పొలమే అతని ప్రయోగశాల
ఆధునికత పెరిగి, వ్యవసాయంలో కూడా కొత్త పరిణామాలు వచ్చాక, దేశవాళీ సేద్యపు విధానాలే కాదు... ఆ విత్తనాలూ కనుమరుగవుతున్నాయి. మనదైన పంట పండించుకోవడానికి మనదంటూ విత్తనం లేకుండా పోతోంది. ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటున్నాడో సాధారణ రైతు. దేశవాళీ విత్తనాలను కాపాడేందుకు వీలైనంతగా శ్రమిస్తున్నాడు. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి ప్రాంతానికి చెందిన జై ప్రకాశ్ సింగ్ చేస్తున్న కృషి, సాధించిన విజయం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మామూలు రైతు ఇప్పటి దాకా 460 రకాల దేశవాళీ వరి విత్తనాలు, 120 రకాల గోదుమ విత్తనాలు, 30 రకాల పప్పు ధాన్యాల విత్తనాలు, 4 రకాల ఆవాల విత్తనాలను భద్రపరిచాడు. ఈ దేశవాళీ విత్తనాలతో రైతులు ఎవరైనా సరే ఆ యా పంటలు వేసుకొని, భారీగా దిగుబడులు సాధించవచ్చని సాక్షాత్తూ సర్కారు వారు కూడా రాజముద్ర వేశారు.
అన్నదాత జై ప్రకాశ్ సింగ్ కాపాడిన దేశవాళీ గోదుమ విత్తన రకంతో పంట వేస్తే, హెక్టారుకు ఏడు టన్నులకు పైగా పంట పండుతోంది. అలాగే, సర్వసాధారణంగా దీర్ఘకాలం పట్టే వరి రకంతో పంట చేతికి రావడానికి 150 నుంచి 160 రోజులు పడుతుంది. కానీ, జై ప్రకాశ్ దగ్గరున్న వరి కేవలం 130 రోజులకే విరగపండుతుంది. ఇలా ఆయన కాపాడుతున్న బ్రహ్మాండమైన దేశవాళీ విత్తనాలు, వాటి లక్షణాలపై ఇప్పటికే దేశం నలుమూలల నుంచి పలు వ్యవసాయ, పరిశోధక సంస్థలు పరిశోధన సాగించాయి. వారణాసికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోని తండియా గ్రామం ఈ రైతు - శాస్త్రవేత్తది. కేవలం 60 గడపలున్న గ్రామం అది. చిన్నప్పటి నుంచి చదువంటే ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ, పదో తరగతి తప్పాక, ఆయన చదువు కొనసాగించలేక పోయాడు. అదే సమయంలో ఉమ్మడి కుటుంబం విడిపోవడంతో, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడైన తండ్రి ఆయనను చదివించలేకపోయారు. తరువాతి రోజుల్లో క్రమంగా సేద్యం వైపు ఆకర్షితుడైన జై ప్రకాశ్ పంటపొలాల్లో తన ప్రయోగాలు మొదలుపెట్టాడు. ఆ ప్రయోగాలు, సేద్యాన్ని అందరికీ ఆమోదయోగ్యం చేయాలనే కృషే ఇవాళ ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.
దాదాపు పాతికేళ్ళుగా సాగుతున్న తన కృషి దేశంలోని రైతులందరికీ ఉపయోగపడాలన్నది ఈ ఆదర్శ రైతు ఆశయం. అందుకే ఆయన తాను కాపాడుతున్న ఈ దేశవాళీ విత్తన రకాలను విక్రయించేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉంటున్నారు. తన దగ్గర కొన్న విత్తనాలను వేరే ఎవరికైనా విక్రయించాలనుకుంటే, కొన్న ధరకే విక్రయించాలంటూ ఏకంగా పత్రాల మీద సంతకాలు కూడా చేయించుకుంటున్నారు. ‘విత్తనాల కోసం భారీగా పెట్టుబడి పెట్టలేని చిన్న సన్నకారు రైతులందరికీ ఈ దేశవాళీ రకాలను అందుబాటులో ఉంచాలన్నదే నా ప్రయత్నం’ అని గర్వంగా చెబుతారు. దేశానికి అన్నభిక్ష పెట్టడం కోసం ఈ సామాన్యుడు సాగిస్తున్న కృషి చూసి సర్కారు వారు సైతం సలామ్ చేశారు. వందలాది దేశవాళీ విత్తన రకాలను కాపాడి, అందుబాటులో ఉంచుతున్నందుకు గాను జై ప్రకాశ్ సింగ్ 2002లో, 2009లో రెండు సార్లు అప్పటి రాష్ట్రపతుల నుంచి అవార్డులు అందుకున్నారు. అలాగే, ‘ప్లాంట్ జీనోమ్’ అవార్డు కూడా దక్కింది.
ఈ ఆదర్శ వ్యవసాయదారుడు మాత్రం వచ్చిన అవార్డులను చూసుకొని మురిసిపోవడం లేదు. ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉందంటూ వ్యవస్థను నిలదీస్తున్నాడు. ‘‘రానున్న ఆహార కొరతను అధిగమించాలంటే దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ దేశవాళీ విత్తనాలను పరిరక్షించుకోవడం, సమర్థంగా వాడడం అవసరమని మన ప్రభుత్వాలు గ్రహించాలి. జన్యుమార్పిడి విత్తనాలకూ, వాటి సేద్యానికీ అనవసరంగా బోలెడంత డబ్బు తగలేస్తున్నాం’’అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆవేదనలో అర్థం ఉంది. దేశం కోసం తపన ఉన్న ఇలాంటి అన్నదాత కృషిని అవార్డులతో కాక, ఆచరణలో ప్రోత్సహిస్తే, వందల రకాల దేశవాళీ విత్తనాలను కాపాడగలిగితే మన జన్మభూమిని బంగారుభూమిగా మార్చుకోవడం కష్టమేమీ కాదు.