ముహూర్తం సమయానికి మాయం
సింగ్‌నగర్ స్టేషన్‌లో కేసు
మధురానగర్ : ప్రేమించిన యువతిని ముందుగా రిజిస్టర్ మ్యారేజీ చేసుకుని, తరువాత పెద్దల సమక్షంలో వివాహమాడతానని ఆమె తల్లిదండ్రులను ఓ యువకుడు నమ్మించాడు. తీరా ముహూర్తం సమయానికి మాయమయ్యాడు. దీనిపై సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగ్‌నగర్ లూనాసెంటర్ ప్రాంతానికి చెందిన యువతి (21) ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సీ పైనలియర్ చదువుతోంది. వర్సిటీలో ఆమె సహచరుడైన గుండా మల్లిఖార్జునరావు గత నెల ఎనిమిదో తేదీన యువతి ఇంటికి వచ్చాడు. తామిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటానని యువతి తల్లిదండ్రులకు చెప్పాడు. ఈ పెళ్లి విషయంలో తమకు అభ్యంతరం లేదని ఆమె తండ్రి చెప్పారు. మీ కుటుంబసభ్యులు అంగీకరిస్తే వివాహం చేస్తానని చెప్పారు. తన కుటుంబసభ్యులతో మాట్లాడతానని చెప్పి మల్లికార్జునరావు వెళ్లిపోయాడు.
కొన్నిరోజుల తరువాత తిరిగి వచ్చి తమ ఇంట్లో పెళ్లికి అంగీకరించటం లేదని చెప్పాడు. తన ప్రేమ స్వచ్ఛమెనదని, తాను కచ్చితంగా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వారు సరేనన్నారు. ఈనెల 13వ తేదీన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకోండంటూ చెప్పి ఖర్చుల కోసం రూ.10 వేలు తీసుకుని వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి అతడి ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. 13వ తేదీన ముహూర్తం సమయానికి అతడు రాలేదు. దీంతో మోసపోయామని యువతి కుటుంబీకులు భావించారు. దీనిపై యువతి తండ్రి ఫిర్యాదు మేరకు సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రేమ, పెళ్లి పేరుతో యువకుడి మోసం
Published Sat, Feb 14 2015 1:21 AM | Last Updated on Fri, Aug 17 2018 2:08 PM
Advertisement