
చకచకా పనులు
ఏఎన్‌యూ/మంగళగిరి రూరల్, న్యూస్‌లైన్: నూతన రాష్ట్ర తొలి సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట మైదానంలో ఈ నెల 8వ తేదీన జరిగే ఈ వేడుకకు అవసరమైన ఏర్పాట్లు 6వ తేదీ సాయంత్రం కల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో జిల్లా యంత్రాంగం చక చకా పనులు చేపడుతోంది. ప్రధానంగా 70 ఎకరాల ప్రాంగణంలో పార్కింగ్‌కు కేటాయించిన 20 ఎకరాలు మినహా మిగిలిన 50 ఎకరాలను చదును చేశారు.
వేదిక నిర్మాణ పనులను మంగళవారం మొదలు పెట్టారు. అలాగే ప్రాంగణంలో బారికేడ్ల ఏర్పాటు, సభా ప్రాంగణం ముఖ ద్వారంలో కటౌట్లు ఏర్పాటు చేయడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన 125 మంది పారిశుద్ధ్య కార్మికులు కంపచెట్లను, చెత్తా చెదారాలను తొలగించి శుభ్రం చేస్తున్నారు.
సభా ప్రాంగణంలో ఇనుప బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. సభావేదిక ప్రధాన రోడ్డు గుంతలమయంగా ఉండడంతో మరమ్మతులు నిర్వహిస్తున్నారు. మైదానంలో విద్యుత్ స్తంభాలను, ప్రత్యేక విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం, ఆర్ అండ్‌బీ పంచాయతీ విభాగం అధికారులు పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ సిబ్బంది మైదానం చుట్టూ విస్తృత బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన అడిషనల్ డీజీ
ప్రమాణ స్వీకార సభా కార్యక్రమానికి సంబంధించి రెవెన్యూ విభాగం నుంచి ప్రత్యేక అధికారిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్, పోలీసుశాఖ నుంచి ప్రత్యేక అధికారిగా నియమితులైన అడిషనల్ డీజీ దామోదర్ గౌతమ్ గవాంగ్, కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. జేసీ వివేక్‌యాదవ్, ఐజీ సునీల్ కుమార్, అర్బన్ ఎస్పీ గోపినాథ్ జెట్టి, బెటాలియన్ డీఐజీ యోగానంద, అర్బన్, రూరల్ అదనపు ఎస్పీలు ధరావత్ జానకి, డి.కోటేశ్వరరావు తదితరులు వారి వెంట ఉన్నారు.
ఏఎన్‌యూలో సమీక్ష..
అనంతరం ఏఎన్‌యూకి తరలి వెళ్లిన ఉన్నతాధికారులు గుంటూరు, కృష్ణా జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్యం, తాగునీటి వసతి, రహదారులు, నిరంతర విద్యుత్ సరఫరా తదితర అంశాల్లో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో సభా వేదిక నిర్మాణం, వేదిక వెనుక భాగంలో మూడు హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
8,500 మంది పోలీసులను బందోబస్తుకు కేటాయించగా ఇప్పటికే సుమారు వెయ్యి మంది విధుల్లో ఉన్నారు. వీఐపీల రాకకు సంబంధించి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అన్ని ప్రధాన హోటళ్లల్లో 50 శాతం రూములు రిజర్వు చేసి ఆయా బాధ్యతలను రెవెన్యూ యంత్రాంగానికి అప్పగించారు. టీడీపీ నాయకులు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ పెద్ద ఎత్తున స్వాగత ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.