
రాజధాని నిర్మాణంతో జిల్లా అభివృద్ధి బాట - ఎంపీ రాయపాటి
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో జిల్లా అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఎంపీ రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు.
నరసరావుపేట వెస్ట్: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో జిల్లా అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఎంపీ రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోనే రాజధాని నిర్మాణం అధికంగా ఉంటుందని, పరిపాలన భవనం కూడా జిల్లా పరిధిలోనే ఉంటుందని చెప్పారు. నరసరావుపేటలో బుధవారం రాత్రి జరిగిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల మహిళా కబడ్డీ పోటీల ముగింపు ఉత్సవాల సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాజధాని కోసం తాడికొండ-తుళ్ళూరుల మధ్య 22వేలు ఎకరాలు సేకరిస్తున్నారన్నారు.
నరసరావుపేట పట్టణంలోని రెండవ రైల్వేగేటు వద్ద ప్రతిపాదించిన అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం, జేఎన్‌టీయు ఇంజినీరింగ్ కళాశాలను వచ్చే ఏడాది పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తామని, నరసరావుపేట-గుంటూరుల మధ్య షటిల్ సర్వీసు రైలును బడ్జెట్‌లో పెట్టిస్తామని చెప్పారు. గుంటూరు-గుంతకల్ మధ్యన రైల్వే విద్యుద్దీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.అనంతరం కబడ్డీ విజేతలకు షీల్టులు బహూకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, సాయి తిరుమల ఇంజినీరంగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ నలబోతు వెంకటరావు, ఏఎన్‌యూ కబడ్డీ కో ఆర్డినేటర్ సూరినారాయణ తదితరులు పాల్గొన్నారు.