వలస పక్షులకు రాదారి గూళ్లు | Sakshi Funday Cover Story ABout Migrant Workers | Sakshi
Sakshi News home page

వలస పక్షులకు రాదారి గూళ్లు

Published Sun, Jun 7 2020 8:20 AM | Last Updated on Sun, Jun 7 2020 8:38 AM

Sakshi Funday Cover Story ABout Migrant Workers

లోకాన్ని ముంచేసే ముప్పేదో రాబోతోందని తెలిస్తే.. అయినవాళ్ల కోసం మనసు వెదుక్కుంటుంది.. చచ్చినా, బతికినా తనవాళ్లతోనే అని కోరుకుంటుంది.. అలాంటి తండ్లాటే కరోనా కాలంలోనూ కనిపిస్తోంది.. 
ఆ వైరస్‌ కన్నా దాన్ని రానివ్వకుండా పెట్టిన లాక్‌డౌన్‌ మనుషుల్లో భయాన్ని సృష్టించింది..  కలైనా.. కఠోర వాస్తవాన్నయినా కుటుంబంతో చూద్దాం... కలో గంజో ఏదున్నా కలిసి పంచుకుందాం అనుకొనేలా చేసింది.. పొట్టకూటి కోసం పరాయి గడ్డకు వచ్చిన మనుషులను బాటసారులుగా మార్చింది..  సొంతవాళ్లను చేరుకునేందుకు వందల కొద్ది కిలోమీటర్లు నడిపించింది...  గుండెకున్న ఆత్రం కాళ్లకూ ఉన్నా నడిపించే శక్తి కడుపులో నిండాలి కదా! అదిలేక నీరసించి సొమ్మసిల్లారు.. ప్రమాదాల బారినపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు.. అయినా మిగిలిన వాళ్లు ప్రయాణం ఆపలేదు.. ప్రాణం పోయినా సరే.. తనది కాని చోట బతికేదే లేదు అనుకుంటూ నడుస్తూనే ఉన్నారు..

ఆ మొండితనమే కాలే కడపులో శక్తిని రగిలించింది.. తోటి మనుషులను కదిలించింది.. సహాయానికి వేల చేతులను అందించింది. వ్యక్తులుగా.. సమూహాలుగా..  గల్లీల్లో.. హైవేల మీద... ఎక్కడెక్కడ వలస కార్మికులు కనిపించే వీలుందో.. అక్కడక్కడ సహాయక శిబిరాలు వెలిశాయి..  ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా సాయం అందిస్తూనే ఉన్నారు..  ఏ ఒక్క వలస కార్మికుడూ ఆకలితో ఇల్లు చేరకూడదు.. వాళ్లను భద్రంగా,  సగౌరవంగా వాళ్ల  ప్రాంతానికి చేర్చాలి అనే  లక్ష్యంతో.  అలా నిలబడ్డ కొంతమంది వ్యక్తులు.. కొన్ని సమూహాలు.. సంస్థల గురించి...

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దేశమంతా లాక్‌డౌన్‌ అయిపోయింది. అత్యవసర సర్వీసులే గడప దాటాయి. మిగిలిన వాళ్లంతా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చూసుకుంటూ, వాట్సప్‌ చాలెంజ్‌లు, టిక్‌టాక్, యూట్యూబ్‌ వీడియోలతో  బిజీగా ఉన్న సమయంలో నెత్తి మీద మూటలతో.. చంకన బిడ్డలతో.. చెప్పుల్లేని కాళ్లతో ఎర్రటి ఎండలో నడుస్తున్నారు వలసకార్మికులు చడీచప్పుడు లేకుండా. వీళ్లు మీడియా కంట పడ్డా.. జనం దృష్టిలోకి రాలేదు మొదట్లో.  నడుస్తూ నడుస్తూ ప్రమాదానికి గురైన రెండు మూడు సంఘటనలతో యావద్దేశం ఉలిక్కిపడి వీళ్లవైపు తలతిప్పింది. అప్పటికే  జాతీయ రహదారుల మీద బారులుబారులుగా కదులుతున్నారు వీళ్లు. అలాంటి వాటిల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ఉన్న నేషనల్‌ హైవే 44 ఒకటి. ఇది తెలంగాణ మీదుగా వెళ్తుంది. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాదికి వచ్చిన వలసకార్మికులు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదే రహదారి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ వాళ్లకు. తమిళనాడు, కర్ణాటక నుంచి వస్తున్నవాళ్లకు హైదరాబాద్‌ .. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్‌ శివార్లలోని మేడ్చల్‌ సెంటర్‌ పాయింట్‌.  ఇక్కడే వెలసింది ఒక సహాయక శిబిరం.

మేడ్చల్‌ ఓఆర్‌ఆర్‌ ఫుడ్‌ క్యాంప్‌.. 
ఈ క్యాంప్‌ ఏర్పడక ముందే మేడ్చల్‌ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్లు కాలినడకన వెళ్తున్న ఈ కార్మికులను చూసి, చలించిపోయారు. వాళ్లను గమ్యం చేర్చడం వల్లకాని పనే.. కనీసం భోజనం పెట్టయినా వాళ్ల కష్టంలో పాలుపంచుకోవాలనుకున్నారు. పది, ఇరవై మందికి సరిపడా వంట చేసి.. దాన్ని పార్సిల్స్‌గా ప్యాక్‌ చేసుకొని హైవే మీదకు వచ్చి ఈ వలసకార్మికులకు ఆ ప్యాకెట్లు ఇచ్చి వెళ్లిపోయేవారు. 

అడ్వకసీ కోవిడ్‌ లాక్‌డౌన్‌ గ్రూప్‌
ఈ ప్రయత్నం ఇలా సాగుతున్నప్పుడే హైదరాబాద్‌ నగరంలో లాక్‌డౌన్‌తో పనిపోయిన వలసకార్మికులకు ఆహారాన్ని, రేషన్‌ను అందజేస్తున్నారు చాలామంది వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు. వాటిల్లో ఒక గ్రూపే ‘అడ్వొకసీ కోవిడ్‌ లాక్‌డౌన్‌ గ్రూప్‌’. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, యాక్టివిస్ట్‌లు కలిపి పెట్టిన గ్రూప్‌ ఇది. ఇందులో రైతు స్వరాజ్య వేదిక నవీన్, మహిళా రైతుల గురించి పనిచేసే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సజయ, శాతవాహన యూనివర్సిటీ అధ్యాపకురాలు సూరేపల్లి సుజాత, భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి, అంకురం నిర్వాహకురాలు సుమిత్ర,  యాక్టివిస్టులు అంబిక, సునీత అచ్యుత, బ్రదర్‌ వర్ఘీస్, వీవీ జ్యోతి, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ పద్మజా షా, న్యాయవాది వసుధ నాగరాజ్, శ్రుతి మొదలైన వాళ్లంతా ఉన్నారు.

ఈ గ్రూప్‌ జంటనగరాల్లో ఉన్న వలసకార్మికుల కోసం ‘సహాయ’ అనే హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్‌లైన్‌కు వచ్చే ఫోన్‌ కాల్స్‌ తీసుకోవడానికి ఇరవై మంది వాలంటీర్లు పనిచేసేవారు ఎవరి ఇళ్లల్లో వాళ్లుండే. నిత్యావసరాల కోసం ఫోన్‌ చేసిన కార్మికుల నంబర్‌ సహా వాళ్ల వివరాలను నమోదు చేసుకొని ‘అడ్వొకసీ కోవిడ్‌ లాక్‌డౌన్‌ గ్రూప్‌’ వాళ్లకు తెలియపరిచేవారు. ఈ గ్రూప్‌ సభ్యుల్లో ఎవరు ఆ ఏరియాకు కాస్త దగ్గరగా ఉంటే వాళ్లు వెళ్లి ఆ కార్మికులకు రేషన్‌ ఇచ్చేవారు. ఇలా మార్చి 25న మొదలైన ఈ సేవ కొనసాగింపే మేడ్చల్‌ ఓఆర్‌ఆర్‌ ఫుడ్‌ క్యాంప్‌. సహాయ హెల్ప్‌లైన్‌ పది మంది వాలంటీర్లతో ప్రారంభమై నలభైమందికి పెరిగి.. ఈ కథనం రాస్తున్నప్పటికి వలసకార్మికులూ సొంతూళ్లకు వెళ్లడం వల్ల సహాయం చేసే అవసరమూ తగ్గి ఇరవై మంది వాలంటీర్లతో నడుస్తోంది. 

లాక్‌డౌన్‌ మూడో దశకు ముందు..
ఒకనాటి రాత్రి.. హైదరాబాద్‌లోనే ఓడియన్‌ థియేటర్‌ కాంప్లెక్స్‌లో ఉన్న వలసకార్మికుల్లో ఓ అమ్మాయికి డెలివరీ అయింది. పాప పుట్టింది. ఆ సమయంలో ఆమెకు అడ్వొకసీ కోవిడ్‌ లాక్‌డౌన్‌ గ్రూపే సహాయమందించింది. మీకేం భయంలేదు.. అని వాళ్లకు ధైర్యమిచ్చేలోపే లాక్‌డౌన్‌ మూడో దశను ప్రకటించారు. వలస కార్మికుల్లో నిరాశ. ఇంకెంతలే.. నాలుగు రోజులు ఆగితే లాక్‌డౌన్‌ ఎత్తేస్తారు.. రైళ్లు, బస్సులు మామూలుగా తిరుగుతాయి సొంతూళ్లకు వెళ్లిపోవచ్చనుకున్న కార్మికులంతా నిరుత్సాహపడ్డారు. ఇక ఒక్కక్షణం కూడా ఆగకూడదు అని ఉన్న సామానంతా సర్దుకొని ప్రయాణానికి సిద్ధపడ్డారు. వాళ్లలో ఓడియన్‌ థియేటర్‌ కాంప్లెక్స్‌ వలసకార్మికుల్లోని ఛత్తీస్‌గఢ్‌ కార్మికులూ ఉన్నారు. చంటిపిల్ల తల్లి సంబంధీకులు ఓ ముపై ్ప మంది కాలినడకనే వెళ్లాలనుకున్నారు.

ఈ విషయం తెలిసి ఆ బాలింతను కూడా నడిపిస్తారేమోననే భయంతో అప్పటికప్పుడు ఓడియన్‌ థియేటర్‌కు వచ్చారు అడ్వొకసీ కోవిడ్‌ లాక్‌డౌన్‌ గ్రూప్‌ సభ్యులు కొందరు. ప్రభుత్వ అధికారుల అనుమతితో ఏదైనా వెహికిల్‌ మాట్లాడి పంపిస్తామని వాళ్లకు నచ్చజెప్పి.. పర్మిషన్‌ కోసం ప్రయత్నించారు. కాని అనుమతి దొరకలేదు. సహనం నశించిన ఛత్తీస్‌గఢ్‌ కార్మికులు నడకమొదలుపెట్టారు మేడ్చల్‌ వరకూ .అక్కడి నుంచి ఏదైనా ట్రక్కులో వెళ్లిపోతామని. అయితే ఆ బాలింతను, ఆమె భర్త, ఇంకొంతమంది చిన్నపిల్లలను ఈగ్రూప్‌ సభ్యులు ఆపారు. మేడ్చల్‌ వరకు కార్లో తీసుకెళ్లి అక్కడ ట్రక్‌ ఎక్కిద్దామని. వాళ్లకు భోజనం పెట్టి, దారిలోకి కావల్సినవి పార్సిల్‌ చేయించి ఆ రోజు సాయంకాలం కార్లో మేడ్చల్‌ తీసుకెళ్లారు గ్రూప్‌ సభ్యుల్లో ఒకరైన సి. వనజ. దారెంట వందల కొద్ది కార్మికులు నెత్తి మీద మూటలతో నడుస్తూ ఉన్నారు.

‘వాళ్లనలా చూస్తే భయమేసింది. నా వెంట ఉన్న ఆ చంటిపిల్ల కుటుంబాన్ని, ఆ పిల్లలను ట్రక్‌ ఎక్కించేసి వసు«ధ నాగరాజ్‌కు ఫోన్‌ చేశా. ఆ రాత్రంతా నాకు నిద్రలేదు. తెల్లవారే వసుధ వచ్చేసింది మేడ్చల్‌ హైవే దగ్గరకి. ఆ కార్మికులతో మాట్లాడాం. తమిళనాడు, బెంగళూరు నుంచి వస్తున్నారు. రెండు రోజులుగా వాళ్లకు తిండిలేదు, తాగడానికి  కనీసం నీళ్లు కూడా లేవు. లారీలను, ట్రక్కులను బతిమాలుకుంటున్నారు. చాలా దయనీయంగా ఉంది వాళ్ల పరిస్థితి. అప్పుడనిపించింది మేం పనిచేయాల్సిన అవసరం ఇక్కడ ఉంది అని. అయితే అప్పటికే చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఇక్కడ సహాయం చేస్తున్నట్టు అర్థమైంది. వాళ్లకు తోడుగా మేమూ స్టార్ట్‌ చేశాం. మా గ్రూప్‌లో మిగిలిన వాళ్లకూ చెప్పాం. వాళ్లూ వచ్చారు. పళ్లు, బ్రెడ్, బిస్కట్‌ ప్యాకెట్స్, మంచి నీళ్లు పంచడం మొదలుపెట్టాం. ఒకొక్కళ్లం రోజుకి పది ట్రిప్పులు వేసినా సరిపోయేది కాదు. విపరీతమైన ఎండ. నడుస్తున్న వాళ్లు సేద తీరడానికి అక్కడేదైనా నీడ ఉంటే బాగుండు అనిపించింది. వెంటనే దిలిప్‌ కొణతంతో మాట్లాడితే, వెంటనే అక్కడ రెండు టెంట్లు వేయించారు.

ఇండివిడ్యువల్‌గా హెల్ప్‌ చేస్తున్న వాళ్లనూ ఈ టెంట్‌ కిందకే తెచ్చి అందరం కలిసి ఓ గ్రూప్‌గా తయారయ్యాం. ఓ ప్రవాహంలా రావడం మొదలుపెట్టారు కార్మికులు. రోజుకు పదిహేనువేల మంది. ఫుడ్, వాటర్, వాలంటీర్స్‌ కోసం ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టాం. మంచి రెస్పాన్స్‌ వచ్చింది. చైతన్య పింగళి, ఆమెతోపాటు మరికొంత మంది.. వచ్చి చేరారు. అలా అలా సర్వీస్‌ అనేది ఓ ఉద్యమంలా మారింది. ఆరామ్‌ఘర్‌లో రేషన్‌ పంపిణీ అయిపోయాక సజయా వచ్చేసింది మేడ్చల్‌ ఓఆర్‌ఆర్‌కి.  పీఓడబ్ల్య్లూ సం««ధ్య, కవిత పులి, సూరెపల్లి సుజాత, వీవీ జ్యోతి, నవీన్‌ సరేసరి. ఇలా చెప్పుకుంటే మేడ్చల్‌ చుట్టుపక్కల వాళ్లు, హైదరాబాద్‌ నుంచి వచ్చే వాళ్లు.. టీచర్లు, రిటైర్డ్‌ పర్సన్స్, గృహిణులు, స్టూడెంట్స్, పిల్లలు.. ఒక్కరు కాదు.. ఎంతమందో! తర్వాత కొంపెల్లిలో కమ్యూనిటీ కిచెన్‌ ఏర్పాటు చేశాం. ఇక్కడ హైవే మీద టెంట్ల సంఖ్యా పెరిగింది. మేం చేస్తున్నది చూసి లోకల్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ కూడా స్పందించారు.

నాలుగు రోజుల్లో పది టెంట్లు వేయించి, ఆరు వాటర్‌ ట్యాంకర్లు, నాలుగు టాయ్‌లెట్లు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఆ మరుసటి రోజుకి మా అవసరాలేంటో కనుక్కొని తెల్లవారికల్లా వాటిని అరెంజ్‌ చేసేవారు. మే 12 నుంచి 26వ తారీఖు వరకు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆకలి, దాహంతో ఈ  మేడ్చల్‌ ఓఆర్‌ఆర్‌ ఫుడ్‌ పాయింట్‌ దాటలేదు. దాదాపు రెండున్నరలక్షల మందికి ఈ ఫుడ్‌పాయింట్‌లో భోజనం పెట్టడమే కాదు, వాళ్లు ఇల్లు చేరేవరకు వాళ్లు వెళ్లే దూరాన్ని బట్టి వాళ్లకు సరిపడా ఫుడ్‌ను ప్యాక్‌ చేసి ఇచ్చాం. మొదట్లో వచ్చినవాళ్లను వచ్చినట్లు ట్రక్కులు మాట్లాడి ఎక్కించేవాళ్లం. అయితే ఎక్కడో ఒక ట్రక్కుకి యాక్సిడెంట్‌ (మేం పంపించిన వాళ్లవి కాదు) అయిందని తెలిసి ట్రక్స్‌లో పంపించడం అంత సేఫ్‌ కాదనిపించింది. దాంతో బస్సుల అరెంజ్‌మెంట్‌కు స్పాన్సర్‌షిప్‌ మొదలైంది.

30 బస్సులు ఆర్గనైజ్‌ అయ్యాయి. ప్రతి ఒక్కరూ చిన్న నుంచి పెద్ద వరకూ అందరూ దాన్నో బాధ్యతగా ఫీలయ్యారు. అక్కడ ఎవరి బ్యానర్స్‌ లేవు. ఎవరు ఏది తీసుకొచ్చినా అందరు కలిసే సర్వ్‌ చేశారు. రోజూ ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి రాత్రి పదకొండు గంటల వరకు ఉండేవాళ్లం. లోకల్‌గా ఉండే శ్రీనివాస్‌ సజ్జ, శ్రీరామ్‌ ఉదయం ఆరున్నరకే క్యాంప్‌ ఓపెన్‌ చేసేవాళ్లు. రోజంతా నిలబడే ఉండేవాళ్లు’  అంటూ మేడ్చల్‌ ఓఆర్‌ఆర్‌ ఫుడ్‌ క్యాంప్‌ గురించి చెప్పుకొచ్చారు సి. వనజ. 

ఆమె అన్నట్లుగా ఈ క్యాంప్‌లో తమ వంతు బాధ్యతను నిర్వహించిన వాళ్లెందరో. ఇండస్‌ మార్టిన్, అరుణాంక్‌ లత,  మోషే డయాన్, ఉషాజ్యోతి బంధం వంటి యాక్టివిస్ట్‌లు, ఆర్టిస్ట్‌లు సహా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉండే స్టూడెంట్స్, చింతల్‌బస్తీలో ఉండే చిరు వ్యాపారాలు, యువత, బస్సుల ఏర్పాటుకు శక్తి కొలది సహాయం చేసే ప్రియాంక దత్‌ వంటి సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు మొదలు సామాన్యుల వరకు చెప్పుకుంటూ పోతే ఎందరో మనసున్న మనుషులు.

పెర్కిట్‌ ఫుడ్‌ క్యాంప్‌..
మోతే గంగారెడ్డి.. ఫిల్మ్‌ మేకర్‌. హైదరాబాద్‌లో నివాసి. ఏప్రిల్‌ రెండో తారీఖున.. హైదరాబాద్‌లోనే అతనికి ఒక వ్యక్తి కనిపించాడు... తల మీద ఇనప్పెట్టె పెట్టుకొని, పిల్లల్ని వెంటేసుకొని నడుస్తూ. ‘ఎక్కడికి వెళ్తున్నావ్‌?’ అని అడిగాడు. ‘ఛత్తీస్‌గఢ్‌ సాబ్‌ ’ జవాబిచ్చాడు అతను. 
సొంతూళ్లకు కాలినడక మొదలుపెట్టిన వలసకార్మికుల గురించి వస్తున్న వార్తలను అప్పటికే చదివున్నాడు గంగారెడ్డి. ఆ రోజు ప్రాక్టికల్‌గా చూస్తున్నాడు. వెంటనే వాళ్లకు చేయగలిగిన సాయం చేశాడు. కాని మనసులోంచి ఆ వ్యక్తి ముద్ర చెరిగిపోలేదు. ఇలా హైదరాబాద్‌ మీదుగా ఎంతమంది వెళుతున్నారో అనే ఆలోచన మొదలైంది అతనిలో. ఒకరోజు రాత్రి రెండు గంటలకు కార్లో సొంతూరు బయలుదేరాడు. అంత రాత్రి కూడా నేషనల్‌ హై వే మీద వలసకార్మికులు నడుస్తూనే ఉన్నారు. మధ్య మధ్యలో కారు ఆపుతూ ఎక్కడి వెళ్తున్నారు అని అడిగితే.. ‘ఛత్తీస్‌ గఢ్‌’ అని కొంతమంది.. ‘మధ్యప్రదేశ్‌’ అని కొంతమంది..

‘బిహార్‌’ అని మరికొంతమంది, ‘యూపీ’ అని ఇంకొంతమంది నుంచి సమాధానం. పిల్లలు, పెద్దలు, యువకులు, మహిళలు.. తలల మీద, భుజాలకు బరువులు... చంకలో చంటిపిల్లలు.. డబ్బుల్లేవు.. తిండీ లేదు.. తన దగ్గరున్న కొంత డబ్బిచ్చాడు.. ఎంతని ఇవ్వగలడు? ఎంత మందికి అని ఇవ్వగలడు? వాళ్లు వెళ్లే రూట్లో ఉండే ఊళ్లళ్లోని తన ఫ్రెండ్స్‌ని, తెలిసిన వాళ్లందరినీ అలర్ట్‌ చేశాడు ఆ వలసకార్మికులకు ఏదైనా సహాయం అందించడం గురించి. అక్కడితో ఆగిపోకుండా, తనకు ఎదురైన సంఘటనల గురించి ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూనే ఉన్నాడు వీడియోలతో సహా. 

మే ఒకటవ తారీఖున..
తన ఊళ్లోని యూత్‌తో మీటింగ్‌ పెట్టాడు. అంశం.. వలసకార్మికులే.  హైవే మీద తనకు ఎదురైన అనుభవాల గురించి చెబుతూ కాలినడకన వెళ్లే వలసకార్మికులను ట్రాక్టర్ల మీద తీసుకెళ్లి బార్డర్‌ దాటించే ఏర్పాట్లు ఏమైనా చేద్దామా? అని అడిగాడు. అతని ప్రతిపాదన సబబుగానే అనిపించినా పర్మిషన్‌ దొరకదని, అనుమతి లేకుండా అంత పెద్ద బాధ్యత తీసుకోవడానికి భయపడ్డారు. చేసేదిలేక తెల్లవారే మళ్లీ హైవే బాటపడ్డాడు గంగారెడ్డి. ఆర్మూర్‌ గుట్టల మధ్య ఇంకో బారు కనిపించింది అతనికి. మ««ధ్యాహ్నానికి మరొకటి. ఆ పూట వెళ్తున్న వారిలో ..ఒక మహిళ తల మీద మూట ఉంది.. చంకన మూడేళ్ల బిడ్డ.. ఆమె ముందు  ఓ అయిదేళ్ల పాపా.. ఆ పాప చంకన యేడాదిన్నర మరో చంటి బిడ్డ. ఆ వరుసలో ఇంకా చిన్న పిల్లలున్నారు.. ఎండకు మొహాలు కమిలిపోయి.. నీళ్లు లేక నోరు పిడచకట్టుకుపోయి... తిండి లేక నీరసపడిపోయి.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌.. మొత్తం నాలుగు రాష్ట్రాల వాళ్లు.. మొత్తం 120 మంది నడుస్తునే ఉన్నారు... అడిగాడు ఎక్కడి నుంచి వస్తున్నారు  అని గంగారెడ్డి. తమిళనాడు, కర్ణాటక నుంచి వస్తున్నారట. 20 రోజులుగా నడుస్తూనే ఉన్నారట.  ‘ఏం దేశం? ఏం అభివృద్ధి ఇది?’  ఇది అనుకున్నాడు. వెంటనే తన స్నేహితులకు ఫోన్‌ చేస్తే వచ్చారు. ఆ 120 మందిని ఎలాగైనా వెహికిల్స్‌లో పంపించాలని అటుగా వెళ్తున్న లారీలను అపారు. రెండు లారీలు తీసుకెళ్లడానికి ఓకే చెప్పాయి. అవి మహారాష్ట్ర వెళ్తున్నాయి కాబట్టి.. అందరినీ ఆ బార్డర్‌లో దింపేస్తాం అన్నారు డ్రైవర్లు. ఆ కాస్త దూరం శ్రమ తగ్గినా తగ్గినట్టే కదా.. అని ఒప్పుకున్నారు. ఆ వలసకార్మికులను ఎక్కించి పంపేశారు. మనసు కాస్త కుదుట పడింది.

అసలు ఈ హైవే మీద ఎంత మంది నడుస్తున్నారో చూడాలని ఒకరోజు ఇందల్‌వాయి (నిజామాబాద్‌ దగ్గర) నుంచి మహారాష్ట్ర బార్డర్‌ పెన్‌గంగ వరకు ప్రయాణించాడు గంగారెడ్డి.  హైవే మొత్తం రైలుపెట్టెలా వరుసగా కార్మికులు నడుస్తూ కనిపించారు. ఆ సమయంలో పెర్కిట్‌ చౌరస్తా దగ్గర కొంత మంది టీచర్లు, బీడీ కార్ఖానా రాజేశ్వర శర్మ ఈ వలసకార్మికులకు ఫుడ్‌ పార్శిల్స్‌ తెచ్చివ్వడం, అలాగే సుంకేట్‌ గ్రామానికి చెందిన జయప్రకాశ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తన ఊళ్లోని యువతతో కలిసి ఇటుకబట్టీ వలస కార్మికులకు ఫుడ్‌ అందించడం, ఆర్మూర్‌ దగ్గర్లోని జానకంపేట్‌కు చెందిన కొందరు, పచ్చల నడుకుడ యూత్, కొంతమంది రైతులు కూడా వలసకార్మికుల ఆకలి తీర్చడం కోసం ప్రయత్నించడం,  ముప్కాల్‌ హైవే మీద అమీనా బేగం అనే ఓ మహిళ  రోజుకి కనీసం 250 మంది వలసకార్మికులకు భోజనం పెట్టడం కనిపించింది.

వాళ్లందరితో మాట్లాడి వాళ్ల ఇంటర్వ్యూలనూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు గంగాధర్‌. అయితే ఇలా ఎవరికి వారు.. వాళ్లకు అనుకూలమైన సమయాల్లో సహాయం అందించడం వల్ల చేస్తున్న సహాయం కూడా సరిగ్గా ఉపయోగపడట్లేదు.. అందిన వాళ్లకు ఆహారం అందుతోంది... అందని వాళ్లు కాలే కడుపుతోనే పొలిమేర దాటుతున్నారని గ్రహించాడు గంగారెడ్డి. వీళ్లందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి నిర్విరామంగా సహాయ కార్యక్రమాన్ని చేపడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అనుకున్నట్టుగానే ఆ వ్యక్తులందరినీ కలిశాడు. తన స్నేహితులకూ చెప్పాడు. టీచర్స్‌ గ్రూప్‌కు నాయకత్వం వహిస్తున్న ఎమ్‌ఈఓ రాజేశ్వర్‌కు ఆ సూచన నచ్చింది. మిగతా వాళ్లూ ఓకే అన్నారు. అంతా కలిసి పెర్కిట్‌ కూడలి దగ్గర టెంట్లు వేశారు. ఈ విషయాన్ని మళ్లీ ఎఫ్‌బీలో పోస్ట్‌ చేసి.. డబ్బు సాయం కోరాడు గంగాధర్‌. ఎమ్‌ఈఓ రాజేశ్వర్‌ అకౌంట్‌ నంబర్‌ ఇచ్చాడు. 

పన్నెండు రాష్ట్రాలు.. నేపాల్‌ వాళ్లు కూడా
‘మంచి స్పందన వచ్చింది. నా ఫ్రెండ్స్‌ కూడా చాలా హెల్ప్‌ చేశారు. ఎన్‌ఆర్‌ఐలూ స్పందించారు. మే 13న మొదలుపెట్టాం. మొదటి రోజు రూ.2.60 లక్షలు  వస్తే, రెండో రోజుకి అది రూ. 6 లక్షలకు చేరింది. వారం రోజులకు రూ.20.70 లక్షలు అయ్యాయి. అన్ని డిటైల్స్‌ ఎప్పటికప్పుడు ఎఫ్‌బీలో పోస్ట్‌ చేసేవాళ్లం. అంతా పారదర్శకంగానే సాగింది.  కమ్యూనిటీ కిచెన్‌ ఏర్పాటు చేశాం. మనుషుల ఫ్లోను బట్టి అన్నం ఉడికేది. పొద్దున్నుంచి రాత్రి వరకు వేల మంది కార్మికులు. ఎవరూ ఆకలితో వెళ్లకూడదు. డీహైడ్రేట్‌ కాకూడదు. చల్లటి నీళ్లు, మజ్జిగ, కీర దోసకాయలు, అరటిపళ్లు కొరత లేకుండా చూసుకున్నాం. అన్నం పెట్టి, మంచినీళ్ల బాటిల్, అరటిపళ్లు, బిస్కట్లు, బ్రెడ్, కీర, మజ్జిగ పాకెట్‌ పార్సిల్‌ చేసి ఇచ్చేవాళ్లం. కొంతమంది అయితే 30 గంటలు ఆహారం లేకుండా వచ్చారు నీరసపడిపోయి. దారి తెలియకుండా అలా రోడ్డు పట్టుకుని నడుస్తున్న వాళ్లూ ఉన్నారు. పెర్కిట్‌ కూడలి దగ్గర పన్నెండు రాష్ట్రాల వాళ్లు వచ్చారు.

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బిహార్, యూపీ, రాజప్థాన్, గుజరాత్, పంజాబ్, అస్సాం, ఒడిశా, వెస్ట్‌ బెంగాల్, ఢిల్లీతోపాటు నేపాల్‌ వాళ్లు కూడా ఉన్నారు. ఒడిశా, బెంగాల్‌ అటువైపు ఎందుకు వచ్చారు అంటే దారి తెలియక. ఇలా వలసకార్మికులు నడుస్తూ కనపడితే వాళ్లు కూడా వీళ్లతో కలిసి నడవడం మొదలుపెట్టారు. వాళ్ల అమాయకత్వం, వాళ్ల కష్టం చూస్తే ఎంత బాధేసిందంటే.. ఏ సమాజంలో ఉన్నాం మనం అనిపించింది. లాక్‌డౌన్‌తో పనిపోతే వాళ్లు డబ్బుల కోసమూ డిమాండ్‌ చేయలేదు. కనీసం మా ఊరికి బస్సు వేయండీ అని కూడా రిక్వెస్ట్‌ చేయలేదు. అయ్యా.. మమ్మల్ని వదిలేస్తే మా దారిన మేం పోతాం ఇంటికి అన్నారు. సురక్షితంగా వాళ్లను ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది.. అది కార్మికులుగా తాము డిమాండ్‌ చేసుకోగల హక్కు అన్న కనీసమైన ఎరుక కూడా వాళ్లకు లేదు. వీళ్లు లేకపోతే నగరాల అభివృద్ధి ఎక్కడిది? వాళ్ల శక్తిని పిండుకుని వాళ్ల కర్మకు వాళ్లను వదిలేశాం.

ఇంతకన్నా అమానుషం ఇంకొకటి ఉండదు. వాళ్లకు ఉపయోగపడని ఈ అభివృద్ధి ఎందుకు? నడుస్తూ నడుస్తూ సొమ్మసిల్లిన వాళ్లను చూస్తే కడుపులోంచి దుఃఖం వచ్చేది. ఇక్కడ మానవీయ సందర్భం ఏంటంటే.. చాలా మంది ట్రక్కు డ్రైవర్లు వలసకార్మికులను ఉచితంగానే తీసుకెళ్లారు. మేం డబ్బులిస్తున్నా తీసుకోలేదు. వలసకార్మికులు కూడా  నోరు విడిచి అన్నం పెట్టమని అడగలేదు. వెనక వరుసలో ఉన్న వాళ్లకు సరిపోదేమోనని కడుపు నిండకపోయినా మాకు చాలు వాళ్లకు వడ్డించండి అని చెప్పేవారు. వాళ్లను సురక్షితంగా ఇళ్లకు చేర్చాలని స్థానిక నాయకులనూ కోరాం. మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. ఆరెంజ్‌ ట్రావెల్స్‌ సునీల్‌ రెడ్డి  బస్సులు వేసి హెల్ప్‌ చేశారు. ఇళ్లకు చేరుకున్న వాళ్లంతా ఫోన్లు చేసి క్షేమంగా చేరుకున్నాం.. తెలంగాణలో దొరికినట్టుగా తర్వాత మాకు ఎక్కడా ఆదరం అందలేదు అని చెప్తుంటే బాధ.. మళ్లీ మళ్లీ దుఃఖం.

నిజానికి హై వే అంతా అలా ప్రతి పది కిలోమీటర్లకు ఒక క్యాంప్‌ పెడితే బాగుణ్ణనిపించింది. అందరినీ కలుపుకొని ఆర్గనైజ్‌ చేయడానికి ట్రై  చేద్దామనుకున్నా, కుదరలేదు. ఎవరూ చెప్పకుండానే అమీనా బేగం, సుంకేట్‌ యూత్, టీచర్లు, రైతులు, బీడీ కార్ఖానా రాజేశ్వర్, ఇందల్‌వాయి దగ్గర డాక్టర్‌ అండ్‌ మెడికల్‌ స్టూడెంట్స్‌ గ్రూప్, మేడ్చల్‌ హైవే మీది ఫుడ్‌ క్యాంప్‌..  వీళ్లంతా వాళ్లంతట వాళ్లే స్పందించి తోటి మనుషుల కష్టాన్ని తగ్గించాలనుకున్నారు.. ఇంతకన్నా ఏం కావాలి. మనసు భారమైనప్పుడు వీళ్లే ఆశను పెంచుతారు నాకే కాదు సమాజానికి కూడా. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇంకా కొంతమంది వస్తూన్నారు కాబట్టి  మా ఈ  ఫుడ్‌ క్యాంప్‌ను ఇంకా పదిహేనురోజులు కొనసాగించాలనుకుంటున్నాం’ అని చెప్పాడు మోతే గంగారెడ్డి. 

ఆంధ్రప్రదేశ్‌లో సేవ
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విజయవాడ – చెన్నై హైవే ఫుడ్‌ క్యాంప్‌గా మారింది. నిజానికి అక్కడి ప్రభుత్వమే వలసకార్మికుల బాధ్యతను తీసుకుంది. కాలినడకన వస్తు్తన్న వాళ్లకు సహాయం అందించడానికి సూరజ్‌ ధనుంజయ్‌ అనే అసిస్టెంట్‌ కలెక్టర్‌ను నియమించింది. ‘మంచి కోఆర్డినేషన్‌తో ఇక్కడి గవర్నమెంట్‌ పనిచేసింది’ అన్నారు పీఓడబ్ల్యూ సభ్యురాలు, గుంటూరు పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ రమాసుందరి. ఆంధ్రప్రదేశ్‌– ఒడిశా బార్డర్‌ వరకు ప్రభుత్వమే బస్సులు నడిపింది. ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్‌ చేసి సురక్షితంగా పంపారు. ప్రైవేట్‌ సంస్థలు, మహిళా సంఘాలు, వ్యక్తులు కూడా వలస కార్మికులకు సహాయం అందించారు.  అందులో పీఓడబ్ల్యూ, జమాతే ఇస్లాం హింద్‌ ఆర్గనైజేషన్‌లోని సాంఘిక సేవా విభాగం కూడా ఉన్నాయి. 

విజయవాడ – చెన్నై హైవే
అప్పటిదాకా ఊళ్లోనే ఉన్న కార్మికులకు సహాయం అందిస్తున్న పీఓడబ్ల్యూ మహిళా సంఘం సభ్యులు వలసకార్మికుల నడక గురించి విని  ‘మన హైవే ఎలా ఉందో చూద్దాం’ అని విజయవాడ– చెన్నై హైవే మీదకు వెళ్లారు. సైకిళ్ల మీద వస్తూ కనిపించారు. ఆపి అడిగారు ‘ఎందుకలా రిస్క్‌ తీసుకుంటున్నారు?’ అని. ‘ఏం చేస్తాం మరి? మీరేమైనా బస్సుల్లో పంపే సహాయం చేయగలరా?’ అని అడిగారు. అప్పటికప్పుడు అంటే ఏ మార్గం తోచలేదు. బస్సులు కాకపోయినా కనీసం ఫుడ్, ప్రయాణంలో అవసరమయ్యే వస్తువులతో కిట్స్‌ అన్నా ఇవ్వాలి అనుకున్నారు. రమా సుందరి తన దగ్గరి అయిదు వేల రూపాయలతో వస్తువులు కొందామనుకునేలోపు ఆమె స్టూడెంట్‌ కూడా అయిదువేల రూపాయలను ఇచ్చింది.

ఆ పదివేల రూపాయలతో బ్రష్‌లు, పేస్ట్‌లు, టవల్స్, సోప్స్, బిస్కట్, బ్రెడ్‌ పాకెట్స్‌ వంటివి కొని కిట్స్‌లా తయారు చేశారు. మిగిలిన అరెంజ్‌మెంట్స్‌తో తెల్లవారి హైవే మీదకు వెళ్లారు. రెవన్యూ డిపార్ట్‌మెంట్‌ వాళ్లకు తెలిసి వాళ్లు వచ్చి టెంట్‌లు వేసి ఓ సెంటర్‌లా చేశారు. వెల్‌ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ స్టాఫ్‌ను అక్కడ పెట్టారు. ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, యూపీ వాళ్ల ఎక్కువగా వస్తున్నారు. వాళ్లందరికీ ఈ వెల్‌ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు సహాయం అందించడం మొదలుపెట్టారు. అయితే పీఓడబ్ల్య్లూ వాళ్లు ఆ సెంటర్‌ కన్నా కాస్త ముందుకు వెళ్లి.. సైకిళ్ల మీద, నడుస్తూ వస్తున్న వాళ్లను ఆపి వాళ్లకు తమ దగ్గరున్న కిట్స్‌ పంచుతూ ‘ముందు గవర్నమెంట్‌ సెంటర్‌ ఉంది.. వాళ్లను సంప్రదించండి మీకు సహాయం అందుతుంది’ అని సూచించే బాధ్యతను తీసుకున్నారు. ‘ప్రభుత్వమే చాలా మంది కార్మికులను పంపింది.

అస్సాం వంటి చోట్లకు వెళ్లాల్సిన వాళ్లను రెండు మూడు జిల్లాల వాళ్లు కలిసి డబ్బు పోగేసి పంపారు. చివరకు వెస్ట్‌బెంగాల్‌ వాళ్లు మిగిలారు. మా దగ్గరున్న ఫండ్స్‌తో ఓ వెహికిల్‌ మాట్లాడాం. మమతా బెనర్జీ అనుమతించట్లేదని తెలిసినా సాహసించాం.. కనీసం బార్డర్‌ వరకు అయినా పంపిస్తే అక్కడినుంచి ఎలాగైనా సొంతప్రాంతానికి చేరుకుంటారనే ఆశతో. ఇక వెళ్లిపోతారనగా ప్రభుత్వం వాళ్లను హ్యాండ్‌ ఓవర్‌ చేసుకుంది రైలులో పంపిస్తాం అని. వాళ్లను విజయవాడ తీసుకెళ్లాక బెంగాల్‌లో తుఫాను వల్ల ట్రైయిన్‌ క్యాన్సిల్‌ అయిపోయింది. ఆగిపోయారు. వాళ్లలో మాల్డా బ్యాచ్‌ వాళ్లూ ఉన్నారు. అందులో ఒక అబ్బాయి తండ్రి చనిపోయాడు. ఆ పిల్లాడి కష్టం చూస్తే చాలా బాధేసింది. ఆ పిల్లాడికి కొంత డబ్బు ఇచ్చాం. అయితే తర్వాత తెలిసింది.. తోడుగా ఉన్న ఓ వ్యక్తితో కలిసి ఆ అబ్బాయి నడుచుకుంటూ వెళ్లిపోయాడని.

చేరుకున్నాడో లేదో.. ఇటుగా వెళ్లిన చాలామంది పదిహేను నుంచి పద్దెనిమిదేళ్ల పిల్లలే. కొంతమందైతే తల్లిదండ్రులకు వాళ్లక్కొరే సంతానంగా ఉన్నవాళ్లు. ఇంతదూరం ఎందుకు పంపించారు మీ అమ్మానాన్న అంటే ‘అక్కడ పనుల్లేవ్‌’ అనే సమాధానం. ఆ పిల్లలంతా ఇక్కడ పానీపూరీ బండ్లు, ఐస్‌క్రీమ్‌ బండ్లు నడుపుకుంటున్న వాళ్లే. కాళ్లకు చెప్పుల్లేవు, తిండి లేదు. చెప్పులిచ్చి, తిండి పెట్టి .. బాగా నడవండి అని చెప్పి పంపినట్టయింది అనిపించింది. మనం చేసింది కరెక్టేనా అనే బాధ తొలుస్తోంది. వలస కార్మికుల విషయంలో వ్యవస్థలూ స్పందించాలి. ప్రభుత్వాలదే తప్పు. మీకేం కాదు అన్న ఒక ధైర్యాన్ని, భరోసాని ఇవ్వలేకపోయాయి ప్రభుత్వ వ్యవస్థలు’ అంటున్నారు పీఓడబ్ల్యూ సభ్యులు. 

కత్తిపూడి హైవే
ఇక్కడ సహాయకార్యక్రమాలు చేపట్టింది జమాతే ఇస్లాం హింద్‌ ఆర్గనైజేషన్‌లోని సాంఘిక సేవా విభాగం. ‘చెన్నై నుంచి బిహార్‌ వెళ్లే వాళ్లు ఈ మార్గం గుండా నడిచారు. అందరూ యంగ్‌స్టర్సే. చెన్నై నుంచి ఎనిమిది రోజులుగా నడుస్తున్నారట. భోజనం పెట్టి, పార్సిల్స్‌ ఇస్తుంటే, ఏదైనా వెహికిల్‌ ఉంటే పంపించండి.. కొంత దూరమైనా పర్లేదు అని రిక్వెస్ట్‌ చేసేవాళ్లు. బాధనిపించింది. కొందరిని హైవే మీద వెళ్తున్న లారీల్లో ఎక్కించాం. అప్పటి నుంచి మా సర్వీస్‌ను కంటిన్యూ చేయాలని డిసైడ్‌ చేసుకున్నాం. బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా విడిపోయి తణుకు, రాజమండ్రి, మండపేట హైవేల్లో క్యాంప్‌లు పెట్టాం. కాకినాడ స్టార్టింగ్‌ పాయింట్‌.  వలస కార్మికులు ముందు కాస్త తక్కువగానే కనిపించినా తర్వాతర్వాత బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా రావడం మొదలైంది.

పతి రోజూ అయిదు వందల లీటర్ల మజ్జిగ, ఫుడ్‌ ప్రిపేర్‌ చేసేవాళ్లం. వాళ్లకు భోజనం పెట్టి, పార్శిళ్లు ఇచ్చి వెహికిల్స్‌ ఎక్కిస్తుంటే చల్లగా ఉండండి అని దీవెనలిచ్చేవారు. వాళ్ల మొహాల్లో తృప్తి చూస్తే చాలా సంతోషంగా ఉండేది. ఈద్‌ కూడా వాళ్లతోనే కలిసి చేసుకున్నాం. అందరికీ వేడివేడి షీర్‌ కుర్మా పంచాం. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి.. లాక్‌డౌన్‌ కంటే ముందు వరకు ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా మేం ఉద్యమం చేశాం. అప్పటిదాకా క్లోజ్‌గా ఉన్న మా హిందూ ఫ్రెండ్స్‌ చాలా మంది దూరం పాటించారు. కాని మేం హైవే మీద ఈ సర్వీస్‌ మొదలుపెట్టాక మళ్లీ వాళ్లంతా మాతో కలసి పాలు పంచుకుంటున్నారు. మానవత్వానికి కులమతాల అడ్డులేదు. మనుషులంతా ఒకటే.. అంతా కలిసే ఉందామనుకుంటారు’ అని చెప్తాడు మెకానికల్‌ ఇంజనీర్‌ హసన్‌ షరీఫ్‌. 
-సరస్వతి రమ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement