీకాకుళం)

ఆ ఆనందం సాటి రాదు కదా..
పిల్లల వ్యక్తిత్వ వికాసంలో ఫస్ట్‌ రోల్‌ పాఠశాలదే. టీచర్‌ చెప్పే పాఠాలతో పాటు తోటి  పిల్లలను కలుసుకోవడం, వారితో స్నేహం చెయ్యడం, కలిసి తినడం, ఆడుకోవడం, చదువుకోవడం అదంతా పిల్లల మానసిక ఉల్లాసాన్ని రెట్టింపు చేస్తుంది. స్కూల్స్‌ మూతపడటంతో మా అబ్బాయి ఇప్పుడు అవన్నీ మిస్‌ అవుతున్నాడు. ఆన్‌లైన్‌ క్లాసులు తరగతి గది పాఠాల లోటును పూరించినా, తమ ఈడు పిల్లలతో ఆడుతూ, పాడుతూ పొందే ఉత్సాహాన్ని మాత్రం ఇవ్వలేకపోతున్నాయి. పెద్ద వాళ్లం పిల్లలుగా మారి వాళ్లతో ఎన్ని కబుర్లు చెప్పినా.. ఎంత ఆడించినా తోటి పిల్లలతో పొందే ఆనందం సాటి రాదు 
కదా అది! – మాకిరెడ్డి వర ప్రసాద్‌ (పేరెంట్‌), నర్సీపట్నం, విశాఖపట్నం

పిల్లలకు నచ్చేలా.. వాళ్లు మెచ్చేలా.. 
ఈ సంక్షోభం వల్ల మనం అవలంబిస్తున్న ఆన్‌లైన్‌ క్లాసులు పిల్లల మీద తీవ్ర ప్రభావాన్నే చూపిస్తున్నాయి. పిల్లల్లో నేర్చుకోవాలనే తపన, తాపత్రయం దెబ్బతినే ప్రమాదం కనపడుతోంది. బడిలో చెప్పే పాఠాలే పిల్లలకు మంచిది. క్లాసులో టీచర్‌  పిల్లలను గమనిస్తూ పాఠం చెప్పటం వల్ల వాళ్ల  మానసిక స్థితిని అంచనా వేయగలం. పాఠం అర్థం చేసుకోలేక పోతుంటే  మరింత వివరంగా  చెప్పే  వీలవుతుంది. అయితే  లాక్‌ డౌన్‌లో వర్చువల్‌ క్లాసులు తప్పవు కాబట్టి.. పిల్లలకు నచ్చేలా.. వాళ్లు మెచ్చేలా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించే ప్రయత్నం  చేస్తున్నాం. క్లాసులు జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. మొబైల్, ల్యాప్‌ టాప్‌లలో క్లాసులు శ్రద్ధగా వింటున్నారా లేక వేరే స్క్రీన్స్‌  ఆన్‌ చేసి కాలక్షేపం చేస్తున్నారా అన్నది తప్పక పరిశీలించుకోవాలి. బాధ్యతగా పిల్లల కోసం సమయాన్ని కేటాయించాలి. – వై రమాదేవి, వైస్‌ ప్రిన్సిపాల్, M.SC, M.Phil, B.Ed, శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్‌ స్కూల్‌ (స్విస్‌), హైదరాబాద్‌

స్టూడెంట్‌.. టీచర్‌.. ఫ్రెండ్స్‌గానూ.. 
పిల్లల టైమ్‌ టేబుల్‌ను కరోనా కంటే ముందు తర్వాత అని చూడాల్సి వస్తోంది.  స్కూల్‌కి వెళ్లి రావడం, ఫ్రెషప్‌ అయ్యి  హోమ్‌ వర్క్‌ చేసు కోవడం.. తర్వాత  పక్కింటి పిల్లలతో ఆడుకోవడం.. ఇలా వాళ్లకంటూ కొంత సరదా, సంతోషం ఉండేది.  కానీ ఇప్పుడు వాళ్లను ఇల్లు దాటిపోనివ్వట్లేదు. చదువులేమో ఆన్‌లైన్‌ అయిపోయే. వాళ్లతో ఆడేవారు, పాడేవారు లేక ఒంటరిగా ఫీల్‌ అవుతున్నారు. అందుకే వాళ్ల మీద మరింత శ్రద్ధ పెట్టాల్సి వస్తోంది. పైగా ఈ ఆన్‌ లైన్‌ క్లాసులతో పేరెంట్స్‌ ఇటు స్టూడెంట్స్‌గా, అటు టీచర్స్‌గానూ మారాల్సి వస్తోంది. మిగిలిన సమయంలో వాళ్లతో ఆడుతూ పాడుతూ వాళ్లకు ఫ్రెండ్స్‌గానూ ఉండాల్సి వస్తోంది. ఇలా పిల్లల మీద కరోనా ప్రభావం లేకుండా వాళ్లను నార్మల్‌గా ఉంచేందుకు పేరెంట్స్‌ చాలానే కష్టపడాల్సి వస్తోంది. నిజంగానే స్కూల్‌ విలువ తెలిసి వస్తోంది. 
– బొద్దుల స్వర్ణలత (పేరెంట్‌) గోకుల్‌ నగర్, మల్లాపూర్, హైదరాబాద్‌

స్కూల్‌ మిస్సవుతున్నాం
స్కూల్‌ ఉంటే ఫ్రెండ్స్‌ని కలవటం, రెగ్యులర్‌గా క్లాసులకు వెళ్లటం జరిగేది. స్పోర్ట్స్‌ పీరియడ్‌లు, కల్చరల్‌ యాక్టివిటీస్‌ ఉండేవి. నాకు ఆన్‌ లైన్‌ క్లాసులు మొదట్లో ఇబ్బందిగా అనిపించేవి. కానీ ఇప్పుడు అలవాటు అయ్యాయి. ఆన్‌ లైన్‌ పరీక్షలు కూడా రాయగలుగు తున్నా. ఆన్‌ లైన్‌లో క్విజ్‌లు, సర్వేలు బాగుంటున్నాయి. ఇది భవిష్యత్‌లో ఆన్‌ లైన్‌ పరీక్షలు రాసేందుకు ఉపయోగపడొచ్చు. కానీ స్కూల్‌నైతే రీప్లేస్‌ చేయలేవు. మా స్కూల్‌ని చాలా మిస్‌ అవుతున్నా. త్వరగా అంతా మామూలుగా అయిపోతే బాగుండు!  – కావ్యశ్రీ రత్న, టెన్త్‌ క్లాస్‌ స్టూడెంట్‌  (హైదరాబాద్‌)

ముందు జాగ్రత్తలు అవసరం
లాక్‌ డౌన్‌ ప్రభావంతో చాలా మంది  పిల్లలు సమాచారం మొత్తం మొబైల్‌లోనే ఉంటుందన్న ఆలోచనలతో ఇమేజినరీ వరల్డ్‌కి వెళ్తున్నారు. ముఖ్యంగా 13–18 సంవత్సరాల పిల్లలపై  ఈ చెడు ప్రభావం ఎక్కువగా ఉంది. నాలెడ్జ్‌కి, ఇన్ఫర్మేషన్‌కి మధ్య తేడాను గుర్తించే శక్తి టీనేజ్‌లో ఉండదు. బాహ్య ప్రపంచం నుంచి పొందే జ్ఞానం తగ్గిపోతుంది. మొబైల్‌ వాడకం ఎక్కువ కావడం వల్ల మొబైల్‌ అడిక్షన్‌ ఎక్కువయ్యే ప్రమాదమూ ఉంది. దీన్ని నోమో ఫోబియా అంటారు. వీటికి పరిష్కారమార్గాలు.. ఇంట్లో ఒక టైం టేబుల్‌ వేసుకుని దాన్ని ఫస్ట్‌ పేరెంట్స్‌ పాటించాలి.

ఉదాహరణకు ఆన్‌ లైన్‌ క్లాస్‌ ఓ 30 నిమిషాలు ఉంటే.. ఆ టైంలో తప్ప మిగిలిన టైంలో మొబైల్‌ యూజ్‌ చేయకుండా చూడాలి. మంచి అభిరుచి ఉన్న పుస్తకాలను చదివేటట్టు చేయాలి. థర్డ్‌ వేవ్‌ గురించి పిల్లల్లో ఉన్న భయాలను పొగొట్టాలి. ఫిజికల్‌గా, మెంటల్‌గా ప్రిపేర్‌ చేయడానికి ధ్యానం, ప్రాణాయామం లాంటివి చేయించాలి. ఐదు నుంచి పది నిమిషాలు బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయించాలి. పిల్లల రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులదే కాబట్టి వాళ్లతో వీలైనంత ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేయాలి. – డా. గంగం సిద్ధా రెడ్డి, డిస్ట్రిక్ట్‌ సైకియాట్రిస్ట్‌ (DMHP), దావణగెరే (జిల్లా), కర్ణాటక

విరక్తి పుడుతోంది.. 
‘ఒంటరితనంతో బాధపడుతున్నా. విరక్తి పుడుతోంది’ అంటూ.. పదహారేళ్ల ఓ బాలుడి నుంచి ఒక హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫోన్‌ కాల్‌ అది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి చెప్పుకున్నాడు. ఇలాంటి కాల్స్‌ తమకు చాలానే వస్తున్నాయని ‘నేషనల్‌ సొసైటీ ఫర్‌ ది ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రుయాల్టీ టు చిల్డ్రన్‌’ అనే చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌  సంస్థ వెల్లడించింది.

‘మనం స్కూళ్లను మూసేసి, పిల్లల జీవితాలనే మూసేశాం’ అని ‘రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌ ’ అనే సంస్థ ప్రెసిడెంట్, ప్రొఫెసర్‌ రస్సెల్‌ వినర్‌ అభిప్రాయపడ్డారు. దీన్ని బట్టి అర్థమవుతోంది కదా  పిల్లల మానసిక సమస్యలకూ వైద్యాలయాలు ఈ విద్యాలయాలు అని. కరోనా కారణంగా  అవి మూతపడి పిల్లల మానసిక స్థితి మీద తీవ్ర ప్రభావం పడినట్లు ప్రపంచవ్యాప్తంగా అనేక సర్వేల్లో  వెల్లడవుతోంది కూడా. 

భయపెడుతున్న గణాంకాలు
ఈ కాలానికి ముందే  సగం బాల్యాన్ని  హైజాక్‌ చేసేసింది ఆధునిక సాంకేతికత. కదలకుండా కంప్యూటర్‌ ముందు కూర్చోబెట్టి కసరత్తుకు దూరం చేసింది. సామాజిక సంబంధాలను డిక్షనరీలో ఓ అర్థంగా మార్చింది. ఆ దుష్ప్రభావాలను గ్రహించి ఆ జీవన శైలి నుంచి బయటపడే ప్రయత్నం మొదలుపెట్టామో లేదో ఇప్పుడు కరోనా పూర్తిగా నిర్బంధంలోకి నెట్టేసింది. అటు బడి లేక.. ఇటు  ఇంటి బయట ఆటలూ లేక పిల్లల మానసిక, శారీరక వికాసానికి కళ్లెం వేసింది. వాళ్లు ఇంట్లోనే ఉంటూండంతో కుటుంబంలోని ఆర్థిక కష్టాలు, హింస వంటి వన్నీ పిల్లలు ప్రత్యక్షంగా చూస్తూన్నారు.

దాంతో తెలియకుండానే ఒత్తిడికి లోనవుతున్నారు. ‘ఈ వైరస్‌ గురించి వింటుంటే చాలా భయమేస్తోంది. కరోనా వల్లే మా నాన్నకు ఉద్యోగం పోయింది. డబ్బు గురించి ఇబ్బంది పడ్తున్నాం. ఇంట్లో గొడవలెక్కువయ్యాయి. ఇంట్లో ఉండాలంటేనే భయమేస్తోంది. ఫ్రెండ్స్‌ దగ్గరకి వెళ్దామన్నా లేదు. లోన్లీగా ఫీలవుతున్నాం..’ అంటూ మధనపడుతు న్నారట చాలామంది చిన్నారులు. ఈ నేపథ్యంలో  పిల్లలకు  ఇచ్చే కౌన్సిలింగ్‌ ఇటీవలి కాలంలో పది  శాతం పెరిగిందని  గణాంకాలు చెబుతున్నాయి.  ‘కుటుంబాల్లో బంధుమిత్రుల రాకపోకల్లేక  చిన్నారులకు బయటి మనుషులతో పరిచయాలు తగ్గిపోతాయి. ఆ పరిణామం వారి  శారీరక, మానసిక పరిణతిపై ప్రభావం చూపెడుతుందని’ చెప్తున్నారు మానసిక వైద్యనిపుణులు. 

యునెస్కో లెక్కలు
పాఠశాలల్లేని కారణంగా  పిల్లలపై హింస, దోపిడీ పెరిగినట్లు, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు ఎక్కువైనట్టు, బాల కార్మికులు, టీనేజ్‌ గర్భిణీలు అధికమైనట్టు యునెస్కో తన  నివేదికలో వెల్లడించింది. బళ్లు లేక ఉచిత భోజనం అందక పేద విద్యార్థులు పోషణకు దూరమవుతున్నారనీ  తెలిపింది. దీన్నిబట్టి అర్థమైన సత్యం ఏంటంటే.. చదువుకి ఆన్‌లైన్‌ ప్రత్యామ్నాయంగా అందినా.. బడికి ఆల్టర్‌నేట్‌ లేదు అని. పెంపకంలో చదువు ఒక భాగం మాత్రమే. కాని బడి.. పెంపకానికి సిలబస్‌. పిల్లల  వికాసానికి ఒక ప్రిస్క్రిప్షన్‌. ఇప్పుడా బాధ్యతను సమాజం తీసుకోవాలి. పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడాలి.
చదవండి: అడ్జస్ట్‌మెంట్‌ డిజార్డర్‌ విత్‌ యాంగ్జైటీ అండ్‌ డిప్రెషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement