♦ కోల్డ్‌స్టోరేజీల్లో దాదాపు రూ. 15 కోట్ల ఏపీ సీడ్స్
♦ ఇప్పటికే గడువు ముగిసిన రూ. 4 కోట్ల విత్తనాల పట్టివేత
♦ డిమాండ్‌లేని విత్తనాల కొనుగోలుపై అనుమానాలు
మార్కెట్ మాయాజాలం.. దిగజారిన గిట్టుబాటు ధరలు..పెరుగుతున్న పెట్టుబడులు.. ప్రకృతి వైపరీత్యాలు..నకిలీ విత్తనాలు.. ఇలా అనేక సమస్యలు రైతుకు నష్టాలు మిగిల్చి కష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. అయినా మొక్కవోని ధైర్యంతో ఈ ఏడాది సాగు చేపట్టిన రైతులకు అండగా నిలవాల్సిన ఏపీ సీడ్స్ అధికారులు నిర్లక్ష్యపు మత్తులో మునిగిపోయారు. కోట్ల రూపాయల సరుకును కోల్డ్‌స్టోరేజీల్లోనే ఉంచి కాలం వెళ్లబుచ్చుతున్నారు. – సాక్షి, అమరావతి బ్యూరో
సాక్షి, అమరావతి బ్యూరో: కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమవుతున్నా పట్టించుకొనే నా«థుడు లేడు. కమీషన్లలకు కక్కుర్తిపడి, డిమాండ్‌లేని సరుకును అధిక ధరలకు కొనుగోలు చేసి.. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఇలా గుంటూరు జిల్లాలోనే ఏపీ సీడ్స్ ఆధ్వర్యంలో దాదాపు రూ. 20 కోట్ల విలువైన గడువు ముగిసిన సీడ్ కోల్డ్ స్టోరేజీల్లో మగ్గుతున్నట్లు సమాచారం. ఇందుకు ఊతమిచ్చేలా ప్రత్తిపాడులోని ఓ కోల్డ్‌స్టోరేజీలో శనివారం రూ. 4 కోట్ల విలువైన మినుములు, పెసర, నువ్వులను విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
గతేడాది విజిలెన్స్ అధికారులు హెచ్చరించినా..
గతేడాది అక్టోబరులో కల్తీ కారం నిల్వలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అదే సమయంలో ఏపీ సీడ్స్ విత్తనాలను గుర్తించినట్లు సమాచారం. విత్తనాలు అమ్ముకొనేందుకు ఈ ఏడాది ఫిబ్రవరితోనే గడువు ముగుస్తుందని హెచ్చరించారు. అయితే ఈ విషయాన్ని ఏపీ సీడ్స్ అధికారులు చెవికెక్కించుకోలేదు.
డిమాండ్ లేకున్నా...
గత మూడేళ్లుగా ఎల్‌బీజీ –752 రకం మినుము విత్తనాలను రైతులు వేసేందుకు ఆసక్తి చూపటం లేదు. ఈ రకం విత్తనాలు వైరస్, తెగుళ్లను తట్టుకోలేకపోవడమే దీనికి కారణం. అయినా ఏపీ సీడ్స్ ఎల్‌బీజీ – 752 విత్తనాలను కోనుగోలు చేయటంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ తతంగం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని చర్చ సాగుతోంది. పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని అవసరం లేకున్నా కోనుగోలు చేశారని రైతులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ విత్తనాలను 30 శాతం సబ్సిడీతో రైతులకు విక్రయిస్తున్నారు. విజిలెన్స్ అధికారుల దాడుల నేపథ్యంలో గడువు తీరిన విత్తనాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయనే దానిపై సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.
పనికిరాని విత్తనాల విక్రయం
ఏపీ సీడ్స్ అధికారులు విత్తనాల గడువు ముగిసే సమయానికి రెండు నెలల ముందే ప్రభుత్వానికి తెలియజేయాలి. మూడు నెలలపాటు వాటికి గడువు పొడిగించాలంటే..అవి జెర్మినేçషన్ (మొలకెత్తడం) టెస్ట్‌లో పాసు కావాలి. అచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ధ్రువీకరించాలి. జెర్మినేషన్ టెస్ట్‌లో ఫెయిలైతే మాత్రం నాన్ సీడ్ పర్పస్ కింద విక్రయిస్తామని ఏసీ సీడ్స్ అధికారులు చెబుతున్నారు. ఏపీ సీడ్స్ అధికారులు విక్రయించే సంచులపై మనుషులుగానీ, ఇతర జంతువులగానీ తినడానికి వాడకూడదు అని రాసి ఉండటం గమనార్హం.
విత్తు.. నిర్లక్ష్యపు మత్తు
Published Tue, Jun 27 2017 11:46 PM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM
Advertisement
Advertisement