విద్యార్థి ఉద్యమం | Students movement for jury trial | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 25 2015 7:55 AM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యపై న్యాయ విచారణకు డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఉద్యమం చేపట్టారు. ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా ఏర్పడిన విద్యార్థి సంఘాలు శుక్రవారం వర్సిటీలో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించి ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో దోషులను పట్టుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, వర్సిటీలో విద్యార్థినులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్‌చార్జి వీసీకి అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యార్థినులకు యూనివర్సిటీలో రక్షణ లేదనటానికి, మితిమీరిన వేధింపులు ఉన్నాయనటానికి రిషితేశ్వరి ఆత్మహత్యే నిదర్శనమన్నారు. మరే విద్యార్థిని ర్యాగింగ్ భూతానికి బలి కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే వరకు తాము ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. ర్యాగింగ్‌ను యూనివర్సిటీ నుంచి తరిమి కొడతామని పేర్కొన్నారు. విద్యార్థిని మృతిపై న్యాయవిచారణ జరిపించాలని, ర్యాగింగ్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని, ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్‌చార్జి వీసీ ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు కు సమర్పించారు. దీనిపై ఇన్‌చార్జి వీసీ స్పందిస్తూ యూనివర్సిటీ వసతి గృహాల్లో భద్రతా చర్యలు ప్రారంభమయ్యాయని రెసిడెంట్ వార్డెన్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ర్యాగింగ్ నిరోధక కమిటీలు, యూనివర్సిటీ సీనియర్ అధ్యాపకులు వారంలో మూడు రోజులు వసతి గృహాల్లో పర్యటిస్తారని తెలిపారు. రాత్రి పదిగంటల తరువాత తాను కూడా వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీ చేస్తానని తెలిపారు. ఘటనపై న్యాయ విచారణ జరపటం, కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలకు ప్రభుత్వాన్ని సంప్రదిస్తాననీ, వారు ఏవిధంగా చెబితే ఆవిధంగా నడుచుకుంటానన్నారు. దీనికి నిర్ణీత గడువు చెప్పాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేయగా, ప్రభుత్వంతో ఈ రోజే తాను మాట్లాడతానన్నారు. యూనివర్సిటీ నియమించిన నిజనిర్ధారణ కమిటీలో ఉన్న ఓ అధ్యాపకుడు ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ అసాంఘిక చర్యలను సమర్థిస్తూ మాట్లాడడం సమంజసమా అని ఎస్‌ఎఫ్‌ఐ నాయకురాలు జ్యోతి ఈ సందర్భంగా ప్రశ్నించారు. దీనికి వీసీ స్పందిస్తూ కమిటీ సభ్యుడు అలా మాట్లాడి ఉండకూడన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement