
రైతు బాంధవుడు రంగా
భారత రాజకీయాలలో ఆచార్య ఎన్‌జీ రంగా అనితర సాధ్యమైన వ్యక్తి. దేశానికి స్వాతంత్య్రం రాకముందు, తరువాత ఆయన సెంట్రల్ లెజిస్టేటివ్ అసెంబ్లీలో పద హారు సంవత్సరాలు సభ్యులుగా పనిచేశారు. అలాగే 1991 వరకు పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక దానిలో సుదీర్ఘంగా 38 ఏళ్లపాటు సభ్యుడు. అయినా ఏ ప్రభుత్వ హోదానూ, మంత్రి పదవినీ ఆశించలేదు. ఏదో ఒక విధంగా అధికారం చేపట్టడానికి ఎలాంటి రాజీకైనా సిద్ధపడే వ్యక్తులు ఉన్న కాలంలో ఆచార్య రంగా ఎంతో విశిష్టంగా కనిపిస్తారు. జీవితాంతం కాంగ్రెస్‌వాదిగా ఉన్నప్పటికీ, రంగా రెండు సందర్భాలలో మాత్రం పార్టీని విడిచివెళ్లారు.
కృషికార్ లోక్ పార్టీని స్థాపించడం కోసం 1951లో ఒకసారి, ఉమ్మడి సహకార వ్యవసాయం గురించి కాంగ్రెస్ తీర్మానించినందుకు నిరసనగా, స్వతం త్ర పార్టీని స్థాపించడానికి 1959లో రెండోసారి కాంగ్రెస్ ను వీడారు. 1972లో తిరిగి చేరి, 1995లో తుది శ్వాస విడిచే వరకు నిబద్ధతతో పనిచేశారు. రాజ్యసభలో ఆయ నతో కలసి పనిచేసే అరుదైన అవకాశం 1977-80 మధ్య నాకు లభించింది. 1920 దశకంలోనూ, 1930 దశకం ఆరంభంలోనూ కాంగ్రెస్ నాయకత్వంలో రైతాంగ పోరాటాలు విస్తారంగా జరిగాయి. రైత్వారీ విధానం అమలులో ఉన్న ప్రాంతంలో సర్దార్ పటేల్ నాయకత్వంలో 1928లో బార్డోలీ సత్యాగ్రహం జరిగింది.
ఈ సమయంలోనే ఆచార్య రంగా తెలుగు రైతాం గం సమస్యల పరిష్కారం కోసం రాజకీయ కార్యకలాపా లను ప్రారంభించారు. 1929లో ఆచార్య రంగా, బిక్కిన వెంకటరత్నం, మాగంటి బాపి నీడు ఆంధ్ర జమిందారీ రైతు సంఘం సమావేశం నిర్వహిం చారు. దీనికి రంగాయే అధ్య క్షులు. అమెరికన్ ఫార్మర్స్ యూనియన్ బాటలో పని చేసిన ఈ రైతు సంఘం ఆదా యం, వ్యవసాయ రుణం, నిరు ద్యోగం, సంఘ సంస్కరణల ధ్యేయంగా పనిచేసింది. జమిం దారీ విధానాన్ని రద్దు చేయా లని 1931లో తీర్మానించింది. భూమి పన్ను తగ్గింపు కోసం రంగా నేతృత్వంలో తెలుగు ప్రాంతంలోని డెల్టాలో ఉద్యమం ఆరంభమైంది.
రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడానికి రంగా కలెక్టర్ కార్యాలయాలకు రైతు యాత్ర లను నిర్వహించారు. ఆయన ఆందోళన అంతా రాజ్యాం గబద్ధ పంథాలోనే నడిచింది. ఆ సమయంలోనే తన స్వస్థలం నిడుబ్రోలు (గుంటూరు జిల్లా)లో రైతుల కోసం నెలకొల్పిన ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించేందుకు మహాత్మాగాంధీని రప్పించారు. ఈ ఉద్యమం విజయ వంతమై పన్ను తగ్గించడానికి అధికారులు సుముఖత వ్యక్తం చేశారు.
రైతుల డిమాండ్లకు సం బంధించి ఆచార్య రంగా కాం గ్రెస్ నాయకత్వం కంటే ఎంతో ముందు ఉండేవారు. ఆంధ్రతో పాటే, బిహార్ తదితర పరగ ణాలలో రాష్ట్ర స్థాయి కిసాన్ సం ఘాలు పని చేయడం ప్రారం భించాయి. తమ కోర్కెల గురిం చి కాంగ్రెస్ అనుసరిస్తున్న విధా నం, కార్యక్రమాల పట్ల రైతాం గంలో అసంతృప్తి పెరగడంతో కిసాన్ సంఘాలు కూడా తమ స్వరాన్ని పెంచాయి. రైతాంగ సమస్యల పట్ల ఉన్న నిబద్ధతతోనూ, పార్లమెంటరీ పంథాలో అహింసా మార్గానికి కట్టుబడి ఉన్న కారణం గానూ స్వతంత్ర రైతు సంఘాలను ఏర్పాటు చేయాలని రంగా అభిప్రాయపడ్డారు. అలా 1936లో అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భవించింది.
అదే సంవత్సరం జరిగిన ఆంధ్ర ప్రాంత రైతు సద స్సులో రంగా మాట్లాడుతూ, రైతులకు అండగా నిలవ డంలో కాంగ్రెస్ నాయకత్వం విఫలమైందని విమర్శిం చారు (ఆధునిక భారత రైతాంగం: ఆచార్య రంగా ఉపన్యాసాల సంకలనం, 1936, పే. 31).
మద్రాస్ ప్రెసిడెన్సీలో (ఆంధ్రప్రాంతం అప్పుడు అందులో భాగం) ఆచార్య రంగా నేతృత్వంలో జరిగిన రైతాంగ ఉద్యమం సాధించిన ఘన విజయం- 1938 నాటి రుణ విమోచన చట్టం అమలు. రైతు రుణ విమో చనకు సంబంధించి రంగాగారు జరుపుతున్న పోరాటం లో ఇది శిఖరాయమానమైనది.
రంగా కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని వ్యతిరేకించినప్ప టికీ స్వాతంత్య్రం రావడానికి ముందు జరిగిన రైతు ఉద్యమాలలో కమ్యూనిస్టులతో సన్నిహితంగా కలసి పని చేశారు. ఆయన దృష్టి ప్రధానంగా చిన్న త రహా రైతుల సమస్యల మీద కేంద్రీకరించినప్పటికీ, రైతుకూలీల సమ స్యల గురించి కూడా ఆయన యోచించారు. ప్రముఖ కమ్యూనిస్టు బంకిమ్ ముఖర్జీకి జూలై 28, 1938న రంగా రాసిన లేఖలో ఈ విషయం వెల్లడైంది. తుది వరకు రైతు సమస్యల గురించి పోరాడినా, వారు తప్పు చేస్తే విమ ర్శించడానికి ఆయన ఏనాడూ వెనకాడలేదు. ఆంధ్ర దేశంలో కాంగ్రెస్‌కు ప్రజా మద్దతు తెచ్చిన నాయకుడు ఆచార్య రంగా.
(ఆచార్య రంగా (1900-1995) శత జయంతి సం దర్భంగా 2000 సంవత్సరంలో ప్రచురించిన ప్రత్యేక సం చిక కోసం నాటి కాంగ్రెస్ ప్రముఖుడు, నేటి రాష్ట్రపతి ప్రణబ్ కుమార్ ముఖర్జీ ‘ఆచార్య రంగా రైతాంగ ఉద్య మం’ పేరుతో రాసిన వ్యాసమిది. రంగా 20వ వర్ధంతి సందర్భంగా (జూన్ 8) డాక్టర్ బండ్లమూడి సుబ్బారావు ఈ వ్యాసాన్ని సేకరించి పంపారు.)