నగరాల్లోను, పట్టణాల్లోను ఒకప్పుడు సైకిళ్ల జోరు విరివిగా కనిపించేది. మోటారు వాహనాలు పెరగడంతో నగరాల్లో సైకిళ్లు చాలా అరుదైపోయాయి. పెట్రో ఇంధనాలతో నడిచే మోటారు వాహనాల నుంచి వెలువడే కాలుష్యం తెచ్చిపెట్టే దుష్ప్రభావాలు అర్థం కావడంతో ఇప్పుడిప్పుడే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సైకిళ్లకు అనుకూలంగా చర్యలు చేపట్టేందుకు ఉపక్రమిస్తున్నాయి. నగరాల్లో సైకిళ్లు నడపడానికి వీలుగా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలతో సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని సంకల్పిస్తున్నాయి. సైకిళ్ల వినియోగం ఎంతగా పెరిగితే మోటారు వాహనాల వినియోగం అంతగా తగ్గి, కాలుష్యం తగ్గుముఖం పట్టడమే కాదు, ప్రజారోగ్యం కూడా మెరుగుపడుతుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నగరాల్లో సైకిళ్లను ప్రోత్సహించాలని సంకల్పించింది. ఈ సందర్భంగా సైకిల్ గురించి కొన్ని విశేషాలు...
ఒకప్పుడు సైకిలెక్కడమంటే కుర్రకారుకి గుర్రమెక్కినంత సంబరంగా ఉండేది. సైకిలెక్కి వీథుల్లో చక్కర్లు కొట్టడం పిల్లలకు ఒక ఆటవిడుపు. నిక్కర్ల వయసులో పడుతూ లేస్తూ మోకాళ్లు డోక్కుపోయినా సరే, సైకిల్ సీటుపైకెక్కి బ్యాలెన్స్ చేస్తూ నడపగలిగితే చాలు, ఒక గొప్పవిద్య ఏదో పట్టుబడినంత ఆనందం. ఒకప్పుడు సైకిల్ ఒక స్టేటస్ సింబల్. పెళ్లి సమయంలో వరుడికి తప్పనిసరిగా చదివించుకోవలసిన లాంఛనం. సైకిల్ కోసం అలకపాన్పులెక్కే పెళ్లికొడుకులు ఉండేవారంటే ఇప్పటితరం కుర్రాళ్లు నవ్విపోతారు గాని, అప్పట్లో సైకిల్ ప్రాభవం అలా ఉండేది మరి! మోపెడ్లు, స్కూటర్లు, మోటారుబైకులు రోడ్ల మీదకు యంత్రాశ్వాల్లా దూసుకురావడం మొదలయ్యాక మన దేశంలో సైకిళ్ల ప్రాభవం మసకబారింది.
మోటారు వాహనాలతో కిక్కిరిసి కనిపించే నగరాల్లో రోడ్ల మీదకు సైకిల్ తీసుకురావాలంటేనే భయపడే పరిస్థితులు సైకిళ్లను మరింతగా వెనక్కు నెట్టేశాయి. మోటారు వాహనాలు తెచ్చిపెట్టే కాలుష్య తీవ్రత అర్థమయ్యాక సైకిళ్ల మీద మళ్లీ దృష్టిసారిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇదొక మంచి పరిణామం. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాలను సైకిళ్లకు అనుకూలంగా మలచేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవతీసుకుంటోంది. దేశంలోని అన్ని నగరాలనూ సైకిళ్లకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ చర్యలు చేపడితే సైకిళ్లకు మళ్లీ మంచిరోజులు త్వరలోనే రాకపోవు. అప్పుడిక ‘సైకిల్‌వాలా జిందాబాద్’ అనే కేరింతలు వినిపించకపోవు.
ప్రపంచంలో సైకిల్ నగరాలు
అంతర్జాతీయంగా చూసుకుంటే ప్రస్తుతం మన దేశంలో సైక్లింగ్‌కు సానుకూలమైన నగరాలు తక్కువనే చెప్పాలి. ప్రపంచంలోనే సైక్లింగ్‌కు అత్యంత సానుకూల నగరం డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్. ఎన్ని అధునాతనమైన మోటారు వాహనాలు అందుబాటులోకి వచ్చినా, ఇప్పటికీ ఈ నగరంలో సైకిల్ జోరు ఏమాత్రం తగ్గలేదు. కోపెన్‌హాగెన్‌లో తొంభైశాతం జనాభా సైక్లిస్టులే! ఐదు కిలోమీటర్ల దూరం పరిధిలో రాకపోకలకు వారు తప్పనిసరిగా సైకిల్‌నే ఉపయోగిస్తారు. సైకిళ్లు నడపడానికి ప్రత్యేకమైన రహదారులు, రాజధాని నుంచి చుట్టుపక్కల పాతిక పట్టణాలను కలుపుతూ సాగే సైకిల్ సూపర్ హైవేలు డెన్మార్క్ ప్రత్యేకత.
సైక్లింగ్‌కు సానుకూల నగరాల్లో కోపెన్‌హాగెన్ తర్వాతి స్థానాల్లో పోర్ట్‌లాండ్ (అమెరికా), మ్యూనిక్ (జర్మనీ), మాంట్‌రియల్ (కెనడా), పెర్త్ (ఆస్ట్రేలియా), ఆమ్‌స్టర్‌డామ్ (నెదర్లాండ్స్), సీటెల్ (అమెరికా), పారిస్ (ఫ్రాన్స్), మిన్నీపోలిస్ (అమెరికా), బొగోటా (కొలంబియా) నిలుస్తాయి. ప్రపంచంలో సైక్లింగ్‌కు అనుకూలమైన తొలి పది నగరాల్లో మన దేశానికి చెందిన నగరమేదీ లేదు. అధిక జనాభా, ఇరుకిరుకు రోడ్లు, నగరాల్లోని ప్రధాన రహదారుల్లో మోటారు వాహనాల జోరు వల్ల మన దేశంలో కొన్ని దశాబ్దాలుగా సైకిళ్ల వినియోగం చాలావరకు తగ్గింది.
మన నగరాల్లో సైకిల్ పరిస్థితులు
ప్రస్తుతం మన దేశంలో సైక్లింగ్‌కు సానుకూల పరిస్థితులు ఉన్న మొదటి పది నగరాలను తీసుకుంటే, కేంద్ర గృహనిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన జాబితా ప్రకారం బెంగళూరు మొదటి స్థానంలో నిలుస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో భువనేశ్వర్, చండీగఢ్, నాగపూర్, సూరత్, వదోదరా, రాజ్‌కోట్, కోహిమా, న్యూటౌన్ కోల్‌కతా, వరంగల్ నగరాలు నిలుస్తున్నాయి. సైకిళ్లు నడపడానికి ఈ నగరాల్లో చాలావరకు సురక్షితమైన పరిస్థితులు ఇప్పటికే ఉన్నాయి. వీటిని మరింతగా మెరుగుపరచడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.
మరోవైపు కేంద్ర గృహనిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ డెవలప్‌మెంట్ పాలసీ (ఐటీడీపీ) కింద చేపట్టిన ‘స్మార్ట్ సిటీస్ మిషన్’లో భాగంగా దేశంలోని నగరాల్లో సైకిళ్ల వినియోగాన్ని పెంచేందుకు ‘సైకిల్స్ ఫర్ చేంజ్ చాలెంజ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద దేశంలోని 107 నగరాలు తమను తాము నమోదు చేసుకున్నాయి. ఈ నగరాల్లో సైకిళ్ల వినియోగాన్ని పెంచేందుకు, సైక్లింగ్‌కు అనుకూలమైన పరిస్థితులు కల్పించేందుకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చర్యలు చేపడుతోంది. ‘సైకిల్స్ ఫర్ చేంజ్ చాలెంజ్’ కింద ప్రభుత్వాలు నగరాల్లో సైకిళ్లు నడపడానికి ప్రత్యేక రహదారులు, సురక్షితమైన ట్రాఫిక్ పరిస్థితులు కల్పించడం వంటి చర్యలను చేపట్టినట్లయితే సైకిళ్లకు మళ్లీ మంచిరోజులొస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
సైకిల్‌తో ఆర్థిక లాభాలు
సైకిల్‌తో ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక ఆరోగ్య లాభాలు. సైకిల్‌కి ఎలాంటి ఇంధనం అక్కర్లేదు. కాబట్టి దీనివల్ల ఎలాంటి ఇం‘ధన’ వ్యయం ఉండదు. సైకిల్ తొక్కడం వల్ల శరీరం దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఫలితంగా తరచు ఆస్పత్రుల చుట్టూ తిరిగి, అక్కడిచ్చే బిల్లులు చూసి కళ్లుతిరిగే పరిస్థితులు ఎంతమాత్రమూ తలెత్తవు. కొద్ది దశాబ్దాలుగా మోటారు ద్విచక్రవాహనాల జోరు బాగా పెరిగినా, జనాలు కూడా ఇప్పుడిప్పుడే సైకిల్ ప్రయోజనాలను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా పెట్రోలు ధర ‘సెంచరీ’ కొట్టిన తర్వాత జనాలకు సైకిళ్ల మీద శ్రద్ధ మొదలైంది. ఇటు జనాల్లోనూ, అటు ప్రభుత్వ వర్గాల్లోనూ దాదాపు ఏకకాలంలోనే సైకిళ్ల వినియోగం పెంచాలనే విషయమై ఆలోచన మొదలవడం ఎంతైనా ఒక శుభపరిణామం. సైకిల్ గొప్పదనం గురించి చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి ఒక అవధానంలో ఈ పద్యం చెప్పారు:
‘‘నీరుం గోరదు గడ్డినడ్గ దొక కొన్నే నుల్వలన్ వేడ దే
వారే నెక్కిన గ్రింద దోయ దొకడుం బజ్జన్ భటుండుంట చే
కూరంగా వల దౌర! బైస్కిలునకున్ గోప మ్మొకింతేని లే
దౌరా! వాజికి దుల్యమైన యిది విశ్వామిత్ర సృష్టంబొకో?’’
జట్కాబళ్లు, ఎడ్లబళ్లు మాత్రమే ప్రధాన రవాణా సాధనాలుగా ఉన్న రోజుల్లో మన దేశంలోని వీథుల్లోకి ప్రవేశించిన సైకిల్ అప్పటి మనుషులకు చాలా అబ్బురంగా ఉండేది. అందుకే చెళ్లపిళ్లవారు సైకిల్ ప్రయోజనాలను చెబుతూనే, గుర్రానికి సాటివచ్చే సైకిల్ విశ్వామిత్ర సృష్టి కాబోలని చమత్కరించారు. అప్పటి కాలంలోనే కాదు, ఇప్పుడు కూడా మోటారు వాహనాలతో పోల్చుకుంటే సైకిలే ఎంతో మెరుగైనది. మోటారు వాహనాలకు నిరంతర ఇంధన వ్యయంతో పాటు, నిర్వహణ వ్యయం కూడా ఎక్కువే. సైకిల్‌కు నిర్వహణ వ్యయం నామమాత్రం. అప్పుడప్పుడు టైర్లలో గాలి కొడుతుంటే చాలు. ఎప్పుడో అరుదుగా చైన్ జారిపోవడం, పెడల్ ఊడిపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. సైకిల్ మరీ పాతబడితే తలెత్తే ఈ సమస్యల పరిష్కారం కోసం మరమ్మతు ఖర్చులు కూడా చాలా తక్కువే. మోటారు వాహనాల ధరలతో పోల్చుకుంటే సైకిల్ ధరలు కూడా తక్కువే. ఆర్థిక కోణంలో చూసుకుంటే సైకిల్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి.
సైకిల్ తొక్కిన ప్రముఖులు
ఇప్పుడంటే ప్రముఖులెవరూ సైకిళ్లపై వీథుల్లోకి రావడం లేదు గాని, ఒకప్పుడు సైకిళ్లు తొక్కే ప్రముఖులు విరివిగానే ఉండేవారు. మన దేశానికి సంబంధించి మహాత్మాగాంధీ మొదలుకొని ఎందరో నాయకులకు అభిమాన వాహనం సైకిల్. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నకాలంలోనే సైకిల్ నేర్చుకున్నారు. భారత్ వచ్చేశాక ఆయన సైకిల్‌ను వదిలేయలేదు. సబర్మతి ఆశ్రమం నుంచి అహ్మదాబాద్‌లోని గుజరాత్ విద్యాపీఠం వరకు ఆయన రోజూ సైకిల్‌పైనే రాకపోకలు సాగించేవారు. స్వాతంత్య్రం వచ్చాక మన తెలుగువాడైన కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య పార్లమెంటుకు సైకిల్‌పైనే వెళ్లేవారు.
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ అసెంబ్లీకి సైకిల్‌పై వెళ్లేవారు. అంతేకాదు, తీరికవేళల్లో ఆయన భువనేశ్వర్ వీథుల్లో సైకిల్‌పై షికారుగా తిరిగేవారు. విదేశీ ప్రముఖుల్లో చెప్పుకోవాలంటే, బ్రిటిష్‌రాణి ఎలిజబెత్ తన చిన్నప్పుడు సోదరి మార్గరెట్‌తో కలసి సైకిల్‌పై తరచు షికారు చేసేవారు. ప్రముఖ రష్యన్ రచయిత లియో టాల్‌స్టాయ్ సైకిల్‌పైనే రాకపోకలు సాగించేవారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అల్బర్ట్ ఐన్‌స్టీన్ తన ఆటవిడుపు సమయాల్లో సైకిల్ తొక్కేందుకు ఇష్టపడేవారు. ఇలా సైకిల్‌ను ఇష్టపడే ప్రముఖులు చాలామందే ఉన్నారు.
సైకిల్ పరిణామం
సైకిల్ వంటి వాహనం తయారీ కోసం పదహారో శతాబ్ది నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయని కొన్ని స్కెచ్‌ల ఆధారంగా పరిశోధకులు చెబుతున్నారు. జర్మన్ ఉన్నతాధికారి కార్ల్ వాన్ డ్రాయిస్ 1817లో తొలిసారిగా కొయ్యతో రెండు చక్రాల వాహనానికి రూపకల్పన చేశాడు. దీనికి ఆయన ‘లౌఫ్‌మెషిన్’ (పరుగెత్తే యంత్రం) అని పేరు పెట్టాడు. అయితే, డ్రాయిస్ పేరిట ఇది ‘డ్రాయిసిన్’గానే పేరుపొందింది. దీనికి చైన్, పెడల్స్ వంటివేమీ లేకపోవడంతో సీటుపై కూర్చున్న వ్యక్తి కాళ్లతో నెడుతూ దీనిని ముందుకు నడపాల్సి వచ్చేది. మొత్తానికి దీనిని నడపడం ఒక విన్యాసంలా ఉండేది. దీంతో అప్పటి జనాలు ఈ విచిత్రవాహనాన్ని ‘డ్యాండీ హార్స్’ (కొయ్యగుర్రం) అంటూ వెటకరించేవారు. తర్వాత కొద్ది దశాబ్దాల పాటు ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలు జరిగినా, అవేవీ పెద్దగా విజయవంతం కాలేదు.
ఆధునిక సైకిల్‌కు తొలి రూపమైన పెడల్స్‌తో కూడిన సైకిల్‌ను ఔత్సాహిక జర్మన్ ఆవిష్కర్త ఫిలిప్ మోరిట్జ్ ఫిషర్ 1853లో రూపొందించాడు. చిన్నప్పుడు ‘డ్రాయిసిన్’పై ఇంటి నుంచి బడికి రాకపోకలు జరిపిన ఫిషర్, మరింత మెరుగైన వాహనాన్ని తయారు చేయాలనే సంకల్పంతో పెడల్స్‌తో కూడిన తొలి సైకిల్ నమూనాకు రూపకల్పన చేశాడు. ఫిషర్ రూపొందించిన ఈ సైకిల్ జర్మనీలోని ష్వీన్‌ఫర్ట్ మునిసిపల్ మ్యూజియంలో భద్రంగా ఉంది. పెడల్స్ ఏర్పాటు చేసినా, దీనికి చైన్, ఫ్రీవీల్ వంటివి లేకపోవడంతో దీనిని తొక్కడం చాలా శ్రమగా ఉండేది. తర్వాత 1870లలో హైవీల్ బైసైకిల్ వచ్చింది. పెద్దచక్రానికి సీటు, హ్యాండిల్, వెనుక వైపు బాగా చిన్నచక్రం ఉండే ఈ సైకిల్ నడపడమంటే దాదాపు సర్కస్ విన్యాసం చేయడమే! ఇది కూడా పెద్దగా జనాల్లోకి వెళ్లలేకపోయింది.
ఆ తర్వాత 1880–90 కాలంలో ‘సేఫ్టీ బైసైకిల్స్’ రూపుదిద్దుకున్నాయి. వెనుక చక్రానికి అనుసంధానమైన చెయిన్, ఫ్రీవీల్, హ్యాండిల్, బ్రేకులు వంటి సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ‘సేఫ్టీ బైసైకిల్స్’ అనతికాలంలోనే జనబాహుళ్యానికి చేరువయ్యాయి. ముఖ్యంగా యూరోప్, అమెరికా ప్రాంతాల్లో సామాన్యులకు సైకిళ్లే ప్రధాన రవాణా సాధనాలుగా మారాయి. వలస పాలకుల కారణంగా సైకిళ్లు ఆసియా, ఆఫ్రికా దేశాలకూ పాకాయి. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలోనే భారత్‌లో కూడా సైకిళ్ల వినియోగం మొదలైంది. దాదాపు రెండు శతాబ్దాల ‘సైకిల్’ ప్రస్థానంలో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. నడిపే వారికి మరింత సౌకర్యవంతమైన మోడల్స్ తయారయ్యాయి. చదునైన రోడ్లపైనే కాకుండా ఎగుడు దిగుడు కొండ దారుల్లో ప్రయాణాలకు అనువైన ‘మౌంటెన్ బైక్స్’ అందుబాటులోకి వచ్చాయి. తొక్కేవారికి శ్రమ తగ్గించేరీతిలో గేర్లతో కూడిన సైకిళ్లు వాడుకలోకి వచ్చాయి. ఇటీవలి కాలంలో తాజాగా రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేసే ‘ఈ–సైకిళ్ల’కు దేశదేశాల్లో క్రమంగా ఆదరణ పెరుగుతోంది.
సైకిల్ తలరాత మార్చిన ‘కరోనా’
ప్రపంచాన్ని ఇప్పటికీ అల్లాడిస్తున్న ‘కరోనా’ మహమ్మారి మన దేశంలో సైకిల్ తలరాతను మార్చేసింది. ‘కరోనా’ తొలివిడత లాక్‌డౌన్ కాలంలో నగరాల నుంచి లక్షలాది మంది వలస కార్మికులు వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వస్థలాలకు తిరుగుముఖం పట్టారు. వారిలో పలువురు కాలినడకన సాగిపోతే, చాలామంది తమవద్దనున్న సైకిళ్లతో స్వస్థలాలకు ప్రయాణమయ్యారు. గత ఏడాది లాక్‌డౌన్ కాలంలో ఇలా సైకిళ్లపై స్వస్థలాలకు చేరుకున్న వారిలో బిహార్‌లోని దర్భంగా జిల్లాకు చెందిన జ్యోతికుమారి అనే పదిహేనేళ్ల బాలిక ఉదంతం అంతర్జాతీయంగా వార్తలకెక్కింది.
ఢిల్లీలో ఈ–రిక్షా డ్రైవర్ అయిన ఆమె తండ్రి అనారోగ్యం పాలవడంతో, అతణ్ణి సైకిల్ వెనుక కూర్చోబెట్టి ఆమె స్వస్థలానికి ప్రయాణమైంది. దాదాపు 1200 కిలోమీటర్లకు పైగా ప్రయాణం సాగించి, స్వగ్రామానికి చేరుకుంది. ఈ సాహసం ఆమెకు ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఆమె ‘బయోపిక్’ తీసేందుకు బాలీవుడ్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు కూడా కొన్ని కథనాలు వచ్చాయి. అయితే, ఆమె తండ్రి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూయడం ఒక విషాదం. తొలివిడత ‘లాక్‌డౌన్’ కాలంలో స్వస్థలాలకు ప్రయాణమైన వలస కార్మికులు కొందరి జీవితాల్లో ఇలాంటి చాలా విషాదాలే చోటు చేసుకున్నాయి.
ఇదిలా ఉంటే, ‘లాక్‌డౌన్’ అనుభవంతో చాలామంది సైకిళ్లవైపు మొగ్గు చూపడం మొదలైంది. ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోవడంతో జనసామాన్యం ఇళ్లల్లో మూలపడి ఉన్న సైకిళ్లను బయటకు తీశారు. సైకిళ్లు లేనివారు లాక్‌డౌన్ సడలింపులు మొదలవగానే, రోజులెప్పుడెలా ఉంటాయోననే భయంతో సైకిళ్ల కొనుగోళ్లు ప్రారంభించారు. ప్రజా రవాణాకు అవరోధం కలిగితే, సైకిల్ గొప్ప భరోసా ఇస్తుందని ప్రజలు బాగానే గ్రహించారు. గత ఏడాది తొలి లాక్‌డౌన్ సడలింపుల కాలం నుంచి ఇప్పటి వరకు– అంటే గడచిన ఏడాది కాలంలో దేశంలోని సైకిళ్ల అమ్మకాల్లో ఏకంగా 20 శాతం పెరుగుదల నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. గడచిన దశాబ్దిలో సైకిళ్ల అమ్మకాల్లో ఈ పెరుగుదలే అత్యధికం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోని నగరాల్లో సైకిళ్ల వినియోగం పెంచేందుకు చర్యలు చేపడుతుండటంతో రానున్నకాలంలో సైకిళ్ల అమ్మకాల్లో నిలకడగా పెరుగుదల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.
సైకిల్‌తో ఆరోగ్య లాభాలు
ఇక ఆరోగ్య లాభాలను చూసుకుంటే, సైకిల్‌కు ఇంధనం అక్కర్లేదు కాబట్టి, దీని నుంచి పొగ వెలువడటం, తద్వారా కాలుష్యం పెరిగి ప్రజారోగ్య సమస్యలు తలెత్తడం వంటి విపత్తులేవీ ఉండవు. ప్రజారోగ్య సమస్యలు తగ్గితే, ప్రభుత్వ ఖజానాపై కూడా భారం తగ్గుతుంది. మోటారు వాహనాలతో పోల్చుకుంటే, నడిపేటప్పుడు సైకిల్‌ను అదుపు చేయడం చాలా తేలిక. అందువల్ల మోటారు వాహనాలను నడిపేవారితో పోల్చుకుంటే, సైకిల్ నడిపేవారికి ఎదురయ్యే ప్రమాదాలు తక్కువే. ఒకవేళ అనుకోని ప్రమాదాలు ఎదురైనా, వాటిలో ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు దాదాపు ఉండవు. ఇక వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం సైక్లింగ్ వల్ల కలిగే లాభాలను తెలుసుకుందాం.
► కాళ్లతో పెడల్ తొక్కుతూ సైకిల్ నడపడం వల్ల ప్రయాణానికి ప్రయాణం, వ్యాయామానికి వ్యాయామం ఏకకాలంలో జరగడమే కాదు, కాళ్లు, నడుము దృఢంగా తయారవుతాయి. చేతులకు పట్టు పెరుగుతుంది.
► సైకిల్ తొక్కడం వల్ల ఊపిరితిత్తుల శక్తి పెరుగుతుందని లండన్‌లోని కింగ్స్ కాలేజీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు, సైక్లింగ్ వల్ల శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగి, బరువు అదుపులో ఉంటుంది. శరీరాకృతి చక్కని తీరులోకి మారుతుంది.
► అధిక బరువు వల్ల తలెత్తే గుండెజబ్బులు, బీపీ, సుగర్ వంటి సమస్యలు దరిచేరవు. ఒకవేళ బీపీ, సుగర్ వంటివి అనువంశిక కారణాల వల్ల వచ్చినా, సైక్లింగ్‌తో అవి అదుపులో ఉంటాయి. సైక్లింగ్ వల్ల గుండెజబ్బులే కాదు, కేన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.
► రోజూ సైక్లింగ్ చేసే అలవాటు ఉన్నవారిలో నిద్రలేమి సమస్య దాదాపుగా ఉండదు. సైక్లింగ్ వల్ల శరీరానికి తగిన వ్యాయామం, అలసట లభించి చక్కగా నిద్రపడుతుందని యూనివర్సిటీ ఆఫ్ జార్జియా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది.
► సైక్లింగ్ వల్ల కేవలం శరీరానికి మాత్రమే కాదు, మెదడుకూ లాభం ఉందంటున్నారు ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైక్లింగ్ వల్ల మెదడుకు రక్తప్రసరణ గణనీయంగా మెరుగుపడుతుందని, దీనివల్ల మెదడు చురుకుదేరి, వయసుమళ్లిన దశకు చేరుకున్నా అల్జీమర్స్, డెమెన్షియా వంటి సమస్యలు రాకుండా ఉంటాయని వారు చెబుతున్నారు.
సైకిల్ విచిత్రాలూ విశేషాలూ
► ఒకటికి మించిన సీట్లు, సీట్లకు సరిసమానమైన సంఖ్యలో చైన్లు, పెడల్స్ జతలు ఉండే పొడవాటి సైకిళ్లను ‘టాండెమ్ బైసైకిల్స్’ అంటారు. ఇలాంటి వాటిలో 35 సీట్లు కలిగిన టాండెమ్ బైసైకిల్ ఏకకాలంలోనే అత్యధిక సంఖ్యలో సైక్లిస్టులు తొక్కగలిగే సైకిల్‌గా రికార్డులకెక్కింది. దీని పొడవు 67 అడుగులు. అయితే, ఇరవై సీట్లు కలిగిన టాండెమ్ సైకిల్ అత్యంత పొడవైనదిగా రికార్డులకెక్కింది. దీని పొడవు ఏకంగా 137 అడుగులు.
► సైకిల్ ప్రధానంగా సామాన్యుల వాహనం. సైకిల్ ధరలు దాదాపుగా అందుబాటులోనే ఉంటాయి. మన దేశంలో సుమారు మూడువేల రూపాయల నుంచి సైకిల్ ధరలు మొదలవుతాయి. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సైకిల్ ధర ఎంతో తెలుసా? అక్షరాలా ఐదులక్షల డాలర్లు– అంటే, సుమారు రూ.3.71 కోట్లు. బ్రిటిష్ ఆర్టిస్ట్ డామీన్ హిర్ట్స్ ‘బటర్‌ఫ్లై బైక్’ పేరిట రూపొందించిన ఈ సైకిల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డులకెక్కింది.
► ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సైకిళ్లు వాడుకలో ఉన్న దేశం చైనా. దాదాపు యాభై కోట్ల సైకిళ్లు చైనాలో ఉన్నాయి.
► ప్రపంచంలో ప్రస్తుతం వాడుకలో ఉన్న సైకిళ్ల కారణంగా ఏడాదికి దాదాపు 90 కోట్ల లీటర్ల వరకు ఇంధనం ఆదా అవుతోందని అంతర్జాతీయ నిపుణుల అంచనా. ఆ మేరకు కాలుష్యం కూడా తగ్గుతున్నట్లే కదా:
► విమానాన్ని రూపొందించిన రైట్ బ్రదర్స్ సైకిళ్ల వ్యాపారం చేసేవారు. ఓహాయో రాష్ట్రంలోని ఐదు చోట్ల వారికి సైకిల్ దుకాణాలు ఉండేవి. సైకిల్ తయారీ, మరమ్మతుల్లో నైపుణ్యం సాధించిన ఆ సోదరులిద్దరూ, సైకిల్ తయారీ కర్మాగారం లోనే విమానం తయారీ ప్రయత్నాలు ప్రారంభించారు.
► ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన సైకిల్ రేసులకు ఫ్రాన్స్ వేదికగా నిలుస్తోంది. అక్కడ ‘టూర్ డి ఫ్రాన్స్’ పేరిట 1903 నుంచి ఏడాదికోసారి మూడువారాల పాటు జరిగే సైకిల్ రేసుల్లో ప్రపంచం నలుమూలలకు చెందిన సైక్లిస్టులు పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment