వేదన..రోదన !
♦ కళాశాలల్లో మళ్లీ ర్యాగింగ్ మహమ్మారి
♦ విద్యార్థిని రిషికేశ్వరి మృతితో బహిర్గతం
♦ కాగితాలకే పరిమితమైన యాంటీ ర్యాగింగ్ కమిటీలు
♦ ఉదాశీనంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు
సాక్షి, గుంటూరు : జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతోపాటు పలు కళాశాలల్లో ర్యాగింగ్ మహమ్మారి తిరిగి జడలు విప్పుతోంది. తాము చెప్పినట్టు వినాల్సిందేనంటూ సీనియర్లు వేధింపులకు దిగుతుండటంతో జూని యర్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల నుంచి వస్తున్న నిరుపేద విద్యార్థులు సీనియర్ల వేధింపులకు తట్టుకోలేకపోతున్నారు.
సీనియర్ల చేష్టలు తమ తల్లిదండ్రులకు తెలిస్తే చదువు మానిపిస్తారనే భయంతో వారికి చెప్పుకోలేక లోలోపల మదనపడుతున్నారు. సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడకుండా ప్రతి నెలా కళాశాలలో సమావేశమై దీనిపై చర్చించి చర్యలు తీసుకొనేందుకు యాంటీ ర్యాగింగ్ కమిటీలను ప్రభుత్వం నియమించింది. అయితే ఈ కమిటీలు నిర్వీర్యంగా మారాయని చెప్పవచ్చు. వీరి సమావేశాలు, తీసుకుంటున్న చర్యలు కాగితాలకే పరిమితమవుతుండటంతో అల్లరిమూకలు మరింత రెచ్చిపోతూ ర్యాగింగ్‌కు పాల్పడుతున్నాయి. ర్యాగింగ్ అనేది సీనియర్ విద్యార్థులకు సరదాగా, జూనియర్లకు ప్రాణ సంకటంగా మారుతోంది.
విద్యార్థులపై చర్యలు తీసుకుంటే వారి భవిష్యత్ పాడవుతుందనే ఉద్దేశంతో పోలీస్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. సున్నిత మనస్థత్వం ఉన్న విద్యార్థులు మనోస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహరించకపోతే ర్యాగింగ్ భయంకర రూపం దాల్చే ప్రమాదం లేకపోలేదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
యూనివర్సిటీలో వేధింపులు కొత్తేమీకాదు ...
ఇప్పటి వరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బయటకు పొక్కకుండా లోలోపల జరుగుతున్న ఈవ్‌టీజింగ్ వ్యవహారం రిషికేశ్వరి మృతితో బహిర్గతమైంది. వర్శిటీలో ర్యాగింగ్ జరగడం లేదనే భావన సరైంది కాదని, తనలా ఎంతో మంది విద్యార్థులు ర్యాగింగ్ వల్ల ఇబ్బందులు పడుతున్నారని మృతురాలు తన సూసైడ్ నోట్‌లో పేర్కొనడంతో అధికారులు, పోలీసులు ఉలిక్కిపడ్డారు. వేధింపులు తట్టుకోలేక, ఆ విషయాన్ని తన తండ్రితో చెప్పుకోలేక మనోవేదనకు గురై ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటే యూనివర్సిటీలో ఈవ్‌టీజింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
విద్యార్థులను వేధింపులకు గురిచేసే వారికి తన లేఖతోనైనా కనువిప్పు కలగాలని, ర్యాగింగ్ వల్ల మరొకరు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి రాకూడదంటూ రిషికేశ్వరి రాసిన సూసైడ్ నోట్ ఆమె మానసిక క్షోభకు అద్దం పట్టింది. ఈ సంఘటనకు ముందు మార్చి నెలలో మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి అనే విద్యార్థిని సైతం ఇలాంటి వేధింపులకు గురై హాస్టల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. తనపై ఐదుగురు సీనియర్ విద్యార్థులు వేధింపులకు పాల్పడడమే కాకుండా దాడి చేసి కొట్టారని మార్చి 16న ఫిర్యాదు చేసింది. తాజాగా రిషికేశ్వరి ఉదంతంతోనైనా వర్సిటీ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు మేలుకొని ర్యాగింగ్‌పై పటిష్ట చర్యలు చేపట్టాల్సి ఉంది.