బుడమేరు వరదకు 32 మంది బలి
లెక్కతేలని మరణాలు మరెన్నో?
‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్
వరద నీటిలో కొట్టుకు వస్తున్న శవాలు
విజయవాడలో హృదయ విదారక దృశ్యాలు
చనిపోయిన వారి లెక్కచెప్పని సర్కార్
శవాలు కనిపిస్తున్నా పట్టించుకోని అధికారులు
మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వని వైనం
అంతిమ సంస్కారాలకూ దిక్కులేదా?
ప్రభుత్వ వైఫల్యం వరద బాధితుల పాలిట అంతులేని విషాదాన్ని మిగిల్చింది. విజయవాడ కన్నీటి సంద్రమైంది. వరద తగ్గుముఖం పడుతున్న కొద్దీ నీటిపై తేలియాడుతున్న శవాలతో ముంపు వాసుల గుండె చెరువవుతోంది. వరదల గురించి ముందుగా అప్రమత్తం చేయడంలో విఫలమైన ప్రభుత్వం.. కనీసం గల్లంతైన వారి ఆచూకీ అయినా చెబుతుందేమోన్న బాధిత కుటుంబాల ఆశలపై నీళ్లు చల్లుతోంది. బాధితుల ఆర్తనాదాలు అరణ్య రోదనగానే మిగిలిపోతున్నాయి.
మూడ్రోజులుగా గల్లంతైన వారు శవాలుగా మారి నీటిలో కొట్టుకుపోతూ కనిపిస్తున్న దృశ్యాలు అత్యంత హృదయ విదారకంగా మారాయి.మృతదేహాలు అలా కళ్లెదుటే వెళ్లిపోతున్నా, చంద్రబాబు సారధ్యంలోని ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడం కనీస భారతీయ సంప్రదాయమనే విషయాన్ని విస్మరిస్తోంది. ఇప్పటిదాకా 32 మృతదేహాలు వెలుగుచూశాయి. మూడ్రోజులుగా ప్రజల మధ్యే ఉన్నప్పటికీ ఈ వాస్తవాలు దాచిపెట్టడం చంద్రబాబు దుర్మార్గానికి పరాకాష్ట.
సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి, అమరావతి: విజయవాడ బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో తేలుతున్న శవాలు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి. ఇప్పటికే 32మంది మృతిచెందితే వీరిలో ఒక్కర్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోవడం విస్తుగొల్పుతోంది. ఇంకా ఎంతమంది చనిపోయారోనని స్థానికులు ఆందోళన
చెందుతున్నారు.
పదుల సంఖ్యలో మృతదేహాలు!
‘ప్రకాష్‌నగర్, సుందరయ్యనగర్, ఎల్‌బీఎస్ నగర్, పైపుల రోడ్డు ఇలా చాలా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో మృతదేహాలు నీటిలో కొట్టుకువస్తూ కనిపించాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం మంగళవారం కలకలం రేపింది. పైపుల రోడ్డు ప్రక్క వీధిలో ఒక టీ స్టాల్ వద్ద మృతదేహం ఉందని, మూడు రోజులుగా దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు చెబుతున్నా అధికారులెవరూ పట్టించుకోలేదు. కాగా, ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడులో వరదలో గల్లంతైన వ్యక్తిని నాగ వీరరాజు (63)గా గుర్తించారు.
ఫ్రీజర్లు సిద్ధం చేయండి..
వరదల్లో మరణించిన వారిని భద్రపరిచేందుకు ఫ్రీజర్లను సిద్ధం చేయాలని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాయి. జీజీహెచ్‌లో 24 ఫ్రీజర్లు అందుబాటులో ఉండగా.. అవి ఇప్పటికే శవాలతో నిండిపోయాయి. ప్రైవేట్ వారి నుంచి ఏడు ఫ్రీజర్లను తీసుకోగా అవికూడా చాలవని మరో 10 ఫ్రీజర్లను అయినా సిద్ధం చేయమని ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు.. వరదల్లో చనిపోయిన వారి శవాలు మార్చురీలో ఫ్రీజర్లులేక పక్కన పెట్టేస్తున్నారు.
చిన్నారులను చిదిమేసిన వరద
వించిపేట(విజయవాడ పశ్చిమ): ఇద్దరు చిన్నారులను వరద నీళ్లు, ప్రభుత్వ వైఫల్యం చిదిమేశాయి. రెండు కుటుంబాల్లోని తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చాయి. ఈ హృదయ విదారక ఘటనలు విజయవాడలోని కేఎల్ రావునగర్‌లో జరిగాయి. వివరాలు.. కేఎల్ రావునగర్‌లోని వైఎస్సార్ కాలనీలో బాలినేని కృష్ణారెడ్డి, గాయత్రి దంపతులు తమ పిల్లలతో నివాసముంటున్నారు. ఆదివారం ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో అతి కష్టం మీద కేఎల్ రావునగర్‌లోనే ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు.
అక్కడ కూడా వరద ముంచెత్తడంతో.. అందరూ కలసి రెండో అంతస్తులో ఉంటున్నారు. సోమవారం రాత్రి వారి చిన్న కుమార్తె సాయిసుధ(6) ఆడుకుంటూ.. వరద నీటిలో పడిపోయింది. వెంటనే తల్లిదండ్రులు గమనించి చిన్నారిని బయటకు తీసి.. ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే బాలిక మృతి చెందినట్టు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అలాగే కేఎల్ రావు నగర్‌లోనే నీట మునిగి మరో బాలుడు మృతి చెందాడు.
పెరుమాలపల్లి కిశోర్, రేణుక దంపతుల కుమారుడు వరుణ్‌సందేశ్(14) ఆదివారం వరద ప్రవాహాన్ని చూసేందుకని బయటకు వెళ్లాడు. ఇంటి సమీపంలోని నీటిలో నడుస్తూ కాలు జారి నీట మునిగిపోయాడు. స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా.. వరుణ్ ఆచూకీ లభ్యం కాలేదు. సాయంత్రం కోస్టల్ స్కూల్ వద్ద బాలుడి మృతదేహం బయటపడింది. ప్రభుత్వం తమను సురక్షిత ప్రాంతాలకు తరలించకపోవడం వల్లే తమ పిల్లలను కోల్పోయామని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో మృతదేహాలు
శవాల మధ్య నరక యాతన
ప్రకాష్ నగర్, సుందరీనగర్, ఎల్‌బీఎస్ నగర్, పైపుల రోడ్డు ఇలా చాలా ప్రాంతాల్లో 50 వరకూ శవాలున్నాయి. శవాలు వాసన వస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలతో నరకం చూస్తున్నాం. తాగునీళ్లిచ్చినా బతికేలా ఉన్నాం. అసలు నీళ్లు రావడం లేదు. పడవ అడిగితే రూ.10 వేల నుంచి రూ.40 వేలు అడుగుతున్నారు. ఎక్కడినుంచి తెస్తాం? 40 పడవలు దించామన్నారు. ఒక్కటి కూడా మా దగ్గరకు రాలేదు. ఇంత మంది పోలీసులున్నారు.
ఆహారం లేదు.. తాగడానికి నీరు లేదు.. ఏమీ రాలేదు. ఎట్టకేలకు నడుచుకుంటూ వస్తుంటే ఎవరో ఒకాయన పడవ ఎక్కించుకుని తీసుకువచ్చారు. ఎంతో కష్టంగా ఉంది. ఇంట్లో సామాన్లు తడిసిపోయి, బయటి చెత్తా చెదారం ఇంట్లోకి వచ్చేసి ఇల్లు నాశనం అయిపోయింది. ఒక్కరికి కూడా ఆహారం లేదు. ఒక్క రోజైతే పర్లేదు. నాలుగు రోజులుగా అలానే ఉన్నాం. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అంటూ ఉందా.. లేదా అర్థం కావడం లేదు.
– ఓ వరద బాధితురాలి ఆవేదన
ఇవి బుడమేరు వరద మరణాలు కావా?
⇒ మూడ్రోజుల కిందట వరదల్లో గల్లంతైన పాతపాడు గ్రామానికి చెందిన రేవూరి సతీష్‌కుమార్ (16) మృతిచెందాడు. ఆదివారం స్నేహితులతో కలిసి పాతపాడు నుంచి కండ్రిక వెళ్లే రోడ్డులో ప్రవహిస్తున్న వరదను చూసేందుకు వెళ్లి వరద ఉధృతిలో స్నేహితులతో పాటు సతీష్‌కుమార్ కొట్టుకుపోయాడు. స్థానికుల సాయంతో స్నేహితులు ఒడ్డుకొచ్చారు. సతీష్ గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లతో కుటుంబ సభ్యులు ఎంత గాలించినా ఆచూకి దొరకలేదు. మూడో రోజు కండ్రికలో సతీష్ మృతదేహాన్ని కనుగొన్నారు.
⇒ అంబాపురం–జక్కంపూడి గ్రామాల మధ్య ఆదివారం వరదలో నున్న గ్రామానికి చెందిన దారా శ్యామ్ అనే వ్యక్తి మృతిచెందాడు. తమ కుటుంబం పెద్దదిక్కు కోల్పోయిందని మృతుని భార్య పద్మజ కన్నీరుమున్నీరవుతున్నారు. శ్యామ్, పద్మజలకు ఒక కుమార్తె. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో తమ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని ఆమె కోరుతున్నారు.
కేఎల్ రావు నగర్‌లో..
⇒ కేఎల్ రావు నగర్ పాల ప్రాజెక్టు ప్రాంతానికి చెందిన పెరుమాలపల్లి కిశోర్ పాల ఫ్యాక్టరీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొడుకు వరుణ్‌సందేశ్ (14) ఆదివారం వరద నీటిని చూసేందుకు బయటకొచ్చి నడుచుకుంటూ వెళ్తుండగా కాలుజారి పడిపోయాడు. అయితే, వరుణ్‌ను రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితంలేదు. రెండు గంటల తర్వాత కోస్టల్ స్కూల్ వద్ద బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.
⇒ వైఎస్సార్ కాలనీకి చెందిన బాలినేని కృష్ణారెడ్డి, గాయత్రిలకు ఆరుగురు సంతానం. ఆదివారం కాలనీని వరద నీరు ముంచెత్తడంతో కట్టుబట్టలతో కేఎల్ రావునగర్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. సోమవారం రాత్రి కృష్ణారెడ్డి చిన్న కుమార్తె సాయిసుధ (6) ఇంటి ముందు ఆడుకుంటూ వరద నీటిలో పడిపోయింది. దీంతో అపస్మారక స్ధితికి చేరుకున్న సాయిసుధను ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
గుణదలలో..
⇒ గుణదల వెటర్నరీ కాలనీకి చెందిన కొల్లిపర వెంకటేశ్వరరావు ఆదివారం సాయంత్రం తన కుమారుడు సాయి సందీప్‌తో కలిసి కార్మెల్ నగర్‌కు వెళ్లి తిరిగొస్తూ వరద ఉధృతిలో కొట్టుకుపోయారు. వెంకటేశ్వరరావు మృతదేహం బుడమేరు సమీపంలో గుర్తించగా, సాయి సందీప్ మంగళవారం శవమై తేలాడు. కాగా, గుణదల ఈగల్ ఫర్నిచర్ షాప్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం (45)ను మంగళవారం పోలీసులు వరద నీటిలో గుర్తించారు.
రాజీవ్‌నగర్‌లో..
రాజీవ్‌నగర్‌కు వరద రావడంతో అనారోగ్యంతో ఉన్న సుభాష్ చంద్రబోస్ (80)ను అతని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రిలో ఉంచారు. అయితే, ఆసుపత్రిలో సుభాష్‌చంద్రబోస్‌కు సరైన చికిత్స లభించకపోవడం కారణంగానే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.
సింగ్‌నగర్‌లో..
సింగ్‌నగర్‌లోని ఆంధ్రప్రభ కాలనీకి చెందిన శివారెడ్డి ఆదివారం తన షాపు మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా వరద ఎక్కువ కావడంతో కాలనీ 12వ లైన్‌లో ఓ గోడపై కూర్చున్నాడు. ఆ తర్వాత శివారెడ్డి కనిపించకపోవడంతో బంధువులు చుట్టుపక్కల గాలించారు. మూడు రోజుల తర్వాత శవమై కనిపించాడని తమ్ముడు ప్రతాప్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కనీసం స్ట్రెచర్ కూడా ఇవ్వలేదని కుటుంబ సభ్యులు సర్కారు తీరుపై విరుచుకుపడుతున్నారు.
సింగ్‌నగర్‌లోనే మరో మృతదేహం..
సింగ్‌నగర్‌లోని పైపుల రోడ్డు పక్కనే ఉన్న టీస్టాల్ వద్ద మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. సుమారు 50 ఏళ్లుంటాయని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇతను చనిపోయి మూడు రోజులై ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహం నుంచి దుర్వాసన వెదజల్లుతోంది.
ఇవికాక..
⇒ ఆదివారం తొలిరోజే అజిత్‌సింగ్‌నగర్ వాంబే కాలనీకి చెందిన కర్రి భారతి అదే ప్రాంతంలోని గంగానమ్మ చెట్టు వద్ద వరదనీటిలో దాటుకుంటూ గుండెపోటుతో మరణించింది. స్థానికులు ఆమెను కారు మీద వదలేసి వెళ్లారు.
⇒ అదేరోజు అజిత్‌సింగ్‌నగర్‌లో ట్రాక్టర్ కింద ఓ వ్యక్తిపడి మరణించారు. ఈ మృతదేహం ఎవరిదో ఇప్పటికీ తెలియడం.
⇒ ఆదివారం గొల్లపూడిలో దాది శ్రీనివాస్ కళ్యాణ్ (33) అనే వ్యక్తి కాలువలో పడి చనిసోయాడు.
⇒ సోమవారం వరదలో నాలుగు శవాలున్నట్లు వరద ప్రాంతాల్లోని ప్రజలు చెబుతున్నారు. అలాగే, సింగ్‌నగర్‌లో సోమవారం ఇంట్లోకి నీరు రావడంతో పద్మావతి (48) మృతిచెందారు.
⇒ మంగవారం బంధువులను తీసుకుని వస్తుండగా, రెండు శవాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
ముందుగా హెచ్చరించి ఉంటే నాన్న బతికేవాడు
ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయని మా ఇద్దరిని (కుమారుడు, కుమార్తె), అమ్మ (శ్రీలక్ష్మి)ని ఒడ్డుకు చేర్చి, సామాను తెస్తానని వెళ్లిన నాన్న వెంకటేశ్వరరావు(43) అక్కడే చనిపోయాడు. మమ్మల్ని బతికించి నాన్న చనిపోయాడు. అసలే మాది పేద కుటుంబం. కూలికి వెళ్తేకానీ పూట గడవని స్థితి. అక్క పదో తరగతి, నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాం. మమ్మల్ని బాగా చదివించాలని నాన్న బాగా కష్టపడేవాడు. నాన్న ఉంటే మాకు ఏది అడిగితే అది ఇచ్చేవారు. ఇప్పుడు నాన్న లేని లోటు ఎవరు తీరుస్తారు? పులివాగు మా నాన్నను పొట్టనపెట్టుకుంది. ముందస్తు హెచ్చరికలు చేసి ఉంటే మా నాన్న చనిపోయేవాడు కాదు.
– నన్నెబోయిన సంతోష్‌కుమార్, గంగినేని గ్రామం, జి.కొండూరు మండలం, ఎన్టీఆర్ జిల్లా
వరద సమాచారంలేకే పెద్ద దిక్కును కోల్పోయాం
మాకున్న ఎకరం పొలంతో పాటు మరో రెండు ఎకరాలను కౌలుకి తీసుకొని మా ఆయన శెట్టిపల్లి కృష్ణారెడ్డి(48) సాగు చేసుకుంటున్నాడు. వరి పొలంలో మోటారు వర్షానికి తడిసి పోతుందేమోనని దానిపై పట్టాలు కప్పేందుకు వెళ్లాడు. వరద ఉధృతి పెరగడంతో పక్కనే ఉన్న వేస్ట్‌మేనేజ్‌మెంట్ యూనిట్‌లోకి వెళ్లి తల దాచుకున్నాడు. ఉన్నట్లుండి వరద మరింతగా పెరగడంతో ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఉప్పెనలా వరద వచ్చే అవకాశం ఉందని ముందస్తుగా ఎటువంటి సమాచారం లేకపోవడం వల్లనే మేము మా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయాం.
– కృష్ణకుమారి, వెల్వడం, మైలవరం మండలం
వరదల్లో మరణించిన వారి వివరాలు
1. రేవూరు సతీష్ కుమార్, పాతపాడు, 2. దారా శ్యామ్, నున్న
3. పెరుమాలపల్లి వరుణ్‌సందేశ్, కేఎల్‌రావు నగర్,
4. బాలినేని సాయిసుధ, వైఎస్సార్ కాలనీ
5. కొల్లిపర వెంకటేశ్వరరావు, గుణదల వెటర్నరీ కాలనీ
6. సుభా‹Ùచంద్రబోస్, రాజీవ్‌నగర్
7. శివారెడ్డి, ఆంధ్రప్రభ కాలనీ, సింగ్‌నగర్
8. గుర్తు తెలియని వ్యక్తి, సింగ్‌నగర్
9. కర్రి భారతి, వాంబేకాలనీ, సింగ్‌నగర్
10. దాది శ్రీనివాస్ కళ్యాణ్, గొల్లపూడి, 11. పద్మావతి, సింగ్‌నగర్
12. పాముల వర్దన్, న్యూ రాజీవ్‌నగర్, ఉడా కాలనీ
13. మాతా సన్యాసి అప్పడు, ఓల్డ్ రాజీవ్‌నగర్, సింగ్‌నగర్
14. గుంజ రమణ, డాబాకొట్ల సెంటర్, సింగ్‌నగర్
15. వజ్రాల కోటేశ్వరరావు, డాబాకొట్ల సెంటర్, సింగ్‌నగర్
16. గుర్తు తెలియని 45 ఏళ్ల వ్యక్తి, ప్రకాశ్‌నగర్, నున్న
17. గుర్తు తెలియని 40 ఏళ్ల వ్యక్తి, జక్కంపూడి, పాముల కాలువ
18. కె.దుర్గారావు, రాజీవ్‌నగర్, 19. గుడ్డు, బిహార్ వ్యక్తి
20. కె.వెంకటరమణారెడ్డి, సింగ్‌నగర్
21. నాగదుర్గారావు, ఇబ్రహీంపట్నం
22. గుర్తు తెలియని వ్యక్తి, నున్న
23. వలిశెట్టి చంద్రశేఖర్, గంగానమ్మ గుడిరోడ్డు, కృష్ణలంక
24, 25, 26, 27. సింగ్‌నగర్‌లో సోమవారం మరో నాలుగు గుర్తు తెలియని మృతదేహాలు
28, 29. సింగ్‌నగర్‌లోనే మంగళవారం చెట్టుకు వేలాడుతూ
రెండు మృతదేహాలు
30. కొడాలి యశ్వంత్‌కుమార్, న్యూ రాజరాజేశ్వరిపేట
31. గుణదలలోని ఈగల్ ఫర్నిచర్ షాపు సమీపంలో
గుర్తు తెలియని 43 ఏళ్ల వ్యక్తి మృతదేహం
32.పడేసి రాజా, పాయకాపురం
సర్టిఫికెట్స్ కోసం వెళ్లిన విద్యార్ధిని మింగేసిన వరద
న్యూ రాజరాజేశ్వరీపేటలో తీవ్ర విషాదం
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): తన సర్టిఫికెట్లు తడిసిపోతాయనే భయంతో.. వాటిని తెచ్చుకొనేందుకు ఇంటికి వెళ్లిన ఓ డిగ్రీ విద్యార్ధిని వరద మింగేసింది. విజయవాడ 57వ డివిజన్ న్యూరాజరాజేశ్వరీపేటలో ఈ విషాదం అందరినీ కలచివేసింది. న్యూ రాజరాజేశ్వరీపేటలో నివసిస్తున్న కొడాలి యశ్వంత్ కుమార్ (20) డిగ్రీ వరకు చదువుకున్నాడు. అతని ఇల్లు మొత్తం వరద నీటిలో మునిగిపోవడంతో అతని కుటుంబం అందులోనే చిక్కుకుపోయింది.
సోమవారం మధ్యాహ్నం స్థానికుల సాయంతో ఆ కుటుంబం అక్కడి నుంచి బయటపడింది. యశ్వంత్ డిగ్రీ సర్టిఫికెట్లు ఇంట్లోనే ఉండిపోవడంతో వాటిని తెచ్చుకొనేందుకు స్నేహితుడితో కలిసి మంగళవారం ఉదయం ఇంటికి వెళ్లాడు. సర్టిఫికెట్లు తీసుకొని తిరిగి వస్తుండగా నీటి ప్రవాహం ధాటికి అదుపుతప్పి కొట్టుకుపోయాడు. ఓ చెట్టుకు చిక్కుకొని ఇరుక్కుపోయాడు. అతని స్నేహితుడు అతి కష్టం మీద బయటపడ్డాడు.
స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు ఇసరపు రాజు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి యశ్వంత్ కోసం గాలించగా వరదనీటిలో శవమై కనిపించాడు. యశ్వంత్ చెట్టుకు చిక్కుకొని రెండు గంటలకు పైగా మృత్యువుతో పోరాడాడని, ఎటువంటి సాయం అందకపోవడంతో మృత్యువాత పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. యశ్వంత్ మృతదేహాన్ని వెలికి తీసేందుకు అధికారులెవరూ ముందుకు రాలేదు.
చివరకు వైఎస్సార్‌సీపీ నాయకుల సాయంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి మృతదేహాన్ని అతి కష్టంమీద వెలుపలికి తీసుకువచ్చారు. చివరకు మృతదేహాన్ని తరలించేందుకు వాహనాన్ని ఇవ్వడానికి కూడా అధికారులు నిరాకరించారు. దీంతో కుటుంబసభ్యులే ఓ మోటారు సైకిల్‌పై యశ్వంత్ మృతదేహాన్ని పూర్ణానందపేటలోని బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. అధికారులు వారికి సహకరించకపోగా ప్రభుత్వం నుంచి సాయం కావాలంటే మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి మీరే తీసుకువెళ్లండంటూ సలహా ఇవ్వడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment