గూడు కట్టుకున్న దిగులు మాటలతోనే బద్దలవుతుంది.. మనసు తేలికపడుతుంది
బతుకు మీద నమ్మకం కలుగుతుంది.. జీవిక పట్ల ఆశ మొదలవుతుంది..
ఇప్పుడు ఈ ప్రపంచానికి కావల్సింది ఆ దిగులు దిబ్బను పగలకొట్టే మాటల డైనమైట్ ..
యెస్.. మౌనంతో ముడుచుకుపోయిన మనసును పెకల్చే ఆ డైనమైటే డైలాగ్ ...
మనుషుల మధ్య స్నేహాన్ని.. సంబంధాల మధ్య అనుబంధాలను పెంచే డైలాగ్ ఉండాలి..
డైలాగ్‌లేని డార్క్‌నెస్‌లో ముందుగా కూరుకుపొయ్యేది గ్లామర్ వరల్డే...
ఆ దుష్ప్రభావమే సినిమా సెలెబ్రిటీల సూసైడ్స్..
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య(14జూన్, 2020) కలవరపెట్టింది. బయటకు కనిపించే కారణాల వరకు అవకాశాల్లేకుండా లేడు. చేతిలో రెండు సినిమాలున్నాయట. ఇప్పటి వరకు చేసినవీ పేరునే కాదు డబ్బునూ ఆర్జించినవే. మరి సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు. అతని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లను బట్టి ఒంటరితనం, డిప్రెషన్ అని అంచనావేస్తున్నారు. డిప్రెషన్‌కు సినిమా తారలు కొత్తకాదు.. సినిమా తారలకూ డిప్రెషన్ పాత కంపానియనే. హీరో, హీరోయిన్‌లుగా కాక నటీనటులుగా నిలిచిపోయిన అనాటి కళాకారులు చాలా మందికి తర్వాత కాలంలో వేషాలు కరువై డిప్రెషన్ ఫ్రెండ్ అయింది. వెండితెర వెలుగుల నీడగా మారిన వాళ్లను ఆర్థిక కష్టాలూ ఆటోగ్రాఫ్ అడిగాయి. డీలా పడిపోలేదు. మనసు విప్పి మాట్లాడారు.
తాము అనుభవిస్తున్న క్షోభను తోటివారితో పంచుకున్నారు. మాట సాయం, నైతిక స్థైర్యం పొందగలిగారు. గెలుపు, ఓటములు కాదు బతకడం ముఖ్యం అని ముందుకు సాగారు. సంపాదించిన కీర్తిని కాదు బతకాలన్న కాంక్షను సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు టీవీ లేదు.. ప్రైవేట్ చానల్స్ ఊహే అందలేదు. గ్రీన్ రూమ్ తప్ప ఇంకో చోటులో ఇమడలేరు. షూటింగ్ స్పాట్ కాకుండా మరో ప్రపంచం తెలియదు. అంటే ఇంకో ఉపాధి ఊసే లేకపోయినా.. రాకపోయినా బతికారు. ప్రాణం పెట్టుకున్న అభిరుచి జీవిత కాలం భరోసా ఇవ్వకపోయినా దాన్ని వృత్తిగా ఆస్వాదించిన క్షణాలనే నెమరువేసుకుంటూ స్నేహితులను పెంచుకుంటూ జీవించారు. ఈరోజుకీ వాళ్లను తలుచుకుంటోంది కేవలం వాళ్లలోని ప్రతిభతోనే కాదు సమస్యల్లో వాళ్లు ప్రదర్శించిన ధైర్యానిక్కూడా. ఈ స్ఫూర్తే కదా అభిమానులకు కావాల్సింది! ఈ హీరోయిజానికే కదా ఫేవరెట్స్ పెరగాల్సింది.
పరిమితి చెదిరి పరిధి పెరిగింది..
ఇదివరకటితో పోలిస్తే అవకాశాలు మెండు. రెమ్యునరేషనూ సంతృప్తికరంగానే ఉంటోంది. ఫాలోయింగ్ ఉన్నప్పుడే లైఫ్‌ను సెటిల్ చేసుకోవాలనే ఎరుకా హెచ్చింది. ఈ సంపాదనను మరో రంగంలో మదుపుగా పెట్టాలనే ఆలోచనా వచ్చింది. పాతతరం నటీనటుల్లా ఎముకలేని దానాలతో కష్టార్జితాన్ని కరిగించుకోవట్లేదు. అవసరం ఉన్నప్పుడు మాత్రం చేయి అందివ్వడానికి వెనకంజ వేయడంలేదు. ఇంతగా ప్లాన్ చేసుకున్న ఈ షెడ్యూల్‌లో హఠాత్తుగా ఆత్మహత్యలెందుకు ప్లేస్ అవుతున్నాయి? నటనా తృష్ణకు ఈ రోజు సినిమా ఒక్కటే మాధ్యమంగా లేదు. థియేటర్ ఒక్కటే ప్రామాణికంగా కనిపించడం లేదు. ప్రైవేట్ చానెల్స్ వస్తూవస్తూనే సీరియళ్లు, రియాలిటీ షోలతో చాన్స్‌లు చూపించాయి.
మాధురి దీక్షిత్, శిల్పా శెట్టి, సొనాలి బెంద్రె, వివేక్ ఒబెరాయ్ లాంటి స్టార్స్, జావేద్ జఫ్రీ, అనుపమ్ ఖేర్ (సమ్‌థింగ్ సే టు అనుపమ్ అంకుల్), కిరణ్ ఖేర్ వంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, అనురాగ్ బసు, అను మాలిక్ వంటి దర్శకులు, సంగీత దర్శకులూ ఈ స్పేస్‌ను ఉపయోగించుకుంటున్నారు. ప్రేక్షకులు తమను మరిచిపోకుండా చూసుకుంటున్నారు. అంతెందుకు ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తో అమితాబ్‌ను ‘బిగ్ బి’గా నిలబెట్టింది ఈ స్మాల్ స్క్రీనే కదా. సల్మాన్ ఖాన్, సంజయ్‌దత్‌లు ‘బిగ్ బాస్’ను నిర్వహించారు. ఆ ప్రేరణతో దక్షిణాది భాషల్లోనూ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ .. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ని ఆడించారు. ‘బిగ్‌బాస్’నూ నడిపించారు. ఇప్పుడు ప్రతి చానెల్‌లోని దాదాపు అన్ని రియాలిటీ షోలకు సినిమా తారలే యాంకర్లు.
ప్రేక్ష మోహతా
క్రైమ్ పెట్రోల్ (క్రైమ్ సీరియల్) యాక్టర్. వయసు 26 ఏళ్లు. ఇండోర్‌లోని తన ఇంట్లో మొన్న (2020) మే, 26న ఉరితో జీవితాన్ని అంతం చేసుకుంది. కెరీర్‌కు సంబంధిం చిన ఆందోళన, నిరాశ, వ్యాకులతతో బాధపడుతున్నట్టు సూసైడ్ నోట్‌లో రాసింది.
కుశల్ పంజాబీ
మోడల్, సినిమా, టీవీ నటుడు. 2019, డిసెంబర్ 26న ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం.. డిప్రెషనే.
నితిన్ కపూర్
తెలుగు సినిమాల నిర్మాత. 2017, మార్చి 14న పై అంతస్తు నుంచి దూకి ప్రాణాలు వదిలాడు. అతనూ మానసిక అనారోగ్యంతో బాధపడ్డట్టు సమాచారం.
ప్రత్యూష బెనర్జీ
‘బాలికా వధు’ సీరియల్‌లో ఆనంది పాత్రతో ప్రాచుర్యం పొందిన నటి. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ కూడా. 2016, ఏప్రిల్ 1న ఆత్మహత్య చేసుకుంది.
ప్రత్యూష
రాయుడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల అటెన్షన్ పొందిన తెలుగు నటి. హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ అయ్యే సమయంలో 2002, ఫిబ్రవరి 2న ఆత్మహత్యతో జీవితానికే ముగింపు చెప్పుకుంది. కారణం ప్రేమ వ్యవహారమే.
రంగనాథ్
ఒకప్పటి తెలుగు హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్. దాదాపు 300 పై చిలుకు చిత్రాల్లో నటించిన రంగనాథ్ 2015, డిసెంబర్ 19న బలవన్మరణంతో ఈ లోకాన్ని విడిచిపోయాడు.
ఉదయ్ కిరణ్
‘చిత్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమై ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ తో ఫేవరేట్ యాక్టర్‌గా మారాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల డిప్రెషన్‌కు లోనై 2014, జనవరి 5న ఆత్మహత్య చేసుకున్నాడు.
ఫటాఫట్ జయలక్ష్మి
తెలుగు, తమిళ, మలయాళ నటి. అంతులేని కథలో ఆమె పోషించిన పాత్ర ఊతపదం ఫటాఫట్. దాంతో ఆమె స్క్రీన్ నేమ్ ‘ఫటాఫట్ జయలక్ష్మి’ అయింది. లవ్ ఫెయిల్యూర్‌తో మనస్తాపం చెంది 1980లో ఆత్మహత్య చేసుకుంది.
గురుదత్
వసంత్ కుమార్ శివశంకర్ పడుకోణే తెర మీద గురుదత్ టైటిల్ కార్డ్‌తో కనిపించాడు.. అలరించాడు. ప్యాసా, కాగజ్ కె ఫూల్, సాహిబ్ బీబీ ఔర్ గులామ్, చౌద్‌వీ కా చాంద్ సినిమాలు ఇప్పటికీ గురుదత్‌ను సజీవంగా నిలుపుతున్నాయి. 1964, అక్టోబర్ 10న ఆల్కహాల్‌లో నిద్రమాత్రలు కలుపుకొని శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు.
కునాల్ సింగ్
‘ప్రేమికుల రోజు’ సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా హీరోనే కునాల్ సింగ్. 2008, ఫిబ్రవరి 7న ఉరివేసుకొని చనిపోయాడు. అంతకు కొన్ని నెలల ముందు కూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడట మణికట్టు కొసుకొని.
జియా ఖాన్
రామ్‌గోపాల్ వర్మ ‘నిశ్శబ్ద్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. ఆమిర్ ఖాన్ ‘గజినీ’లోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది. 2013, జూన్ 3న సూసైడ్ చేసుకుంది. కారణం.. బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలీ కొడుకు సూరజ్ పంచోలీ (‘హీరో’ ఫేమ్)తో ప్రేమ.. వైఫల్యం.
సిల్క్ స్మిత
తెలియనది ఎవరికి? వందల సినిమాల్లో నటించి అప్పటి యువతకు ఆరాధ్య దేవతగా నిలిచింది. 1996, సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకొని సినిమా అభిమానులందరినీ షాక్‌కు గురిచేసింది.
మోనల్ నావల్
తమిళ సినిమాల్లో నటించిన మోనల్... ఫేమస్ హీరోయిన్ సిమ్రన్‌కు చెల్లెలు. 2002లో చెన్నైలోని తన ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది.
అక్కడ కూడా
మానసిక నిర్బలత్వానికి ఏ వుడ్ అయినా ఒకటే. సైకియాట్రీకన్సల్టేషన్ పట్ల సంకోచాలేమీ లేని పాశ్చాత్య సమాజంలోని నటులు కూడా ఆత్మహత్య అనే బలహీన క్షణాన్ని కౌగిలించుకున్నారు. హాలీవుడ్ ప్రసిద్ధులు రాస్ అలెగ్జాండర్, మార్లిన్ మాన్రో, స్టాన్లీ ఆడమ్స్, ఎలిజబెత్ హార్ట్‌మన్, బ్రాడ్ డేవిస్, రిచర్డ్ ఫ్రాన్స్ వర్త్, రాబిన్ విలియమ్స్, బ్రిటిష్ యాక్ట్రెస్, మోడల్ లూసీ గార్డన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సూసైడ్స్ లిస్ట్ కూడా పెదద్దే.
నటనకే కాదు గొంతు అరువివ్వడానికీ అవకాశాలున్న కాలం ఇది. యానిమేషన్ పిక్చర్స్‌కి కూడా ఫీచర్ ఫిల్మ్స్‌కున్నంత డిమాండ్ ఉంటోంది. అన్ని భాషల్లోకి అనువాదం అవుతున్న ఈ సినిమాలకు ఆయా భాషల్లోని స్టార్స్ తమ గొంతును అరువిస్తున్నారు. స్వరంతో నటించే ఈ జాబ్ కూడా సంతృప్తినిచ్చేదే..
ఖ్యాతినార్జించి పెట్టేదే.
షార్ట్‌ఫిల్మ్స్‌కూ కాల్‌షీట్లు
యూట్యూబ్ చానెల్స్ తమ ఉనికితో మరిన్ని ఆపర్చునిటీస్‌ను పెంచాయి. క్రియేటివిటీనే పెటుబడిగా మార్చాయి. షార్ట్ ఫిల్మ్స్‌కు మెయిన్ స్ట్రీమ్ సినిమా స్టేటస్‌ను తెచ్చాయి. సోషల్ మీడియా దానికి పబ్లిసిటీ పార్ట్‌నర్ అయింది. ఔత్సాహిక టెక్నీషియన్లు, యాక్టర్లకు బిగ్ స్క్రీన్ ఎంట్రీ టికెట్‌గా, అలాగే బిగ్ స్క్రీన్ టెక్నీషియన్లు, యాక్టర్లకు ఫాలోయింగ్ పెంచే ప్లాట్‌ఫామ్‌గా స్పేస్ తీసుకున్నాయీ యూ ట్యూబ్ చానళ్లు. అనురాగ్ కశ్యప్ వంటి డైరెక్టర్లు, నసీరుద్దీన్ షా, దీప్తి నావల్, నందితా దాస్, కాజోల్ వంటి తారలు యూట్యూబ్ చానెల్ షార్ట్ ఫిల్మ్స్ కోసం కాల్షీట్లు అడ్జస్ట్ చేసినవారే.
ఎవర్ ది టాప్
ఈ అవకాశాల పందిరి ఇలా ఉండగానే ఓటీటీ (ఓవర్ ది టాప్) వేదిక తయారైంది. టీవీలు, యూట్యూబ్‌లతో థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గింది అనే మాట వైరల్ అవుతూండగానే యాప్‌ల రూపంలో స్మార్ట్ టీవీల్లోకి దూరిపోయింది. సినిమాతో పోటీ పడే బడ్జెట్.. దానికి మించిన సాంకేతిక విలువలు.. ఫీచర్ ఫిల్మ్ యాక్టర్లూ టచప్ చేసుకునేలా చూశాయి. మూవీస్‌కు స్ట్రీమింగ్ పార్టనర్స్‌గా ఉంటూనే ఒరిజనల్స్‌ను రిలీజ్ చేశాయి. వెబ్ సిరీస్‌తో టీవీ సీరియళ్లు తమ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేను తరచి చూసుకోవాల్సిన పరిస్థితి. సృజన, ప్రతిభకు ఆకాశం దాటిపో యింది హద్దు. లైమ్‌లైట్‌లో ఉన్న సినిమా నటీనటులు వెబ్ సిరీస్, ఓటీటీ ఒరిజనల్స్ కోసం డేట్స్ బ్లాక్ చేసుకుంటున్నారు. దీనికి హాలీవుడ్ కూడా డై హార్డ్ ఫ్యాన్. మన దగ్గరా అన్ని భాషల ఫిల్మ్ వుడ్స్‌కు ఓటీటీ నుంచి ఇన్విటేషన్ ఉంది. వరల్డ్ సినిమాకు ఇంటినే స్క్రీనింగ్ థియేటర్‌గా చేసింది.
ఇప్పటికే బాలీవుడ్ నుంచి అనురాగ్ కశ్యప్, కరణ్ జోహార్, దిబాకర్ బెనర్జీ, జోయా అఖ్తర్‌లు దీనికోసం సినిమాలు తీశారు. సిరీస్‌లూ నిర్మించారు. సైఫ్‌అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ, పంకజ్ త్రిపాఠి, మనీషా కోయిరాలా, వివేక్ ఒబెరాయ్, రీచా ఛద్దా, వికీ కౌశల్, భూమి ఫడ్నేకర్, కియారా అద్వాణి, సుప్రియా పాఠక్, రత్నా పాఠక్ షా, అభయ్ డియోల్, రమ్యకృష్ణ వంటి సుప్రసిద్ధులంతా ఓటీటీలో నటించారు. కరోనా వల్ల థియేటర్‌లో రిలీజ్ కాని షూజిత్ సర్కార్ సినిమా ‘గులాబో సితాబో’ కూడా అమెజాన్‌లో విడుదలైంది. అజయ్ దేవ్‌గన్ కూడా ఈ వెబ్ చానెల్స్ కోసం సినిమా నిర్మిస్తున్నాడు. అందులో కాజల్, షబానా ఆజ్మీ నటిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా నెట్‌ఫ్లిక్స్ కోసం ధర్మ ప్రొడక్షన్స్ తీసిన ‘డ్రై వ్’ అనే చిత్రంలో నటించాడు. ‘బాలాజీ’ (బాలాజీ టెలిఫిలిమ్స్, బాలాజీ మోషన్ పిక్చర్స్) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేసుకుంది ‘బాలజీ ఆల్ట్’ పేరుతో. తెలుగు చిత్రసీమా ఓటీటీ తెర మీద కనిపిస్తోంది. నందిని రెడ్డి, జగపతి బాబు వంటి దర్శక, నటుల కంట్రిబ్యూషన్ మొదలైపోయింది. తెలుగు భాష తరపునా ‘ఆహా’ అనే స్క్రీన్ లాంచ్ అయింది.
కరోనాతో కలిసొచ్చిన కాలం..
ఫిల్మ్ దునియాలో ఓటీటీ ఒక విప్లవమే. సెన్సార్, డిస్ట్రిబ్యూషన్, థియేటర్ల తలనొప్పుల్లేకుండా ఓటీటీలో ప్లే చేసుకోవచ్చు. పైగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లు సిరీస్, సినిమాలు నిర్మించడానికీ సిద్ధంగా ఉన్నాయి భారతీయ ప్రధాన భాషల్లో... కథ నచ్చితే. దీంతో త్వరలోనే ప్రధాన స్రవంతి సినిమా స్కోప్ తగ్గుతుందనే అంచనాలు మొదలయ్యాయి. కరోనా ఆ ‘త్వరలో’ అనే భవిష్యత్తును వర్తమానం చేసేసింది. సమూహాలు.. సమూహ ప్రదేశాలు నిషేధించింది. షూటింగ్స్ ఆగిపోయాయి. పూర్తయిన సినిమాలు థియేటర్లకు వెళ్లే సీన్ లేదు. అనివార్యంగా ఓటీటీయే కనిపించింది. ‘గులాబో సితాబో’ బోణీ చేసింది. అలా ఓటీటీకి కాలం కలిసొచ్చింది.
ఆశావాదం
‘ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి తప్పకుండా తెరిచే ఉంటుంది..’ అనే మాటను వింటూనే ఉంటాం. కరోనాతో సినిమాలు ఆగిపోతే... ఒటీటీ ఓపెన్ అయింది. దాని పట్ల ప్రేక్షకులకున్న క్రేజ్ కూడా అర్థమైంది. షూటింగ్‌లు ఆగిపోవడం తాత్కాలికమే (ఈ వ్యాసం రాస్తున్న సమయానికి వీటికీ గ్రీన్‌సిగ్నల్ వచ్చింది). ఇది మనకు మాత్రమే ఉన్న సమస్య కాదు.. ప్రపంచమంతా ఎదుర్కొంటున్నదే. కాబట్టి పరిష్కారమూ అంతే వేగంగా దొరుకుతుంది. ఎటొచ్చి కొంత సంయమనం.. కాస్తంత సహనం అవసరం. కాని ఇప్పుడంతా ఇన్‌స్టంట్ టైమ్.. వేచి చూసేంత ఓపిక లేదు. క్షణాల్లో ఫలితాలు కావాలి. లేకపోతే భయం.. ఆందోళన.. అభద్రత. దాన్నుంచే ఒత్తిడి.. వ్యాకులత. కుటుంబంతో గడిపితే ఉపశమనం కలుగుతుంది. సన్నిహితులతో చెప్పుకుంటే బరువు దిగుతుంది. ఆ షేరింగే మిస్ అయింది చాలా మంది సెలబ్రిటీల ఆత్మహత్యల కేసుల్లో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ సహా.
కరోనాతో దారి మూసుకుపోయిందన్న దిగులా? ప్రత్యామ్నాయ వేదిక అనే మరో దారి తెరిచే ఉంది.. దాని కోసం నటించిన అనుభవమూ ఉందన్న ధీమాను పట్టుకోలేని నిస్సహాయతా? అమ్మానాన్న, తోబుట్టువుల ముందు బయటపడితే వాళ్లు టెన్షన్ పడతారేమోనన్న బాధా? ఆ మానసిక సంఘర్షణను స్నేహితులతో చెప్పుకొనీ గుండె నిండా ఊపిరి పీల్చుకోవచ్చు.. ఓస్ ఇంతేనా ఈ పటాటోపం అని పలుచన చేస్తారనే బెరుకా? అయినవాళ్ల దగ్గర ఇన్ని సంకోచాలెందుకు? మనసులో ఉన్నది చెప్పుకోవడానికి తటపటాయిస్తున్నామంటే ఆ చనువు, చొరవ మిస్ అయినట్టే. అంటే అవతలి వాళ్లను మనవాళ్లుగా చూడట్లేదనో.. మనవాళ్లనుకున్నవాళ్లు మనల్ని కేవలం విజేతలుగా మాత్రమే పరిగణిస్తున్నట్టో! ఆ అంతరమే మాటకు, చెవికీ వర్తించి మనసు ముడుచుకుపోయేలా చేస్తుంది. ఇన్‌సెక్యూరిటీ, యాంగై్జటీ తనను ఆక్యుపై చేస్తున్నా గాంభీర్యం ప్రదర్శించమని పోరుతుంది మెదడు. ఆర్జించిన పేరుప్రఖ్యాతుల మాయ ఇది. అందుకే ఆత్మీయులే ఈ స్పృహతో మెదలాలి.
గ్లామర్ మేకప్ కింద తడి చారికలుంటాయి. వాటిని గమనించాలి.. మాటలతో ఆ మనసును కదిలించాలి.. చెవి ఒగ్గాలి. నెమ్మదిగా గూడు కట్టుకున్న దిగులు మాటలుగా కరగడం మొదలుపెడుతుంది. కన్నీళ్లుగా ఉబికి వస్తుంది. దుఃఖంతో బహిర్గతమవుతుంది. ఆ భావోద్వేగమంతా పోయి ఖాళీ అయిన గుండె ధైర్యంతో కొట్టుకోవడం మొదలుపెడుతుంది. నిర్భయంగా ముందుకు సాగేందుకు సన్నద్ధమవుతుంది నడక. జీవితానికి హ్యాపీ కంటిన్యుయేషనే... తర్వాత అవాంతరాలు ఉండవని కాదు.. లెక్కలోకి రావు అని. ఆత్మహత్యల జాబితా తగ్గుతుందీ అని.
డిప్రెషన్ అంతు చూసిన తారలు
తాను డిప్రెషన్‌లోకి వెళ్లానని.. సైకియాట్రిస్ట్, ఫ్యామిలీ సపోర్ట్‌తో బయటపడ్డానని మీడియా ముందు రివీల్ చేసి బాలీవుడ్‌లో స్టార్ డిప్రెషన్‌ను బయటపెట్టింది దీపికా పడుకోణ్. మానసిక అనారోగ్యం గురించి మాట్లాడితే పోయేదేమీ లేదు వ్యాకులత తప్ప అనే స్థైర్యాన్నీ తోటి సెలబ్రిటీలకు పంచింది. దీనిమీద అవగాహన కలిగించడానికి తన చెల్లి అనిషా పడుకోణ్‌తో కలిసి ‘ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్’ను స్థాపించింది. ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా, అలియా భట్ వంటి తారలూ తాము డ్రిపెషన్‌ను ఎదుర్కొన్నామని, కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయంతో దాన్నుంచి రిలీవ్ అయ్యామనీ చెప్పారు. దృష్టికి రాని ఇలాంటి సెలబ్రిటీలు ఇంకెందరో ధైర్యమివ్వడానికి!
– సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment