Funday Cover Story- Worldwide Winter Festivals: శీతకాలం చిరుచలితో మొదలై, గజగజ వణికించే స్థాయికి చేరుతుంది. చలిపంజా దెబ్బకు జనాలు రాత్రివేళ ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టేందుకే వెనుకాడుతారు. శీతకాలం రాగానే, అప్పటివరకు అలమరాల అట్టడుగున పడివున్న చలిదుస్తులు ఒంటిమీదకు వస్తాయి. వీథుల్లో చలిమంటల సందడి మొదలవుతుంది. చలితీవ్రత పెరిగే కొద్ది, మనుషులకు వణుకూ పెరుగుతుంది. చలిలో ఆరుబయటకు వచ్చేవాళ్లు ఒద్దికగా చేతులు కట్టుకుని చలిని కాచుకుంటారు.
చలికాలంలో కొన్నిచోట్ల తెరిపిలేని హిమపాతంతో నేలంతా మంచుతో నిండిపోతుంది. శీతకాలం మొదలయ్యే వేళ దీపావళి, శీతకాలం తారస్థాయిలో ఉండేటప్పుడు మకరసంక్రాంతి వేడుకలను మనం జరుపుకొంటాం. శీతకాలంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలు వారి వారి సంప్రదాయ వేడుకలను జరుపుకొంటారు.
వ్యవసాయ పనులు ముగిసి, కాస్త తీరిక దొరికే కాలం కావడంతో సంబరాలు చేసుకుంటారు. కాలానికి తగినట్లుగా ప్రత్యేకమైన వంటకాలను ఆగరిస్తారు. ఆరుబయటకు చేరి ఆట పాటలతో శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. వివిధ దేశాల్లో జరుపుకొనే శీతకాల సంబరాలను, వాటి విశేషాలను తెలుసుకుందాం...
షెట్లాండ్ వైకింగ్ ఫెస్టివల్
స్కాట్లాండ్‌లోని షెట్లాండ్ ప్రాంతంలో క్రిస్మస్ వేడుకలు ముగిసినప్పటి నుంచి మూడునెలల వరకు సుదీర్ఘంగా కొనసాగే చలిమంటల వేడుక ‘షెట్లాండ్ వైకింగ్ ఫెస్టివల్’. స్థానికంగా ఈ వేడుకలను ‘అప్ హెలీ ఆ’ అంటారు. షెట్లాండ్ రాజధాని లెర్విక్‌లో ఈ వేడుకల్లో భాగంగా జనవరి మూడో మంగళవారం రోజున జనాల ఆట పాటలతో వాద్యాల హోరుతో భారీ ఊరేగింపు జరుగుతుంది.
వైకింగ్‌ల పొడవాటి పడవలను అనుకరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులు ధరించి, మేళతాళాలతో ఈ ఊరేగింపులో పాల్గొంటారు. తొలినాళ్లలో తారుపీపాలకు నిప్పుపెట్టి స్లెడ్జిబళ్ల మీద మంచునిండిన వీథుల్లోకి లాక్కొచ్చేవారు. ఇటీవలికాలంలో తారుపీపాలకు నిప్పుపెట్టడం వంటి పనులు మానేసి, ఎక్కడికక్కడ చలిమంటలు వేసుకుని, వేడుకలు జరుపుకొంటున్నారు.
వెనిస్ కార్నివాల్
ఇటలీలోని వెనిస్ నగరంలో శీతకాలం ముగుస్తూ ఉండే సమయంలో జరిగే ఉత్సవం ఇది. క్రైస్తవుల ఉపవాస దినాలైన ‘లెంట్’ రోజుల్లోని ‘యాష్ వెన్స్‌డే’ నుంచి మొదలయ్యే వెనిస్ కార్నివాల్ ‘ష్రోవ్ ట్యూస్‌డే’ వరకు మూడువారాల పాటు జరిగే ఈ వేడుకల్లో భారీ ఎత్తున జనాలు పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి సుమారు ముప్పయి లక్షలకు పైగా జనాలు వెనిస్ వీథుల్లో జరిగే ఊరేగింపుల్లో చిత్రవిచిత్ర వేషధారణలతో రకరకాల మాస్కులు ధరించి తిరుగుతూ సందడి చేస్తారు.
ఈ వేడుకల్లో భాగంగా వెనిస్ కూడళ్లలో ఏర్పాటు చేసే బహిరంగ వేదికలపై సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ముఖాలకు మాస్కులు ధరించడాన్ని రోమన్ చక్రవర్తి 1797లో నిషేధించడంతో చాలాకాలం ఈ వేడుకలు కనుమరుగయ్యాయి. ఇటలీ ప్రభుత్వం సాంస్కృతిక పునరుద్ధరణలో భాగంగా 1979 నుంచి పునఃప్రారంభించడంతో వెనిస్ కార్నివాల్ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే స్థాయికి చేరుకుంది.
లా ఫాలాస్ వాలెన్షియా
స్పెయిన్‌లోని వాలెన్షియా నగరంలోను, చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాల్లోను ఈ వేడుకలు ఏటా మార్చి 1 నుంచి 19 వరకు జరుగుతాయి. ఈ వేడుకల్లో మార్చి 15 నుంచి 19 వరకు ఐదురోజుల పాటు సెయింట్ జోసెఫ్ స్మారకార్థం ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీథుల్లో చలిమంటలను వెలిగించి ఆటపాటలతో జనాలు కాలక్షేపం చేస్తారు.
మార్చిలో శీతకాల సంబరాలేమిటా అనుకోకండి. అక్కడ మార్చిలోనూ మంచు కురుస్తూనే ఉంటుంది. చలిమంటల ముందు సేదదీరుతూ విందు వినోదాలు, గానా భజానాలతో జనం ఉల్లాసంగా గడుపుతారు. ఈ రోజుల్లో ప్రత్యేకంగా తయారు చేసే బిర్యానీ మాదిరి ‘ప్యేలా’ అనే వంటకాన్ని సామూహిక విందుల్లో వడ్డిస్తారు. దీని తయారీలో బియ్యం, మేక, గొర్రె, కుందేలు, కోడి, చేపలు, ప్రత్యేక సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తారు. లా ఫాలెస్ వాలెన్షియాను ‘యునెస్కో’ వారసత్వ వేడుకగా గుర్తించింది.
నయాగరా వింటర్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్
నయాగరా జలపాతం మామూలుగా చూస్తేనే కళ్లకు మిరుమిట్లు గొలుపుతుంది. ఇక శీతకాలంలో రాత్రివేళ ఈ జలపాతం వద్ద ఆరుబయట చేసే విద్యుద్దీపాలంకరణలు చూస్తే, రంగు రంగుల నక్షత్రాలు కళ్లముందే కదలాడినట్లుంటుంది.
నయాగరా జలపాతం వద్ద కెనడాలో ఏటా శీతకాలం పొడవునా ‘వింటర్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్’ వేడుకలను దేదీప్యమానంగా నిర్వహిస్తారు. ఈసారి నవంబర్ 12న మొదలైన ఈ వేడుకలు ఫిబ్రవరి 20 వరకు కొనసాగనున్నాయి. విద్యుద్దీప కాంతుల వెలుగులో ధగధగలాడే నయాగరా అందాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు చేరుకుంటారు. ఈ సందర్భంగా పలు వినోద కార్యక్రమాలు, బాణసంచా ప్రదర్శనలు కూడా జరుగుతాయి.
హార్బిన్ ఐస్ అండ్ స్నో స్కల్ప్చర్ ఫెస్టివల్
చైనాలో ఏటా శీతకాలంలో జరిగే అంతర్జాతీయ హిమశిల్పకళా వేడుకలు ఇవి. హీలోంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని హార్బిన్ నగరంలో జరిగే ఈ వేడుకలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి దాదాపు రెండుకోట్ల మంది వరకు వస్తారు. ప్రపంచంలోనే అత్యంత భారీ హిమశిల్పాలు ఈ ఉత్సవాల్లో కొలువుదీరుతాయి.
హార్బిన్ నగరంలోని కూడళ్లలోను, నగరం మీదుగా ప్రవహించే సోంఘువా నదీ తీరంలోను భారీ ఎత్తున హిమశిల్పాలను ఏర్పాటు చేస్తారు. సైబీరియా మీదుగా వీచే చలిగాలుల వల్ల సోంఘువా నదిలోని నీళ్లు గడ్డకట్టిపోతాయి.
నదిలో నుంచి వెలికితీసిన భారీ మంచుదిమ్మలతోనే స్థానిక కళాకారులు శిల్పాలను చెక్కి, ప్రదర్శనకు ఉంచుతారు. చైనాలో ఈ వేడుకలు 1963 నుంచి జరుగుతూ వస్తున్నాయి. ఏటా డిసెంబర్ చివరి వారం నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు జరిగే ఈ వేడుకల ద్వారా చైనా ప్రభుత్వానికి పర్యాటక ఆదాయం దండిగానే లభిస్తుంది.
టోజి మత్సురి
జపాన్‌లో జరుపుకొనే శీతకాల వేడుకలు ‘టోజి మత్సురి’. ఈ వేడుకలనే ‘టోజిసాయి’ అని కూడా అంటారు. మంచు కురిసే ప్రాంతాల్లో ఆరుబయట గుడారాలు వేసుకుని, వాటి ముందు చలిమంటలు వేసుకుని, ఆటపాటలతో గడుపుతారు.
‘ఓన్సెన్’ అనే వేడినీటి బుగ్గల్లో స్నానాలు చేస్తారు. నిజానికి ఈ వేడినీటి బుగ్గల్లో ఏడాది పొడవునా స్నానాలు చేస్తుంటారు గాని, శీతకాలం తప్పనిసరిగా వీటిలో స్నానం చేయడం ఆరోగ్యకరమని జపానీయులు నమ్ముతారు.
గతించిన పెద్దలను తలచుకుంటూ చెరువుల్లో దీపాలను విడిచిపెడతారు. శీతకాలంలో గుమ్మడి, క్యారెట్, ముల్లంగి, తామరతూళ్లు తినడం శుభప్రదమనే నమ్ముతారు. ముఖ్యంగా తామరతూళ్లతో తయారుచేసే రెన్‌కాన్ చిప్స్‌ను చిన్నాపెద్దా ఇష్టంగా తింటారు.
రేక్‌జావిక్ వింటర్ లైట్స్ ఫెస్టివల్
ఐస్‌లాండ్‌లోని రేక్‌జావిక్ నగరంలో ఏటా శీతకాలంలో వింటర్ లైట్స్ ఫెస్టివల్ వేడుకలు జరుగుతాయి. నగరంలోని చారిత్రిక కట్టడాలు, మ్యూజియమ్‌లు, పార్కులు, ఈతకొలనులు, మైదానాలు వంటివాటిని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు.
నగరంలోని వేడినీటి బుగ్గలలో జనాలు ఈతలు కొడతారు. వేడుకలు జరిగేంత కాలం రాత్రివేళల్లో మ్యూజియమ్‌లన్నీ సందర్శకుల కోసం తెరిచే ఉంచుతారు. కూడళ్లలో ఏర్పాటు చేసే తాత్కాలిక వేదికలపైనా, నగరంలోని రంగస్థలాలపైన సంగీత, నృత్య, వినోద కార్యక్రమాలు కోలాహలంగా సాగుతాయి.
హ్వాషియోన్ సాన్షియోనియో ఐస్ ఫెస్టివల్
దక్షిణ కొరియాలోని గాంగ్వన్ డో ప్రావిన్స్‌లో ఏటా శీతకాలంలో ఐస్ ఫెస్టివల్ వేడుకలు జరుగుతాయి. హ్వాషియోన్ నగరంలో గడ్డకట్టిన నదిపై రకరకాల క్రీడలు, వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. నది ఎగువ ప్రాంతంలోని సాన్షియోనియో వద్ద మంచుదిమ్మల మీద ఏర్పడిన రంధ్రాల గుండా చేపలను పట్టే పోటీలను నిర్వహిస్తారు.
భారీస్థాయి మంచుశిల్పాలను తీర్చిదిద్ది ప్రదర్శిస్తారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొరియన్ ప్రభుత్వం ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఏటా జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరిగే ఈ వేడుకలు తిలకించేందుకు దేశ విదేశాల నుంచి 15 లక్షల మందికి పైగా పర్యాటకులు వస్తుంటారు.
డ్రాగన్ కార్నివాల్
స్లోవేనియా రాజధాని ల్యూబ్లీయానలో ఏటా శీతకాలంలో జరిగే సంప్రదాయ వేడుక డ్రాగన్ కార్నివాల్. పురాతన పేగన్ సంస్కృతికి ఆనవాలుగా కొనసాగే ఈ వేడుకల్లో భారీ ఊరేగింపులు నిర్వహిస్తారు. వేలాది మంది చిత్రవిచిత్రమైన మాస్కులు, రంగు రంగుల దుస్తులు ధరించి పాల్గొంటారు.
భారీసైజులోని ఆకుపచ్చని డ్రాగన్ బొమ్మను మోసుకుంటూ ఊరేగిస్తారు. సంప్రదాయ వాద్యపరికరాలను మోగిస్తూ, నాట్యం చేస్తూ నగర వీథుల్లో సందడి చేస్తారు. పదమూడో శతాబ్దిలో పేగన్, క్రైస్తవ సంస్కృతులు పరస్పరం కలగలసిపోయిన నాటి నుంచి డ్రాగన్ కార్నివాల్ జరుగుతూ వస్తోందని చెబుతారు. నలభైరోజుల లెంట్ ఉపవాస దినాలకు ముందుగా, జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సంబరాన్ని నిర్వహిస్తారు.
కలోన్ వింటర్ కార్నివాల్
జర్మనీలోని కలోన్ నగరంలో ఏటా వింటర్ కార్నివాల్ వేడుకలు భారీ స్థాయిలో జరుగుతాయి. పదకొండో నెల పదకొండో తేదీన– అంటే, ఏటా నవంబర్ 11న ఉదయం 11.11 గంటల నుంచి ‘కార్నివాల్’ సీజన్ మొదలవుతుంది. వీథుల్లో చిత్రవిచిత్ర వేషధారణలతో నిర్వహించే ఊరేగింపులతో ఈ వేడుకలు జనవరి 6 వరకు కొనసాగుతాయి. ఈ రోజుల్లో ‘ఫ్యాట్ థర్స్‌డే’ నుంచి ‘యాష్ వెన్స్‌డే’ వరకు వారం రోజులను ‘క్రేజీ డేస్’ అంటారు.
ఈ వారం రోజుల్లోనూ మరింత భారీ స్థాయిలో వేడుకలు జరుగుతాయి. పిల్లలూ పెద్దలూ వీథుల్లోకి చేరి, ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. వివిధ దేశాల నుంచి వచ్చే బ్యాండ్ బృందాలు, నృత్యబృందాలు ఊరేగింపుల్లో పాల్గొంటాయి. కలోన్ కార్నివాల్‌లో పాల్గొనేందుకు ముఖ్యంగా యూరోప్ నలుమూలల నుంచి జనాలు పెద్దసంఖ్యలో వస్తారు.
సప్పోరో స్నో ఫెస్టివల్
జపాన్‌లోని సప్పోరో నగరంలో ఏటా ఫిబ్రవరిలో జరిగే వేడుక ఇది. మంచుగడ్డ కట్టే పరిస్థితుల్లో మంచుతో శిల్పాలను తీర్చిదిద్ది ప్రదర్శిస్తారు. ఈసారి 2023 ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. సప్పోరో నగరంలోని ఓడోరి పార్క్, సుసుకినో, సుడోమ్ సహా పలు ప్రదేశాలు ఈ వేడుకల్లో హిమశిల్ప ప్రదర్శనలకు వేదికలుగా నిలుస్తాయి.
