
మీ ఇల్లు ఇలాగే ఉంచుతారా?
ఏఎన్‌యూ వసతిగృహాల్లో పర్యటించిన మంత్రి గంటా
పరిసరాలు శుభ్రం చేయాలని సూచన
విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన మంత్రి
ఏఎన్‌యూ : రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. యూనివర్సిటీలో సంస్కరణలు, చేపట్టాల్సిన చర్యలపై పరిపాలనాభవన్‌లోని కమిటీ హాలులో సమీక్ష జరిపారు. అనంతరం బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. వసతి గృహ ప్రాంగణంలో పరిసరాలను పరిశీలించారు. పనికిరాని వస్తువులను చిందరవందరగా పడవేయటం, ఆవరణలో చెట్లు పెరిగి ఉండటంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. మీ ఇల్లు ఇలాగే ఉంచుకుంటారా అని యూనివర్సిటీ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. వెంటనే శుభ్రం చేసి లాండ్‌స్కేపింగ్ చేయాలని సూచించారు.
వసతిగృహం స్టోర్‌లో వస్తువులు, స్టాక్ రికార్డులను పరిశీలించారు. అనంతరం భోజనశాలలో విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. భోజనం ఎలా ఉంటుందని విద్యార్థినినులను అడిగారు. కొన్నిసార్లు భోజనం బాగోవటంలేదని, పెరుగు బాగోవటం లేదని వారు సమాధానమిచ్చారు. బాలికల వసతి గృహాల్లోని అన్ని సమస్యలు పరిష్కరించాలని ఇన్‌చార్జి వీసీకి సూచించారు. విద్యార్థినులు ఉండే గదులు, పరిసరాలను పరిశీలించారు. వసతి గృహాల్లో 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని మంత్రిని స్టూడెంట్స్ కోరారు. వెంటనే నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని మంత్రి సూచించారు. మంత్రి వెంట ఇన్‌చార్జి వీసీ బి.ఉదయలక్ష్మి, రెక్టార్ ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, వసతి గృహాల వార్డెన్ ఆచార్య ఎల్.ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.