గుంపులో గోవిందకు కాలం చెల్లింది.. అంతా క్రేజీ క్రియేటివ్స్‌ మాయ | Sakshi Funday Cover Story About Creative Skills Todays Technology | Sakshi
Sakshi News home page

Funday Cover Story: గుంపులో గోవిందకు కాలం చెల్లింది.. అంతా క్రేజీ క్రియేటివ్స్‌ మాయ

Published Sun, Jun 5 2022 9:18 AM | Last Updated on Sun, Jun 5 2022 10:10 AM

Sakshi Funday Cover Story About Creative Skills Todays Technology

నలుగురితో నారాయణ.. గుంపులో గోవింద..  ఇప్పుడు వర్కవుట్‌ అయ్యే కాన్సెప్ట్‌ కాదు! సాంకేతిక, సమాచార విప్లవం వచ్చాక.. కొత్తదనమనేది పాతబడి..  అర్థం మార్చుకున్నాక..కొంచెం క్రేజీ ఆలోచనే సృజనగా పబ్లిక్‌ డొమైన్‌లో గుర్తింపు పొందాక.. నలుగురితో నారాయణలకు గుంపులో గోవిందులకు కాలం చెల్లిపోయింది! క్రియేటివిటీ ఎంత హద్దులు దాటితే అంత యూనిక్‌గా మన్ననలందుకుంటోంది! ఈ ధోరణి పబ్లిసిటీ రంగంలో పోస్టరేసినట్టు కనపడుతోంది.. అలాంటి కొన్ని ప్రచారాలు.. ప్రకటనలు మీ ‘ఫన్‌’డే కోసం

పులిరాజా గుర్తున్నాడా? ‘పులిరాజాకు ఏమైంది?’ అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో వెలసిన హోర్డింగ్స్‌ గుర్తుకొచ్చాయా? దాదాపు రెండు దశాబ్దాల కిందటి విషయం. ఈ ఏకవాక్య ప్రకటన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలందరిలో ఎక్కడలేని కుతూహలాన్ని కలిగించింది. ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏంటి.. దేశవ్యాప్తంగానే (ఆయా భాషల్లో) సంచలనం సృష్టించింది. ఆ తర్వాత దానికి కొనసాగింపుగా మరో ప్రకటన వచ్చింది.. ‘పులిరాజాకు ఎయిడ్స్‌ వస్తుందా?’ అంటూ.

ఇదీ అంతే ఆసక్తిని.. సెన్సేషన్‌ను రేకెత్తించింది. ఎయిడ్స్‌ ఉనికిలోకి వచ్చిన కొత్తలో దాని మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేసిన ప్రయత్నమే ఆ ప్రచారం. ప్రధానంగా లైంగిక (అపరిచిత వ్యక్తులు, అసురక్షిత ) సంపర్కం ద్వారా సంక్రమించే ఈ వ్యాధి గురించి ఎంత చర్చిస్తే అంత అవగాహన పెరుగుతుంది.. గుట్టుగా ఉంటే వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంటుంది అనే చైతన్యాన్ని పెంపొందిచండం కోసం ఈ ప్రకటనను అలా డిజైన్‌ చేశారు. అందుకే  ‘ఎయిడ్స్‌ గురించి మాట్లాండి.. నిశ్శబ్దాన్ని ఛేదించండి’ అనే ట్యాగ్‌లైన్‌నూ జోడించారు. ఆ ఉద్దేశం నెరవేరింది. దీని మీద పెద్ద చర్చే జరిగింది. ఎలాగోలా ఎయిడ్స్‌ అనే మాట జనాల మస్తిష్కాల్లో ముద్రపడిపోయింది. అది స్పృహను పెంచింది. ఎయిడ్స్‌పై అప్పటి వరకు చేసిన ప్రచారమంతా ఒకెత్తు పులిరాజా ఒక్కడు ఒకెత్తు అనేట్టుగా నిలిచిపోయింది.

ఇలాంటి ప్రకటనలు చాలానే ప్రజల మెదళ్లను వశపరచుకున్నాయి. ఆ జాబితాలో కరపత్రాల నుంచి కమర్షియల్‌ యాడ్స్‌ దాకా చాలానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కళలూ అందులో చేరాయి. దానికి ఉదాహరణ పాప్‌ లెజెండ్‌ మైకేల్‌ జాక్సన్‌. నిజానికి ఇలాంటి చిత్రమైన స్టంట్‌తోనే పాప్‌ అభిమాన ప్రపంచం ఒక్కసారిగా ఆయన వైపు తలతిప్పింది. మైకేల్‌ జాక్సన్‌ ‘థ్రిల్లర్‌’ ఆల్బమ్‌ తెలుసు కదా! లవ్, మ్యూజిక్, డ్యాన్స్‌ అనే ఎవర్‌గ్రీన్‌ ఫార్ములాకు మనిషిని పీక్కుతినే జాంబీని జోడించి శ్మశానంలో చిత్రీకరించిన పాట. అప్పటి వరకు అతని ఏ పాటకు, డాన్స్‌కు రాని స్పందన, అభిమాన వెల్లువ థ్రిల్లర్‌తో వచ్చింది. అతనికంటూ ఓ ఫ్యాన్‌ బేస్‌ను ఏర్పాటు చేసింది. ఆ టైమ్‌లో ఎవరి ఊహకూ అందని ప్రయోగం అది.

ఆ విజయం మైకేల్‌ను మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోనివ్వలేదు. ఇలా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ మంది దృష్టిని ఆకట్టుకోవాలంటే అందరూ నడిచే దారిలో నడిస్తే కుదరదు. ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ ఆలోచించాలి. ఎవ్వరూ చేయనిది చేయాలి. బడా స్టార్ల పరిమితుల్లో లేనిది, బిగ్‌షాట్స్‌కు సాధ్యం కానిది,  కార్పొరేట్స్‌కు చిక్కని మ్యాజిక్‌ ఒకటి క్రియేట్‌ చేయాలి. అది నలుగురి నోళ్లల్లో  నానుతుంది. ఆ ప్రచారమే వ్యాపారాన్నయినా.. సినిమానైనా లాభాల్లో నడిపిస్తుంది. అందుకే పబ్లిసిటీ కొత్త పద్ధతుల్లో కనిపిస్తోంది. 

చెరిగిపోదులే..
ఈ సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ ధ్యాసలోని కొన్ని ఆలోచనలు.. ప్రగతిపథాన్ని స్పీడ్‌ బ్రేకర్లలా స్లో చేస్తున్నాయి అప్పుడప్పుడు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి. ఉదాహరణకు కెమ్లిన్‌ మార్కర్‌ పెన్‌ యాడ్‌. ఇందులో భార్యకు సిందూరం బదులు మార్కర్‌ పెన్నుతో బొట్టు పెడతాడు భర్త. అనారోగ్యంతో మంచాన పడి అతను చనిపోతాడు. ఆమె బొట్టును చెరిపేందుకు ప్రయత్నిస్తుంటారు ఇతర స్త్రీలు. మార్కర్‌తో భర్త దిద్దిన ఆ బొట్టు చెరిగిపోదు. దీంతో ఆ భర్త ప్రాణాలతో లేచి కూర్చుంటాడు. ఇంచుమించు ఇది సతీ సావిత్రి కాన్సెప్ట్‌ను తలపిస్తుంది. అయినా ఆ యాడ్‌లో ఉన్న యూనిక్‌నెస్‌తో అది సక్సెస్‌ అయింది.

లైటర్‌వీన్‌లో సుతిమెత్తగా కాస్త హాస్యరస ప్రధానంగా తీశారు కాబట్టి కొంచెం లోతుగా చూస్తే తప్ప దీని వెనుకున్న ముత్తయిదువ సెంటిమెంట్‌ అర్థంకాదు. క్రియెటివిటీకి పరాకాష్టగా కనిపించే ఇంకో యాడ్‌ హాథీ సిమెంట్స్‌ యాడ్‌. ఆత్మలు కూడా దూరలేనంత దృఢంగా తమ సిమెంట్‌తో కట్టిన నిర్మాణాలుంటాయని శ్మశానం, దెయ్యాలు, ఆత్మలు నేపథ్యంగా రూపొందించిన ఆ యాడ్‌ ద్వారా తన ప్రోడక్ట్‌ను ప్రమోట్‌ చేసుకుందీ కంపెనీ. 

ఛోటేమియా బడేమియా
ఈ కామర్స్‌ బూమ్‌ మొదలైన కొత్తలో అది వ్యాపార ప్రకటనలకు ప్లాట్‌ఫామ్‌గా మారింది. కానీ ఆ ప్రకటనలు ఇలా స్టార్ట్‌కాగానే అలా రిమోట్‌ నొక్కేవాళ్లు లేదా స్కిప్‌ బటన్‌ మీదకు కర్సర్‌ను తీసుకెళ్లేవాళ్లు. అలాంటిది ఆ రిమోట్‌నే స్కిప్‌ చేశాయి ఫ్లిప్‌కార్ట్‌ యాడ్స్‌. చిన్న పిల్లలను పెద్ద వాళ్ల గెటప్‌లో చూపిస్తూ  రొటీన్‌కు భిన్నంగా ఫ్లిప్‌కార్ట్‌ చేసిన ప్రయత్నం ఫ్లాష్‌సేల్‌లా సక్సెస్‌ అయ్యింది. అమెజాన్‌ దెబ్బకు అప్పటి వరకు ఉన్న ఈ కామర్స్‌ సైట్స్‌ చతికిలబడుతున్న సమయంలో ఈ యాడ్స్‌ .. మార్కెట్‌లో ఫ్లిప్‌కార్ట్‌ నిలదొక్కుకునేందుకు సాయపడ్డాయి. 
చూడక తప్పదు

విలక్షణమైన ప్రకటనల ఫ్రేమ్‌లో సినిమా పబ్లిసిటీ, ట్రైలర్స్‌ కూడా ఇముడుతాయి. సినిమా అంటేనే లార్జర్‌ దాన్‌ లైఫ్‌ కలలకి దృశ్యరూపం. సినిమాకే కాదు వాటి ట్రైలర్లకూ లార్జెర్‌ దాన్‌ లైఫ్‌ ఉంటుందని నిరూపించి బాక్సాఫీస్‌ను ఫుల్‌ చేసుకుంది లక్ష్మీ గణపతి ఫిల్మ్స్‌. హాలీవుడ్‌ సినిమాలను తెలుగులోకి డబ్‌ చేసేది ఈ సంస్థ. పెక్యూలియర్‌.. హై పిచ్‌ వాయిస్‌తో ‘లక్ష్మీ గణపతి ఫిల్మ్స్‌ ‘సముద్రపుత్రుడు’.., ‘దెయ్యాల కోట’..,  ‘వింత ప్రపంచం’ అంటూ టీవీ, రేడియో ప్రకటనల్లో చెబుతుంటే.. వినే వాళ్లకు ఈ సినిమా చూడకపోతే తమ కళ్లు దండగ అనే భావన కలిగేది. 

జూ జూ.. 
వైవిధ్యమైన ప్రకటనల ట్రెండ్‌లో టెలికమ్‌ సేవల కంపెనీలూ తమ ఐడియాలను నమోదు చేసుకున్నాయి. వీటిల్లో వొడాఫోన్‌ క్రియేట్‌ చేసిన జూ జూలది చెప్పుకోదగ్గ పాత్ర. వీటితో పండించిన ప్రకటనలే ఆ కంపెనీ బిజినెస్‌కు కాసుల సిగ్నల్స్‌ అందించాయి. అంతేనా ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌)ను ఐఎఫ్‌ఎఫ్‌(ఇండియన్‌ ఫ్యామిలీస్‌ ఫేవరెట్‌)గా మార్చలేదూ! నిజానికి  వోడాఫోన్‌ జూ జూలు దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది కూడా ఐపీఎల్‌ ద్వారానే. ఈ మ్యాచ్‌ల మధ్యలోనే కదా వీటిని పెట్టి వోడాఫోన్‌ తన ప్రచార ప్రకటనలను ప్రసారం చేసింది. క్రికెట్‌ అభిమానులు ఐపీఎల్‌ కోసం టీవీ ముందు కూర్చుంటే వాళ్ల కుటుంబ సభ్యులు ఈ జూ జూల యాడ్స్‌ కోసం టీవీ ముందు ఆసీనులయ్యేవారు. అలా వారూ ఐపీఎల్‌కు అడిక్ట్‌ అయ్యారు. ఏలియన్స్‌  రూపంలో మాటల్లేకుండా జూజూలు చేసే అల్లరి వోడాఫోన్‌కు ఎంతటి పబ్లిసిటీనిచ్చిందో ఐపీఎల్‌కూ అంతటి క్రేజ్‌ను తెచ్చింది. అయితే ఇంచుమించు ఓ దశాబ్దం కిందట మిరిండా కూల్‌ డ్రింక్‌ కూడా ఇలాగే మాటల్లేని జూ జూలను పోలిన గుండు క్యారెక్టర్లతో మార్కెట్లోకి వచ్చింది. డ్రింక్‌ సంగతేమో కానీ ప్రచారంతో మాత్రం జనాల్ని చిల్‌ చేసింది.   

స్మార్ట్‌ కాకి
ఇది హార్డ్‌ వర్క్‌ కాలం కాదు.. స్మార్ట్‌ వర్క్‌ కాలం. అందుకే నాటి కథల్లోని క్యారెక్టర్స్‌ కూడా నేటి కాలానికి అప్‌ డేట్‌ అవుతున్నాయి. మనందరి చిన్నప్పటి కాకి కథలోని కాకి కూడా. విపరీతంగా దాహమేసిన ఆ కాకి కూజాలో ఉన్న కాసిన్ని నీళ్లల్లో రాళ్లు వేసి.. ఆ నీళ్లను పైకి తెప్పించి దాహం తీర్చుకుని ఎంచక్కా ఎగిరిపోతుంది. కాలం మారినా దాహం మారదు కదా. అందుకే అప్‌డేటెడ్‌ నేటి కాకికీ దాహం వేస్తుంది. ఆ పక్కనే నాటి చాదస్తపు కాకీ ఉంటుంది తన ముక్కు దూరని చిన్న పాత్రలో ఉన్న కొంచెం నీళ్లల్లో రాళ్లు వేస్తూ. అప్‌డేటెడ్‌  కాకి దాన్ని వింతగా చూసి తన ముందున్న స్ప్రైట్‌ బాటిల్‌ను ముక్కుతో పొడిచి.. పౌంటెన్‌గా చిమ్మిన స్ప్రైట్‌తో దాహం తీర్చుకుని కులాసాగా ఫ్లై అవుతుంది. ఇది స్ప్రైట్‌ యాడ్‌ క్రియేటివిటీ. వావ్‌.. వాటేన్‌ ఐడియా అనిపించక మానదు.. స్ప్రైట్‌ను కొనిపించక మానదు. ఈ వరుసలోకే చేరుతుంది ఫెవికాల్‌ ప్రకటన కూడా. ఫాంటసీతో వీక్షకుడిని కట్టిపడేయడంలో దానిది  ప్రత్యేక శైలి. ఫెవికాల్‌ నుంచి ఏదైనా యాడ్‌ వస్తే చూసి వదిలేయకుండా  దాని మీద మిత్రబృందంతో చర్చపెట్టేలా చేస్తుంది. చేపలు పట్టడం మొదలు కలలో హీరోయిన్‌ యాడ్‌ వరకు థీమ్‌ ఒక్కటే అయినా దేనికదే భిన్నంగా కనువిందు చేసి జనాలను ఆ బ్రాండ్‌కి అతుక్కుపోయేలా చేస్తుంది.

పోస్టర్సే స్టార్స్‌గా
యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రవిబాబు సినిమా డైరెక్టర్‌గా మారాక తనదైన శైలిని విడిచి పెట్టలేదు. పెద్ద పెద్ద స్టార్‌ కాస్ట్‌ లేకుండా కొత్తవాళ్లతో సినిమాలు తీసే రవిబాబు.. తన సినిమాలపై ప్రేక్షకుల అటెన్షన్‌ను సాధించేందుకు డిఫరెంట్‌గా పోస్టర్స్‌ను డిజైన్‌ చేస్తాడు. కేవలం వెరైటీ పోస్టర్‌ పబ్లిసిటీ ద్వారానే ప్రేక్షకులను థియేటర్‌కు రప్పిస్తాడు. ‘అల్లరి’ మొదలు ‘నచ్చావులే’, ‘మనసారా’, ‘అవును’.. ఇలా తన ప్రతి సినిమాకు రవిబాబు క్రియేట్‌ చేసిన పోస్టర్లు సినిమా లవర్స్‌నే కాదు సాధారణ ప్రజలనూ ఆకట్టుకున్నాయి. అంతకు ముందు తరంలో వంశీ సినిమా పోస్టర్లు సైతం ఆయనదైన సిగ్నేచర్‌తో ఇట్టే జనాల్లోకి వెళ్లేవి. 

...తిని చూడు
న్యూవేవ్‌ పబ్లిసిటీ మెథడ్స్‌లో హోటల్‌ బిజినెస్‌ టాప్‌లో ఉంది. తమ ఫుడ్‌ సెంటర్లకు సమాపక, అసమాపక క్రియలనే నామాలుగా పెట్టి ఈ రకమైన ప్రచారానికి తాలింపేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్ట్రీట్‌ ఫుడ్‌ కల్చర్‌ ఊపందుకున్నాక.. అప్పటి వరకు ఉన్న టిఫిన్‌ సెంటర్లు కాస్తా ఫుడ్‌కోర్ట్, దోసా ఆన్‌ వీల్స్‌ ఎట్సెట్రాగా మారాయి. ఈ కొత్త ట్రెండ్‌ కొత్త పేర్లను తీసుకొచ్చింది. ఇంగ్లిష్‌ పేర్ల స్థానంలో  ‘రా.. తిని పో’,‘రా బావ తిని చూడు’, ‘భలేబావుంది’, ‘ఉప్పు కారం’, ‘దిబ్బరొట్టె’, ‘అద్భుతః’, ‘కోడికూర చిట్టిగారె’, ‘దా తిను’ వంటి పేర్లు వచ్చి చేరాయి. ఈ ఐడియా బాగా వర్కవుట్‌ అవడంతో కర్రీ పాయింట్లు, హోటళ్లు కూడా తమ సెంటర్లకు పునః నామకరణం చేసి ఈ కొత్త ఒరవడిలోకి ఎంటర్‌ అయ్యాయి. ‘సెకండ్‌ వైఫ్‌ రెస్టారెంట్‌’, ‘తిను బకాసుర’, ‘పొట్ట పెంచుదాం’, వంటి పేర్లతో, ‘మాయాబజార్‌’, ‘వివాహ భోజనంబు’ వంటి ఎవర్‌గ్రీన్‌ హిట్‌ సినిమాల పేర్లతోనూ  రెంస్టారెంట్లు తెరచుకున్నాయి. ఫుడీలకే  కాదు మీమర్లకూ ఫీడ్‌ అందించాయి. 

షాకింగ్‌? సర్‌ప్రైజ్‌?!
కాన్యే వెస్ట్‌.. అమెరికన్‌ సింగర్‌. అక్కడి యూత్‌కి ఫ్యాషన్‌ ఐకాన్‌. రెండేళ్ల కిందట అతను ఇచ్చిన ఓ సర్‌ప్రైజ్‌ను ప్రపంచం ఈనాటికీ మరిచిపోలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడుతున్నానని, అదీ ట్రంప్‌తో ఉన్న మంచి స్నేహాన్ని చెడగొట్టుకుని మరీ అంటూ ప్రకటించడంతో అంతా షాక్‌ తిన్నారు. తమ ఫేవరెట్‌ సెలబ్రిటీ అధ్యక్ష ఎన్నికల్లోనా? అంటూ ఆశ్చర్యానికిలోనైంది అక్కడి యువత. కట్‌ చేస్తే.. తన కొత్త ఆల్బమ్‌ కోసం అతను చేసిన పబ్లిసిటీ స్టంట్‌ అని తేలడంతో.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు కాన్యే వెస్ట్‌ను. 

అయ్యో వద్దమ్మా..
ఓ వర్షపు వేళ.. సిగ్నల్‌ పడి ట్రాఫిక్‌ ఆగిపోతుంది. ఒక కారు వెనుక సీట్‌ దగ్గరకు ఓ ట్రాన్స్‌ జెండర్‌ వచ్చి కారు అద్దాన్ని తడుతుంది మునివేళ్లతో. ఆ ట్రాన్స్‌జెండర్‌ డబ్బుల కోసం వచ్చిందేమో అనుకుని కార్లో ఉన్న పెద్దావిడ అద్దాలు దించి డబ్బులివ్వబోతుంది. ‘అయ్యో వద్దమ్మ టీ ఇవ్వడానికి  వచ్చాను’ అంటూ తన చేతిలో ఉన్న టీ గ్లాస్‌ను ఆమెకు అందిస్తుంది. టీ తీసుకుని నిండు మనసుతో ఆ ట్రాన్స్‌జెండర్‌ను ఆశీర్వదిస్తుంది ఆ పెద్దావిడ. పేరున్న ఓ టీ బ్రాండ్‌ యాడ్‌ ఇది. ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ యాడ్‌ చాలా పాపులర్‌ అయింది. ఈ యాడ్‌ పాపులారిటీని మన పోలీసులూ వాడుకున్నారు.. ‘అమ్మో వద్దమ్మా’ అంటూ ట్రాఫిక్‌ మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.. ఆ యాడ్‌ చూపిన ప్రభావం ఎంతటిదో! ఇలా సామాన్యులను ప్రభావితం చేసిన ఎన్నో ప్రకటనలు మీమ్స్‌గా.. రీల్స్‌గా నెట్టింట వెల్లువెత్తుతున్నాయి.

డాక్టర్లు..స్టాక్‌ మార్కెట్‌ ట్రేడర్లు..
వ్యాపార ప్రమోషన్లకే కాదు ఆఖరికి వెడ్డింగ్‌ కార్డుల్లోనూ వెరైటీకి పెద్ద పీట వేస్తున్నాయి క్రియేటివ్‌ మైండ్స్‌. ఇటీవలి కాలంలో తెలంగాణ యాసలో వెడ్డింగ్‌ కార్డ్స్‌ ప్రింట్‌ చేయడం ఫ్యాషన్‌గా మారింది. దీనికి అదనంగా డాక్టర్లయితే వారి టెర్మినాలజీలో, స్టాక్‌ మార్కెట్‌ ట్రేడర్లయితే ఐపీవో, పబ్లిక్‌ ఇష్యూ, ప్రమోటర్‌ వంటి పదాలు వాడుతూ శుభలేఖలకు కొత్త శోభను అద్దుతున్నారు. రియల్‌ లైఫ్‌ సరే.. రీల్‌ లైఫ్‌ పబ్లిసిటీకి సంబంధించి ఇక్కడొక సంగతి చెప్పుకోవాలి. ప్రకటనలతో తన ప్రోడక్ట్‌పై నమ్మకాన్ని.. ఆసక్తిని పెంచేలా చేయడంలో ఒకప్పుడు దేశంలోనే ఎవరూ చేయని సాహసం చేశాడు.

కన్నడ దర్శక హీరో ఉపేంద్ర. కథకు.. సినిమాలో పాత్రలకు ఏ సంబంధం లేకుండా సినిమాకు టైటిల్‌ పెట్టే కొత్త ట్రెండ్‌ను క్రియేట్‌ చేశాడు. ‘ష్‌’, ‘ఓం, ‘ఏ’  వంటి ఒకే అక్షరంతో కూడిన టైటిల్స్‌ కన్నడనాటే కాకుండా తెలుగులో కూడా సెన్సేషన్‌ అయ్యాయి. సినిమా టైటిల్స్‌ వేయడంలో దివంగత దర్శకుడు ఈవీవీది సపరేట్‌  స్టయిల్‌. ముఖ్యంగా టెక్నీషియన్స్‌ టైటిల్‌ కార్డ్స్‌ విషయంలో ఆయన పద్ధతే వేరప్పా! ఎడిటర్‌కి కత్తెరేసినోడు అని, కొరియోగ్రఫీకి చిందులేయించింది అని, సంగీతానికి  వాయించింది అని.. వాడుక పదాలను వాడేవాడు. దీన్నీ సినిమా ప్రమోషన్‌లో న్యూ వేగా భావించవచ్చు. 

ఇలా చెప్పకుంటూ పోతే కిరాణా కొట్టు నుంచి కాస్మిక్‌ ఎనర్జీ దాకా.. ఆయా రంగాలకు చెందిన ప్రోడక్ట్స్‌ ప్రమోషన్స్‌ అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పోటీ పడుతున్నాయి క్రియేటివిటీలో. ఆ సృజన కొనుగోళ్లను పెంచుతుందో లేదో తెలియదు కానీ కొనుగోలుదారుల మనసును మాత్రం గెలుచుకుంటోంది. అందుకే మార్కెట్‌లో గూడ్స్‌ కన్నా సృజనాత్మకమైన ఐడియాలకు మాత్రం పోటీ పెరిగింది. ఆ తిక్క ఉన్నవాళ్లదే గెలుపు మరి! 
∙టి. కృష్ణ గోవింద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement