యాప్‌లతో సేఫ్టీకి భరోసా! | Funday Cover Story About Women Safety Apps International Womens Day | Sakshi
Sakshi News home page

యాప్‌లతో సేఫ్టీకి భరోసా!

Published Sun, Mar 5 2023 9:32 AM | Last Updated on Sun, Mar 5 2023 9:33 AM

Funday Cover Story About Women Safety Apps International Womens Day - Sakshi

అడ్వాన్స్‌డ్‌ ఎరాలో ఉన్నాం.. మీట నొక్కే వేగంలో పనులు అయిపోతున్నాయి..  అయినా స్త్రీకి సంబంధించిన విషయంలో సమాజపు ఆలోచనలే  ఇంకా ప్రగతి పంథా పట్టలేదు! అందుకే ఇప్పటికీ ఆమెకు భద్రత లేదు!  ఆమె సేఫ్టీకి సాంకేతికత యాప్‌ల ద్వారా ఇస్తున్న భరోసా మనసావాచాకర్మణా సమాజం ఇవ్వడం లేదు! ఆ స్పృహను సాధించే వరకు..   మహిళ ఆ సేఫ్టీ యాప్‌లనే నమ్ముకోక తప్పదు!!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. యూఎన్‌ఓ ఈ ఏడాది ప్రకటించిన థీమ్‌.. డిజిటాల్‌: ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ ఫర్‌ జెండర్‌ ఈక్వాలిటీ (DigtALL: Innovation and technology for gender equality). . అవును ఏ ఆవిష్కరణ అయినా.. సాంకేతికతైనా స్త్రీ, పురుష సమానత్వాన్నే చాటాలి. ఈ సమానత్వ పోరు నేటిది కాదు.. దాదాపు 115 ఏళ్ల నాటిది. నాడు అమెరికాలో గార్మెంట్‌ ఇండస్ట్రీలో ప్రమాదరకమైన పని పరిస్థితులు.. స్త్రీల పట్ల వివక్ష.. అసమాన వేతనాలు వంటి విషయాల్లో మార్పు కోసం మహిళల సమ్మెతో మొదలైన పోరాటం.. అన్ని రంగాల్లో.. అన్ని విషయాల్లో జెండర్‌ ఈక్వాలిటీ దిశగా ఇంకా కొనసాగుతూనే ఉంది.

శతాబ్దం మారింది.. అయినా సమానత్వ సాధన కోసం ఇంకా థీమ్స్‌ను సెట్‌ చేసుకునే దశ, దిశలోనే ఉన్నాం. ‘కాలం మారింది.. ఇప్పుడు అన్ని రంగాల్లో స్త్రీలు కనపడుతున్నారు.. వినపడుతున్నారు కదా!’ అని మనకు అనిపించినప్పుడల్లా.. ఒక్కసారి స్త్రీల మీద జరుగుతున్న క్రైమ్‌ రికార్డ్స్‌ను ముందేసుకుందాం! అన్ని రంగాల్లో స్త్రీలు ఉన్నారు కదా అని ఎత్తుకున్న తల దించేసుకుంటుంది. స్వేచ్ఛ ఉంటేనే సమానత్వం సిద్ధిస్తుంది. భద్రత ఉంటేనే ఆ స్వేచ్ఛకు అర్థం ఉంటుంది. ఇంట్లో హింస.. బయట హింస.. ఆఖరకు ఆడపిల్ల తల్లి గర్భంలో ఉన్నా హింసే.

ఈ వాక్యాలు రొడ్డకొట్టుడులా అనిపిస్తున్నాయి. అంటే పరిస్థితిలో ఇంకా మార్పు రాలేదనే కదా! అందుకే ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ ఫర్‌ జెండర్‌ ఈక్వాలిటీ సాధించాలంటే ముందు ఆడపిల్ల సురక్షితంగా ఉండాలి. ఇంటా.. బయటా బేఫికర్‌గా మసలగలగాలి! పోలీసులు, చట్టాలు ఉన్నాయి కదా అని తట్టొచ్చు! ‘నాకు సేఫ్టీ లేదు.. భయంగా ఉంది’ అని అమ్మాయి చెబితేనే కదా.. పోలీసులు స్పందించేది. ఆ అభద్రతను రిజిస్టర్‌ చేస్తేనే కదా.. రక్షణ చట్టాలు వచ్చేవి. ఇదంతా జరగాలంటే సమాజంలో అవగాహన రావాలి.

అమ్మాయిలను చూసే తీరు.. వాళ్లతో ప్రవర్తించే పద్ధతులు మారాలి. వాళ్ల పట్ల మర్యాద పెరగాలి. వీటన్నిటికీ మగపిల్లలకు జెండర్‌ సెన్సిటివిటీ ఎడ్యుకేషన్‌ ఎంత అవసరమో.. తనున్న పరిస్థితి పట్ల ఎరుక.. దాన్నుంచి బయటపడే చొరవ అమ్మాయిలకూ అంతే అవసరం. ముందు తన చుట్టూ ఉన్న ప్రమాదాన్ని గుర్తించే ధైర్యం.. తెగువ చేయాలి. అందుకు ఇప్పుడు సాంకేతికత బోలెడంత సాయాన్ని అందిస్తోంది. యాప్‌ల రూపంలో! అలా ఫోన్‌లో తప్పకుండా డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన విమెన్‌ సెక్యూరిటీ యాప్‌లు కొన్ని ఇక్కడ..  

దిశ
ఇది ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ కమ్యూనికేషన్‌ వింగ్‌ రూపొందించిన ఆండ్రాయిడ్‌ యాప్‌. ఫోన్‌లో యాప్‌ను ఓపెన్‌చేసి.. మూడుసార్లు షేక్‌ చేయగానే ఫోన్‌లోని జీపీఎస్‌ యాక్టివేట్‌ అయ్యి.. దగ్గర్లో ఉన్న పోలీస్‌ స్టేషన్‌లు, డ్యూటీలో ఉన్న పోలీసులను అలర్ట్‌ చేస్తుంది లొకేషన్‌ను పంపించి. ఒకవేళ ఫోన్‌ షేక్‌ చేయకుండా యాప్‌లోని ఎస్‌ఓఎస్‌ బటన్‌ను నొక్కినా.. మీ సమాచారం మీరున్న ప్రాంతానికి దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌లు, ఆన్‌ డ్యూటీ పోలీసులకు చేరుతుంది. వెంటనే సహాయ సిబ్బంది మీ దగ్గరకు చేరుకుంటారు. ఈ యాప్‌ సహాయంతో 100 నంబర్, లేదా ఈ యాప్‌లో ఉన్న ఇతర హెల్ప్‌ లైన్‌ నంబర్స్‌కూ కాల్‌ చేయవచ్చు. ఈ యాప్‌ ప్రమాదస్థలికి దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్ల వివరాలనే కాక.. ఇతర సేఫ్టీ ప్లేసెస్, ఆసుపత్రులు, ఇతర హెల్ప్‌లైన్‌ నంబర్లనూ అందిస్తోంది. 

విమెన్‌ సేఫ్టీ (Women Safety) 
ఈ యాప్‌లోని బటన్‌ను ఒక్కసారి తడితే చాలు.. మీరు ప్రమాదంలో చిక్కుకున్న సంగతి.. లొకేషన్‌ గూగుల్‌ మ్యాప్‌ లింక్‌ సహా మీ ఫోన్‌లో మీరు ఫీడ్‌ చేసుకున్న ఎమర్జెన్సీ నంబర్లకు చేరిపోతుంది. ఇందులోని బటన్లు మూడు రంగుల్లో ఉంటాయి. అంటే మీరున్న పరిస్థితి తీవ్రతను బట్టి ఆయా రంగుల్లో ఉన్న బటన్స్‌ను నొక్కాలి. 

షీ టీమ్స్‌
మహిళల భద్రత కోసం తెలంగాణ రాష్ట్రం షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ వింగ్‌ 2014లో ప్రారంభమైంది. తొలుత హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ పరిధికే వీరి సేవలు పరిమితమైనా.. తర్వాత ఏడాదికి అంటే 2015కల్లా  రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తెలంగాణ అంతటా 331 షీ టీమ్స్‌ పనిచేస్తున్నాయి. 

112 యాప్‌
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆల్‌ ఇన్‌ వన్‌ యాప్‌ ఇది. ఉపయోగించడం చాలా తేలిక. ప్రమాదంలో ఉన్నప్పుడు.. ఈ యాప్‌ను సింగిల్‌ ట్యాప్‌ చేస్తే చాలు.. మీరున్న డేంజర్‌ సిచ్యుయేషన్‌కు సంబంధించి అలారమ్‌ మోగుతుంది. తక్షణమే సహాయక చర్యల సిబ్బందీ స్పందిస్తారు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ రెండు ఫోన్‌లకూ సెట్‌ అవుతుంది. ఈ 112 యాప్‌ మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తుంది. కీ ఫీచర్స్‌ ఏంటంటే.. ఎమర్జెన్సీ అలారమ్‌ను పంపించేందుకు ఇందులో ఆడియో/విజువల్‌ మీడియా ఉంటుంది. 24 గంటలూ ఈ యాప్‌ ద్వారా భద్రతా సేవలు పొందవచ్చు. అదనంగా.. సంఘటనల విచారణలోనూ తనవంతు సాయం అందిస్తుంది. 

మై సేఫ్టీపిన్‌ (My SafetyPin)
డేటా మాపింగ్‌ టెక్నిక్స్‌ సాయంతో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు సేఫ్‌గా ఫీలయ్యేందుకు సాయపడుతుందీ అప్లికేషన్‌. వెలుతురు, వైశాల్యం, సెక్యూరిటీ గార్డ్స్, కాలిబాట, ప్రజా రవాణా వ్యవస్థ, జెండర్‌ యూసేజ్, భావోద్వేగాలు.. మొదలైన తొమ్మిది అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ యాప్‌ను రూపొందించారు. ఒకవేళ మీరు రాంగ్‌రూట్‌ని ఎంచుకున్నా ఇది వెంటనే మీ కుటుంబ సభ్యులను అలర్ట్‌ చేస్తుంది. భద్రమైన దారిని ఎంచుకునేందుకు మీకు తోడ్పడుతుంది. మీరు తప్పిదారి అంత భద్రతలేని ప్రాంతంలోకి వెళ్లినా.. ఆ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు అందజేస్తుంది. సెర్చింగ్‌లో మీ చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు.. ఇతర సౌకర్యాల గురించీ మీకు సమాచారం ఇస్తుంది. దేశంలోని నగరాలను సురక్షిత నగరాలుగా మార్చడమే ‘మై సేఫ్టీపిన్‌’ లక్ష్యం. 

షీరోస్‌
ఇప్పుడున్న లీడింగ్‌ విమెన్‌ యాప్స్‌లో యూనిక్‌ యాప్‌ ఇది. మహిళల భద్రతకు సంబంధించే కాదు కెరీర్‌ గైడెన్స్, ఫ్రీ హెల్ప్‌ లైన్, రెసిపీలు మొదలు బ్యూటీ టిప్స్, ఇంట్లో ఉండే పనిచేసుకునే ఉపాధి అవకాశాల నుంచి కొత్త కొత్త పరిచయాలు, ఉచిత న్యాయ సలహాల వరకు మహిళలకు అవసరమైన చాలా అంశాల్లో ఈ యాప్‌ సహాయమందిస్తుంది. మీ నెలసరినీ ట్రాక్‌ చేస్తూ సూచనలిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది దీని గోప్యత, భద్రత. మీ ఫొటోలు, వీడియోలు మొదలు మీ వ్యక్తిగత సమాచారాన్నంత గోప్యంగా.. భద్రంగా ఉంచుతుంది. దీని సేవలను ఇటు ఆండ్రాయిడ్, అటు ఐఓఎస్‌.. రెండు ఫోన్‌లలోనూ పొందవచ్చు.  

స్మార్ట్‌ 24 గీ సెవెన్‌ ( స్మార్ట్‌ 24 X7)
దీనితో ఇరవైనాలుగు గంటల కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌తో సపోర్ట్‌ పొందవచ్చు. ఇది ఇటు యాపిల్‌ అటు ఆండ్రాయిడ్‌ ఫోన్లలో సెట్‌ అవుతుంది. ఆపదలో ఉన్న మహిళలు తమ దీని ద్వారా ఎమర్జెన్సీ అలర్ట్స్‌ను కుటుంబ సభ్యులు, స్నేహితులతోపాటు చుట్టుపక్కలనున్న ఫైర్‌ స్టేషన్, పోలీస్‌ స్టేషన్, అంబులెన్స్‌ సర్వీసెస్‌కూ పంపిచవచ్చు. వాటి సహాయం పొందవచ్చు.ఆపదలో ఉన్న వాళ్లు బటన్‌ నొక్కగానే ఆ ఫోన్‌లోని కాంటాక్ట్‌ లిస్ట్‌లో వాళ్లు సేవ్‌ చేసుకున్న అయిదు ఎమర్జెన్సీ నంబర్లకు క్షణాల్లో సమాచారం వెళ్తుంది. ఒకవేళ జీపీఆర్‌ఎస్‌ అందుబాటులో లేకపోతే.. ఎస్‌మ్మెస్‌లు వెళ్తాయి. స్మార్ట్‌ 24 ఇంటూ సెవెన్‌ కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ వాళ్లూ 
వెంటనే కాల్‌ చేస్తారు. 

బీసేఫ్‌ (bSafe)
మహిళల మీద జరుగుతున్న హింస, లైంగిక వేధింపులు, లైంగిక దాడులను నివారించడమే కాక దురదృష్టవశాత్తు ఇలాంటి నేరాలు జరిగితే.. సంబంధించిన సాక్ష్యాధారాలనూ అందిస్తుంది. వాయిస్‌ యాక్టివేషన్, లైవ్‌ స్ట్రీమింగ్, ఆడియో, వీడియో రికార్డింగ్, ఫాల్స్‌ కాల్, ఫాలో మీ, లొకేషన్‌ ట్రాకింగ్‌ వంటి ఫీచర్స్‌తో మహిళల భద్రతకు భరోసానిస్తోంది. బటన్‌ను ఒక్కసారి నొక్కితే చాలు.. ఎస్‌ఓఎస్‌ సిగ్నల్‌ను సెండ్‌ చేసేస్తుంది. దీని ద్వారా.. అత్యవసర వేళల్లో ఫొటోలు తీసుకుని.. వాటిని పోస్ట్‌ చేయొచ్చు. మీరున్న చోటును మీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తుంది. దీన్ని ఇటు ఆండ్రాయిడ్, అటు ఐఓఎస్‌ రెండు ఫోన్లలోనూ డౌన్‌లోడ్‌ చేçసుకోవచ్చు. 

నిర్భయ
ఇది యూజర్‌ ఫ్రెండ్లీ యాప్‌. ఫోన్‌లో డౌన్‌లోడ్‌ అయ్యాక.. ఒక్కసారి బటన్‌ను ప్రెస్‌ చేయగానే యాక్టివేట్‌ అవుతుంది. ఒకవేళ బటన్‌ నొక్కడం వీలు పడకపోతే ఫోన్‌ షేకింగ్‌ ద్వారా, ఎస్సెమ్మెస్‌ల ద్వారా.. ఫోన్‌ కాల్‌ ద్వారా కూడా  మన పరిస్థితిని తెలియజేయవచ్చు. అయితే వీటికి డేటా ప్లాన్, జీపీఎస్‌ అవసరం ఉంటాయి. ఆపదలో ఉన్నవారి లొకేషన్‌ను ఇది ప్రతి రెండు గంటలు.. లేదా ప్రతి మూడువందల మీటర్లకు మారినప్పుడల్లా  ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు పంపిస్తూంటుంది. 

ఎస్‌ఓఎస్‌ – స్టే సేఫ్‌ 
ఇది ఆండ్రాయిడ్‌ యాప్‌. ఫోన్‌లో ఈ యాప్‌ యాక్టివేట్‌ అయితే చాలు.. ఫోన్‌ లాక్‌ మోడ్‌లో ఉన్నా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆపదలో ఉన్నప్పుడు ఫోన్‌ను అన్‌లాక్‌ చేసుకునేంత టైమ్‌ ఉండదు. వెంటనే స్పందించాలి. అందుకే ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం మంచిది. ఆపదలో ఉన్నామని తెలియగానే ఫోన్‌ను రెండుమూడు సార్లు షేక్‌ చేయాలి.. అంతే.. మనకు సంబంధించిన సమాచారం.. మనమున్న లొకేషన్‌ సహా ఎమర్జెన్సీ కాంటాక్ట్‌కి వెళ్లిపోతాయి. ఒకవేళ షేక్‌ చేయడం తికమక వ్యవహారంలా అనిపిస్తే ఈ యాప్‌ హోమ్‌ బటన్‌ను ప్రెస్‌ చేసినా చాలు.. మన సమాచారం, లొకేషన్‌ సహా మప ఫోన్‌ బ్యాటరీ ఏ స్థితిలో ఉందో కూడా ఎమర్జెన్సీ కాంటాక్ట్‌కి చెప్పేస్తుంది. అంతేకాదు ఆడియో రికార్డింగ్‌నూ పంపుతుంది. 

రక్ష (Raksha)
భద్రతతో కూడిన స్వావలంబన.. ఈ యాప్‌ లక్ష్యం. అందుకే అహర్నిశలూ అందుబాటులో ఉంటుంది. దీన్ని ఉపయోగించడమూ తేలికే. మీరు ఆపదలో చిక్కుకున్నారని మీకు అనిపించిన  వెంటనే యాప్‌లో సూచించిన బటన్‌ను ప్రెస్‌ చేస్తే చాలు.. మీరున్న లొకేషన్‌ సహా మీకు సంబంధించిన అలర్ట్స్‌ అన్నీ మీ కుటుంబ సభ్యులకు చేరుతాయి మీ వాళ్ల ఫోన్‌ నంబర్ల ద్వారా.  నెట్‌వర్క్‌ లేకపోయినా.. ఈ యాప్‌ స్పందిస్తుంది. వాల్యూమ్‌ కీని మూడు సెకండ్ల పాటు ప్రెస్‌ చేస్తే చాలు.. మీ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు అందజేస్తుంది. ఇందులో ఎస్‌ఓఎస్‌ కూడా ఉన్నందున.. ఇంటర్నెట్‌ లేని ఏరియాల్లో .. ఎస్సెమ్మెస్‌ ద్వారా మీకు సంబంధించిన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు చేరవేస్తుంది. 

ఐయామ్‌ శక్తి (Iam Shakthi)
ఇదీ యూజర్‌ ఫ్రెండ్లీనే. ఫోన్‌లోని పవర్‌ బటన్‌ను రెండు సెకండ్ల వ్యవధిలో అయిదుసార్లు నొక్కితే చాలు.. ఫోన్‌లో ముందుగా సెట్‌ చేసిపెట్టుకున్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు లొకేషన్‌ సహా సమాచారం వెళుతుంది. బటన్‌ నొక్కిన వెంటనే లొకేషన్‌ను ట్రేస్‌ చేయలేకపోతే.. ట్రేస్‌ అయిన వెంటనే మళ్లీ అలర్ట్‌ మెసేజెస్‌ను పంపిస్తుంది. 

విత్‌యు (WithYou)
ఇది కూడా ‘స్పాట్‌ఎన్‌సేవ్‌’ లాంటిదే. ఆపదలో ఉన్నప్పుడు ఫోన్‌లోని పవర్‌ బటన్‌ను రెండుసార్లు నొక్కితే .. మనకు సంబంధించిన సమాచారమంతా లొకేషన్‌ సహా.. అంతకుముందే సెట్‌ చేసిపెట్టుకున్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు వెళుతుంది.. ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి. 

స్పాట్‌ఎన్‌సేవ్‌ ఫీల్‌ సెక్యూర్‌
ఇప్పుడున్న అన్ని సేఫ్టీ యాప్‌లోకెల్లా అడ్వాన్స్‌డ్‌ యాప్‌ ఇది. దీన్ని ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాచీలా మణికట్టుకు ధరిస్తే చాలు. అవును రిస్ట్‌ బ్యాండ్‌లా! డేంజర్‌ సిచ్యుయేషన్‌లో ఉన్నప్పుడు మీ ఫోన్‌ పవర్‌ బటన్‌ను రెండుసార్లు ప్రెస్‌ చేయాలి అంతే.. రిస్ట్‌బ్యాండ్‌లోని యాప్‌ యాక్టివేట్‌ అయ్యి మీరు ముందే సెట్‌ చేసి పెట్టుకున్న మీ ఎమర్జెన్సీ ఫోన్‌ నంబర్స్‌కి.. ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి.. మీరున్న లొకేషన్‌ సహా వివరాలను అందిస్తూంటుంది. ఒకవేళ మీరు ఫోన్‌ను ఉపయోగించే స్థితిలో లేకపోతే రిస్ట్‌బ్యాండ్‌కున్న బటన్‌ను రెండుసార్లు ప్రెస్‌ చేసినా చాలు బ్లూటూత్‌ సాయంతో యాప్‌ పనిచేయడం మొదలుపెడుతుంది.

ఇటు చూడండీ.. 
ఎన్‌సీఆర్‌బీ (నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో)–2021 నివేదిక ప్రకారం.. దేశంలో మహిళల మీద జరుగుతున్న హింస 2020 సంవత్సరం కన్నా 2021లో 15.3 శాతం పెరిగింది. 2020లో 3,71,503 కేసులు నమోదైతే 2021లో 4,28,278 కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష జనాభాకు ఈ హింసాత్మక సంఘటనల రేటు 64.5 శాతంగా నమోదైంది. 2020లో ఇది 56.5 శాతం. వీటిల్లో 31.8 శాతం గృహహింస కేసులే. మిగతావన్నీ వేధింపులు, కిడ్నాప్‌లు, లైంగికదాడుల కేసులు. మహిళల మీద జరుగుతున్న హింసలో అసోం రాష్ట్రం మొదటి స్థానపు అప్రతిష్ఠను మూటగట్టుకుంది. తర్వాత స్థానాల్లో ఒడిశా, హరియాణా, తెలంగాణ, రాజస్థాన్‌లు నిలిచి ఆ అవమానపు భారాన్ని మోస్తున్నాయి. షాకింగ్‌ ఏంటంటే.. గతంలో కన్నా తెలంగాణలో మహిళల మీద హింస పెరిగినట్టు చూపిస్తోంది ఎన్‌సీఆర్‌బీ. అత్యంత తక్కువ కేసులతో నాగాలాండ్‌ కాస్త మెరుగైన రాష్ట్రంగా కనిపిస్తోంది. మూడేళ్లుగా ఇది ఈ రికార్డ్‌నే మెయిన్‌టైన్‌ చేస్తోంది. హింస పెట్రేగుతున్న నగరాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లు నిలిచి తలవంచుకుంటున్నాయి. 

2021 సంవత్సరం CEOWORLD మ్యాగజీన్‌ ప్రచురించిన నివేదిక ప్రకారం.. మహిళల భద్రత విషయంలో ప్రపంచంలోకెల్లా తొలి స్థానంలో నిలిచిన దేశం నెదర్లాండ్స్‌. రెండో స్థానంలో నార్వే, మూడో స్థానంలో స్వీడన్‌లు ఉన్నాయి. డెన్మార్క్‌ నాలుగో స్థానాన్ని పొందింది. చిత్రమేంటంటే.. అందరికీ పెద్దన్నలా వ్యవహరించే అమెరికా మొదటి పది స్థానాల్లో ఎక్కడా లేదు. 20వ స్థానంలో ఉంది! యునైటెడ్‌ కింగ్‌డమ్‌ది పదిహేడో స్థానం. మన గురించీ చెప్పుకోవాలి కదా.. మహిళల భద్రత విషయంలో మన పరువుకు దక్కిన ప్లేస్‌.. నలభై తొమ్మిది!   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement