Seedling
-
విత్తు..నిర్లక్ష్యపు మత్తు
♦ కోల్డ్‌స్టోరేజీల్లో దాదాపు రూ. 15 కోట్ల ఏపీ సీడ్స్ ♦ ఇప్పటికే గడువు ముగిసిన రూ. 4 కోట్ల విత్తనాల పట్టివేత ♦ డిమాండ్‌లేని విత్తనాల కొనుగోలుపై అనుమానాలు మార్కెట్ మాయాజాలం.. దిగజారిన గిట్టుబాటు ధరలు..పెరుగుతున్న పెట్టుబడులు.. ప్రకృతి వైపరీత్యాలు..నకిలీ విత్తనాలు.. ఇలా అనేక సమస్యలు రైతుకు నష్టాలు మిగిల్చి కష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. అయినా మొక్కవోని ధైర్యంతో ఈ ఏడాది సాగు చేపట్టిన రైతులకు అండగా నిలవాల్సిన ఏపీ సీడ్స్ అధికారులు నిర్లక్ష్యపు మత్తులో మునిగిపోయారు. కోట్ల రూపాయల సరుకును కోల్డ్‌స్టోరేజీల్లోనే ఉంచి కాలం వెళ్లబుచ్చుతున్నారు. – సాక్షి, అమరావతి బ్యూరో సాక్షి, అమరావతి బ్యూరో: కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమవుతున్నా పట్టించుకొనే నా«థుడు లేడు. కమీషన్లలకు కక్కుర్తిపడి, డిమాండ్‌లేని సరుకును అధిక ధరలకు కొనుగోలు చేసి.. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఇలా గుంటూరు జిల్లాలోనే ఏపీ సీడ్స్ ఆధ్వర్యంలో దాదాపు రూ. 20 కోట్ల విలువైన గడువు ముగిసిన సీడ్ కోల్డ్ స్టోరేజీల్లో మగ్గుతున్నట్లు సమాచారం. ఇందుకు ఊతమిచ్చేలా ప్రత్తిపాడులోని ఓ కోల్డ్‌స్టోరేజీలో శనివారం రూ. 4 కోట్ల విలువైన మినుములు, పెసర, నువ్వులను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. గతేడాది విజిలెన్స్ అధికారులు హెచ్చరించినా.. గతేడాది అక్టోబరులో కల్తీ కారం నిల్వలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అదే సమయంలో ఏపీ సీడ్స్ విత్తనాలను గుర్తించినట్లు సమాచారం. విత్తనాలు అమ్ముకొనేందుకు ఈ ఏడాది ఫిబ్రవరితోనే గడువు ముగుస్తుందని హెచ్చరించారు. అయితే ఈ విషయాన్ని ఏపీ సీడ్స్ అధికారులు చెవికెక్కించుకోలేదు. డిమాండ్ లేకున్నా... గత మూడేళ్లుగా ఎల్బీజీ –752 రకం మినుము విత్తనాలను రైతులు వేసేందుకు ఆసక్తి చూపటం లేదు. ఈ రకం విత్తనాలు వైరస్, తెగుళ్లను తట్టుకోలేకపోవడమే దీనికి కారణం. అయినా ఏపీ సీడ్స్ ఎల్బీజీ – 752 విత్తనాలను కోనుగోలు చేయటంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ తతంగం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని చర్చ సాగుతోంది. పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని అవసరం లేకున్నా కోనుగోలు చేశారని రైతులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ విత్తనాలను 30 శాతం సబ్సిడీతో రైతులకు విక్రయిస్తున్నారు. విజిలెన్స్ అధికారుల దాడుల నేపథ్యంలో గడువు తీరిన విత్తనాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయనే దానిపై సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. పనికిరాని విత్తనాల విక్రయం ఏపీ సీడ్స్ అధికారులు విత్తనాల గడువు ముగిసే సమయానికి రెండు నెలల ముందే ప్రభుత్వానికి తెలియజేయాలి. మూడు నెలలపాటు వాటికి గడువు పొడిగించాలంటే..అవి జెర్మినేçషన్ (మొలకెత్తడం) టెస్ట్‌లో పాసు కావాలి. అచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ధ్రువీకరించాలి. జెర్మినేషన్ టెస్ట్‌లో ఫెయిలైతే మాత్రం నాన్ సీడ్ పర్పస్ కింద విక్రయిస్తామని ఏసీ సీడ్స్ అధికారులు చెబుతున్నారు. ఏపీ సీడ్స్ అధికారులు విక్రయించే సంచులపై మనుషులుగానీ, ఇతర జంతువులగానీ తినడానికి వాడకూడదు అని రాసి ఉండటం గమనార్హం. -
రకం ఏదైనా మెలకువలు పాటించాల్సిందే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ మంది రైతులు బీటీ పత్తి సాగు పైనే ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం రైతులు వేలంవెర్రిగా కేవలం రెండు మూడు రకాల విత్తనాల కోసమే ఎగబడడం పరిపాటిగా మారుతోంది. వారు గుర్తుంచుకోవాల్సిన విషయమేమంటే వంగడం ఏదైనా తొలి దశ నుంచే సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడులు, ఆదాయం లభిస్తాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తమ ప్రాంతానికి అనువైన హైబ్రిడ్ రకాన్ని రైతులు ఎంపిక చేసుకోవాలి. నీటి వసతి కింద సాగు చేసే వారు మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలు వేసుకోవాలి. వర్షాధారంగా వేసే వారు త్వరగా పూతకు, కాపుకు వచ్చే స్వల్పకాలిక రకాల్ని ఎంచుకోవాలి. ఈ నేపథ్యంలో పత్తి సాగుపై ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందిస్తున్న సూచనలు... ఈ నేలలు అనువైనవి ముంపుకు గురికాని నల్లరేగడి నేలలు, ఆరుతడి సదుపాయం కలిగిన సారవంతమైన ఎర్ర నేలలు పత్తి సాగుకు అనుకూలంగా ఉంటాయి. తేలికపాటి నేలలు, ఇసుక నేలలు, ముంపుకు గురయ్యే నేలలు, వరికి అనువైన మాగాణి భూములు పత్తి పంటకు పనికిరావు. ఎప్పుడు-ఎలా విత్తాలి? జూన్-జూలై నెలల్లో 75-100 మిల్లీమీటర్ల వర్షం పడిన తర్వాత మాత్రమే పత్తి విత్తనాలు వేసుకోవాలి. భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడే మొలక శాతం బాగుంటుంది. మంచి దిగుబడులు వస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయమేమంటే బీటీ పత్తితో పాటు బీటీ జన్యువు లేని అదే రకం పత్తిని... అంటే రెఫ్యూజియా (ఎర పంట)ను పొలం చుట్టూ నాలుగైదు వరుసలుగా వేసుకోవాలి. సాధారణ రకం పత్తి మొక్కతో పోలిస్తే బీటీ పత్తి మొక్క ఎదుగుదల తక్కువగా ఉంటుంది. కాబట్టి నేల స్వభావం, నీటి వసతిని బట్టి వరుసలు, మొక్కల మధ్య దూరాన్ని తగ్గించాలి (వరుసల మధ్య 90-120 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45-60 సెంటీమీటర్ల దూ రం పాటించాలి). దీనివల్ల చేలో మొక్కల సాం ద్రత పెరుగుతుంది. ఎలుకల బెడదను నివారించాలంటే పదును మీదే విత్తనాలు వేయాలి. ఎరువుల యాజమాన్యం పత్తికి పంటకాలంలో ఎకరానికి 54 కిలోల నత్రజని (మూడు బస్తాల యూరియా), 24 కిలోల భాస్వరం (మూడు బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్), 24 కిలోల పొటాష్ (40 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్) వేయాలి. భాస్వరం మోతాదు మొత్తాన్నీ చివరి దుక్కిలోనే వేసుకోవాలి. సిఫార్సు చేసిన నత్రజని, పొటాష్ ఎరువుల్ని నీటి వసతి/వర్షపాతాన్ని బట్టి విత్తిన 20, 40, 60, 80 రోజులప్పుడు దఫదఫాలుగా వేయాలి. కలుపు నివారణ కోసం... బీటీ పత్తిలో కలుపు నివారణకు విత్తనాలు విత్తిన ఒకటి రెండు రోజులకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1.3-1.6 లీటర్ల పెండిమిథాలిన్ 30% కలిపి నేలపై పిచికారీ చేయాలి. విత్తిన 25-30, 50-55 రోజులప్పుడు గొర్రు/గుంటకతో అంతరకృషి చేయాలి. వర్షాలు ఎక్కువగా కురుస్తున్నప్పుడు అంతరకృషి సాధ్యంకాదు. అలాంటప్పుడు ఎకరానికి 200 లీటర్ల నీటిలో లీటరు పారాక్వాట్ 24% కలిపి పైరుపై పడకుండా వరుసల మధ్య కలుపుపై మాత్రమే పడేలా పిచికారీ చేసుకోవాలి. సమగ్ర చర్యలు తప్పనిసరి బీటీ పత్తి రకాల మధ్య జన్యు వైవిధ్యం తక్కువగా ఉంటుంది. పంటకాలంలో సరైన యాజమాన్య పద్ధతులు అవలంబించినట్లయితే ఏ వంగడమైనా దిగుబడి, నాణ్యత ఒకే రకంగా ఉంటాయి. రాష్ట్రంలో సాగు చేస్తున్న బీటీ పత్తి రకాలపై గుంటూరు లాం ఫారం గతంలో పరిశోధనలు చేసింది. బీటీ రకాల్ని సాగు చేస్తున్న వ్యవసాయ భూముల్లో విత్తనాలు విత్తిన 120 రోజుల వరకూ ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టకుండా పంట తీరును పరిశీలించారు. ఏ ఒక్క వంగడం కూడా రసం పీల్చే పురుగుల్ని తట్టుకోలేకపోతోందని ఆ పరిశీలనలో తేలింది. కాబట్టి సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపడితే ఏ బీటీ రకమైనా మంచి దిగుబడినే అందిస్తుంది. ఈ పురుగులతోనే ప్రమాదం పత్తి విత్తనాలు వేసిన 50-60 రోజుల వరకు రసం పీల్చే పేనుబంక, పచ్చదోమ, తామర పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వీటిలో పేనుబంక, పచ్చదోమ పురుగుల బెడద పంట చివరి వరకు ఉంటోంది. ఇక పైరు పూత మీద ఉన్నప్పుడు పొగాకు లద్దె పురుగులు, గులాబీ రంగు పురుగులు దాడి చేస్తాయి. రసం పీల్చే పురుగుల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా పచ్చ, తెల్ల దోమల్ని తట్టుకునే రకాన్ని ఎంచుకోవడం మంచిది. కిలో విత్తనాలకు 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్/4 గ్రాముల థయోమిథాక్సామ్‌తో పాటు తగినంత జిగురు కలిపి విత్తనశుద్ధి చేస్తే విత్తనాలు వేసిన 30-40 రోజుల వరకు రసం పీల్చే పురుగుల బెడద తప్పుతుంది. కిలో విత్తనాలకు 40-50 గ్రాముల కార్బోసల్ఫాన్ పట్టించి, విత్తుకుంటే రసం పీల్చే పురుగుల నుంచి 30 రోజుల వరకు పైరుకు రక్షణ లభిస్తుంది. మోనోక్రొటోఫాస్, నీటిని 1:4 నిష్పత్తిలో కలిపి, ఆ ద్రావణాన్ని బ్రష్‌తో మొక్క లేత కాండానికి పూసినట్లయితే (విత్తిన 20, 40, 60 రోజులప్పుడు) రసం పీల్చే పురుగులు అదుపులో ఉంటాయి. ఈ పద్ధతి వల్ల వాతావరణ కాలుష్యమూ తగ్గుతుంది. చివరిగా అవసరమైతే క్రిమిసంహారక మందులు పిచికారీ చేసుకోవాలి. -
పొలమే అతని ప్రయోగశాల
ఆధునికత పెరిగి, వ్యవసాయంలో కూడా కొత్త పరిణామాలు వచ్చాక, దేశవాళీ సేద్యపు విధానాలే కాదు... ఆ విత్తనాలూ కనుమరుగవుతున్నాయి. మనదైన పంట పండించుకోవడానికి మనదంటూ విత్తనం లేకుండా పోతోంది. ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటున్నాడో సాధారణ రైతు. దేశవాళీ విత్తనాలను కాపాడేందుకు వీలైనంతగా శ్రమిస్తున్నాడు. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి ప్రాంతానికి చెందిన జై ప్రకాశ్ సింగ్ చేస్తున్న కృషి, సాధించిన విజయం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మామూలు రైతు ఇప్పటి దాకా 460 రకాల దేశవాళీ వరి విత్తనాలు, 120 రకాల గోదుమ విత్తనాలు, 30 రకాల పప్పు ధాన్యాల విత్తనాలు, 4 రకాల ఆవాల విత్తనాలను భద్రపరిచాడు. ఈ దేశవాళీ విత్తనాలతో రైతులు ఎవరైనా సరే ఆ యా పంటలు వేసుకొని, భారీగా దిగుబడులు సాధించవచ్చని సాక్షాత్తూ సర్కారు వారు కూడా రాజముద్ర వేశారు. అన్నదాత జై ప్రకాశ్ సింగ్ కాపాడిన దేశవాళీ గోదుమ విత్తన రకంతో పంట వేస్తే, హెక్టారుకు ఏడు టన్నులకు పైగా పంట పండుతోంది. అలాగే, సర్వసాధారణంగా దీర్ఘకాలం పట్టే వరి రకంతో పంట చేతికి రావడానికి 150 నుంచి 160 రోజులు పడుతుంది. కానీ, జై ప్రకాశ్ దగ్గరున్న వరి కేవలం 130 రోజులకే విరగపండుతుంది. ఇలా ఆయన కాపాడుతున్న బ్రహ్మాండమైన దేశవాళీ విత్తనాలు, వాటి లక్షణాలపై ఇప్పటికే దేశం నలుమూలల నుంచి పలు వ్యవసాయ, పరిశోధక సంస్థలు పరిశోధన సాగించాయి. వారణాసికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోని తండియా గ్రామం ఈ రైతు - శాస్త్రవేత్తది. కేవలం 60 గడపలున్న గ్రామం అది. చిన్నప్పటి నుంచి చదువంటే ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ, పదో తరగతి తప్పాక, ఆయన చదువు కొనసాగించలేక పోయాడు. అదే సమయంలో ఉమ్మడి కుటుంబం విడిపోవడంతో, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడైన తండ్రి ఆయనను చదివించలేకపోయారు. తరువాతి రోజుల్లో క్రమంగా సేద్యం వైపు ఆకర్షితుడైన జై ప్రకాశ్ పంటపొలాల్లో తన ప్రయోగాలు మొదలుపెట్టాడు. ఆ ప్రయోగాలు, సేద్యాన్ని అందరికీ ఆమోదయోగ్యం చేయాలనే కృషే ఇవాళ ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. దాదాపు పాతికేళ్ళుగా సాగుతున్న తన కృషి దేశంలోని రైతులందరికీ ఉపయోగపడాలన్నది ఈ ఆదర్శ రైతు ఆశయం. అందుకే ఆయన తాను కాపాడుతున్న ఈ దేశవాళీ విత్తన రకాలను విక్రయించేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉంటున్నారు. తన దగ్గర కొన్న విత్తనాలను వేరే ఎవరికైనా విక్రయించాలనుకుంటే, కొన్న ధరకే విక్రయించాలంటూ ఏకంగా పత్రాల మీద సంతకాలు కూడా చేయించుకుంటున్నారు. ‘విత్తనాల కోసం భారీగా పెట్టుబడి పెట్టలేని చిన్న సన్నకారు రైతులందరికీ ఈ దేశవాళీ రకాలను అందుబాటులో ఉంచాలన్నదే నా ప్రయత్నం’ అని గర్వంగా చెబుతారు. దేశానికి అన్నభిక్ష పెట్టడం కోసం ఈ సామాన్యుడు సాగిస్తున్న కృషి చూసి సర్కారు వారు సైతం సలామ్ చేశారు. వందలాది దేశవాళీ విత్తన రకాలను కాపాడి, అందుబాటులో ఉంచుతున్నందుకు గాను జై ప్రకాశ్ సింగ్ 2002లో, 2009లో రెండు సార్లు అప్పటి రాష్ట్రపతుల నుంచి అవార్డులు అందుకున్నారు. అలాగే, ‘ప్లాంట్ జీనోమ్’ అవార్డు కూడా దక్కింది. ఈ ఆదర్శ వ్యవసాయదారుడు మాత్రం వచ్చిన అవార్డులను చూసుకొని మురిసిపోవడం లేదు. ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉందంటూ వ్యవస్థను నిలదీస్తున్నాడు. ‘‘రానున్న ఆహార కొరతను అధిగమించాలంటే దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ దేశవాళీ విత్తనాలను పరిరక్షించుకోవడం, సమర్థంగా వాడడం అవసరమని మన ప్రభుత్వాలు గ్రహించాలి. జన్యుమార్పిడి విత్తనాలకూ, వాటి సేద్యానికీ అనవసరంగా బోలెడంత డబ్బు తగలేస్తున్నాం’’అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆవేదనలో అర్థం ఉంది. దేశం కోసం తపన ఉన్న ఇలాంటి అన్నదాత కృషిని అవార్డులతో కాక, ఆచరణలో ప్రోత్సహిస్తే, వందల రకాల దేశవాళీ విత్తనాలను కాపాడగలిగితే మన జన్మభూమిని బంగారుభూమిగా మార్చుకోవడం కష్టమేమీ కాదు.