ఆ విషయంలో మనవారే ఎక్కువ..! | Cover Story On International Migrants Day In Sakshi Funday | Sakshi
Sakshi News home page

వలస భారతం

Published Sun, Dec 15 2019 8:32 AM | Last Updated on Sun, Dec 15 2019 12:42 PM

Cover Story On International Migrants Day In Sakshi Funday

మనుషులకు వలసలు కొత్త కాదు. వానరాల నుంచి పరిణామం చెంది నిటారుగా నిలబడటం, రెండు కాళ్లపై నడవడం ప్రారంభించినప్పటి నుంచి ఆదిమానవులు మనుగడ కోసం వలసబాట పట్టారు. మానవజాతి వలసలకు దాదాపు 17.5 లక్షల ఏళ్ల చరిత్ర ఉంది. ఆదిమానవులు తొలుత ఆఫ్రికా నుంచి యూరేసియా వైపు వలసలు సాగించారు. క్రీస్తుపూర్వం 40 వేల ఏళ్ల నాటికి ఈ ఆదిమానవులు ఆసియా, యూరోప్, ఆస్ట్రేలియా ఖండాలకు విస్తరించారు. కాస్త ఆలస్యంగా– అంటే, క్రీస్తుపూర్వం 20 వేల ఏళ్ల నాటికి రెండు అమెరికా ఖండాలకూ వ్యాపించారు. సానుకూల వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో మానవులు స్థిర నివాసాలు ఏర్పరచుకోవడంతో నాగరికతలు ఏర్పడ్డాయి. రాజ్యాలు ఏర్పడ్డాయి. అవి ఏర్పడిన తర్వాత కూడా ఆధిపత్యం కోసం ఒక ప్రాంతంలోని వారు మరో ప్రాంతం మీదకు దండయాత్రలు సాగించడం, దండయాత్రల్లో స్వాధీనం చేసుకున్న ప్రాంతాలకు కొందరు వలస వెళ్లడం వంటివి కొనసాగాయి. ఆధునిక యుగంలో మనుషుల అవసరాలు, ఆశయాలలో మార్పులు వచ్చినా, వలసలు మాత్రం ఆగలేదు. మెరుగైన ఉపాధి కోసం, జీవన భద్రత కోసం, పురోగతం కోసం ఒక దేశాన్ని వదిలి మరో దేశానికి వలసలు పోతూనే ఉన్నారు. ఆధునిక కాలంలో ఇతర దేశాలకు వలసపోతున్న వారిలో భారతీయులే ఎక్కువగా ఉంటున్నారు.

ఆధునిక కాలంలో మెరుగైన ఉపాధి కోసం, ఉన్నత విద్య కోసం, సౌకర్యవంతమైన అధునాతన జీవితం కోసం, స్వదేశంలో ఉంటున్న కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం కోసం, జీవితంలో మరింతగా అభివృద్ధి సాధించడం కోసం వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి చాలామంది అభివృద్ధి చెందిన సంపన్న దేశాలకు వలస వెళుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశమైన మన భారత్‌ నుంచి కూడా చాలామంది దాదాపు ఇవే కారణాలతో వలసబాట పడుతున్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం ప్రకటించిన వివరాల ప్రకారం స్వదేశాలను విడిచి ఇతర దేశాలలో నివసిస్తున్న వలసదారుల సంఖ్య 27.2 కోట్లకు పైగా ఉంటే, అంతర్జాతీయ వలసలలో మన భారతీయులే అగ్రస్థానంలో నిలుస్తున్నారు. భారత్‌ నుంచి వివిధ కారణాలతో ఇతర దేశాలకు వలస వెళ్లి, అక్కడ నివసిస్తున్న వారి సంఖ్య

1.75 కోట్లకు పైమాటే. 
ఇదిలా ఉంటే, ఇతర దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చి ఉంటున్న వారి సంఖ్య ప్రస్తుతం 51 లక్షలుగా ఉంది. నాలుగేళ్ల కిందటి లెక్కలతో పోల్చుకుంటే భారత్‌కు వలస వచ్చే విదేశీయుల సంఖ్య కాస్త తగ్గింది. 2015 నాటికి భారత్‌కు వలస వచ్చిన వారి సంఖ్య 52 లక్షలు. గడచిన దశాబ్దం లెక్కలను చూసుకుంటే– 2010–19 మధ్య కాలంలో భారత్‌లో ఉంటున్న విదేశీయుల సంఖ్య మొత్తం దేశ జనాభాలో దాదాపు 0.4 శాతం వరకు ఉంటున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. విద్య, ఉపాధి తదితర కారణాలతో వలస వచ్చిన వారే కాకుండా, వీరిలో భారత్‌లో తలదాచుకుంటున్న కాందిశీకులు సుమారు 2.07 లక్షల మంది వరకు ఉంటున్నారు. భారత్‌కు వలస వస్తున్న విదేశీయుల్లో ఎక్కువగా పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్‌ దేశాలకు చెందిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. 

ఆశ్రయమిస్తున్న దేశాల్లో అగ్రగామి అమెరికా
విదేశీ వలసదారులకు పెద్దసంఖ్యలో ఆశ్రయమిస్తున్న దేశాల్లో అమెరికా అగ్రగామిగా నిలుస్తోంది. వివిధ దేశాల నుంచి వలస వచ్చి ఉంటున్న వారి సంఖ్య అమెరికాలో దాదాపు 5.1 కోట్లు. జర్మనీ, సౌదీ అరేబియా దేశాలు దాదాపు 1.3 కోట్ల చొప్పున విదేశీ వలసదారులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. రష్యా 1.2 కోట్ల మందికి, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ 1 కోటి మందికి, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 90 లక్షల మందికి, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు దాదాపు 80 లక్షల చొప్పున, ఇటలీ సుమారు 60 లక్షల మంది విదేశీ వలసదారులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి.

వివిధ భౌగోళిక ప్రాంతాల్లోని జనాభా నిష్పత్తి ప్రకారం చూసుకుంటే, సహారా ఎడారి పరిసరాల్లోని ఆఫ్రికా దేశాల నుంచి అత్యధికంగా 89 శాతం ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. తూర్పు ఆసియా– ఆగ్నేయాసియా దేశాల నుంచి 83 శాతం, లాటిన్‌ అమెరికన్‌ దేశాలు– కరీబియన్‌ దేశాల నుంచి 73 శాతం, మధ్య ఆసియా– దక్షిణాసియా దేశాల నుంచి 63 శాతం ప్రజలు ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. విదేశీ వలస దారుల్లో అత్యధికంగా 98 శాతం ఉత్తర అమెరికా దేశాల్లోను, ఉత్తరాఫ్రికా–పశ్చిమాసియా దేశాల్లో 59 శాతం నివాసం ఉంటున్నారు. ఉపాధి, విద్య, ఉన్నతమైన జీవితం వంటి అవసరాల కోసం వివిధ దేశాలకు వలస వెళుతున్న వారి సంగతి ఒక ఎత్తయితే, కొన్ని దేశాల్లో యుద్ధ వాతావరణం కారణంగా అనివార్య పరిస్థితుల్లో బలవంతంగా స్వదేశాల సరిహద్దులు దాటి ఇతర దేశాలకు చేరుకుంటున్న వారి సంఖ్య కూడా ఏటేటా పెరుగుతూ వస్తోంది. ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం వెల్లడించిన లెక్కల ప్రకారం 2010–17 మధ్య కాలంలో ఇలా అనివార్యంగా స్వదేశాలను విడిచిపెట్టిన వారి సంఖ్య 1.3 కోట్లకు పైగానే ఉంది. బతికి ఉంటే బలుసాకు తినొచ్చనే రీతిలో ఇలా బలవంతంగా స్వదేశాలను విడిచిపెడుతున్న వారి సంఖ్య అత్య«ధికంగా ఉత్తరాఫ్రికా–పశ్చిమాసియా దేశాల్లోనే ఉంది. ఈ దేశాల నుంచి 46 శాతం మంది వివిధ దేశాల్లో కాందిశీకులుగా తలదాచుకుంటున్నారు. అలాగే, సహారా పరిసర ఆఫ్రికా దేశాల నుంచి 21 శాతం మంది ఇతర దేశాల్లో కాందిశీకులుగా ఉంటున్నారు. 

అభివృద్ధికి ఆలంబన
వివిధ దేశాల అభివృద్ధికి వలసలే ఆలంబనగా నిలుస్తున్నాయి. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధనలో వలసలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రపంచ దేశాలన్నీ సురక్షితమైన, క్రమబద్ధమైన, బాధ్యతాయుతమైన వలసలకు వెసులుబాటు కల్పించడం ద్వారా సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి వీలవుతుందని ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల అండర్‌ సెక్రటరీ లియు ఝెన్‌మిన్‌ చెబుతున్నారు. వలసల వల్ల కలిగే సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను భారతీయ సామాజికవేత్త రాధాకమల్‌ ముఖర్జీ 1936లోనే తాను రాసిన ‘మైగ్రంట్‌ ఆసియా’ పుస్తకం ద్వారా వెల్లడించారు. ఆసియా దేశాల్లో, ముఖ్యంగా భారత్‌లో మిగులు కార్మిక శక్తి అత్యధికంగా ఉందని, ఈ మిగులు కార్మిక శక్తి కార్మికుల అవసరం ఎక్కువగా ఉన్న ఇతర దేశాలకు వలస వెళితే ఉభయ దేశాలకూ ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. వివిధ దేశాల్లో బ్రిటిష్‌ వలస పాలన కొనసాగుతున్న కాలంలో– 1870–1914 సంవత్సరాల మధ్య కాలంలో భారత్‌ నుంచి దాదాపు 4 కోట్ల మంది బ్రిటిష్‌ పాలనలో ఉన్న ఇతర దేశాలకు వలస వెళ్లారు.

వీరిలో అత్యధికులు మారిషస్‌ వెళ్లారు. మారిషస్‌ ప్రస్తుత జనాభాలో దాదాపు 70 శాతం మంది భారత సంతతికి చెందిన వారే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడిన 1930 దశకంలో భారత్‌ నుంచి ఇతర దేశాలకు వలసలు గణనీయంగా తగ్గాయి. అప్పటి వరకు భారతీయులు ఎక్కువగా వలస వెళ్లే శ్రీలంక, మయన్మార్, మలేసియాలకు కూడా వలసల సంఖ్య పడిపోయింది. స్వాతంత్య్రం వచ్చి, కొంత నిలదొక్కుకున్న తర్వాత 1970 దశకం నుంచి భారత్‌ నుంచి మళ్లీ ఇతర దేశాలకు వలసలు ఊపందుకున్నాయి. స్వాతంత్య్రానికి ముందు భారతీయులు ఎక్కువగా దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలకు వలస వెళ్లేవారు. స్వాతంత్య్రం వచ్చాక ఈ వలసలు పశ్చిమాసియా, అమెరికా, యూరోప్‌ల వైపు మళ్లాయి. పశ్చిమాసియా దేశాలు మినహా మిగిలిన దేశాలు తమ దేశాల్లో చిరకాలంగా నివాసం ఉంటున్న విదేశీయులకు పౌరసత్వ అవకాశాలు కూడా కల్పిస్తుండటంతో పలువురు భారతీయులు అమెరికా, కెనడా, యునైటెడ్‌ కింగ్‌డమ్, దక్షిణాఫ్రికా, మారిషస్, మలేసియా వంటి దేశాల్లో పౌరసత్వం పొంది అక్కడే స్థిరపడి ఉంటున్నారు. వీరంతా భారత్‌లో ఉంటున్న తమ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు కూడా పెడుతున్నారు.

స్వదేశాలను విడిచి ఇతర దేశాలకు చేరుకుంటున్న వలసదారులు తాము గమ్యంగా ఎంపిక చేసుకున్న దేశం అభివృద్ధిలో పాలు పంచుకోవడంతో పాటు తమ తమ స్వదేశాల ఆర్థిక పరిపుష్టికి కూడా ఇతోధికంగా దోహదపడుతున్నారు. ఇతర దేశాల్లో ఉంటున్న భారతీయులు కూడా మన దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ప్రవాస భారతీయులు, ఇతర దేశాల్లో స్థిరపడిన భారత సంతతి ప్రజల ద్వారా గడచిన ఆర్థిక సంవత్సరంలో 8000 కోట్ల డాలర్లు (రూ.5.70 లక్షల కోట్లు) మన దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చి చేరాయి. గడచిన దశాబ్ద కాలంలో వలస వెళ్లిన భారతీయుల ద్వారా ఏటా మన ఆర్థిక వ్యవస్థకు చేరే నిధుల మొత్తం రెట్టింపు కంటే పెరిగింది. భారత సంతతి ప్రజల జనాభా లక్షకు పైగానే ఉన్న దేశాలు 32 వరకు ఉన్నాయి. వీటిలో అత్యధిక సంఖ్యలో భారతీయులు అమెరికాలోనే ఉంటున్నారు.

ఈ పది దేశాలతో పాటు కువైట్, మారిషస్, ఖతార్, ఓమన్, సింగపూర్, నేపాల్, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, ఫిజి, గుయానా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఇటలీ, థాయ్‌లాండ్, సురినేమ్, జర్మనీ, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, ఇండోనేసియా వంటి దేశాల్లోనూ భారతీయులు గణనీయమైన సంఖ్యలో ఉంటున్నారు.

విదేశాలలో స్థిరపడ్డ భారతీయులలో తెలుగు వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. పై ఐదు దేశాల్లో తెలుగు వారి సంఖ్య లక్షకు పైగానే ఉంది. పలు దేశాల్లో తెలుగు సంస్థలు కూడా క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. – పన్యాల జగన్నాథదాసు

విదేశాల్లో మనవాళ్ల ఘనత
విదేశాల్లో స్థిరపడిన భారతీయులు వివిధ రంగాల్లో ఘన విజయాలు సాధిస్తూ స్వదేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన హైటెక్‌ కంపెనీల వ్యవస్థాపకుల్లో 8 శాతం మంది భారత సంతతికి చెందిన వారేనని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ వెల్లడించింది. వీరిలో గూగుల్‌ అధినేత సుందర్‌ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌ అధినేత సత్య నాదెళ్ల వంటి వారు సాంకేతిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగలుగుతున్నారు. భారత సంతతికి చెందిన వారిలో పలువురు వివిధ దేశాల్లోని చట్టసభల్లోనూ కీలక పదవుల్లో రాణిస్తున్నారు. అమెరికా, కెనడా, యునైటెడ్‌ కింగ్‌డమ్, మారిషస్, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, దక్షిణాఫ్రికా, టాంజానియా, సురినేమ్, సింగపూర్, న్యూజిలాండ్, మలేసియా వంటి దేశాల చట్టసభల్లో భారత సంతతికి చెందినవారు గణనీయమైన సంఖ్యలో సభ్యులుగా ఉంటున్నారు.


 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement