
ఆధునికత పెరిగిన తర్వాత జనాలు ఆటలకు దూరమవుతున్నారు. ఆటలాడే వయసులోని పిల్లలను మోయలేని చదువుల భారం కుంగదీస్తోంది. క్రీడా మైదానాలు లేని ఇరుకిరుకు పాఠశాలల్లో చదువుకునే పిల్లలు ఆటలకు దూరమవుతున్నారు. దీనివల్ల కొందరు బాల్యంలోనే స్థూలకాయం బారిన పడుతున్నారు. ఇంకొందరు రోగనిరోధక శక్తి నశించి, తరచు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఆటలు ఆడే వారికన్నా టీవీల్లో వచ్చే క్రికెట్ మ్యాచ్‌లు, టెన్నిస్ మ్యాచ్‌లు, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూసే జనాలే ఎక్కువవుతున్నారు. ఆటలు ఆడితేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది గాని, కుదిరితే స్టేడియంలో, కుదరకుంటే ఇంట్లోనే టీవీల్లో క్రీడల మ్యాచ్‌లు చూసినంత మాత్రాన ఆరోగ్యానికి ఒరిగేదేమీ ఉండదు. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడల గురించి ఒక సింహావలోకనం...
ఆటలాడటం మనుషుల సహజ లక్షణం. పాకే వయసు నుంచే పిల్లలు ఆటల వైపు మొగ్గు చూపుతారు. బుడి బుడి అడుగులు వేసే వయసులో చేతికందిన వస్తువులతో తోచిన రీతిలో ఆటలాడతారు. ఆ వయసులోనే వారికి ప్రమాదాలకు తావులేని ఆటబొమ్మలను ఇవ్వాలి. సమవయస్కులైన పిల్లలు కూడా జత చేరితే పిల్లలు మరింత ఉత్సాహంగా ఆటలాడతారు. కాస్త ఊహ తెలిసిన వయసు వచ్చాక వీధుల్లోకి వెళ్లి ఆరుబయట స్నేహితులతో ఆటలాడేందుకు ఇష్టపడతారు. ఆటల వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. ఆటల్లోని సహజ వ్యాయామం వల్ల శరీరం తీరుగా ఎదుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తోటి పిల్లలతో ఆడుకోవడం వల్ల సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయి. బృందంతో కలసి పనిచేయడం, బృందానికి నాయకత్వం వహించడం, బృందం గెలుపు కోసం కృషి చేయడం వంటి లక్షణాలు పిల్లల్లో సహజసిద్ధంగానే పరిణతిని పెంచుతాయి.
చరిత్రపూర్వయుగం నుంచే ఆటలు...
చరిత్రపూర్వయుగంలోని ఆదిమానవులు సైతం ఆటలాడేవారు. పాతరాతి యుగంలోనే అప్పటి మానవులు ఆటలాడేవారు. నాటి మానవులు ఆటలాడిన ఆనవాళ్లు ఫ్రాన్స్‌లోని లాస్కాక్స్ గుహల్లో లభించాయి. ఆ గుహల్లోని రాతి గోడలపై అప్పటి మనుషులు పరుగు పందేల్లో పాల్గొంటున్నట్లుగా, కుస్తీలు పడుతున్నట్లుగా ఉన్న చిత్రాలు ఆదిమానవుల క్రీడాస్ఫూర్తికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. రాతిగోడలపై ఉన్న ఆ చిత్రాలు కనీసం 15,800 ఏళ్ల కిందటివని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కొత్తరాతి యుగం నాటికి మనుషులు మరిన్ని కొత్త క్రీడలను కనిపెట్టారు. ఈతకొట్టడం, ధనుర్బాణాలను తయారు చేసి, గురితప్పకుండా బాణాలను కొట్టడం వంటి క్రీడలకు సంబంధించిన గుహా చిత్రాలు జపాన్‌లో లభించాయి. అవి పదివేల ఏళ్ల కిందటివని శాస్త్రవేత్తల అంచనా. మానవుల మేధస్సు వికసించి, నెమ్మదిగా నాగరికతలు ఏర్పడిన కాలంలో మరికొన్ని క్రీడలను మనుషులు కనుగొన్నారు. ప్రాచీన సుమేరియన్, ఈజిప్టు, గ్రీకు, రోమన్, సింధులోయ నాగరికతల కాలంలో మనుషులు ఉత్సాహభరితంగా క్రీడా వినోదాన్ని ఆస్వాదించినట్లుగా అనేక ఆనవాళ్లు దొరికాయి.
నాగరికతల వికాసంలో క్రీడలు
సుమేరియన్ల కాలంలో కుస్తీలు, బాక్సింగ్, గాలాలతో చేపలు పట్టడం వంటి క్రీడలు ఉండేవి. ఈజిప్టు నాగరికత కాలంలో కుస్తీలు, బాక్సింగ్, చేపలు పట్టడం, లాంగ్ జంప్, ఈత, విలువిద్య వంటి క్రీడలు ఉండేవి. గ్రీకు నాగరికత కాలంలో కుస్తీలు, బాక్సింగ్, విలువిద్యలతో పాటు బల్లేలు విసరడం, బరువైన చక్రాలు విసరడం, రథాల పందేలు వంటి క్రీడలు ఉండేవి. ప్రాచీన నాగరికతలు వికసించిన తొలినాళ్లలో ప్రపంచంలో పలుచోట్ల రకరకాల క్రీడలు అభివృద్ధి చెందాయి. ప్రాచీన రోమ్, మెసొపొటేమియా, చైనా, ఐర్లాండ్, స్కాట్లాండ్ తదితర ప్రాంతాల్లో క్రీడలు ఉండేవి. ప్రాచీన నాగరికతల్లో నాటి మనుషులు ఆడిన క్రీడల్లో కొన్ని నేటికీ ఉనికిలో ఉన్నాయి. ప్రాచీన గ్రీకు సామ్రాజ్యంలోని ఒలింపియా పట్టణంలో క్రీస్తుపూర్వం 776లోనే తొలిసారిగా ఒలింపిక్స్ క్రీడల పోటీలు మొదలయ్యాయి.
ఒలింపిక్స్ క్రీడల పోటీలు ప్రారంభమైన కొన్నాళ్లకు ప్రాచీన గ్రీకు సామ్రాజ్యంలో ఇస్త్‌మియాన్, నెమియాన్, పైథియాన్ క్రీడల పోటీలు కూడా జరిగేవి. ఒలింపిక్స్ క్రీడల పోటీలు నాలుగేళ్లకు ఒకసారి జరిగేవి. పైథియాన్ క్రీడల పోటీలు కూడా నాలుగేళ్లకు ఒకసారి జరిగేవి. ఒలింపిక్స్ జరిగిన రెండేళ్లకు పైథియాన్ క్రీడల పోటీలు జరిగేవి. ఇస్త్‌మియాన్, నెమియాన్ పోటీలు రెండేళ్లకు ఒకసారి జరిగేవి. ప్రాచీన గ్రీకు సామ్రాజ్యంలో ఈ నాలుగు క్రీడల పోటీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఉండేవి. మధ్యయుగాల నాటికి మరిన్ని క్రీడలు కొత్తగా వచ్చి చేరాయి. గుర్రపు పందేలు, ఫుట్‌బాల్ తరహా క్రీడలు మధ్యయుగాల నాటివే.
ప్రాచీన భారతదేశంలో క్రీడలు
ప్రాచీన భారతదేశంలోనూ క్రీడలు ఉండేవి. వేదకాలంలోనే భారత భూభాగంలో జనాలు క్రీడలు ఆడేవారనేందుకు ఆధారాలు ఉన్నాయి. ‘‘కర్తవ్యం నా కుడి చెయ్యి... విజయఫలం నా ఎడమచెయ్యి’’ అనే అర్థంతో కూడిన అధర్వణవేద మంత్రం నాటి భారతీయుల క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుంది. కుస్తీ (మల్లయుద్ధం), బాక్సింగ్ (ముష్టియుద్ధం) వంటి క్రీడలు పురాణకాలంలోనే ఉండేవి. రామాయణ, మహాభారతాల్లో ఈ యుద్ధక్రీడల ప్రస్తావన కనిపిస్తుంది. కంసుడి ఆస్థానంలోని చాణూర ముష్టికులనే మల్లయోధులను కృష్ణబలరాములు మట్టి కరిపించిన పురాణగాథ అందరికీ తెలిసినదే. రథాల పోటీలు, గుర్రపు స్వారీ పోటీలు, విలువిద్య, ఈత, పోలో వంటి క్రీడలతో పాటు మల్లయుద్ధం, ముష్టియుద్ధం, బరువులను ఎత్తడం (వెయిట్ లిఫ్టింగ్), కత్తియుద్ధం (ఫెన్సింగ్), గదాయుద్ధం, బల్లేలను గురిచూసి విసరడం (జావెలిన్ త్రో), కరాటేకు మూలంగా భావిస్తున్న కలరి వంటి యుద్ధ క్రీడలకు కూడా ప్రాచీన భారతదేశంలో విశేష ఆదరణ ఉండేది.
బౌద్ధం ద్వారా కలరి యుద్ధక్రీడ క్రీస్తుశకం ఐదో శతాబ్దినాటికి చైనా, జపాన్ వంటి తూర్పుదేశాలకు వ్యాపించి, తర్వాతి కాలంలో ఆధునిక కరాటేగా రూపుదిద్దుకుందని కొందరు క్రీడాచరిత్రకారులు అభిప్రాయపడతారు. బౌద్ధాన్ని బోధించిన గౌతమబుద్ధుడు స్వయంగా మేటి విలుకాడు. ఆయనకు సుత్తి వంటి బరువైన వస్తువులను దూరంగా విసరడంలోనూ నైపుణ్యం ఉండేది. నేటికీ వీధుల్లో పిల్లలు ఆడుకునే గిల్లీదండా, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు ప్రాచీనకాలం నాటివే. మనసును ఏకాగ్రంగా ఉంచుకోవడానికి, శరీరాన్ని దృఢంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రాచీన భారతీయులు క్రీడలకు విశేషమైన ప్రాధాన్యం ఇచ్చేవారు. సింధులోయ నాగరికత నాటి ప్రజలు బల్లెం, ధనుర్బాణాలు, గద, చక్రం, కత్తి, బాకు, గొడ్డలి వంటి ఆయుధాలను ఉపయోగించేవారు.
వాటితో యుద్ధక్రీడలూ ఆడేవారు. ప్రాచీన భారతదేశాన్ని సందర్శించిన హ్యుయాన్ త్సాంగ్, పాహియాన్‌లు తమ రచనల్లో నాటి భారతీయులు ఆడుకునే రకరకాల క్రీడలను గురించి వివరించారు. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు పరుగు పందేలు, కుస్తీ పోటీలు, బంతులతో ఆడే రకరకాల ఆటలు, ఈత, బరువులెత్తడం వంటి క్రీడలతో ఉల్లాసం పొందేవారని వారు రాశారు. పన్నెండో శతాబ్దికి చెందిన సోమేశ్వరుడు తన ‘మనోల్లాస’ గ్రంథంలో భారశ్రమ (వెయిట్‌లిఫ్టింగ్), భ్రమణశ్రమ (పరుగు), మల్లస్తంభ (రెజ్లింగ్), ధనుర్వినోద (విలువిద్య) సహా నాటి జనాలు ఆడుకునే రకరకాల క్రీడలను విపులంగా వివరించాడు.
క్రీస్తుశకం పదహారో శతాబ్దిలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించుకున్న పోర్చుగీసు రాయబారి డోమింగో పేస్ ఇక్కడి క్రీడలను చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా మల్లయోధుడని, గుర్రపుస్వారీలోను, కత్తియుద్ధంలోను ఆయనకు అద్భుతమైన నైపుణ్యం ఉండేదని డోమింగో పేస్ తన రచనల్లో రాశారు.
మొఘల్ చక్రవర్తుల హయాంలో కూడా భారతదేశంలో క్రీడలకు విశేషమైన ఆదరణ ఉండేది. ఆగ్రా కోట, ఢిల్లీలోని ఎర్రకోట మొఘల్‌ల హయాంలో క్రీడాపోటీలకు ప్రధాన వేదికలుగా ఉండేవి. ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలో విరివిగా హనుమాన్ ఆలయాలను స్థాపించి, ఆ ఆలయాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్రీడా వ్యాయామశాలల ద్వారా యువకులను క్రీడల వైపు, వ్యాయామం వైపు ప్రోత్సహించాడు. స్వాతంత్య్రపూర్వం నాటి ప్రముఖుల్లో స్వామి వివేకానంద ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు, గొప్ప క్రీడాకారుడు, క్రీడాభిమాని కూడా. ఆయనకు ఫుట్‌బాల్, ఫెన్సింగ్, బాక్సింగ్, ఈత, మల్లయుద్ధం వంటి క్రీడల్లో మంచి ప్రావీణ్యం ఉండేది. ఒకసారి వివేకానంద ‘భగవద్గీత చదవడం కంటే ఫుట్‌బాల్ ఆడటం ద్వారా స్వర్గానికి త్వరగా చేరువకాగలం’ అని చెప్పిన మాటలు ఆయన క్రీడాభినివేశానికి అద్దం పడతాయి.
బ్రిటిష్‌కాలంలో ఆధునిక క్రీడలు
బ్రిటిష్‌కాలంలో భారతదేశంలోకి ఆధునిక పాశ్చాత్య క్రీడలు అడుగుపెట్టాయి. బ్రిటిష్‌వారు భారత్‌కు వచ్చేనాటికి ఇక్కడ బాగా ఆదరణ పొందిన క్రీడలను వారు కూడా నేర్చుకున్నారు. బ్రిటిష్‌వారు ఇక్కడకు వచ్చేనాటికి పుణే ప్రాంతంలో ‘పూనా’ అనే ఆట ఆడేవారు. బ్రిటిషర్లు దీనికే కొద్దిపాటి మార్పులు చేసి, ఆధునిక బ్యాడ్మింటన్‌గా ప్రపంచానికి పరిచయం చేశారు. భారతదేశంలో ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ క్రికెట్. బ్రిటిష్ నావికులు 1721లో కాంబే తీరంలో ఆడటం ద్వారా క్రికెట్‌ను భారతీయులకు పరిచయం చేశారు. స్వాతంత్య్రానికి పూర్వకాలంలో నాటి సంపన్నులు క్రికెట్ ఆడటానికి ఇష్టపడేవారు. పోలో ఆటను అంతకుముందు రకరకాలుగా ఆడేవారు.
గుర్రాలపైనే కాకుండా, ఏనుగుల పైనుంచి కూడా ఆడేవారు. అయితే, ఇప్పటి నిబంధనలతో ఆధునిక పోలో క్రీడ పంతొమ్మిదో శతాబ్దిలో మణిపూర్‌లో రూపుదిద్దుకుంది. తర్వాత ఇది యూరోప్, ఉత్తర అమెరికాలకు వ్యాపించింది. భారత్‌లో తొలి ఫుట్‌బాల్ క్లబ్ 1889లో ప్రారంభమైంది. అప్పట్లో భారతీయులు ఈ క్రీడలో కొంత వెనుకబడి ఉండేవారు. దీనిపై బ్రిటిషర్లు వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. దీనిని సవాలుగా తీసుకున్న బెంగాలీ యువత పట్టుదలతో సాధన చేసి, 1911లో బ్రిటిష్ జట్టుతో తలపడినప్పుడు ఫైనల్స్‌లో ఇండియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్‌నే గెలుపు వరించింది. భారత క్రీడాకారులు 1920 నుంచి ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడం మొదలైంది. నాటి నుంచి నేటి వరకు ఒలింపిక్స్‌లో భారత్ 28 పతకాలను దక్కించుకోగలిగింది. 1928–1980 మధ్యకాలంలో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత్ తొమ్మిది బంగారు పతకాలను దక్కించుకోగా, వాటిలో ఎనిమిది పతకాలు మన హాకీ జట్టు గెలుచుకున్నవే కావడం విశేషం.
హాకీని మన జాతీయ క్రీడగా చాలామంది పొరబడతారు గాని, భారత్ ఇంతవరకు ఏ క్రీడనూ జాతీయక్రీడగా ప్రకటించలేదు. ఈ సంగతిని సాక్షాత్తు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ స్వయంగా స్పష్టం చేసింది. అయితే, హాకీ వల్లనే ఒలింపిక్స్‌లో భారత్ అత్యధిక బంగారు పతకాలు సాధించిందన్నది మాత్రం వాస్తవం. 1928, 1932, 1936 సంవత్సరాల్లో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత హాకీ జట్టకు సారథ్యం వహించి, పతకాల పంట పండించిన నాటి మన హాకీజట్టు కెప్టెన్ ధ్యాన్‌చంద్ గౌరవార్ధంగానే ఆయన పుట్టిన రోజును ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించింది. 1928 నాటి ఒలింపిక్స్ పోటీల్లో ధ్యాన్‌చంద్ నేతృత్వంలోని భారత జట్టు ఏకంగా 178 గోల్స్ సాధించి ప్రపంచాన్ని నివ్వెరపరచింది. ఆ పోటీల్లో మరే జట్టు కూడా భారత జట్టుకు దరిదాపుల్లో నిలవలేకపోయాయి. దాదాపు ఆరు దశాబ్దాల పాటు భారత హాకీ జట్టు అంతర్జాతీయ పోటీల్లో ఇదే దూకుడును కొనసాగించింది.
కాలక్రమేణా క్రికెట్‌కు జనాదరణ పెరగడంతో హాకీకి ప్రోత్సాహం కరువైంది. భారత హాకీ జట్టు 1980లో చివరిసారిగా ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించింది. అది జరిగిన మూడేళ్లకు 1983లో కపిల్‌దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలుచుకుంది. ఇక అప్పటి నుంచి దేశంలో క్రికెట్‌కు విపరీతంగా జనాదరణ పెరిగింది. అంతకుముందు సంపన్నవర్గాలకే పరిమితమైన క్రికెట్ గల్లీలకు వ్యాపించింది. దేశంలోని ఏ క్రీడాకారుడికీ దక్కని గౌరవం ‘భారతరత్న’ అవార్డు క్రికెట్ క్రీడాకారుడైన సచిన్ టెండూల్కర్‌కు దక్కింది. భారత క్రీడాకారులు పరుగుపందేలు, బ్యాడ్మింటన్, విలువిద్య వంటి క్రీడల్లో సైతం అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నప్పటికీ, క్రికెటర్లకు దక్కుతున్న ప్రోత్సాహం, ఆదరణ మిగిలిన క్రీడాకారులకు దక్కడంలేదు.
క్రీడల గురించి కొన్ని విశేషాలు
► మనకైతే జాతీయ క్రీడ అంటూ ఏదీ లేదుగాని, మన పొరుగు దేశమైన భూటాన్ విలువిద్యను జాతీయక్రీడగా గుర్తించి, ఆ క్రీడను ప్రోత్సహిస్తోంది.
► క్రీడారంగంలో అతి తేలికపాటి, గౌరవనీయమైన పదవి ఒకటి ఉంది. గాలిపటాల క్రీడ (కైట్ సర్ఫింగ్) కోసం సృష్టించిన ఈ పదవిలో ఉన్న వ్యక్తి చేయాల్సిన పనల్లా గాలిపటాలు ఎగరవేయడానికి గాలి అనుకూలంగా ఉందో లేదో చెప్పడమే. ఈ పదవిలో ఉన్న వ్యక్తిని ‘విండ్ డమ్మీ’ అంటారు. ‘గినీపిగ్’ అని కూడా ముద్దుగా పిలుస్తారు.
► సాధారణంగా క్రీడల్లో మహిళలు, పురుషులు ఒకే జట్టులో సమాన సంఖ్యలో ఉండటం కనిపించదు. ‘కోర్ఫ్‌బాల్’ క్రీడలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం. ‘కోర్ఫ్‌బాల్’ జట్టులో ఎనిమిది మంది క్రీడాకారులు ఉంటారు. తప్పనిసరిగా సమాన సంఖ్యలో పురుషులు, మహిళలతో కలిసిన జట్టును ఏర్పాటు చేయడమే ‘కోర్ఫ్‌బాల్’ ప్రత్యేకత.
► టెన్నిస్‌లో ఒకప్పుడు కోర్టు బ్యాక్‌గ్రౌండ్‌ను బట్టి తెలుపు లేదా నలుపు రంగు బంతులను మాత్రమే వాడారు. అయితే, ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) 1972లో తొలిసారిగా పసుపు రంగు బంతులను ప్రవేశపెట్టింది. కలర్ టీవీ తెరలపై కొట్టొచ్చినట్టు కనిపించాలనే ఉద్దేశంతోనే ఐటీఎఫ్ నిపుణులు పసుపు రంగును ఎంపిక చేసుకున్నారు.
► కండలను పెంచుకోవడానికి చాలామంది జిమ్‌లకు వెళుతుంటారు గాని, చాలామందికి వాటి చరిత్ర తెలీదు. తొలిసారిగా ప్రాచీన గ్రీకు సామ్రాజ్యంలో క్రీస్తుపూర్వం తొమ్మిదో శతాబ్దిలో జిమ్నాసియమ్‌లు ఏర్పాటయ్యాయి. వాటిలో వ్యాయామం కోసం వెళ్లేవారు దుస్తులన్నీ తీసేసి పూర్తి నగ్నంగా వ్యాయామాలు చేసేవారు. ఒకవైపు వ్యాయామాలు కొనసాగుతుంటే మరోవైపు ఒక బృందం వాద్యసంగీతం వినిపించేది.
► ‘స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ది ఇయర్’గా రెండుసార్లు ‘టైమ్స్’ మ్యాగజైన్ కవర్‌పైకెక్కిన ఘనత దక్కించుకున్న ఏకైక క్రీడాకారుడు గోల్ఫ్ క్రీడాకారుడైన టైగర్ వుడ్స్. ‘టైమ్స్’ మ్యాగజైన్ 2000 ఆగస్టు సంచికలో ఒకసారి, ఈ ఏడాది ఆగస్టు సంచికలో ఒకసారి కవర్ పేజీకెక్కాడాయన.
క్రీడల్లో మనది ఇంకా కొంత వెనుకబాటే...
క్రీడారంగంలో భారత్ ఇంకా కొంత వెనుకబాటలోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా క్రీడల్లో అగ్రగాములుగా నిలుస్తున్న దేశాల జాబితాలో భారత్ ఇంకా తొలి పదిస్థానాల్లో చోటు పొందలేదు. నాలుగేళ్లకు ఒకసారి వెలువడే ఈ జాబితా గత ఏడాది విడుదలైంది. ఇందులో భారత్ కేవలం 37వ స్థానంలో నిలిచింది. క్రీడల్లో టాప్–10 దేశాలు ఇవే...
1. అమెరికా
2. ఫ్రాన్స్
3. యునైటెడ్ కింగ్‌డమ్
4. స్పెయిన్
5. ఆస్ట్రేలియా
6. జర్మనీ
7. రష్యా
8. బ్రెజిల్
9. జపాన్
10. కెనడా
క్రీడలతోనే ఆరోగ్యం
క్రీడలతోనే ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. చిన్నారులు ఆడుకునేటప్పుడు వారిని ఆటల నుంచి నివారించడం చాలామంది పెద్దలు చేసే పొరపాటు. ఆటల వల్ల పిల్లలు చదువులను నిర్లక్ష్యం చేస్తారని, ఆటల వల్ల పిల్లలు దుందుడుకుగా మారిపోతారని చాలామంది పెద్దలు అనుకుంటూ ఉంటారు. అవన్నీ అపోహలు మాత్రమే. నిజానికి ఆటల వల్లనే పిల్లలు మరింత చురుకుగా తయారవుతారు. కాసేపు ఆటలాడుకుని, విశ్రాంతి తీసుకున్న తర్వాత చదువుకున్నట్లయితే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. తోటిపిల్లలతో కలసి ఆడుకోవడం వల్ల నలుగురితో ఎలా మెసలుకోవాలో తెలుసుకోగలుగుతారు. సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచుకోగలుగుతారు. అన్నిటి కంటే ముఖ్యంగా శారీరకంగా దృఢంగా ఎదుగుతారు. క్రీడల వల్ల ఆరోగ్యానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయి. క్రీడల వల్ల ముఖ్యంగా కలిగే ప్రయోజనాలేమిటంటే...
స్థూలకాయం రాదు
తరచు క్రీడలు ఆడటం వల్ల స్థూలకాయం రాదు. ఒంట్లోని కొవ్వు కరిగి శరీరం తీరుగా తయారవుతుంది. చురుకుదనం పుంజుకుంటుంది. కండరాలు, ఎముకలు దృఢంగా తయారవుతాయి. చిన్నప్పుడు బాగా ఆటలాడేవారు పెద్దయిన తర్వాత కూడా చురుకుగా ఉంటారు. స్థూలకాయం వల్ల వచ్చే డయాబెటిస్, హైబీపీ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
మానసిక ఆరోగ్యం
క్రీడలు శరీరానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా దోహదపడతాయి. ఆందోళన, దిగులు, కుంగుబాటు వంటి మానసిక సమస్యలను అధిగమించడానికి వ్యాయామం, క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణులు చెబుతుండటం విశేషం. క్రీడల వల్ల ఏకాగ్రత, మానసిక సంయమనం, ప్రతికూల పరిస్థితులను స్థిమితంగా ఎదుర్కోగల శక్తి ఏర్పడతాయని పలు అంతర్జాతీయ అధ్యయనాలు తేల్చాయి.
గుండెకు ఆరోగ్యం
క్రీడలు ఆడేవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. క్రీడల వల్ల గుండె ఆరోగ్యంగా, శక్తిమంతంగా ఉంటుంది. క్రీడలు గుండె కండరాల దారుఢ్యానికి దోహదపడతాయి. క్రీడల వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు గుండె నుంచి సక్రమంగా రక్త సరఫరా జరుగుతుంది. క్రీడాకారుల్లో గుండెపోటు మరణాలు సంభవించే అవకాశాలు చాలా అరుదు.
అదుపులో రక్తపోటు
క్రీడలు ఆడటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కేవలం ఆహార నియమాలను పాటించడం వల్ల రక్తపోటును నియంత్రించడం దుస్సాధ్యం. ఆహార నియమాలతో పాటు వ్యాయామం, క్రీడల్లో పాల్గొనడం వల్ల రక్తపోటు పెరగకుండా చూసుకోవచ్చని బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ నిపుణులు సూచిస్తున్నారు. క్రీడల వల్ల రక్తపోటును అదుపులో ఉండటమే కాకుండా, పక్షవాతం వంటి జబ్బులు రాకుండా ఉంటాయని వారు చెబుతున్నారు.
మెరుగైన రక్తసరఫరా
క్రీడల వల్ల శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలకు సక్రమంగా రక్తం సరఫరా అవుతుంది. ఫలితంగా శరీరంలోని ప్రతి జీవకణానికీ తగినంతగా ఆక్సిజన్ అందుతుంది. కండరాలు, ఎముకలు దృఢంగా తయారవుతాయి. క్రీడలు ఆడేవారికి వెన్నునొప్పి, కీళ్లనొప్పుల వంటి ఇబ్బందులు బాధించే అవకాశాలు తక్కువ. ఈ కారణం వల్లనే క్రీడలు ఆడేవారిలో చాలాకాలం వరకు కండరాలు పట్టు సడలకుండా బిగువుగా ఉండటంతో పాటు వార్ధక్య లక్షణాలు త్వరగా కనిపించకుండా ఉంటాయి.
మెరుగైన రోగనిరోధక శక్తి
క్రీడలు ఆడేవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా మెరుగుపడుతుంది. ఫలితంగా రుతువులు మారినప్పుడల్లా వచ్చే జలుబు, దగ్గు, చిన్నా చితకా ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. క్రీడల్లో పాల్గొనే వారికి బాగా చెమట పట్టి, శరీరంలోని మాలిన్యాలు త్వరగా బయటకు పోతాయి. వేగంగా పరుగులు తీయడం, ఆటలాడటం వల్ల శరీరం ఉష్ణోగ్రత స్వల్పంగా పెరిగి, త్వరగా బ్యాక్టీరియా సోకకుండా ఉంటుంది.
సానుకూల దృక్పథం
క్రీడలు సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తాయి. దీనివల్ల జీవితంలోని ఒడిదుడుకులను తట్టుకునే శక్తి ఏర్పడుతుంది. బృందంతో కలసి పనిచేయడం, లక్ష్యాలను నిర్దేశించుకుని, ఒకరకమైన స్పష్టతతో లక్ష్య సాధన దిశగా ముందుకు సాగడం, క్రమశిక్షణ వంటి సానుకూల లక్షణాలు క్రీడల వల్ల అలవడతాయని ‘జర్నల్ ఆఫ్ స్పోర్ట్ అండ్ హెల్త్ సైన్స్’ ఒక పరిశోధనాత్మక వ్యాసంలో తెలిపింది.
– పన్యాల జగన్నాథదాసు
Comments
Please login to add a commentAdd a comment