ఓడోరి పార్క్‌లో హిమశిల్పాల పోటీలు కూడా జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలలకు చెందిన కళాకారులు వందలాదిగా ఇక్కడకు వస్తుంటారు. సప్పోరో స్నో ఫెస్టివల్ 1950లో తొలిసారిగా ఒకరోజు కార్యక్రమంగా మొదలైంది. అప్పట్లో ఆరుగురు హైస్కూల్ విద్యార్థులు ఓడోరి పార్క్‌లో చేరి, మంచుతో శిల్పాలు మలచి సందర్శకులను ఆకట్టుకున్నారు.
జపాన్ సైనిక దళాలు కూడా 1955 నుంచి ఈ వేడుకల్లో పాల్గొనడం ప్రారంభించడంతో ఇవి వారంరోజుల వేడుకలుగా మారాయి. అనతికాలంలోనే ఈ వేడుకలు అంతర్జాతీయ ప్రాచుర్యం పొందాయి. ఇక్కడి హిమశిల్పాలను తిలకించడానికి దేశవిదేశాల నుంచి ఏటా దాదాపు పాతిక లక్షల మంది వరకు పర్యాటకులు వస్తుంటారు.
సెయింట్ పాల్ వింటర్ కార్నివాల్
అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్ర రాజధాని సెయింట్ పాల్‌లో ఏటా శీతకాలంలో భారీ కార్నివాల్ జరుగుతుంది. ఈ కార్నివాల్ వెనుక ఒక కథ ఉంది. న్యూయార్క్‌కు చెందిన ఒక పాత్రికేయుడు సెయింట్ పాల్‌ను ‘మరో సైబీరియా’గా పోలుస్తూ కథనం రాశాడు. శీతకాలంలో ఇక్కడ మనుషులు బతకలేరని అతను రాశాడు. ఈ కథనం స్థానికులకు కోపం తెప్పించింది.
శీతకాలంలో కూడా సెయింట్ పాల్‌లో మనుషులు బతుకుతారని, అంతేకాదు, ఉల్లాసంగా ఉత్సాహంగా వేడుకలూ జరుపుకొంటారని రుజువు చేసేందుకు 1885లో మాంట్‌రియల్ సరిహద్దుల్లో ఒక మంచుసౌధాన్ని నిర్మించి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు 1937 వరకు ఒక క్రమం లేకుండా జరుగుతూ వచ్చాయి.
తిరిగి 1946 నుంచి ఏటా క్రమపద్ధతిలో నిర్వహించడం ప్రారంభమైంది. ఈ వేడుకల కోసం భారీ హిమసౌధాన్ని సిద్ధం చేస్తారు. వీథుల్లో పరేడ్లు, రాత్రివేళల్లో కాగడాల ఊరేగింపులు, సంగీత నృత్య కార్యక్రమాలు, హిమశిల్పాల తయారీ పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
క్యూబెక్ వింటర్ కార్నివాల్
కెనడాలోని క్యూబెక్ నగరంలో ఏటా ఫిబ్రవరిలో పదిరోజుల పాటు వింటర్ కార్నివాల్ జరుగుతుంది. ఈసారి ఫిబ్రవరి 3 నుంచి 12 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. క్యూబెక్‌లో 1893 నుంచి జరుగుతూ వస్తున్న ఈ కార్నివాల్‌లో పాల్గొనేందుకు కెనడా, అమెరికా, యూరోప్‌ల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.
నగరంలో పగలూ రాత్రీ కూడా కోలాహలంగా ఊరేగింపులు జరుగుతాయి. వాద్యపరికరాలను మోగిస్తూ, విచిత్రవేషధారణలతో వేలాది మంది ఈ ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మంచుశిల్పాల ప్రదర్శనలు, క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment