మహా ‘శివ’రాత్రి మార్మోగిపోయేలా | Special Story On Maha Shivaratri In Telugu | Sakshi
Sakshi News home page

‘శివ’రాత్రి స్పెషల్‌ స్టోరీ

Published Sun, Feb 16 2020 11:30 AM | Last Updated on Sun, Feb 16 2020 2:14 PM

Special Story On Maha Shivaratri In Telugu - Sakshi

ముక్కోటి దేవతలలో శివుడు సనాతనుడు. శివుడు భోళాశంకరుడు. శివుడు భక్త వశంకరుడు. శివుడు పంచభూతాలకు అధినాథుడైన భూతనాథుడు. శివుడు భవరోగాలను నయం చేసే వైద్యనాథుడు. సమస్త చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు. ఏదో మాట వరసకు జన్మానికో శివరాత్రి అంటారు గాని, నిజానికి ఏటా మహాశివరాత్రి పర్వదినం వస్తూనే ఉంటుంది. లోక రక్షణ కోసం శివుడు గరళాన్ని దిగమింగి కంఠంలో దాచుకున్న రోజును మహాశివరాత్రిగా పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా, ముందుగా హాలాహలం పుట్టింది. 

హాలహల విషజ్వాలలు ముల్లోకాలనూ అల్లకల్లోలం చేస్తుండటంతో దేవదానవులంతా పరమశివుడిని శరణు వేడుకున్నారు. భక్త వశంకరుడైన శివుడు మరో ఆలోచన లేకుండా, హాలాహలాన్ని ఒడిసి పట్టి, దానిని దిగమింగి గొంతులో బిగించి బంధించాడు. గరళమైన హాలాహల ప్రభావానికి శివుని కంఠం కమిలిపోయి నీలిరంగులోకి మారడంతో నీలకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడు స్పృహతప్పిపోయాడు. పార్వతీదేవి భర్త తలను ఒడిలోకి తీసుకుని దుఃఖించసాగింది. జరిగిన పరిణామానికి దేవదానవులందరూ భీతిల్లారు. శోకసాగరంలో మునిగిపోయారు. శివుడు తిరిగి మెలకువలోకి వచ్చేంత వరకు అందరూ జాగరం చేశారు. నాటి నుంచి శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివుని పూజించి, జాగరం చేయడం ఆనవాయితీగా మారినట్లు పురాణాల కథనం.

పురాణాలే కాదు, వాటి కంటే పురాతనమైన వేదాల కంటే ముందు నుంచే భారత ఉపఖండంలో ప్రజలు శివారాధన చేసేవారు. మధ్యప్రదేశ్‌లోని భీమ్‌భెట్కా గుహలలోని కుడ్యచిత్రాలు ఆనాటి శివారాధనకు నిదర్శనాలుగా కనిపిస్తాయి. అవి క్రీస్తుపూర్వం ఎనిమిదివేల ఏళ్ల నాటివని చరిత్రకారుల అంచనా. భీమ్‌భెట్కా గుహలలో శివతాండవ దృశ్యాలు, శివుడి త్రిశూలం, ఆయన వాహనమైన నంది చిత్రాలు నేటికీ నిలిచి ఉన్నాయి. సింధులోయ నాగరికత కాలంలో హరప్పా మొహెంజదారో ప్రాంతాల్లోని ప్రజలు శివుడిని పశుపతిగా ఆరాధించేవారనేందుకు మొహెంజదారోలో జరిపిన తవ్వకాలలో ఆధారాలు దొరికాయి. వేద వాంగ్మయం శివుడిని ప్రధానంగా రుద్రుడిగా ప్రస్తుతించింది.

రుగ్వేదంలో మొదటిసారిగా ‘శివ’నామం కనిపిస్తుంది. రుద్రాంశ ప్రళయ బీభత్సాలకు దారితీసే ప్రకృతి వైపరీత్యాలకు కారణమైతే, శివాంశ కాలానుకూలమైన మంచి వర్షాలకు కారణమవుతుందని వేద స్తోత్రాలు చెబుతున్నాయి. గ్రీకు దేవుడు ‘డయోనిసిస్‌’కు శివుని పోలికలు ఉండటంతో భారత భూభాగంపై దండయాత్రకు వచ్చిన అలెగ్జాండర్‌ ఇక్కడి శివుడిని ‘ఇండియన్‌ డయోనిసిస్‌’గా అభివర్ణించాడు. కాలక్రమేణా భారత ఉపఖండంలో శివుడినే పరమదైవంగా పరిగణించే శైవమతం వ్యాప్తిలోకి వచ్చింది. క్రీస్తుపూర్వం తొలి సహస్రాబ్దిలో శైవమతం విస్తృతంగా వ్యాపించింది. 

భగవద్గీత కంటే ముందునాటి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో శైవమత మూలాలు కనిపిస్తాయి. భారత ఉపఖండమే కాకుండా, శ్రీలంక, కంబోడియా, వియత్నాం, ఇండోనేసియా వంటి ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించింది. సనాతన మతాలలో శైవమతం శాక్తేయానికి దగ్గరగా ఉండటంతో పలుచోట్ల శివుడితో పాటు శక్తి ఆరాధన జమిలిగా జరిగేది. అందుకే చాలాచోట్ల శైవక్షేత్రాలు, శక్తి పీఠాలు సన్నిహితంగా కనిపిస్తాయి. క్రీస్తుపూర్వం తొలి సహస్రాబ్దిలో చాలా రాజ్యాలు శైవాన్ని బాగా ఆదరించాయి. ఆ కాలంలోనే విస్తృతంగా శివునికి ఆలయ నిర్మాణాలు జరిగాయి.

అందరివాడు
శివుడు అందరివాడు. బ్రహ్మవిష్ణు దేవేంద్రాది దేవతలే కాదు, రావణుడు, బాణాసురుడు, భస్మాసురుడు వంటి దానవులు, వాలి వంటి వానరులు, సమస్త రుషులు, ఆది శంకరాచార్యుల వంటి ఆధ్యాత్మిక గురువులు, కన్నప్ప వంటి గిరిజనులు శివుని ఆరాధించిన వారే. కాళహస్తి మహాత్మ్యం కథనం ప్రకారం సాలెపురుగు, సర్పం, ఏనుగు కూడా శివుని పూజించినట్లు తెలుస్తోంది. దేవ దానవ మానవులకే కాదు, చరాచర సృష్టిలోని సమస్త జీవులకు శివుడే దైవమని పురాణాలు చెబుతున్నాయి. రామాయణ, మహాభారత కాలాల నాటికే శైవమత వ్యాప్తి విస్తృతంగా ఉండేది. బ్రహ్మ సృష్టికారకుడని, విష్ణువు స్థితికారకుడని, శివుడు లయకారకుడని పలు పురాణాలు చెబుతున్నా, శైవమతం ప్రకారం సృష్టి స్థితి లయలకు శివుడే కారకుడు. శివుడే పరబ్రహ్మ స్వరూపుడు. శివుడే ఆదిదేవుడు. సమస్త విశ్వానికీ శివుడే అధినాథుడు.

కర్ణాటకలోని మురుడేశ్వరుడు

శివుడిని వివిధ భంగిమల్లోని విగ్రహమూర్తిగానే కాకుండా, లింగరూపంలో పూజిస్తారు. చాలాచోట్ల శివాలయాల్లో శివుని పూర్తి విగ్రహాలకు బదులు శివలింగాలే కనిపిస్తాయి. శివపురాణం, లింగపురాణాల్లో శివుని మహిమలకు సంబంధించిన గాథలు విపులంగా కనిపిస్తాయి. అంతేకాదు, మిగిలిన పురాణాల్లోనూ శివుని ప్రస్తావన, శివునికి సంబంధించిన గాథలు కనిపిస్తాయి. సనాతన మతాలైన వైష్ణవ, శాక్తేయాల్లోనూ శివునికి సముచిత ప్రాధాన్యం కనిపిస్తుంది. స్మార్త సంప్రదాయంలోని పంచాయతన దేవతల్లో శివుడికీ స్థానం కల్పించారు. వైష్ణవం పుంజుకోక ముందు ఉత్తర దక్షిణ భారత ప్రాంతాల్లోని పలు రాజ్యాల్లో శైవానికి విపరీతమైన ఆదరణ ఉండేది. ప్రతి రాజ్యంలోనూ శివాలయాలు వెలిశాయి. వాటికి సంబంధించిన స్థల పురాణాలూ ప్రాచుర్యంలోకి వచ్చాయి. కుషానుల పాలనలో చలామణీలో ఉన్న బంగారు నాణేలపై నంది వాహనంతో శివుని బొమ్మను ముద్రించారంటే ఆనాటి కాలంలో శైవానికి ఎలాంటి ఆదరణ ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు
శైవ క్షేత్రాల్లో ప్రధానమైనవి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు. ఈ పన్నెండు క్షేత్రాలనూ శైవులు అత్యంత పవిత్ర క్షేత్రాలుగా పరిగణిస్తారు. గుజరాత్‌లోని సోమనాథ క్షేత్రం, జామ్‌నగర్‌లో నాగేశ్వర క్షేత్రం, ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలంలోని మల్లికార్జున క్షేత్రం, మధ్యప్రదేశ్‌లో ఉజ్జయినిలోని మహాకాలేశ్వర క్షేత్రం, ఇండోర్‌ సమీపంలోని ఓంకారేశ్వర క్షేత్రం, ఉత్తరాఖండ్‌లో కేదారనాథ క్షేత్రం, మహారాష్ట్రలో పుణె సమీపంలోని భీమశంకర క్షేత్రం, నాసిక్‌ వద్ద త్రయంబకేశ్వర క్షేత్రం, ఎల్లోరా వద్ద ఘృష్ణేశ్వర క్షేత్రం, ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలోని విశ్వేశ్వర క్షేత్రం, జార్ఖండ్‌లో దేవ్‌గఢ్‌ వద్ద వైద్యనాథ క్షేత్రం, తమిళనాడులో రామేశ్వరంలోని రామనాథ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పంచారామ క్షేత్రాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఐదు శైవ క్షేత్రాలు పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. అవి: అమరావతిలోని అమరలింగేశ్వరుని ఆలయం, ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయం, భీమవరంలోని సోమేశ్వర ఆలయం, పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర ఆలయం, సామర్లకోటలోని కుమార భీమేశ్వర ఆలయం. ఇవి అమరారామం, ద్రాక్షారామం, సోమారామం, క్షీరారామం, భీమారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి.

పంచభూత క్షేత్రాలు
ఐదు శైవ క్షేత్రాలు పంచభూత క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. వీటిలో నాలుగు తమిళనాడులో ఉంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉంది. తమిళనాడులోని జంబుకేశ్వరం జల క్షేత్రంగా, అరుణాచలం అగ్ని క్షేత్రంగా, కంచిలోని ఏకాంబరేశ్వరాలయం పృథ్వీక్షేత్రంగా, చిదంబరంలోని నటరాజ ఆలయం ఆకాశ క్షేత్రంగా, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి వాయు క్షేత్రంగా ప్రసిద్ధి చెందాయి.

ఆదియోగి
మన పురాణాలు ఆదియోగి శివుడేనని చెబుతాయి. పరమయోగులందరికీ శివుడే గురువని చెబుతాయి. సనాతన మతాలలో యోగసాధనకు విస్తృత ప్రాధాన్యం ఉంది. జీవుని అంతిమ లక్ష్యం కైవల్యమేనని, కైవల్యపథాన్ని చేరుకోవడానికి యోగమే మార్గమని, యోగసాధనతోనే జీవాత్మ పరమాత్మలో లీనమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. యోగ విద్యలో వివిధ పద్ధతులు ఉన్నా, శైవ సంప్రదాయానికి చెందిన గ్రంథాలు ఎక్కువగా హఠయోగానికే ప్రాధాన్యమిచ్చాయి. క్రీస్తుశకం ఒకటో శతాబ్దికి చెందిన ‘ఈశ్వర గీత’, పదో శతాబ్దికి చెందిన ‘శివసూత్ర’, ‘శివసంహిత’ వంటి గ్రంథాలు శైవ సంప్రదాయంలో యోగసాధనకు గల ప్రాశస్త్యాన్ని విపులంగా వివరిస్తాయి. భవబంధాలలో చిక్కుకున్న మనుషులు నిరంతరం ఈతిబాధల్లో కొట్టుమిట్టాడుతుంటారని, పరమాత్మను చేరుకోవాలంటే మనుషులకు యోగమే తగిన మార్గమని పదో శతాబ్దికి చెందిన కాశ్మీర శైవ పండితుడు అభినవగుప్తుడు తన రచనల్లో చెప్పాడు.

ఉపఖండానికి వెలుపల...
భారత ఉపఖండానికి వెలుపల సైతం ప్రాచీనకాలం నుంచి శివారాధన ఉండేది. ఇండోనేసియాలో శివుడిని ‘బటరగురు’గా ఆరాధిస్తారు. ‘బటరగురు’ అంటే ఆదిగురువు అని అర్థం. ‘బటరగురు’ శిల్పరూపం, ఆరాధన పద్ధతులు దాదాపు మన దేశంలోని దక్షిణామూర్తిని పోలి ఉంటాయి. ఇండోనేసియాలోని లువులో పురాతనమైన ‘బటరగురు’ ఆలయం ఉంది. ఈ ఆలయం క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్ది నాటిది. ఆగ్నేయాసియాలో బౌద్ధ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కాలంలో సైతం జావా దీవుల్లో శివారాధన కొనసాగేది. అక్కడి ప్రజలు శివుడిని బుద్ధుడు, జనార్దనుడు (విష్ణువు)తో సమానంగా ఆరాధించేవారు. అక్కడి ప్రజలు బుద్ధుడిని శివుని తమ్ముడిగా భావిస్తారు. కుషానుల కాలంలో మధ్య ఆసియా ప్రాంతంలోనూ శైవమత ప్రాబల్యం ఉండేది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న సోగ్డియా, యుతియాన్‌ రాజ్యాలలో శివారాధన జరిగేది. జపానీయులు పూజించే ఏడుగురు అదృష్టదేవతలకు శివతత్వమే మూలమని చరిత్రకారులు భావిస్తారు. తాంత్రిక ఆచారాలు పాటించే వజ్రయాన, మహాయాన బౌద్ధులు శివుడిని కూడా పూజిస్తారు. 

పరమశివునికి పదివేల పేర్లు
ప్రసిద్ధ దేవతలను సహస్రనామ స్తోత్రాలతో అర్చించడం పరిపాటి. అదే కోవలో శివ సహస్రనామ స్తోత్రం కూడా వాడుకలో ఉంది. అంతేకాదు, మహన్యాసంలో శివునికి దశసహస్రనామాలు ఉన్నాయి. అందులోని పదివేల పేర్లూ పరమశివుని గుణ విశేషాలను స్తుతించేవే! మహాదేవుడిగా, మహేశ్వరుడిగా, త్రినేత్రుడిగా, రుద్రుడిగా, హరుడిగా, శంభునిగా, శంకరునిగా భక్తులు శివుడిని ఆరాధిస్తారు. యోగముద్రలో ఉన్న శివుడిని దక్షిణామూర్తిగా, తాండవ భంగిమలోని శివుడిని నటరాజుగా కూడా పూజిస్తారు.

శివరాత్రి ప్రశస్తి
మహాశివరాత్రి నేపథ్యానికి సంబంధించి క్షీరసాగరమథన ఘట్టం అందరికీ తెలిసినదే. అయితే, ఇదేరోజు ఆదియోగి అయిన శివుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందాడని యోగ, తంత్ర గ్రంథాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజున జాగరం ఉంటూ యోగసాధన చేయడం ద్వారా కుండలినీ శక్తి జాగృతమవుతుందని కొందరు నమ్ముతారు. శివరాత్రి రోజున యోగసాధనలో గడిపేవారు తక్కువే గాని, ప్రసిద్ధ శైవ క్షేత్రాలు మొదలుకొని గ్రామ గ్రామాల్లో ఉండే శివాలయాలకు పెద్దసంఖ్యలో భక్తులు చేరుకుని పూజలు, భజనల్లో పాల్గొంటారు. ఆలయ ప్రాంగణాలలో రాత్రంతా జాగరం ఉండేలా నృత్యగాన కార్యక్రమాలతో సందడిగా గడుపుతారు. మన దేశంలోని వివిధ ఆలయాలతో పాటు నేపాల్‌లోని పశుపతినాథ ఆలయంలోను, పాకిస్తాన్‌లోని ఉమర్‌కోట్‌లో ఉన్న శివాలయంలోను శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. మారిషస్‌లో శివరాత్రి రోజున భక్తులు ‘గంగాతలావొ’ సరస్సులో పవిత్రస్నానాలను ఆచరిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement