మహమ్మారి వైరస్‌కు విరుగుడు | Coronavirus Vaccine Based Cover Story In Sakshi Funday | Sakshi
Sakshi News home page

మహమ్మారి వైరస్‌కు విరుగుడు

Published Sun, Apr 26 2020 10:08 AM | Last Updated on Sun, Apr 26 2020 1:11 PM

Coronavirus Vaccine Based Cover Story In Sakshi Funday

ఆధునిక వైద్యశాస్త్రం పురోగతి సాధించిన ప్రస్తుత కాలంలో ఎలాంటి వైరస్‌కు అయినా విరుగుడు దానిని అరికట్టగల వ్యాక్సిన్‌ మాత్రమే. ఎలాంటి వ్యాక్సిన్‌లు లేని కాలంలో సైతం రకరకాల వైరస్‌లు మనుషులను సోకి మహమ్మారి రోగాలను వ్యాప్తి చేసేవి. మహమ్మారి రోగాలు వ్యాపించిన కాలాల్లో పెద్దసంఖ్యలోనే మరణాలు సంభవించేవి. అలాగని మానవాళి పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. మనుషుల్లోని రోగనిరోధకత సహజంగానే ఉంటుంది. ఒకసారి ఏదైనా మహమ్మారి వ్యాధి సోకి, దాని నుంచి కోలుకున్న వాళ్లు తిరిగి అది విజృంభించినప్పుడు దానిని సమర్థంగా ఎదుర్కొనే శక్తిని సహజంగానే సంతరించుకుని ఉంటారు. అయితే, సహజ రోగనిరోధక శక్తి తగినంతగా లేనివాళ్లు మాత్రం మహమ్మారి రోగాల తాకిడికి ప్రాణాలను కోల్పోతూ ఉంటారు.

ఆధునిక వైద్యరంగం ఎన్నో రకాల మహమ్మారి వ్యాధులకు విరుగుడుగా వ్యాక్సిన్లను తయారు చేయగలిగింది. చాలావరకు రోగాలను సమర్థంగా కట్టడి చేయగలిగింది. ఇటీవల ప్రపంచాన్ని వణికిస్తున్న నావెల్‌ కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు సైతం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ఎందరో శాస్త్రవేత్తలు పలు వ్యాక్సిన్లను ఇప్పటికే రూపొందించారు. వీటిలో కొన్నిటిని ఇప్పటికే మనుషులపై ప్రయోగించడం కూడా ప్రారంభించారు. మరికొన్ని వ్యాక్సిన్లు మాత్రం ఇంకా మనుషులపై ప్రయోగాలు జరిపే దశకు చేరుకోలేదు. ‘వరల్డ్‌ ఇమ్యూనైజేషన్‌ వీక్‌’ (ఏప్రిల్‌ 24–30) సందర్భంగా ‘కరోనా’ను అరికట్టే లక్ష్యంతో తయారవుతున్న వ్యాక్సిన్ల గురించి, అసలు వ్యాక్సిన్లే లేని కాలంలో ఇమ్యూనైజేషన్‌పై జరిగిన ప్రయోగాల గురించి సంక్షిప్తంగా మీ కోసం..

ఇమ్యూనైజేషన్‌
ఇమ్యూనైజేషన్‌కు ముందు కాలంలో ‘ఇనాక్యులేషన్‌’ ద్వారా రోగ నిరోధకతను పెంపొందించే ప్రయత్నాలు చేసేవారు. ‘ఇనాక్యులేషన్‌’ అంటే, కృత్రిమ పద్ధతిలో వ్యాధి సోకేలా చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించేలా చేయడమన్న మాట. మశూచి వ్యాధి విజృంభించినప్పుడు క్రీస్తుశకం పదిహేనో శతాబ్దిలో కొందరు ఇలాంటి ప్రయత్నమే చేశారు. మశూచి రోగుల శరీరంపై ఏర్పడిన పొక్కుల నుంచి కారిన రసిని ఎండబెట్టి పొడి చేసి, ఆ పొడిని ఆరోగ్యవంతుల ముక్కుల్లోకి వెళ్లేలా ఊదేవారు. దీనివల్ల ఆరోగ్యవంతుల్లో మశూచి లక్షణాలు స్వల్పస్థాయిలో ఏర్పడి, కొంతకాలానికి తగ్గిపోయేవి. ఈ ప్రక్రియలో వారి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేది. తర్వాతి కాలంలో మశూచి వ్యాపించినా, వారిని పెద్దగా ఇబ్బందిపెట్టేది కాదు. ఇలా మశూచిని కృత్రిమంగా సోకేలా చేయడం వల్ల జనాల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించే ప్రక్రియను గురించి పదహారో శతాబ్దికి చెందిన చైనా శాస్త్రవేత్త వాన్‌ ఖువాన్‌ తన ‘డౌజెన్‌ జిన్ఫా’ గ్రంథంలో విపులంగా వివరించాడు.

ఆధునిక ఇమ్యూనైజేషన్‌ ప్రక్రియతో పోల్చుకుంటే, ఈ ఇనాక్యులేషన్‌ ప్రక్రియ కొంత ముతక పద్ధతేనని చెప్పుకోవచ్చు. అయితే, మశూచి సోకిన వారిలో మరణాల రేటు దాదాపు 20–30 శాతం వరకు ఉంటే, ఇనాక్యులేషన్‌ ప్రక్రియ ద్వారా రోగనిరోధక శక్తి పెంపొందించుకున్న వారిలో మరణాల రేటు కేవలం 0.5 నుంచి 2.0 శాతం వరకు మాత్రమే ఉండేది. చైనాలో దాదాపు వందేళ్ల పాటు ఇనాక్యులేషన్‌ పద్ధతితోనే అంటువ్యాధులపై పోరాటం సాగించారు. అక్కడి నుంచి ఈ పద్ధతి ఈస్టిండియా కంపెనీ ఉద్యోగుల ద్వారా పద్దెనిమిదో శతాబ్ది నాటికి ఇంగ్లాండ్‌కు పాకింది. ఇంగ్లాండ్‌కు చెందిన వైద్యుడు ఎడ్వర్డ్‌ జెన్నర్‌ 1798లో మశూచికి వ్యాక్సిన్‌ను రూపొందించాడు. ప్రపంచంలో ఇదే తొలి వ్యాక్సిన్‌. ఈ వ్యాక్సిన్‌ రూపకల్పన తర్వాత ఇనాక్యులేషన్‌ ప్రక్రియ కనుమరుగైంది. 

ఇమ్యూనైజేషన్‌ రకాలు...
ఇమ్యూనైజేషన్‌ రెండు రకాలు. ఒకటి: యాక్టివ్‌ ఇమ్యూనైజేషన్, రెండు: పాసివ్‌ ఇమ్యూనైజేషన్‌. మనిషి శరీరంలోకి వ్యాధికారక సూక్ష్మజీవిని పంపడం ద్వారా యాక్టివ్‌ ఇమ్యూనైజేషన్‌ జరుగుతుంది. వ్యాధికారక సూక్ష్మజీవి శరీరంలోకి చేరగానే, శరీరంలోని యాంటీబాడీస్‌ సూక్ష్మజీవికి వ్యతిరేకంగా వెనువెంటనే పోరాటం ప్రారంభిస్తాయి. బాల్యంలో ఒకసారి సోకిన ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడిన తర్వాత తిరిగి ఆ ఇన్ఫెక్షన్లు దాదాపు సోకవు. ఒకవేళ సోకినా, వాటి తీవ్రత నామమాత్రంగా ఉంటుంది. ఆధునిక వ్యాక్సిన్ల ద్వారా కృత్రిమంగా యాక్టివ్‌ ఇమ్యూనైజేషన్‌ చేస్తారు. ఈ ప్రక్రియలో వ్యాధికారక సూక్ష్మజీవులను పూర్తిగా గాని, వాటిలోని కొన్ని భాగాలను గాని శరీరంలోకి ఇంజెక్ట్‌ చేస్తారు. సూక్ష్మజీవిని పూర్తిగా ఇంజెక్ట్‌ చేయాల్సి వస్తే, దానిని ముందుగానే నిర్వీర్యం చేస్తారు. మశూచి, గవదబిళ్లలు, రుబెల్లా, ఎఎంఆర్, యెల్లో ఫీవర్, ఆటలమ్మ, రోటావైరస్, ఇన్‌ఫ్లూయెంజా వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు రూపొందించిన వ్యాక్సిన్లు యాక్టివ్‌ ఇమ్యూనైజేషన్‌ పద్ధతిలో రూపొందించినవే. 

పాసివ్‌ ఇమ్యూనైజేషన్‌లో సూక్ష్మజీవులను లేదా వాటి భాగాలను శరీరంలోకి ఎక్కించరు. దానికి బదులు శరీరంలోని రోగనిరోధక కణాలలోని అంశాలను సంశ్లేషణ చేసి, వాటిని శరీరంలోకి ఎక్కిస్తారు. ఇలా ఎక్కించిన రోగ నిరోధక కణాలు శరీరంలోకి రోగ కారక సూక్ష్మజీవులు చేరినప్పుడు శరవేగంగా స్పందించి, వాటితో పోరాడతాయి. అయితే, పాసివ్‌ ఇమ్యూనైజేషన్‌ ఫలితాలు స్వల్పకాలికంగా మాత్రమే ఉంటాయి. టిటానస్‌ వంటి వ్యాధులను పాసివ్‌ ఇమ్యూనైజేషన్‌ పద్ధతిలో కట్టడి చేస్తారు.

ఏ విరుగుడుకు ఎన్నాళ్లు పట్టిందంటే..?
చరిత్రలో రకరకాల వైరస్‌లు విజృంభించి, మహమ్మారి రోగాలకు దారితీశాయి. తొలినాళ్లలో విజృంభించిన వైరస్‌లకు విరుగుడు ఔషధాలు అందుబాటులోకి రావడానికి శతాబ్దాలకు శతాబ్దాలే పట్టింది. ఆధునిక కాలంలో ఉనికిలోకి వచ్చిన వైరస్‌లకు విరుగుడు మందులు కొంత త్వరగానే అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో వైరస్‌కు, దాని విరుగుడు కనుగొనడానికి పట్టిన కాలం శతాబ్దాల నుంచి కొన్ని నెలల వ్యవధిలోకే కుదించుకుపోయిందిప్పుడు. కొన్ని వైరస్‌లు కలిగించిన వ్యాధులు, వాటి విరుగుడు కనుగొనడానికి పట్టిన కాలం ఈ పట్టికలో...

రోగనిరోధకతే రక్షణ కవచం
మన చుట్టూ ఎన్నో రోగకారక సూక్ష్మజీవులు ఉంటాయి. అయితే, జనాభాలో తొంభై శాతం మందిలో వాటి ప్రభావం కనిపించదు. కేవలం పట్టుమని పదిశాతం మందిలోనే రోగ లక్షణాలు కనిపిస్తాయి. మన చుట్టూ రోగకారక సూక్ష్మజీవులు ఉన్నా, వాటి ప్రభావం కనిపించకుండా చేసే రక్షణ వ్యవస్థ మనలోనే ఉంటుంది. అదే మన రోగనిరోధక వ్యవస్థ– ఇమ్యూనిటీ. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి: ఇన్నేట్‌ ఇమ్యూనిటీ, రెండు: అక్వైర్డ్‌ ఇమ్యూనిటీ. 

ఇన్నేట్‌ ఇమ్యూనిటీ
రోగకారక సూక్ష్మజీవుల నుంచి తొలి అంచె రక్షణ మన చర్మమే కల్పిస్తుంది. ఏదైనా కారణం వల్ల చర్మం తెగడం లేదా కాలడం జరిగితే, అక్కడ ఆ రక్షణ వ్యవస్థ పనిచేయదు. అప్పుడు ఆ రక్షణ బాధ్యతను రక్తంలో ఉండే కొన్ని ప్రొటీన్లు తీసుకుంటాయి. పట్టుబడిన శత్రువును కమాండర్‌ వద్దకు తీసుకుపోయినట్లుగా శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులను చుట్టుముట్టి కణలలోకి తీసుకువెళతాయి. అక్కడి యాంటీబాడీస్, న్యూట్రోఫిల్స్, మ్యాక్రోఫిల్స్, డెండ్రైటిక్‌ సెల్స్‌ వంటివన్నీ మరో అంచెలోని వేర్వేరు స్థాయిల్లో శత్రువుపై దాడి చేసినట్లుగా, సూక్ష్మజీవుల ప్రభావాన్ని అక్కడికక్కడే కట్టడి చేస్తాయి. అక్కడ అవన్నీ చీములా మారి హానికరమైన పదార్థాన్ని బయటకు నెట్టేసి, శరీరానికి రక్షణ కల్పిస్తాయి. రకరకాల బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్‌ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ మనకు ఇదే రీతిలో రక్షణ కల్పిస్తుంది.

అక్వైర్డ్‌ ఇమ్యూనిటీ
మన శరీరంలోకి వ్యాక్సిన్‌ రూపంలో నిర్వీర్యం చేసిన ఏదైనా వైరస్‌ను ప్రవేశపెట్టినట్లయితే, అప్పుడు మన శరీరంలోని కొన్ని కణాలు ఆ వైరస్‌ను గుర్తుంచుకుంటాయి. ఇలా గుర్తుపెట్టుకునే కణాలనే మెమొరీ సెల్స్‌ అంటారు. భవిష్యత్తులో మన శరీరంలోకి ఆ వైరస్‌ ప్రవేశిస్తే, పెద్దసంఖ్యలో రోగ నిరోధక కణాలను అభివృద్ధి చేసి ఆ వైరస్‌ను నిర్వీర్యం చేసేలా చేస్తాయి. శరీరంలో మరో రెండు రకాల రక్షణ వ్యవస్థలు కూడా పనిచేస్తాయి. వాటిలో మొదటిది సెల్‌ మీడియేటెడ్‌ ఇమ్యూనిటీ, రెండోది హ్యూమెరల్‌ ఇమ్యూనిటీ. శరీరంలోకి ఏదైనా రోగకారక సూక్ష్మజీవి ప్రవేశిస్తే, టి.–లింఫోసైట్స్‌ అనే కణాలు ఆ సూక్ష్మజీవిని చుట్టుముట్టి, దాన్ని మింగేసి, మన శరీరాన్ని దాని నుంచి రక్షిస్తాయి.

టీబీ, లెప్రసీ వంటి వ్యాధులకు కారణమైన సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఇలాంటి తరహా రక్షణే దొరుకుతుంది. దీనినే సెల్‌ మీడియేటెడ్‌ ఇమ్యూనిటీ అంటారు. ఇక హ్యూమరల్‌ ఇమ్యూనిటీ యాంటీబాడీస్‌పై ఆధారపడి ఉంటుంది. దీనికి బి–లింఫోసైట్స్‌ అనే కణాలు దోహదపడతాయి. అయితే, ఇవి రోగకారక సూక్ష్మజీవిపై నేరుగా దాడి చేయవు. రోగకారక సూక్ష్మజీవిని ఎదుర్కొనే యాంటీబాడీస్‌ను అసంఖ్యాకంగా సృష్టించి, దాని బారి నుంచి మనల్ని రక్షిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థలో కీలకంగా పనిచేసే టి.లింఫోసైట్స్, బి.–లింఫోసైట్స్‌ ఎముక మూలుగ నుంచి కాలేయం నుంచి అభివృద్ధి చెందుతాయి.

‘కరోనా’ వ్యాప్తి మరింత ఎక్కువే!
‘కరోనా’ వ్యాప్తికి సంబంధించి ఇప్పటి వరకు వెల్లడైన అధికారిక లెక్కల కంటే నిజానికి దీని బారిన పడిన వారి సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుందని ఒక తాజా అధ్యయనంలో తేలింది. శరీరంలో సమర్థమైన యాంటీబాడీస్‌ ఉన్నవారు ఈ వైరస్‌ బారిన పడినా, వ్యాధి లక్షణాలేవీ లేకుండానే బయటపడగలిగినట్లు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నిపుణులు ఇటీవల చేపట్టిన అధ్యయనంలో తేలింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన శాంటా క్లారా కౌంటీలో 3300 మంది నుంచి సేకరించిన రక్తనమూనాలపై జరిపిన పరీక్షల్లో దిగ్భ్రాంతికరమైన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. వీరిలో 2.5 నుంచి 4 శాతం మంది ‘కోవిడ్‌–19’ నుంచి కోలుకున్నట్లు ఈ పరీక్షల్లో వెల్లడైంది. వీరెవరూ ‘కోవిడ్‌–19’ కారణంగా ఆస్పత్రుల్లో చేరకపోవడం విశేషం. ఎందుకంటే, వీరిలో ఎలాంటి వ్యాధి లక్షణాలూ బయటపడలేదు. అయితే, రక్త పరీక్షల్లో మాత్రం వీరిలో కరోనా వైరస్‌ను ఎదుర్కొని తిప్పికొట్టిన యాంటీబాడీస్‌ బయటపడ్డాయి. శాంటా క్లారా కౌంటీ జనాభా దాదాపు 20 లక్షలు.

ఈ ప్రాంతంలో అధికారికంగా దాదాపు వెయ్యికి పైగా మాత్రమే కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి.  కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీస్‌ ఎవరిలోనూ లేనట్లయితే, ఈ ప్రాంతంలో కరోనా పాజిటివ్‌ కేసులు దాదాపు 48 వేల నుంచి 81 వేల వరకు నమోదై ఉండేవని స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన అధికారికంగా వెల్లడించిన లెక్కల కంటే దాదాపు 50 నుంచి 80 రెట్ల మందికి కరోనా వైరస్‌ ఇప్పటికే సోకి ఉంటుందని, సమర్థమైన యాంటీబాడీస్‌ ఉన్నవారు ఎలాంటి లక్షణాలూ లేకుండానే దాని నుంచి బయటపడి ఉంటారని వారు చెబుతున్నారు. అయితే, యాంటీబాడీస్‌ ఉన్నవారికి ఈ వైరస్‌ మరోసారి సోకదని చెప్పలేమని, మరోసారి సోకినప్పుడు వ్యాధి లక్షణాలు కలిగించకుండా ఉండదని కూడా చెప్పలేమని డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జింగ్‌ డిసీజెస్‌ యూనిట్‌ అధినేత డాక్టర్‌ మారియా వాన్‌ కెర్ఖోవె చెబుతున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంపై మరింత క్షుణ్ణంగా అధ్యయనం జరగాల్సి ఉందని, దీనికి సమర్థమైన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేంత వరకు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటమే మంచిదని అంటున్నారు.

‘కరోనా’ వ్యాక్సిన్లు ఎంతవరకు వచ్చాయంటే?
‘కరోనా’ కలకలం గత ఏడాది చివర్లో చైనాలో మొదలై, అనతికాలంలోనే ప్రపంచ దేశాలకు శరవేగంగా పాకిన దరిమిలా, దీని కట్టడి కోసం వ్యాక్సిన్‌ తయారీ ప్రయత్నాలు ముమ్మరంగా మొదలయ్యాయి. దీనిని శాస్త్రవేత్తలు ‘సార్స్‌’ కరోనా వైరస్‌–2 అని గుర్తించారు. దీనికే ‘నావెల్‌ కరోనా వైరస్‌’ అని నామకరణం చేశారు. దీనివల్ల కలిగే వ్యాధికి ‘కరోనా వైరస్‌ డిసీజ్‌–19’– సంక్షిప్తంగా ‘కోవిడ్‌–19’గా పేరుపెట్టారు. వివిధ దేశాల్లోని శాస్త్రవేత్తలు నావెల్‌ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో తలమునకలుగా ఉన్నారు. ఇప్పటి వరకు దీనికోసం రూపొందించిన వ్యాక్సిన్లలో రెండు వ్యాక్సిన్లు మనుషులపై ప్రయోగించే దశకు చేరుకున్నాయి. ఇవి కాకుండా, దాదాపు మరో అరవై వ్యాక్సిన్లు ప్రీక్లినికల్‌ దశలో ఉన్నాయి. ‘కోవిడ్‌–19’ వ్యాధి కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్లలో రెండు ఇప్పటికే మనుషులపై ప్రయోగించే దశకు చేరుకున్నాయని, మనుషులపై వీటి ప్రయోగాలు జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఏప్రిల్‌ 4న ఒక ముసాయిదా ప్రకటనలో వెల్లడించింది.

వీటిలో ఒకదానిని చైనాకు చెందిన కాన్‌సైనో బయోలాజికల్‌ ఇన్‌కార్పొరేషన్‌ సంస్థ బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయో టెక్నాలజీ సహకారంతో రూపొందించింది. దీనిని ఇప్పటి వరకు 18–60 ఏళ్ల మధ్య వయసు గల 60 మంది స్త్రీ పురుషులపై ప్రయోగించి, ఫలితాలను విశ్లేషిస్తున్నారు. ఇక రెండో వ్యాక్సిన్‌ను అమెరికాకు చెందిన మోడర్నా ఫార్మ సంస్థ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలెర్జీ అండ్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌తో కలసి రూపొందించింది. ఇది ‘మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ’ వ్యాక్సిన్‌. దీనిని ఇంతవరకు 18–55 ఏళ్ల మధ్య వయసు గల 45 మందిపై ప్రయోగించారు. చైనా రూపొందించిన వ్యాక్సిన్‌ను షెన్‌జెన్‌ జీనో–ఇమ్యూన్‌ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్, అమెరికా రూపొందించిన వ్యాక్సిన్‌ను ఇనోవియో ఫార్మాసూటికల్‌ సాధ్యమైనంత త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి.  

భారత్‌లోనూ వ్యాక్సిన్‌ ప్రయత్నాలు
కరోనా వైరస్‌ కట్టడికి భారత శాస్త్రవేత్తలు కూడా వ్యాక్సిన్‌ రూపకల్పన చేశారు. గుజరాత్‌కు చెందిన జైడస్‌ కాడిలా సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఇప్పటికే కరోనా వైరస్‌ కట్టడికి వ్యాక్సిన్‌ను రూపొందించారు. ఇది ‘డీఎన్‌ఏ ప్లాస్మిడ్‌’ వ్యాక్సిన్‌. ఈ వ్యాక్సిన్‌ ఇంకా ప్రీక్లినకల్‌ పరీక్షల దశలోనే ఉంది. డీఎన్‌ఏ వ్యాక్సిన్లను రోగకారక క్రిమి నుంచి సేకరించిన జన్యువులతో రూపొందిస్తారు.

దీనిని మనిషి శరీరంలోకి ఎక్కించాక, ఇది వైరస్‌లోని ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుంది. మనిషిలోని రోగ నిరోధక కణాలు ఈ వైరల్‌ ప్రొటీన్లను శత్రువుగా గుర్తించి, వెనువెంటనే ఎదుర్కొని వాటిని మట్టుబెడతాయి. భారత్‌కు చెందిన మరో ఐదు కంపెనీలు కరోనా వైరస్‌ నిరోధానికి వ్యాక్సిన్‌ను రూపొందించాయి. ఇవి కూడా ఇంకా ప్రీక్లినికల్‌ పరీక్షల దశలోనే ఉన్నాయి. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్, బయోలాజికల్‌ ఇ, భారత్‌ బయోటెక్, ఇండియన్‌ ఇమ్యూనోలాజికల్స్, మైన్‌వ్యాక్స్‌ కంపెనీలు సైతం కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను రూపొందించాయి. – పన్యాల జగన్నాథదాసు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement