ఖతర్నాక్‌ కరోనా | Coronavirus Special Cover Story In Sakshi Funday | Sakshi
Sakshi News home page

ఖతర్నాక్‌ కరోనా

Published Sun, Apr 12 2020 7:42 AM | Last Updated on Sun, Apr 12 2020 7:23 PM

Coronavirus Special Cover Story In Sakshi Funday

‘కరోనా’ వైరస్‌ పేరు చెబితినే యావత్‌ ప్రపంచం వణికిపోతోంది. గత ఏడాది చివర్లో చైనాలో మొదలైన ఈ వైరస్‌ శరవేగంగా కార్చిచ్చులా ప్రపంచమంతటికీ వ్యాపించింది. కీలకమైన వ్యవస్థలన్నింటినీ స్తంభించిపోయేలా చేసింది. జనాలను దాదాపు ఇళ్లకు పరిమితం చేసింది. చైనాలో ఈ వైరస్‌ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో తేలిగ్గా తీసుకున్న దేశాలే ఇప్పుడు భయంతో గజగజలాడుతున్నాయి. ‘కరోనా’ వైరస్‌ పరిణామంపై శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలను కొందరు ఏమాత్రం పట్టించుకోకుండా దీనిపై రకరకాల వితండ వాదనలను, కుట్ర సిద్ధాంతాలను ప్రచారంలోకి తెస్తున్నారు. ‘కరోనా’ వైరస్‌ విజృంభణ మొదలైన తర్వాత ప్రపంచం రూపురేఖలే మారిపోయాయి. ప్రకృతిలోనూ చాలా మార్పులు వచ్చాయి. ‘కరోనా’ వైరస్‌ గురించి, దీని కారణంగా ఏర్పడిన పరిణామాల గురించి కొన్ని విశేషాలు...

కరోనా వైరస్‌ గురించి శాస్త్రవేత్తలు చెబుతున్నదేమిటంటే.. ఈ వైరస్‌ కొత్తదేమీ కాదు. ఇది సహజంగానే పరిణామం చెంది మరింత బలం పుంజుకుంది. తొలిసారిగా 2003 సంవత్సరంలో చైనాలో సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (సార్స్‌) వ్యాప్తికి దారితీసినది కూడా ఒక రకమైన ‘కరోనా’ వైరస్సే. తొమ్మిదేళ్ల విరామం తర్వాత– 2012లో మరో రకమైన ‘కరోనా’ వైరస్‌ విజృంభణ సౌదీ అరేబియాలో కనిపించింది. ఇది మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌’ (మెర్స్‌) వ్యాప్తికి దారితీసింది. ‘సార్స్‌’, ‘మెర్స్‌’ వ్యాధులకు దారితీసిన కరోనా వైరస్‌లు ప్రపంచమంతటికీ విస్తరించకుండా, అక్కడికక్కడే సద్దుమణిగిపోయాయి. చైనాలో తిరిగి ఉనికిలోకి వచ్చిన ‘కరోనా’ వైరస్‌ మాత్రం అలాంటిలాంటిది కాదు. ఇది జగమొండి రకం. కొత్త తరహా కరోనా వైరస్‌ తమ దేశంలో విజృంభిస్తోందంటూ చైనా వైద్యులు 2019 డిసెంబర్‌ 31న ప్రపంచ ఆరోగ్య సంస్థను (డబ్ల్యూహెచ్‌వో) అప్రమత్తం చేశారు. ఈ కొత్త కరోనా వైరస్‌కు వారు ‘సార్స్‌–కరోనా వైరస్‌ 2’గా, దీని ద్వారా వ్యాప్తి చెందే వ్యాధికి ‘కోవిడ్‌–19’గా నామకరణం చేశారు.

శరవేగంగా ఇది దేశాలను దాటి ప్రయాణించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20 నాటికి ఈ వైరస్‌ ఏకంగా 1,67,500 మందికి సోకింది. ‘సార్స్‌’, ‘మెర్స్‌’ వ్యాధులకు కారణమైన కరోనా వైరస్‌లను, తాజాగా ‘కోవిడ్‌–19’కు కారణమైన ‘సార్స్‌–కరోనా వైరస్‌ 2’ జన్యు క్రమాన్ని పరిశీలిస్తే, ఇది సహజంగానే పరిణామం చెందినట్లు స్పష్టమవుతోందని అమెరికాలోని టులేన్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త రాబర్ట్‌ ఎఫ్‌ గ్యారీ, కొలంబియా వర్సిటీకి చెందిన శాస్త్రవేత్త డబ్ల్యూ. అయాన్‌ లిప్కిన్, ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ఎడ్వర్డ్‌ హోమ్స్, బ్రిటన్‌లోని ఎడిన్‌బర్గ్‌ యూనివర్సిటీకి చెందిన ఆండ్రూ రాంబాట్‌ తదితరులు చెబుతున్నారు. ఈ శాస్త్రవేత్తలు ‘కోవిడ్‌–19’ మహమ్మారి వ్యాప్తికి దారితీసిన తాజా కరోనా వైరస్‌ జన్యు పరిణామంపై సుదీర్ఘమైన పరిశోధనలు సాగించారు. ఇదివరకటి ‘కరోనా’ వైరస్‌లతో పోల్చుకుంటే, ‘సార్స్‌–కరోనా వైరస్‌ 2’లో జీవకణాలలోకి చొరబడగల రిసెప్టర్‌ బైండింగ్‌ డోమైన్‌ (ఆర్‌బీడీ) మరింత శక్తిమంతంగా పరిణామం చెందినట్లు వీరు చెబుతున్నారు. అందుకే, ‘కోవిడ్‌–19’, ఇదివరకటి ‘సార్స్‌’, ‘మెర్స్‌’లను మించిన మహమ్మారిగా మారిందని వివరిస్తున్నారు.

కొన్ని కుట్ర సిద్ధాంతాలు
‘కోవిడ్‌–19’ మహమ్మారికి కారణమైన కరోనా వైరస్‌ సహజ పరిణామం చెందినదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నా, కొందరు అతితెలివిపరులు మాత్రం కుట్ర సిద్ధాంతాలకు తెరతీస్తున్నారు. ప్రపంచంపై జీవ యుద్ధానికి చైనా పెద్దసంఖ్యలో మరణాలకు దారితీసే వైరస్‌ను సృష్టించిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. జీవ యుద్ధం కోసం చైనా తన ల్యాబొరేటరీలో సృష్టించిన వైరస్, ప్రమాదవశాత్తు అక్కడే లీకై గాల్లో కలిసి, అక్కడికక్కడే ఉత్పతాన్ని సృష్టించడమే కాకుండా, యావత్‌ ప్రపంచానికీ పెనుముప్పుగా మారిందనే ఊహాగానాలను ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యవహారం కేవలం ప్రచారాలకే పరిమితం కాలేదు. అమెరికన్‌ సెనేటర్‌ టామ్‌ కాటన్‌ సహా కొందరు ప్రముఖులు ఈ విషయమై చైనాకు వ్యతిరేకంగా కోర్టుకెక్కారు.

ప్రమాదకరమైన కరోనా వైరస్‌ను విడిచిపెట్టినందుకు చైనా 20 లక్షల కోట్ల డాలర్ల (రూ.1528 లక్షల కోట్లు) పరిహారం చెల్లించాలంటూ వారు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. చైనా నుంచి పరిహారంగా కోరుతున్న ఈ మొత్తం చైనా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) కంటే కూడా చాలా ఎక్కువ. కరోనా వైరస్‌ సహజసిద్ధంగా పరిణామం చెందినదేమీ కాదని, చైనా శాస్త్రవేత్తలు దానిని ఉద్దేశపూర్వకంగా ల్యాబొరేటరీలో సృష్టించారని బలంగా నమ్ముతున్న వాళ్లలో అమెరికన్‌ గూఢచర్య సంస్థ ‘సీఐఏ’ మాజీ మిలటరీ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ ఫిలిప్‌ గిరాల్డీ వంటి వారు కూడా ఉండటం గమనార్హం. గిరాల్డీ ఇదే వాదనతో రాసి పడేసిన సుదీర్ఘ వ్యాసాన్ని ‘ది స్ట్రాటెజిక్‌ కల్చర్‌ ఫౌండేషన్‌’ గత నెల సంచికలో ప్రచురించింది. 

‘కరోనా’ నివారణకు ఏం చేయాలంటే..?
ఇప్పటి వరకు ‘కరోనా’ నివారణకు వ్యాక్సిన్‌ ఏదీ సామాన్యులకు అందుబాటులోకి రాలేదు. అలాగే కరోనా వైరస్‌ సోకిన తర్వాత కచ్చితంగా నయం చేయగల ఔషధాలు కూడా లేవు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా వైద్యులందరూ రోగ లక్షణాల ఆధారంగానే చికిత్స చేస్తూ వస్తున్నారు. అక్కడక్కడా వివిధ దేశాల్లో శాస్త్రవేత్తలు రూపొందించిన వ్యాక్సిన్లపై ఇంకా ప్రయోగాలు, పరీక్షలు జరుగుతున్నాయి. ఈలోగా ‘కరోనా’ వ్యాప్తిని నిరోధించడానికి మనం చేయగలిగిన ముఖ్యమైన పనులేమిటంటే...

ఇదిలా ఉంటే...
కరోనా వైరస్‌ గురించి అమెరికా చైనాపై ఆరోపణలు గుప్పిస్తున్నా, నిజానికి అది అమెరికా సృష్టేనని కూడా కొందరు అమెరికా వ్యతిరేకులు మరో కుట్ర సిద్ధాంతాన్ని వినిపిస్తున్నారు.అమెరికన్‌ గూఢచర్య సంస్థ సీఐఏ బయోవెపన్‌ ల్యాబ్‌లో దీనిని తయారు చేశారని వారు ప్రచారం సాగిస్తున్నారు. సీఐఏ అధీనంలోని ఫోర్ట్‌ డెట్రిక్‌ ల్యాబ్‌లో దీనిని తయారు చేశారని చెబుతూ, ఈ వాదనకు బలం చేకూర్చే కొన్ని సంఘటనలను కూడా వారు ఉదహరిస్తున్నారు.

వారు చెబుతున్నదేమిటంటే...
ఫోర్ట్‌ డెట్రిక్‌లోని మెడికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫెక్షస్‌ డిసీజెస్‌ లాబొరేటరీని గత ఏడాది జూలైలో సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) మూసివేయించింది. వైరస్‌ రహస్య సృష్టి వ్యవహారం బయటకు పొక్కకూడదనే ఫోర్ట్‌ డెట్రిక్‌ ల్యాబ్‌ను సీడీసీ మూసివేయింది. గత ఏడాది ఆగస్టులో చాలామంది అమెరికన్లు ‘ఇన్‌ఫ్లూయెంజా’ బారిన పడ్డారు. వారిలో దాదాపు పదివేల మంది మరణించారు. సీడీసీ ఈ మరణాలకు అసలు కారణాలను వెల్లడించకుండా, నెపాన్ని ఈ–సిగరెట్లపైకి నెట్టేసింది.

ఫోర్ట్‌ డెట్రిక్‌ ల్యాబ్‌ను మూసివేసిన కొద్ది నెలల్లోనే అమెరికాలోని 22 రాష్ట్రాల్లోని జనాలు తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ బారిన పడ్డారు. అమెరికాలో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ వ్యాపిస్తున్న కాలంలోనే గత ఏడాది సెప్టెంబరులో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలెర్జీ అండ్‌ ఇన్ఫెక్షస్‌ డిసీజెస్‌ కరోనా వైరస్‌ నివారణకు వ్యాక్సిన్‌ తయారీ కాంట్రాక్టును ‘గ్రెఫెక్స్‌’ కంపెనీకి అప్పగించింది. టెక్సాస్‌కు చెందిన ఈ కంపెనీకి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తయారీ కాంట్రాక్టు దక్కిన విషయం చాలా ఆలస్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి 20న ‘న్యూయార్క్‌ పోస్ట్‌’లో వెలుగులోకి వచ్చింది. కాబట్టి, ఇదంతా అమెరికా ఘనకార్యమేనని అమెరికా వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు.

ప్రకృతికి మేలు...
కరోనా వైరస్‌ కారణంగా మనుషులకు కష్టంగానే ఉంటోంది. దీని వల్ల సంభవిస్తున్న అకాల మరణాలు తీవ్ర భయోత్పాతాలకు దారితీస్తున్నాయి. ఇది నాణేనికి ఒకవైపు. మరోవైపు గమనిస్తే, దీని వల్ల ప్రకృతికి మేలు జరుగుతోంది. ప్రకృతి తనను తాను మరమ్మతు చేసుకునేందుకే మహమ్మారి రూపంలో విరుచుకుపడిందని భావిస్తున్నవారూ లేకపోలేదు. ‘కరోనా’ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాహనాల వినియోగం గణనీయంగా తగ్గింది. రోడ్ల మీద సంచరించే వాహనాలు, రైళ్లు మాత్రమే కాదు, విమానాలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చాలా వరకు పరిశ్రమలు మూతబడ్డాయి. ఫలితంగా నిత్యం గాలిలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గాయి. వాతావరణంలో స్వచ్ఛత ఏర్పడింది.

న్యూయార్‌ మహానగరాన్నే తీసుకుంటే, ‘కరోనా’ వ్యాప్తి తర్వాత అక్కడ వాయు కాలుష్యం 50 శాతం మేరకు తగ్గింది. చైనాలోనైతే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు వినియోగం 40 శాతం తగ్గింది. చాలా చోట్ల ఖాళీగా మారిన నగరాల రహదారులపై వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో ఇంతటి తగ్గుదల నమోదు కావడం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆరుబయట జన సంచారం కూడా గణనీయంగా తగ్గిపోవడంతో చాలా చోట్ల నదులు, సెలయేళ్లు, సరస్సులు కూడా స్వచ్ఛమైన నీటితో కళకళలాడుతున్నాయి. వాటిలోకి కొత్త కొత్త జలచరాలు వచ్చి చేరుతున్నాయి.

వాటంతట అవే సద్దుమణుగుతాయా?
సాధారణంగా మహమ్మారి వ్యాధులు వ్యాపించినప్పుడు కొంతకాలానికి వాటంతట అవే సద్దుమణుగుతాయి. అలాగని అవి పూర్తిగా అంతరించాయనుకోవడం సరికాదు. వాటి నిర్మూలనకు వ్యాక్సిన్లు, కచ్చితమైన ఔషధాలు సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిందే. ఒక్కోసారి సద్దుమణిగిన మహమ్మారి వ్యాధులు కొంత వ్యవధి తర్వాత మళ్లీ తిరగబెడుతుంటాయి. ఇదివరకటి కాలంలో ప్లేగు, మశూచి, కలరా వంటి వ్యాధులు ఇలా తిరగబెట్టిన ఉదంతాలు మనకు తెలిసినవే.

కరోనా వైరస్‌ సోకిన రోగుల్లో దాదాపు 25 శాతం మందికి ఎలాంటి వ్యాధి లక్షణాలూ కనిపించడం లేదని, వారి ద్వారా ఇతరులకు వైరస్‌ సోకే అవకాశాలు ఉంటాయని, అందువల్ల దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అమెరికాలోని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) డైరెక్టర్‌ డాక్టర్‌ రాబర్ట్‌ రెడ్‌ఫీల్డ్‌ హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌ కనీసం మరో రెండేళ్లు మనుషులను వెన్నాడే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన చెబుతున్నారు. కరోనా వైరస్‌ కట్టడికి ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడానికి కనీసం ఏడాది నుంచి ఏడాదిన్నర కాలం పడుతుందని, సమర్థమైన వ్యాక్సిన్లు పూర్తిగా అందుబాటులోకి వచ్చేంత వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

కరోనా నేర్పుతున్న పాఠం!
కళ్లు నులుముకుంటూనే వంట గదిలోకి పరిగెత్తింది. టిఫిన్‌ చేయడానికి కావల్సిన పదార్థాలన్నీ సర్దుకుంది. హాల్లోకి వెళ్లి గుమ్మం తెరిచి.. వాకిట్లో ఉన్న పాలపాకెట్, న్యూస్‌ పేపర్‌ లోపలికి తెచ్చింది. పాలు స్టవ్‌ మీద పెట్టి.. బ్రష్‌ చేసుకుంటూనే పేపర్‌ తిప్పేసింది. మొహం కడుక్కొని వచ్చి కాఫీ చేసుకొని సిప్‌ చేసుకుంటూ వెళ్లి భర్తను నిద్రలేపింది. టిఫిన్‌ రెడీ చేసి.. బిడ్డను నిద్రలేపి.. ఓ వైపు వంట చేసుకుంటూనే కూతురిని స్కూల్‌కి రెడీ చేసింది. ఇంకో వైపు భర్తకు కాఫీ.. టిఫిన్‌ అందించింది. ఆయన పేపర్‌ చదువుతూ తీరిగ్గా కాఫీని ఆస్వాదిస్తున్నాడు. గబగబా కూతురికి టిఫిన్‌ తినిపించి లంచ్‌ సిద్ధం చేసి.. స్కూల్‌కు పంపింది. ఇంకోసారి కాఫీ తాగాలన్నా టైమ్‌ లేదు.. ఆఫీస్‌ నుంచి కాల్స్‌.. కంప్యూటర్‌ ఆన్‌ చేసి.. ఆన్‌లైన్‌ మీటింగ్స్‌కు అటెండ్‌ అవుతూనే ఆఫ్‌లైన్‌లో ఆఫీస్‌కు రెడీ అయిపోయింది. 

సాయంకాలం..
ఆఫీస్‌ నుంచి వచ్చీ రాగానే కూతుర్ని గారం చేస్తూనే స్నాక్స్‌ తినిపించి హోమ్‌వర్క్‌ చేయించింది. ఇంకో వైపు రాత్రి వంటకు కావల్సినవి సిద్ధం చేసుకుంది. హోమ్‌వర్క్‌ అయిపోయాక కూతుర్ని కాసేపు ఆడించి.. ఈలోపు ఆఫీస్‌ నుంచి వచ్చిన భర్తకు కాఫీ ఇచ్చి.. వంట చేసి..తను ఫ్రెష్‌ అయ్యి డిన్నర్‌ సర్వ్‌ చేసింది. బెడ్‌ టైమ్‌ స్టోరీస్‌తో బిడ్డను నిద్రపుచ్చి.. తను లేచి.. లాప్‌ట్యాప్‌ ఆన్‌ చేసింది.. అటు ఆఫీస్‌ వర్క్‌ చేసుకుంటూనే ఇంకోవైపు మధ్యాహ్నం మిగిలిపోయిన బట్టలుతికే పనీ చూసుకుంది.. వాషింగ్‌ మెషీన్‌లో బట్టలు వేసి. అప్పటికి రాత్రి పన్నెండు దాటిపోయింది.

అలసిపోయి ఉందేమో అలాగే వాషింగ్‌ మెషీన్‌ ముందు కుర్చీలో కూర్చోనే నిద్రలోని జారుకుంది.. మధ్యరాత్రి లేచి చూసిన భర్తకు వాషింగ్‌ మెషీన్‌ ముందు కునికిపాట్లు పడ్తున్న భార్య కనిపించింది. తన బాధ్యతా రాహిత్యం అప్పుడు గుర్తొచ్చింది. సిగ్గుపడ్డాడు. వెళ్లి భార్యను నిద్రపొమ్మని చెప్పి మిగిలిన పని బాధ్యత తాను తీసుకున్నాడు. ఇది రియల్‌ వాషింగ్‌ పౌడర్‌ వాళ్ల  ప్రమోషనల్‌ యాడ్‌. కాని ఇందులో చూపించిదంతా సత్యమే. దాదాపు ప్రతి ఇంటిలోని దశ్యమే. 

‘మన దేశంలో  71 శాతం మంది మహిళలకు నిద్రలేమితో తెల్లవారుతోందట. వాళ్ల భర్తలతో పోల్చుకుంటే! కారణం.. తెల్లవారి మొదలయ్యే ఇంటి పని పట్ల ఆందోళన’ అనే సమాచారాన్నీ ఇస్తోంది ఈ యాడ్‌. ఈ ఇన్ఫర్మేషన్‌లో విశ్వసనీయత ఎంతున్నా ఇళ్లల్లో ఆడవాళ్ల పరిస్థితి చూసినవాళ్లకు ఆ సమాచారం అతిశయోక్తిగా మాత్రం అనిపించదు. 

ఈ ఉపోద్ఘాతమంతా ఇప్పుడెందుకు అంటే..
మగవాళ్లు ఇంటి బాధ్యతలు పంచుకోవడనికి కరోనా లాక్‌డౌన్‌ మంచి అవకాశాన్నిచ్చింది అని చెప్పడానికి. 24 గంటలూ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి.. ఇంట్లో అందరినీ సౌకర్యంగా ఉంచడం కోసం ఆమె చేసే సర్కస్‌ ఫీట్లు అర్థమై ఉండాలి.. ఇక ఉద్యోగినుల విషయానికి వస్తే మీకంటే ముందుగానే లేచి... ఎప్పటిలాగే ఇంటి పని, వంట పని ముగించుకొని మీతోపాటుగా ల్యాప్‌టాప్‌ తెరిచి ఆఫీస్‌ పనికీ సిద్ధమవుతూ.. మధ్యమ«ధ్య మీ టీ బ్రేక్‌... కాఫీ బ్రేక్‌.. స్నాక్స్‌ బ్రేక్‌ మిస్‌ కానివ్వకుండా వాటినీ సమకూరుస్తూ మళ్లీ తన ఆఫీస్‌ పనినీ నిర్వహిస్తూ ఆమె చేసే మల్టీ టాస్క్‌నూ గ్రహించి ఉండాలి.. 

ఆ యాడ్‌లో చెప్పిన విషయమూ అవగతమై ఉండాలి ఇప్పటికే!
అందుకే ఈ లాక్‌డౌన్‌ టైమ్‌ పూర్తయ్యేలోపు ఇంటిపనుల్లోనూ పాలుపంచుకునే సంపూర్ణ పురుషుడిలా మారిపోండి. మీ పిల్లలకు రోల్‌ మోడల్‌గా తయారవ్వండి. మీ ఇంట్లో మహిళలు రేపటి చింతను మరిచిపోయి కంటినిండా నిద్రపోయేలా చూడండి. ఇంటిని ఆరోగ్యంగా ఉంచండి. కరోనా.. జెండర్‌ ఈక్వాలిటీ లెసన్‌ నేర్పడానిక్కూడా వచ్చిందేమో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement