
ప్రకృతి చాలా గొప్పది. పరిణామక్రమంలో... వెన్నెముక ఉన్న జీవుల్లో చేపలు, ఉభయచర జాతులు, పాములు, పక్షులు, పాలిచ్చి పెంచే జంతువులు ఇలా క్రమంగా ఆవిర్భవిస్తూ పోయాయి. చేపలూ, ఉభయచరాల్లో పెద్దగా మాతృ ప్రేమను అనే భావనను ప్రకృతి కలిగించలేదు. కానీ పక్షుల దగ్గరికి వచ్చేసరికి ఆ సహజాతాన్ని సహజంగానే కలిగేలా చేసింది. తమ ప్రజాతి హాయిగా మనుగడ సాగించాలన్న తపన కలిగించడానికి సృష్టి భావనను పెంచింది. కానీ ప్రత్యేకంగా పిల్లలకే కావాల్సిన ఆహారాన్ని తామే తయారు చేసే వ్యవస్థను మాత్రం ప్రకృతి పరిణామం కలిగించలేదు.
దాంతో పిట్టలు తమ పిల్లలకు ఎక్కడెక్కడి నుంచో కీటకాలూ, క్రిములూ, పురుగులను పట్టి తెచ్చేవి. మరి తాము పట్టి తెచ్చే లోపు పిల్లలకు ఏదైనా హాని జరిగితే...? బహుశా ఈ ప్రమాదాన్ని నివారించడానికేనేమో... పాలిచ్చి పెంచే జీవుల దగ్గరికి వచ్చే సరికి ఆ ఆహారం తమ ఎదలోనే ఊరే వ్యవస్థను రూపొందించింది. సహజమైన ఏ పరిణామమైనా తన సహజత్వాన్ని తప్పితే ఏదో ఓ సైడ్‌ఎఫెక్టో, రిస్కో ఉంటుంది. సహజమైన గుణానికి అనుగుణంగా ఉండకపోతే ఏదో ఓ అనర్థం చోటు చేసుకుంటుంది. అది ఆహారపరంగా కావచ్చు. బిడ్డలకు పాలివ్వని అలవాట్ల కారణంగా కావచ్చు. మరింకేదైనా కారణాల వల్లనో కావచ్చు. అలాంటి ఓ సైడ్‌ఎఫెక్టే... రొమ్ము క్యాన్సర్. దాని గురించి ఒకింత వివరంగా చెప్పుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యధికంగా వచ్చేది రొమ్ముక్యాన్సరే. అంతగా అభివృద్ధి చెందని దేశాల్లో మొత్తం మరణాల్లో దాదాపు 1.6 శాతం రొమ్ముక్యాన్సర్ వల్లనే సంభవిస్తున్నాయి. మనదేశంలో ప్రతి 28 మంది మహిళల్లో ఒకరు రొమ్ముక్యాన్సర్ బారిన పడుతున్నారంటే దీని తీవ్రత ఎంతో తెలుసుకోవచ్చు. రొమ్ముక్యాన్సర్ రిస్క్ పల్లెల్లో కంటే నగరాల్లో ఎక్కువ. పల్లెల్లో ప్రతి 60 మందికి ఒకరు రొమ్ము క్యాన్సర్‌కు బారిన పడుతుండగా, నగరాల్లో మాత్రం ప్రతి 22 మందిలో ఒకరు దీనికి గురవుతున్నారు. పల్లె జీవితంలోని సహజత్వంతో పోలిస్తే అంటే నగర జీవితంలోని కృత్రిమత్వం రొమ్ముక్యాన్సర్‌ను పెంచుతోందన్నమాట.
కారణాలు
- వయసు పెరిగే కొద్దీ రొమ్ము క్యాన్సర్ ముప్పూ పెరుగుతుంది.
- ఇది అందరిలోనూ ఉండే నివారించలేని రిస్క్ ఫ్యాక్టర్. ఆధునిక జీవశైలిలో వచ్చే మార్పులతో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. తల్లులు తమ బిడ్డలకు రొమ్ము పాలు పట్టకపోవడం. బిడ్డ పుట్టాక తల్లులు కనీసం ఆర్నెల్లు/ ఏడాది పాటైనా బిడ్డకు రొమ్ము పాలు పట్టించాలి. అది జరగకపోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ రావచ్చు. మహిళల్లో వచ్చే హార్మోన్ మార్పులు కూడా రొమ్ము క్యాన్సర్‌కు కారణం కావచ్చు. పాశ్చాత్య దేశ వాసులతో పోలిస్తే మన దేశంలో రొమ్ము క్యాన్సర్ త్వరగా గుర్తించినప్పుడు... మన దేశ మహిళల్లో ఉండే జన్యుపరమైన అంశాలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు.
- ఆలస్యంగా మొదటిబిడ్డ పుట్టడం... మరీ ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత ∙పిల్లలు లేని మహిళలు ∙కొంతవరకు జన్యుపరమైన అంశాలు.
లక్షణాలు
- రొమ్ము క్యాన్సర్‌ను చాలా తేలిగ్గా గుర్తించవచ్చు. ఉదాహరణకు తమలో అంతకు ముందు కనిపించని గడ్డలు చేతికి, స్పర్శకు తెలుస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక్కోసారి అవి నొప్పిగా లేనప్పుడు మహిళలు వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అవి హానికరం కానివా, లేక హానికరమైనవా అని తెలుసుకున్న తర్వాతే వాటి గురించి నిశ్చింతగా ఉండాలి.
- రొమ్ములో ఒక గడ్డలా కదులుతూ రొమ్ముపైనున్న చర్మం నుంచి అది స్పర్శకు అందడం
- రొమ్ము ఆకృతిలో మార్పులు
- బాగా ముదిరిన దశలో రొమ్ము అల్సర్స్ రావడం.
- నిపుల్‌కు సంబంధించినవి : రొమ్ముపై దద్దుర్ల వంటివి లేదా వ్రణాలు రావడం ∙
- రొమ్ము నిపుల్ లోపలికి ముడుచుకుపోయినట్లుగా ఉండటం. రక్తం వంటి స్రావాలు రావడం.
- చంకల్లో : చివరిదశలో గడ్డ బాగా పెరిగి చంకలోనూ దారి స్పర్శ తెలియడం. ∙భుజానికి సంబంధించి భుజం వాపు కనిపించడం. ∙రొమ్ములో సొట్టలు పడినట్లుగా ఉండటం ∙రొమ్ము పరిమాణంలో మార్పులు వచ్చినట్లుగా అనిపించడం. (నెలసరి సమయంలో రొమ్ములు గట్టిబడి... ఆ తర్వాత మళ్లీ నార్మల్ అవుతాయి. అందుకోసం ప్రతినెలా వచ్చే మార్పుల గురించి అంతగా ఆందోళన అవసరం లేదు. కానీ అలాగే గట్టిబడి ఉండటం కొనసాగితే మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలి.)
రొమ్ము క్యాన్సర్ లక్షణాలను గుర్తించాలంటే...
- రొమ్ములో కణితి చేతికి తగలడం.
- రొమ్ములో, చంకలో గడ్డ లేదా వాపు కనిపించడం. చనుమొన సైజులో మార్పు, అది లోపలికి తిరిగినట్లు ఉండటం.
- రొమ్ముపై చర్మం మందం కావడం, సొట్టపడటం ∙రొమ్ము సైజులో, షేపులో, రంగులో మార్పు కనిపించడం.
- రొమ్ము మీద ఎంతకూ నయంకాని పుండు. చనుమొన నుంచి రక్తస్రావం.
పైన చెప్పిన ఈ లక్షణాలు కనిపించేసరికి రొమ్ము క్యాన్సర్ తొలిదశను దాటిపోయే ప్రమాదం ఉంటుంది. క్యాన్సర్ కణితి రకం, దశ (స్టేజ్), గ్రేడింగ్ వంటి విషయాల మీద ఆధారపడి సర్జరీ, దాంతో పాటు కీమో, రేడియేషన్, హార్మోన్ థెరపీలను నిర్ణయిస్తారు. రొమ్ములోని సన్నటి గొట్టాలు, లోబ్స్‌కు పరిమితమయ్యే క్యాన్సర్లు, ఇతర భాగాలకు త్వరగా వ్యాపించే క్యాన్సర్ల వంటి రకాలు ఉంటాయి. చికిత్స ఆలస్యం అయ్యేకొద్దీ ఈ క్యాన్సర్లు అదుపు తప్పుతాయి. వయసు పైబడ్డ మహిళల్లో కంటే చిన్న వయసులో వచ్చే రొమ్ము క్యాన్సర్లను అదుపు చేయడం కష్టమవుతుంది. చిన్న వయసులో వచ్చే రొమ్ము క్యాన్సర్ కణితులకు అధికంగా వ్యాపించే గుణం ఉంటుంది. ఈ రోజుల్లో రొమ్ముల్లో ఎలాంటి మార్పులూ బయటకు కనిపించకుండా నిర్వహించే రీ–కన్‌స్ట్రక్టివ్ ఆంకోప్లాస్టిక్ సర్జరీలూ సమర్థంగా నిర్వహించడం సాధ్యమవుతోంది. కాబట్టి మహిళలు తమ అందం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
అవసరమైతే పెట్ సీటీ స్కాన్
ఫ్యామిలీ హిస్టరీలో రొమ్ము క్యాన్సర్ వచ్చినవారు ఎక్కువగా ఉన్నప్పుడు ముందుగానే దీన్ని పసిగట్టడానికి బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ2 అనే జెనెటిక్ పరీక్షలు చేయించుకోవాలి. ఈ జీన్ మ్యూటేషన్ పరీక్షలు పాజిటివ్ అని వస్తే... డాక్టర సలహా మేరకు మందుగానే రొమ్ములను తొలగించుకోవడంగానీ, లేదా ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్తగా ఉండల్సిగానీ ఉంటుంది. ఆ మహిళల వయసు, రిపోర్టుల మీద ఆధారపడి ఏవిధమైన నిర్ణయం తీసుకుంటే వారికి మంచిదనే విషయాన్ని వైద్యులు నిర్ణయించి, వారికి తగిన కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎవరిలో ఎక్కువ?
- దగ్గరి బంధువుల్లో (అమ్మ, అమ్మమ్మలు, అక్కచెల్లెళ్లు, మేనత్తల్లో) ఈ క్యాన్సర్ ఉన్నప్పుడు. వారు 40 ఏళ్ల కంటే చిన్నవయసులోనే ఈ క్యాన్సర్‌కు గురైనప్పుడు.
- రెండు రొమ్ములూ ఈ క్యాన్సర్‌కు గురైన కుటుంబాల్లో. ఆ కుటుంబానికి చెందిన పురుషుల్లో కూడా ఈ క్యాన్సర్ బయటపడ్డప్పుడు.
- ఆ కుటుంబ సభ్యులలో ఇతర క్యాన్సర్స్ ఎక్కువగా కనిపించడంగానీ లేదా అండాశయాలకు సంబంధించిన క్యాన్సర్స్ వచ్చినప్పుడు.
- జీన్ మ్యుటేషన్స్ స్ట్రాంగ్‌గా ఉన్నవారిలోనూ... అలాగే పెళ్లి లేటుగా చేసుకోవడం, పిల్లల్ని ఆలస్యంగా కనడం, పిల్లలకు పాలు పట్టకపోవడం, సంతానలేమి సమస్యల పరిష్కారం కోసం అధిక మోతాదుల్లో హార్మోన్ మందుల వాడటం, పదేళ్ల కంటే చిన్నవయసులోనే రజస్వల కావడం, 50 ఏళ్లు పైబడినా నెలసరి ఆగకపోవడంతో పాటు ఈస్ట్రోజెన్ అధిక మోతాదుల్లో దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు... ఇంకా వారికి అధిక బరువు కూడా తోడైతే ఈ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.
- అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలోని పట్టణాల్లో ఈ క్యాన్సర్‌కు గురయ్యే మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. ముప్ఫై ఏళ్ల వయసులో రెండు లక్షల మందికి ఒకరిలో కనిపించే ఈ క్యాన్సర్... 80 ఏళ్ల వయసులో ప్రతి పది మందిలో ఒకరిలో కనిపించేంతగా ఎక్కువవుతోంది.
చికిత్స : ఇప్పుడు క్యాన్సర్ ఉందని తెలిసినా వైద్యపరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీన్ని మొదటి లేదా రెండో దశలో ఉంటే పూర్తిగా నయం చేయవచ్చు. రొమ్ము క్యాన్సర్ తగ్గదనేది అపోహ మాత్రమే. ఇక తొలి దశల్లో తెలిస్తే రొమ్మును తొలగించాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. కేవలం క్యాన్సర్ గడ్డను మాత్రమే విజయవంతంగా తొలిగించవచ్చు. రొమ్ము క్యాన్సర్ చుట్టుపక్కలకు కూడా పాకిందని (శాటిలైట్ లీజన్స్ ఉన్నాయని) తెలిసినప్పుడు మాత్రమే రొమ్మును తొలగిస్తారు. అయినా ఇప్పుడు ఉన్నాధునిక వైద్య పరిజ్ఞానంతో రొమ్మును తొలగించినా... లేదా రొమ్ములోనే కాస్తంత భాగాన్ని తొలగించినా మిగతా చోట్ల ఉండే కండరాలతో ఆ ప్రాంతాన్ని భర్తీ చేసే శస్త్రచికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. రొమ్మును పూర్తిగా తొలగించాల్సి వచ్చినా సిలికాన్ ఇంప్లాంట్ ద్వారా కూడా రొమ్ము ఆకృతిని మునుపటిలాగే ఉండేలా చేయవచ్చు.
ఇతర చికిత్సలు : ఈ రోజుల్లో శస్త్రచికిత్సతో పాటు, రేడియేషన్ థెరపీ, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మాసెక్టమీలో రొమ్మ తొలగిస్తారు. అయితే రొమ్ముక్యాన్సర్ తొలిదశలో ఉంటే రొమ్మును రక్షిస్తూ, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. ఇందుకోసం సర్జరీని మొదటి చికిత్సగా చేస్తారు. ఇక ఆ తర్వాత వ్యాప్తిని నివారించేందుకు హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీలను చేస్తారు. రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారిలో ఇప్పుడు మొదటే దీన్ని కనుగొంటే ఆంకోప్లాస్టీ అనే శస్త్రచికిత్స సహాయంతో రొమ్మును పూర్తిగా రక్షిస్తారు. రొమ్ము సర్జరీతో క్యాన్సర్ గడ్డను తొలగించడంతో పాటు అక్కడ పడిన చొట్టను పూడ్చుతూ ప్లాస్టిక్ సర్జరీని కలగలిపి ఈ శస్త్రచికిత్స చేస్తారు.
నివారణ : ఒక మహిళకు రొమ్ము క్యాన్సర్ రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవడం నివారణలో కీలకం అవుతుంది. ఇందుకోసం వ్యక్తిగత జీవనశైలి, కుటుంబ ఆరోగ్య చరిత్ర, వృత్తి లాంటి అంశాలు ఇందుకోసం ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో కొన్నింటిని ప్రయత్నపూర్వకంగా మార్చుకోవచ్చు. మరికొన్ని మార్చలేనివీ ఉంటాయి. ఈ రెండింటినీ కలుపుకొని క్యాన్సర్ వచ్చే అవకాశాలను అంచనా వేస్తారు. వయసు, జెండర్, రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ బంధువులతో దగ్గరి బాంధవ్యం, రుతుస్రావ చరిత్ర, ఏ వయసులో రుతుస్రావం ఆగిపోతుంది వంటి అంశాలను మార్చలేం. కానీ... మార్చుకోగల అంశాలు... ఎక్కువ బరువు కలిగి ఉండటం, మొదటి సంతానం ఏ వయసులో కలిగింది, ఎంత మంది పిల్లలు, బిడ్డలకు ఎంతకాలం పాటు రొమ్ముపాలు పట్టారు, ఆల్కహాల్ అలవాట్లు, పోషకాహారం, అబార్షన్ల సంఖ్య. పై అంశాల ఆధారంగా ఒకరికి రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశం ఎంత ఉందో చెప్పడానికి కొన్ని ‘పద్ధతులు’ అందుబాటులో ఉన్నాయి. ఇందులోని ప్రాచుర్యం పొందిన పద్ధతే... ‘గేల్స్ మోడల్’. దీని సహాయంతో ప్రస్తుత వయసు, ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ సమయంలో రుతుక్రమం మొదలైంది, మొదటి సంతానం ఏ వయసులో కలిగింది, దగ్గరి బంధువుల్లో ఎంత మందికి రొమ్ముక్యాన్సర్ ఉంది లాంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అంచనా వేస్తారు. అయితే ‘గేల్స్ మోడల్’కు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇందులో ఒవేరియన్ క్యాన్సర్ చరిత్రను చేర్చలేదు. దగ్గరి బంధువులుగాక... కాస్తంత దూరపు బంధువులు అంటే చిన్నమ్మ పెద్దమ్మలూ, వారి పిల్లలూ, వారి పిల్లల పిల్లలూ (మనవలను) చేర్చలేదు. అయినా చాలా అంశాల ఆధారంగా చాలావరకు దీన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ సదరు మహిళ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉన్నవారిలో ఉన్నారని తేలితే... దాన్ని బట్టి నివారణ చర్యలు తీసుకోవచ్చు.
పౌష్టికాహారం : ముదురు ఆకుపచ్చరంగులో ఉన్న ఆకుకూరలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్యాన్సర్ గుణాలున్న అన్ని రకాల కూరగాయలను ఆహారంలో పుష్కలంగా తీసుకోవాలి. వ్యాయామం : మహిళలంతా ఒక మోస్తరు వ్యాయామాలను రోజూ కనీసం 30 నిమిషాలు చేయాలి. వారంలో ఐదు రోజులైనా వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామాల వ్యవధిని 45 నిమిషాలకు పెంచుకుంటే రొమ్ముక్యాన్సర్ రిస్క్ మరింత తగ్గుతుంది. అదే కాస్త చిన్న వయసు పిల్లలైతే ఈ వ్యాయామ వ్యవధిని 60 నిమిషాలకు పెంచుకోవాలి. ఆల్కహాల్ అలవాటు ఉంటే దాన్ని పూర్తిగా మానేయాలి.
మందులతో నివారణ : కుటుంబ చరిత్రలో ఎవరికైనా రొమ్ముక్యాన్సర్ ఉన్నా లేదా బీఆర్‌సీఏ అనే జన్యువులో మార్పు ఉన్నా టామోక్సిఫెన్, ర్యాలోక్సిఫీన్ వంటి మందులతో దీన్ని నివారించవచ్చు. ఇలా రొమ్ముక్యాన్సర్ వచ్చాక చేయాల్సిన చికిత్సను నివారించడానికి అవకాశం ఉంది. ∙శస్త్రచికిత్సతో నివారణ: బీఆర్‌సీఏ అనే జన్యువులో మార్పులు ఉన్నట్లయితే ‘ప్రొఫిలాక్టిక్ మాసెక్టమీ’ అనే ముందస్తు శస్త్రచికిత్సతో రొమ్ము క్యాన్సర్‌ను నివారించవచ్చు.
ఈ–నోస్‌తో ముందే తెలుసుకోవచ్చు...
రొమ్ముక్యాన్సర్ విషయంలో ఇది భవిష్యత్తులో కనిపించబోతున్న విప్లవాత్మకమైన ఆశారేఖ. అదేమిటంటే... కొన్ని రకాల క్యాన్సర్లను ఇప్పుడు కేవలం మూత్రపరీక్ష వంటి చిన్న పరీక్షతోనూ తెలుసుకునే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ‘ఇజ్రాయెల్‌లోని బీర్షెబాలో ఉన్న బెన్–గురియన్ యూనివర్సిటీ ఆఫ్ నెగావ్ కు చెందిన పరిశోధకులు ఈ పరిశోధన తాలూకు ప్రాథమిక అంశాలను రూపొందించారు. దీని సహాయంతో రొమ్ముక్యాన్సర్‌ను చాలా నిశితంగానూ, చాలా త్వరగానూ పట్టేయడానికి వీలవుతుంది. దాంతో చికిత్స ఆలస్యం కావడం అనే పరిస్థితి తప్పిపోయి, ఎంతోమంది మహిళల ప్రాణాలు నిలబడతాయి.
ఇదీ క్యాన్సర్ రోగులకు అందుబాటులోకి రాబోతున్న మరో ఆశారేఖ. ఇక్కడ ఒక చిన్న తమాషా కూడా ఉంది. మూత్రం ద్వారా పట్టేసేందుకు ఉద్దేశించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని పరిశోధకులు నిర్మించారు. దీనికి పెద్దగా ఖర్చుకూడా అవసరం లేదు. మూత్రాన్ని పరిశీలించి, రొమ్ముక్యాన్సర్ తాలూకు వాసన పట్టేస్తుందనే ఉద్దేశంతోనో ఏమో ఈ ఎలక్ట్రానిక్ పరికరానికి ‘ఈ–నోస్’ (ఎలక్ట్రానిక్ ముక్కు) అని పిలుస్తున్నారు. దాంతో మహిళారోగులు భవిష్యత్తులో మామోగ్రఫీ లాంటి అడ్వాన్స్‌డ్ పరీక్షలతో కాకుండా... కేవలం కొద్ది ఖర్చుతోనే రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకునే అవకాశం రాబోతోంది.
రొమ్ముక్యాన్సర్ వస్తే దాని నుంచి దాదాపు 90 శాతం మంది రోగులు విముక్తమయ్యేలా ఇప్పటికే సైన్స్ అభివృద్ధి సాధించింది. ఈ–నోస్ వంటి మరెన్నో ఆవిష్కరణలతో దాదాపుగా అందరూ ఈ జబ్బునుంచి విముక్తమయే రోజూ ఒకటి వస్తుంది. ఈలోపు మనం చేయాల్సిందల్లా రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన పెంచుకొని, రిస్క్‌ఫ్యాక్టర్లు ఉన్నవారు తగిన స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తూ, నివారణ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే చాలు.
Comments
Please login to add a commentAdd a comment