వర్సిటీలో సంస్కరణలు | In Varsity reforms | Sakshi
Sakshi News home page

వర్సిటీలో సంస్కరణలు

Published Sat, Aug 1 2015 4:02 AM | Last Updated on Fri, Aug 17 2018 2:08 PM

వర్సిటీలో సంస్కరణలు - Sakshi

వర్సిటీలో సంస్కరణలు

- ప్రవేశ ద్వారం వద్ద నుంచే ప్రారంభం
- అమలులోకి మూడు రకాల పాస్‌ల విధానం
- ఒకే వసతి గృహంలో..ప్రథమ సంవత్సం విద్యార్థులు
- విద్యార్థుల నడుమ స్నేహభావం వెల్లివిరిసేలా చర్యలు
- కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్‌గా ఆర్డీవో భాస్కరనాయుడు
- వర్సిటీని సందర్శించి ఇన్‌చార్జి వీసీతో చర్చించిన ఐజీ, అర్బన్ జిల్లా ఎస్పీ
ఏఎన్‌యూ/సాక్షి గుంటూరు:
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పలు సంస్కరణలకు ఉన్నతాధికారులు నాంది పలుకుతున్నారు. దీనిలో భాగంగా తొలుత వర్సిటీలో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. ఈ మేరకు వర్సిటీలోని కళాశాలలు, కార్యాలయాలు, వసతి గృహాలపై యూనివర్సిటీ, రెవెన్యూ, పోలీసు శాఖల ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతికి వర్సిటీ వ్యవస్థలో నెలకొన్న తీవ్రమైన లోపాలే కారణమని విద్యార్థి సంఘా లు, స్వచ్ఛంద సంస్థలు, మహిళ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలోని యూనివర్సిటీపై దృష్టి సారించిన ప్రభుత్వం వర్సిటీ, పోలీసు, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులకు యూనివర్సిటీని సంస్కరించే  బాధ్యతలను అప్పగించింది.

ర్యాగింగ్ నిర్మూలనతోపాటు, విద్యార్థులకు కల్పించాల్సిన వసతి, సౌకర్యాలపై దృష్టి సారించారు. శుక్రవారం యూనివర్సిటీకి వచ్చిన గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఆర్డీవో భాస్కర్ నాయుడులు ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె.ఆర్.ఎస్. సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్‌లతో సుదీర్ఘంగా చర్చించారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం, బాలుర, బాలికల వసతి గృహాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో తీసుకో వాల్సిన భద్రతాచర్యలు, మౌలిక వసతుల అభివృద్ధి అంశాలను పరిశీలించారు.
 
మూడు రకాల పాస్‌ల విధానం అమలు

ఇక మీదట యూనివర్సిటీలో మూడు రంగుల పాస్‌ల విధానాన్ని అమలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అధ్యాపకులు, సిబ్బందికి ఓ రకం, విద్యార్థులు, పరిశోధకులకు ఒక రకం, అతిథులకు ఒక రకం పాస్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఐజీ సంజయ్ పలు సూచనలు చేశారు. వర్సిటీలోకి ప్రవేశించే ప్రతి వ్యక్తి తన వాహనాన్ని ప్రధాన ద్వారం వద్ద కుడివైపున పార్కు  చేసుకుని పాస్ చెక్ చేయించుకుని వాహనాన్ని తీసుకుని లోపలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే ప్రధాన ద్వారం కుడివైపున ఉన్న చెట్టును  తొలగించి పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్సిటీకి వచ్చే వివిధ విశ్వ విద్యాలయాల అధ్యాపకులు, అతిథులు, సాధారణ సందర్శకులకు కూడా తప్పనిసరిగా విజిటింగ్ పాస్ ఉండాల్సిందేనని ఐజీ సూచించారు.
 
యూనివర్సిటీలో ప్రత్యేక కమిటీలు ...
వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు స్నేహభావంతో మెలిగే విధంగా, విద్య, క్రీడ, సాంస్కృతిక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేయాలని ఐజీ  సూచించారు.  ప్రథమ సంవత్సరం విద్యార్థులంతా కోర్సులతో నిమిత్తం లేకుండా ఒకే వసతి గృహంలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహాల విద్యార్థుల్లో విద్య, క్రీడ స్ఫూర్తిని పెంపొందించేందుకు కల్చరల్, స్పోర్ట్స్, ఎక్స్‌ట్రా కర్క్యూలర్ యాక్టివిటీస్ తదితర కమిటీలను నియమించి ఆయా అంశాల్లో విద్యార్థులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు.
 
యూనివర్సిటీ మ్యాప్ అందజేయండి
బాలికల వసతి గృహాలను సందర్శించిన సందర్భంలో ఐజీ యూనివర్సిటీ అధికారులతో మాట్లాడుతూ వర్సిటీలో చేపట్టాల్సిన చర్యలు, ప్రభుత్వ శాఖలతో సమన్వయం వంటి అంశాలపై ఏర్పాటు చేసిన కో ఆర్డినేషన్ కమిటీకి గుంటూరు ఆర్డీవో భాస్కరనాయుడు కన్వీనర్‌గా వ్యవహరిస్తారన్నారు. ప్రతిమూడు రోజులకొకసారి ఈ కమిటీ సమావేశమై యూనివర్సిటీలో చేపట్టిన పనులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. అనంతరం వర్సిటీ మ్యాప్‌ను అందజేయాలని ఐజీ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement