అనగనగా ఒక రుపాయి.. | Funday Cover Story About Indian Rupee And Its Intresting Facts | Sakshi
Sakshi News home page

Indian Rupee: అనగనగా ఒక రుపాయి..

Published Sun, Jul 31 2022 9:02 AM | Last Updated on Sun, Jul 31 2022 1:19 PM

Funday Cover Story About Indian Rupee And Its Intresting Facts - Sakshi

రూపాయ్‌! రూపాయ్‌! ఎందుకు పడ్డావ్‌ అంటే.. దిగుమతులు గుదిబండగా మారాయని చెప్పింది. దిగుమతులూ! దిగుమతులూ! గుదిబండగా ఎందుకు మారారంటే... డాలర్‌ అంతకంతకూ బలపడుతోందని అంటాయి.lడాలర్‌! డాలర్‌! ఎందుకు బలపడుతున్నావంటే... అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతున్నాయని అంటుంది. వడ్డీ రేటు! వడ్డీ రేటు! ఎందుకు పెరుగుతున్నావంటే.. ధరలు భారీగా పెరగడం వల్లంటుంది. ధరా! ధరా! ఎందుకు పెరిగావనడిగితే.. క్రూడాయిల్‌ రేట్లు మండిపోతున్నాయంటుంది. క్రూడాయిల్‌! క్రూడాయిల్‌! ఎందుకు మండుతున్నావంటే.. రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తిందని చెబుతుంది. రష్యా! రష్యా! ఎందుకు దండెత్తావంటే... అమెరికా నా బంగారు దేశానికి ముప్పు తలపెడితే ఊరుకుంటానా అంటుంది.

ఇదీ... ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా తయారైంది మన రూపాయి పరిస్థితి! ఎక్కడో ఉక్రెయిన్‌లో జరుగుతున్న వార్‌.. కరెన్సీలనే కాదు ఎకానమీలనూ కకావికలం చేస్తోంది. 1947లో దాదాపు 3 రూపాయలిస్తే ఒక డాలరు వచ్చేది. మరిప్పుడో... 80 రూపాయలు వదిలించుకోవాల్సిందే. అంతకంతకూ చిక్కి శల్యమవుతున్న రూపాయి తాజాగా చరిత్రాత్మక కనిష్ఠ స్థాయికి (80.05) జారిపోయింది.

అంటే,  బ్రిటిష్‌ వాళ్లను తరిమికొట్టిన తర్వాత 75 ఏళ్లలో ఏకంగా 75 రెట్లకు పైగా విలువ కోల్పోయిందన్నమాట! అసలు రూపాయికి డాలరుతో ఉన్న లింకేంటి? మన దేశ కరెన్సీ విలువ ఇలా బక్కచిక్కడానికి కారణాలేంటి? రూపాయి పతనం వల్ల ఎవరిపై ఎలాంటి ప్రభావం పడుతుంది? రూపాయి విలువ ఎందుకు పెరుగుతుంది.. ఎందుకు తగ్గుతుంది? ఇలాంటి సందేహాలన్నీ తీరాలంటే... ఈ కథ చదివేయండి మరి!!
- శివరామకృష్ణ మిర్తిపాటి

మనకు స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశీ కరెన్సీ బ్రిటిష్‌ పౌండ్‌తో ముడిపడి ఉండేది. విదేశీ లావాదేవీలన్నింటికీ పౌండ్లలో చెల్లింపులు జరిగేవి. అప్పట్లో ఒక బ్రిటిష్‌ పౌండ్‌ విలువను 13.33 రూపాయలుగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయించింది. అప్పుడు పౌండ్‌ విలువ 4 డాలర్లు. దీని ప్రకారం డాలరుతో మన రూపాయి మారకం విలువ దాదాపు 3.3 కింద లెక్క. 1951లో మొదలుపెట్టిన పంచవర్ష ప్రణాళికల అమలు కోసం విదేశీ రుణాలను భారీగా సమీకరించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, ప్రభుత్వం స్థిర కరెన్సీ మారకం విలువను అమలు చేయడం వల్ల 1947 నుంచి 1966 మధ్య డాలరుతో రూపాయి విలువ 4–5 స్థాయిలోనే కొనసాగింది. ఇక 1962లో చైనాతో యుద్ధం, పాకిస్థాన్‌తో 1965లో జరిగిన పోరుతో భారత బడ్జెట్‌లో భారీ లోటు ఏర్పడింది. 1965–66లో వచ్చిన కరువుతో దేశంలో ధరలు ఆకాశాన్నంటాయి. దీనికితోడు ఇతర దేశాలనుంచి దిగుమతులు పోటెత్తడంతో వాణిజ్యలోటు దూసుకెళ్లింది. ఆ సమయంలో డాలరుకు రూపాయి మారకం రేటును 7.57గా నిర్ణయించారు.

పెద్దన్న కబంధ హస్తాల్లో...
1971లో బ్రిటిష్‌ పౌండ్‌తో భారత్‌ కరెన్సీకి పూర్తిగా బంధం తెగిపోయింది. అగ్రరాజ్యం అమెరికా కరెన్సీ కబంధ హస్తాల్లో రూపాయి చిక్కుకుంది. ఇక అప్పటినుంచి మన విదేశీ రుణ చెల్లింపులు, ఎగుమతులు– దిగుమతులు ఇతరత్రా లావాదేవీలన్నీ నేరుగా అమెరికా డాలరుతోనే ముడిపడ్డాయి. 1975లో డాలరుతో రూపాయి మారకం విలువ 8.39 డాలర్లకు తగ్గింది. 1985 నాటికి 12కు పడిపోయింది. ప్రధానంగా వాణిజ్యలోటు (ఎగుమతులు తగ్గిపోయి.. దిగుమతులు భారీగా ఎగబాకడం) పెరిగిపోవడంతో డాలరుతో రూపాయి మారకం విలువ 1990 నాటికి 17.5కు క్షీణించింది.

చెల్లింపుల సంక్షోభంతో నియంత్రణకు చెల్లు...
1991లో భారత ఆర్థిక పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. దేశంలో విదేశీ కరెన్సీ(ఫారెక్స్‌) నిల్వలు దాదాపు అడుగంటిపోయాయి. దీంతో ఇతర దేశాలనుంచి చేసుకున్న దిగుమతులకు చెల్లింపులు జరపలేని స్థితి వచ్చేసింది. కేవలం మూడు వారాలకు సరిపడా చెల్లింపులకు మాత్రమే ఫారెక్స్‌ నిల్వలు (డాలర్లు) భారత్‌వద్ద మిగలాయి. తీవ్రమైన చెల్లింపుల సంక్షోభం తలెత్తడంతో బంగారాన్ని తాకట్టు పెట్టి డాలర్లను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనం ధరల మంటతో అల్లాడుతున్నారు. ఈ సమయంలోనే భారత్‌లో ఆర్థిక సంస్కరణలు, దేశంలోకి విదేశీ పెట్టుబడులు తరలి వచ్చేలా కీలకమైన సరళీకరణలకు ప్రభుత్వం తెరతీసింది.

అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌ గనుక సంస్కరణలతో చికిత్స చేసి ఉండకపోతే మన దేశం పరిస్థితి కూడా ఇప్పటి శ్రీలంకలా మారిపోయేదన్న మాట! ఇక 1993లో దేశ కరెన్సీ చరిత్రలో కీలక సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం కరెన్సీపై నియంత్రణను పూర్తిగా ఎత్తివేసింది. ఆర్‌బీఐ కనుసన్నల్లో మార్కెట్‌ వర్గాలు (ఫారెక్స్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ ఆధారంగా) రూపాయి మారకం విలువను నిర్దేశించేలా సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలతో 1995 నాటికి డాలరుతో రూపాయి మారకం విలువ 32.42కు పడిపోయింది. 2000 సంవత్సరం నాటికి ఒక అమెరికా డాలరు కోసం 44.94 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

2008 ఆర్థిక సంక్షోభంతో కుదేలు...
మన్మోహన్‌ సింగ్‌.. 2004లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఆర్థిక వ్యవస్థ వృద్ధి పతాక స్థాయికి చేరింది. విదేశీ పెట్టుబడులు భారీగా తరలి రావడం, ప్రైవేటు రంగం పుంజుకోవడం, సరళీకరణల ఫలాలతో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏకంగా 9 శాతాన్ని తాకింది. అయితే, 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం మన దేశాన్ని కూడా కకావికలం చేసింది. దీనికితోడు ధరల మంట కరెన్సీని కుదేలు చేసింది. 2009లో తొలిసారిగా రూపాయి 50ని దాటి పడిపోయింది. ఇక అప్పటి నుంచీ అంతకంతకూ బక్కచిక్కుతూనే ఉంది. 2016 నవంబర్‌లో 68.86 కనిష్ఠానికి దిగజారింది. 2018 వరకూ 66–68 స్థాయిలో కదలాడిన రూపాయి మళ్లీ అంతర్జాతీయ ఆర్థిక ప్రతికూలతలతో కట్టలు తెంచుకుంది.

ట్రంప్‌ ముంపు... కరోనా పంజా!
ట్రంప్‌ అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేశారు. ఇతర దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై సుంకాలను ఎడాపెడా పెంచి వాణిజ్య యుద్ధానికి తెరతీయడంతో అంతర్జాతీయ వాణిజ్య రంగం అతలాకుతలమైంది. దీంతో వర్ధమాన దేశాల కరెన్సీలు మరింతగా కుప్పకూలాయి. ఇవన్నీ ఒకెత్తయితే, 2020 సంవత్సరంలో ప్రపంచం నెత్తిన ‘కరోనా’ పిడుగు పడింది. వ్యాపార వాణిజ్యాలు స్తంభించడంతో ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఈ దెబ్బకు డాలరుతో రూపాయి విలువ 76.70 స్థాయికి క్షీణించింది. ఇప్పుడు నెలకొన్న భౌగోళిక రాజకీయ ప్రభావాలకు తోడు ఇతరత్రా అంతర్జాతీయ ప్రతికూలతలతో తాజాగా రూపాయి 80.05ను తాకి చరిత్రాత్మక కనిష్టానికి జారిపోయింది.

తాజా పతనానికి కారణాలేంటి...కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు... రూపాయి తాజా పతనానికీ అనేక అంశాలు ఆజ్యం పోస్తున్నాయి.
వడ్డీరేట్ల పెంపు గుబులు..:
2020లో వచ్చిన కరోనా దెబ్బకు ఎకానమీ కకావికలం కావడంతో అమెరికా మళ్లీ డాలర్లను ఎడపెడా ముద్రించి, వడ్డీరేట్లను సున్నా స్థాయికి తెచ్చింది. అయితే, ధరల మంట కారణంగా (2022 జూన్‌లో ద్రవ్యోల్బణం 9.1%.. 4 దశాబ్దాల గరిష్ఠం) తాజాగా ఈ ప్యాకేజీల ఉపసంహరణను స్టార్ట్‌ చేయడంతో పాటు వడ్డీరేట్లను శరవేగంగా పెంచుతూ పోతోంది. అధిక ద్రవ్యోల్బణం ప్రపంచ దేశాలన్నింటినీ కుదిపేస్తుండటంతో ఆయా దేశాల సెంట్రల్‌ బ్యాంకులు సైతం వడ్డీరేట్లను తీవ్రంగా పెంచుతున్నాయి. దీంతో స్టాక్‌ మార్కెట్ల నుంచి ఇన్వెస్టర్లు నిధులను వెనక్కి తీసుకుంటూ... కష్టకాలంలో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించే డాలరు వైపు దృష్టిసారిస్తున్నారు. దీనివల్ల కూడా ఇతర దేశాల కరెన్సీలు దిగజారుతున్నాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో ముడిపడిన డాలరు ఇండెక్స్‌ విలువ ఏకంగా 20 ఏళ్ల గరిష్ఠానికి ఎగసి 109 స్థాయికి దూసుకెళ్లింది అందుకే. అయితే, మిగతా చాలా కరెన్సీలతో పోలిస్తే ఈ ఏడాది రూపాయి కాస్త తక్కువగానే పతనం కావడం విశేషం.

రష్యా–ఉక్రెయిన్‌ వార్‌.. క్రూడ్‌ సెగలు: మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్లు...ప్రపంచ ఎకానమీకి ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ఊహించని షాకిచ్చింది. రష్యా క్రూడ్, గ్యాస్‌ ఇతరత్రా కమోడిటీల ఎగుమతులపై అమెరికా, యూరప్‌ దేశాలు విధించిన ఆంక్షల దెబ్బకు ముడి చమురు ధర భగ్గుమంది. ఫిబ్రవరిలో యుద్ధం మొదలవడానికి ముందు బ్యారెల్‌కు 90 స్థాయిలో ఉన్న క్రూడ్‌ ఒక్కసారిగా 140 డాలర్లకు ఎగబాకింది. ప్రస్తుతం 100–105 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఈ ప్రభావంతో అనేక దేశాల్లో ధరలు ఆకాశాన్నంటడంతో.. వడ్డీరేట్లను భారీగా పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది రూపాయితో సహా అనేక దేశాల కరెన్సీ విలువలకు చిల్లు పెడుతోంది.

దిగుమతుల బండ: అత్యధికంగా దిగుమతులపై ఆధారపడిన దేశం మనది. క్రూడ్‌ ధర పెరిగిపోయిన కారణంగా ముడిచమురు దిగుమతుల బిల్లు అంతకంతకూ తడిసిమోపెడవుతోంది. ఎందుకంటే మన క్రూడ్‌ అవసరాల్లో 85% వాటా దిగుమతులదే. గతేడాది (2021–22)లో దేశ ఎగుమతులు రికార్డు స్థాయిలో 418 బిలియన్‌ డాలర్లను (28% వృద్ధి) తాకాయి. అయితే,  దిగుమతులు ఏకంగా 55% ఎగబాకి... 610 బిలియన్‌ డాలర్లకు దూసుకెళ్లాయి. ఇందులో ప్రధానంగా క్రూడ్, బంగారం దిగుమతులదే ప్రధాన వాటా కావడం గమనార్హం. దీంతో వాణిజ్య లోటు 88% ఎగసి 192 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. రిఫైనర్ల నుంచి డాలర్లకు డిమాండ్‌ పెరిగిపోతుండటంతో రూపాయిని బక్కచిక్కిపోయేలా చేస్తోంది. మరోపక్క, భారీ వాణిజ్య లోటు కారణంగా కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌ – మూలధన పెట్టుబడులు మినహా.. దేశంలోకి వచ్చి, పోయే విదేశీ మారక ద్రవ్యం మధ్య వ్యత్యాసం) తీవ్రమవుతోంది. గత ఆర్థిక సంవత్సరం 50 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉన్న క్యాడ్‌ (జీడీపీతో పోలిస్తే 1.8%)... ఈ ఏడాది ఏకంగా 105 బిలియన్‌ డాలర్లకు (జీడీపీలో 3%) పెరిగిపోవచ్చనేది బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా తాజా అంచనా.

విదేశీ పెట్టుబడులు రివర్స్‌గేర్‌: అమెరికా వడ్డీరేట్ల భారీ పెంపునకు తోడు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) అమ్మకాలకు తెగబడుతున్నారు. దీంతో స్టాక్‌ మార్కెట్లు కూడా భారీగా పడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు భారతీయ స్టాక్, బాండ్‌ మార్కెట్‌ నుంచి 39 బిలియన్‌ డాలర్లను వెనక్కి తీసుకోవడం గమనార్హం. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నాటితో పోలిస్తే, ఇది ఏకంగా 3 రెట్లు అధికం కావడం ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనలకు నిదర్శనం.

ఆర్థిక వ్యవస్థ బలహీనతలు..: 2021–22లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదైంది (అయితే, కరోనా కారణంగా 2020–21లో జీడీపీ 6.6% క్షీణించిన నేపథ్యంలో దీంతో పోల్చడానికి లేదు). ఈ ఏడాది (2022–23) వృద్ధి రేటు 7 శాతం లోపే ఉండొచ్చని అంచనా. రూపాయికి ఆర్థిక బలహీనత సెగ కూడా తగులుతోంది. మనలాంటి వర్ధమాన దేశాల్లో, ముఖ్యంగా భారత్‌ వంటి దిగుమతులపై అధికంగా ఆధారపడిన దేశంలో కరెన్సీ బలహీనత అనేది సహజమేనని కూడా కొంతమంది ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నంత వరకూ పెద్దగా ఆందోళనlచెందక్కర్లేదనేది వారి అభిప్రాయం. అయితే, ప్రస్తుత కరెన్సీ కల్లోలానికి దేశీ అంశాలకంటే అంతర్జాతీయ ప్రతికూలతలే ప్రధాన కారణం కావడంతో రూపాయి పతనానికి ఎక్కడ అడ్డుకట్టపడుతుందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే!!

రూపాయి బలహీనత వల్ల ఏం జరుగుతుంది...
కంపెనీల లాభాలు ఆవిరి: మనదేశంలో చాలా కంపెనీలు దిగుమతులపైనే ఆధారపడటంతో అధిక మొత్తంలో ఖర్చుచేయాల్సి వస్తుంది. అంటే 100 డాలర్ల విలువైన కమోడిటీ లేదా విడిభాగాన్ని దిగుమతి చేసుకోవడానికి గతంలో రూ.7,400 వెచ్చించాల్సివస్తే... ఇప్పుడు రూపాయి క్షీణతతో రూ.8,000 ఖర్చుపెట్టాల్సి వస్తుందన్నమాట. దీంతో లాభాలు కూడా కరిగిపోతాయి.

విదేశీ రుణాలు తడిసిమోపెడు: రూపాయి క్షీణతతో విదేశీ రుణాలు కూడా భారంగా మారతాయి. గతంలో కంపెనీలు, ప్రభుత్వం డాలరు రూపంలో తీసుకున్న రుణాలకు ఇప్పుడు చెల్లింపులు, వడ్డీ తడిసిమోపడవుతుంది.

పెట్రో మంట.. ధరల మోత: అధిక కమోడిటీ రేట్లకు తోడు రూపాయి పడిపోవటం వల్ల దిగుమతి చేసుకునే వస్తువులకు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. పెట్రోలు నుంచి వంటనూనెల వరకూ అన్నీ ఆకాశాన్నంటి వంటింటి సంక్షోభానికి కారణమవుతోంది. బొగ్గు దిగుమతి భారం కూడా పెరిగి, కరెంటు చార్జీలు షాకిస్తున్నాయి. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, గృహోపకరణాలు మొదలైన ఉత్పత్తుల తయారీ సంస్థలు ముడి వస్తువుల ధరల సెగతో రేట్లను పెంచేస్తున్నాయి. దీంతో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇప్పటికే 7 శాతానికి ఎగబాకడం తెలిసిందే.

విదేశీ ప్రయాణాలకూ సెగ..: రూపాయి దెబ్బకు విదేశీ ప్రయాణాల వ్యయం కూడా పెరిగిపోతోంది. విమాన టికెట్లకు, హోటల్స్‌ అద్దెకు, షాపింగ్‌కు మరింత వెచ్చించాల్సి వస్తోంది. ఉదాహరణకు 100 డాలర్ల అద్దె ఉన్న హోటల్‌ రూమ్‌కు ఆర్నెల్ల క్రితం రూపాయి మారకంలో రూ. 7,400 కడితే.. ఇప్పుడు.. రూ. 8,000 కట్టాల్సి వస్తుంది.
ఉద్యోగాల్లో కోత..: రూపాయి పతన ంతో దిగుమతులకు కంపెనీలు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా రేట్లు పెంచాలి. రేట్లు భారీగా పెరిగితే కొనేవాళ్లుండరు. కొనేవాళ్లు లేక ఉత్పత్తి తగ్గించుకోవాల్సి వస్తుంది. దానికి తగ్గట్లే ఉద్యోగాల్లోనూ కోతలు తప్పవు.

విదేశీ విద్య భారం: రూపాయి పతనం వల్ల విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థులు ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం మరింత సొమ్ము వదిలించుకోవాల్సిన పరిస్థితి. ఉదాహరణకు, ఆర్నెల్ల క్రితం సెమిస్టర్‌లో 2000 డాలర్ల ఫీజుకు అప్పటి రూపాయి విలువ ప్రకారం రూ.1.48 లక్షలు ఖర్చయిందనుకుందాం. అదే ఇప్పుడు మళ్లీ సెమిస్టర్‌ ఫీజు 2,000 డాలర్లే ఉన్నప్పటికీ రూ.1.60 లక్షలు చెల్లించాల్సి వస్తుందన్నమాట.

కొందరికే ఊరట!
రూపాయి పడటం వల్ల కొన్ని వర్గాలకు మాత్రం ఊరట లభిస్తుంది. డాలర్లలో ఆదాయం ఆర్జిస్తూ ఇక్కyì  తమ కుటుంబాలకు సొమ్ము పంపేవారికి మరిన్ని ఎక్కువ రూపాయలు లభిస్తాయి. అలాగే, ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడమూ వారికి ప్రయోజనకరమే. ఇక సాధారణంగా రూపాయి బలహీనపడితే ఎగుమతి రంగ కంపెనీలకు పండగే. ఉదాహరణకు ఎగుమతుల ద్వారా ఆర్నెల్ల క్రితం రూ. కోటి ఆదాయం వచ్చుంటే.. రూపాయి క్షీణత వల్ల ప్రస్తుతం అదనంగా దాదాపు రూ. 6 లక్షలు ఆర్జించగలుగుతారు. మరోవైపు, డాలర్లలో ఆదాయం పొందే మన ఐటీ కంపెనీలకు కూడా రూపాయి పతనం సానుకూలంశమే.

ఆర్‌బీఐ ఏం చేస్తోంది...
చిక్కిపోతున్న రూపాయికి చికిత్స చేసేందుకు ఆర్‌బీఐ పరోక్షంగా పలు చర్యలు తీసుకుంటోంది. దేశంలోకి డాలర్‌ నిధులను పెంచేలా మరిన్ని ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లకు ఓకే చెప్పింది. వడ్డీరేట్లను పెంచుకునే వెసులుబాటునూ బ్యాంకులకు ఇచ్చింది. ఇక విదేశీ వాణిజ్య లావాదేవీలను రూపాయల్లో సెటిల్‌ చేసేందుకు (డాలర్లకు డిమాండ్‌ తగ్గించడం) తాజాగా అనుమతించింది. అలాగే, మన బ్యాంకులు, కార్పొరేట్‌ కంపెనీలు విదేశాల నుంచి మరింతగా రుణాలను సమీకరించుకునే అవకాశాన్ని, పరిమితులను కూడా ఆర్‌బీఐ పెంచింది. కాగా, రూపాయి పతనంతో మన విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 632 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఫారెక్స్‌ నిల్వలు తాజాగా 580 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. ఇవి 9 నెలల పాటు దిగుమతులకు సరిపోతాయని అంచనా.

రూపాయి పైకి.. కిందికి ఎందుకు?
వివిధ దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలు, రాజకీయ స్థితిగతులు కరెన్సీపై ప్రభావం చూపుతుంటాయి. ఉదాహరణకు, అమెరికా వెళ్లినప్పుడు అక్కడ మన రూపాయలు చెల్లవు కాబట్టి.. వాటిని ఇచ్చి డాలర్లు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, వాళ్లు మన దగ్గరకొస్తే డాలర్లు ఇచ్చి రూపాయలు తీసుకోవాల్సి వస్తుంది. ఇలా మార్కెట్లో సంబంధిత కరెన్సీ లభ్యత, డిమాండును బట్టి ఇతర కరెన్సీలతో పోలిస్తే దాని విలువ మారుతూ ఉంటుంది. డాలర్‌కు డిమాండ్‌ పెరిగినప్పుడు రూపాయి బలహీనపడుతుంది. అలాగే రూపాయలకు డిమాండ్‌ పెరిగినప్పుడు బలపడుతుంది. రూపాయి హెచ్చుతగ్గులకు లోనవడానికి అనేక ఆర్థికాంశాలు కారణమవుతుంటాయి.

ఉదాహరణకు ఎగుమతులు పెరిగినప్పుడు ఆయా కంపెనీలకు ఆదాయం కింద ఎక్కువ డాలర్లు వస్తాయి. సహజంగానే వీటిని దేశీయంగా రూపాయల్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో డాలర్ల లభ్యత ఎక్కువై.. రూపాయల కొరత ఏర్పడుతుంది. ఫలితంగా రూపాయికి డిమాండ్‌ పెరిగి బలపడుతుంది. మరోవైపు, దేశీ కంపెనీలు దిగుమతి చేసుకున్నప్పుడు వాటికి డాలర్లలో చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. కనుక దిగుమతులు ఎక్కువైనప్పుడు డాలర్లకు ఆటోమేటిక్‌గా డిమాండ్‌ పెరిగి అది బలపడుతుంది.

అలాగే, విదేశీ పెట్టుబడుల అంశం కూడా. విదేశీ కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టినప్పుడు రూపాయలు కావాల్సి ఉంటుంది కనుక.. డాలర్ల విలువ తగ్గి రూపాయికి డిమాండ్‌ పెరుగుతుంది. అదే.. ఆ కంపెనీలు ఇండియాలో తమ పెట్టుబడులు అమ్మేసినప్పుడు వాటికి డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది కనుక డాలర్లకు డిమాండ్‌ పెరుగుతుంది. ఇలా తరచు డాలర్లు, రూపాయల డిమాండ్‌లో మార్పుల వల్ల ఒకదానితో పోలిస్తే మరొక దాని విలువ కూడా మారుతుంటుంది. ద్రవ్యోల్బణం, జీడీపీ వృద్ధి, వడ్డీ రేట్లూ కూడా కరెన్సీపై ప్రభావం చూపుతాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement