► గుంటూరు జీటీ రోడ్డుపై రాస్తారోకో
► ప్రభుత్వ తీరుపై ధ్వజం
కొరిటెపాడు(గుంటూరు): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం గుంటూరు జీటీ రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. వ్యవసాయ కళాశాలల విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులంతా ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం లేనిపోని జీవోలతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. వ్యవసాయ రంగంపై మక్కువతో బీఎస్సీ ఏజీ కోర్సు పూర్తి చేశామని, రాష్ట్రంలో తగినన్ని సీట్లు అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న యూజీసీ గుర్తింపు ఉన్న విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నామన్నారు.
యూజీసీ గుర్తింపు ఉన్న విద్యాసంస్థలకు ఐసీఏఆర్ గుర్తింపు అవసరం లేదన్నారు. కానీ రాష్ట్రంలో ఏ ఉద్యోగానికి హాజరైనా ఐసీఏఆర్ గుర్తింపు లేని కళాశాలలో విద్యనభ్యసించారని అభ్యంతరాలు తెలుపుతున్నారన్నారు. తమను జీఆర్‌ఎస్, ఎస్‌ఆర్‌ఎఫ్, ఏఆర్‌ఎస్బీ, నీట్ వంటి పరీక్షలకు అనుమతించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా ఎప్పటికీ నిరుద్యోగులుగానే మిగిలిపోవాల్సిన పరస్థితి ఏర్పడిందన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జీవో నెం 64పై హైకోర్టు సస్పెన్షన్ ఎత్తివేయించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం నగరపాలెం పోలీసులు రాస్తారోకో వద్దకు వచ్చి వారించడంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అనేక పరిణామాల తర్వాత రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనరేట్ కార్యాలయంలోని డీడీ అడ్మిన్ భగత్‌స్వరూప్‌కు విద్యార్థులు సమస్యలపై వినతిపత్రం అందించారు.