HIGHER OFFICIALS
-
మీరు గడప దాటండి..: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నికల కోడ్ కారణంగా వంద రోజులు ప్రభుత్వ కార్యక్రమాలు, పనులు నిలిచిపోయాయి. ఇకపై ఉన్నతాధికారులు విధిగా పరిపాలనపైనే దృష్టి సారించాలి. ప్రజలకు సుపరిపాలనను అందించేందుకు క్రమశిక్షణ పాటించాలి. ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సమయపాలనను తప్పనిసరిగా పాటించాలి. ప్రతిరోజూ పనివేళల్లో సచివాలయంలో అందుబాటులో ఉండాలి. కేవలం కార్యాలయాలకు పరిమితం కాకుండా తమ విభాగం పనితీరును పర్యవేక్షించేందుకు వారానికో రోజు విధిగా జిల్లాల పర్యటనలకు వెళ్లాలి. నెలకోసారి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. కార్య క్రమాల అమలు, పనుల పురోగతిని తెలుసుకోవాలి. చాలా జిల్లాల్లో కలెక్టర్లు కార్యాలయాలు దాటడం లేదు. కలెక్టర్లు విధిగా క్షేత్ర పర్యటనకు వెళ్లేలా సీఎస్ చూడాలి. ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ సేవలందించే అన్ని విభాగాలను కలెక్టర్లు సందర్శించాలి..’అని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో 29 ప్రభుత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శాఖల పనితీరుపై పట్టు సాధించాలి ‘ఐఏఎస్ అధికారులందరూ సచివాలయం నుంచి క్షేత్ర స్థాయి వరకు విధిగా తమ పరిధిలోని శాఖలు, విభాగాల పనితీరుపై పట్టు సాధించాలి. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలను ఎప్పటికప్పుడు నేరుగా సీఎంవోతో పంచుకోవాలి. ఒక్కో అధికారి ఒక్కో ఫ్లాగ్ షిప్ ఐడియాను రెండు వారాల్లో ప్రభుత్వానికి సమరి్పంచాలి..’అని ముఖ్యమంత్రి కోరారు. అవసరమైతే ప్రక్షాళన చేయండి ‘మీ శాఖల పని తీరును మెరుగుపరిచేందుకు అవసరమైతే అధికారులు, సిబ్బంది ప్రక్షాళన చేపట్టాలి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు పలువురు ముఖ్యమంత్రులతో పని చేసిన అనుభవమున్న అధికారులు ఇప్పటికీ కీలక విభాగాల్లో ఉన్నారు. వీరు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి తమ పనితీరును చాటుకోవాలి. ప్రజలకు మేలు జరిగే పనులు చేయాలనే సంకల్పంతో విధులు నిర్వహించాలి. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా పాలనను అందించేందుకు బాధ్యతగా పని చేయాలి. అధికారులందరూ ఏకతాటిపై పని చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. వ్యక్తుల ఇష్టాయిష్టాలతో ప్రభుత్వానికి సంబంధం లేదు. అధికారులపై రాగద్వేషాలేమీ లేవు. కేవలం పని తీరు ఆధారంగానే అధికారులకు తదుపరి ఉన్నత అవకాశాలుంటాయి. బాగా పని చేసే వారికి ప్రోత్సాహకాలుంటాయి. లేనిపోని సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దు. ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలి..’అని సీఎం స్పష్టం చేశారు. త్వరలో జిల్లాల పర్యటన త్వరలోనే వారానికో జిల్లా పర్యటనకు వెళతానని రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులతో పాటు క్షేత్ర స్థాయిలో వివిధ కార్యక్రమాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తానని అన్నారు. ప్రజలను స్వయంగా కలుసుకునేలా తన పర్యటన ఉంటుందని చెప్పారు. ఈ మేరకు షెడ్యూలు త్వరలో విడుదల చేస్తామన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంవో ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి పాల్గొన్నారు. -
పశుసంవర్ధక శాఖ సెక్షన్ అధికారిపై సస్పెన్షన్ వేటు?
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన విషయాన్ని దాచి సచివాలయంలో విధులకు హాజరయ్యారన్న ఆరోపణలపై పశుసంవర్ధక శాఖ సెక్షన్ అధికారి ఆయూబ్‌ఖాన్‌ను సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఆ శాఖ ప్రతిపాదనలు పంపించినట్టు సమాచారం. త్వరలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ఆయూబ్‌ఖాన్‌ను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా లేదని తేలింది. ప్రస్తుతం ఆయన నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్లో ఉన్నారు. -
ఏపీ, తెలంగాణ అధికారుల భేటీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన వివాదాల పరిష్కారం దిశగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమై మరో దఫా చర్చలు జరిపారు. ఏపీ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (ఎక్స్అఫీషియో) ఎల్.ప్రేమ్‌చంద్రారెడ్డి, తెలంగాణ ఆర్థిక శాఖ సీనియర్ కన్సల్టెంట్, రిటైర్డ్ ఐఏఎస్ ఎన్.శివశంకర్ల నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమై చర్చలు జరిపారు. రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్-9లో 89 ప్రభుత్వ రంగ సంస్థలుండగా, ఇప్పటికే 53 సంస్థల విభజన విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మిగిలిన వాటిలో నాలుగు సంస్థల విభజనపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోయినా, చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని అధికారవర్గాలు వెల్లడించాయి. వచ్చే సోమవారం మళ్లీ సమావేశమై చర్చలను ముందుకు కొనసాగించాలని నిర్ణయించారు. ఇచ్చిపుచ్చుకునే విధానంలో చర్చల ద్వారా విభజన వివాదాలు పరిష్కరించుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావులు నిర్ణయించిన విషయం తెలిసిందే. -
అందరం కలిసి సుపరిపాలన అందిద్దాం
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాలునీళ్లలా కలిసి మెలిసి పనిచేయాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. అవినీతికి తావు లేకుండా సుపరిపాలన అందించేందుకు అంతా కృషి చేయాలన్నారు. శాసనసభ శీతాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం రాత్రి విజయవాడలోని బరంపార్కులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులకు సీఎం విందు ఇచ్చారు. ఇద్దరు ఎంపీలు కూడా దీనికి హాజరయ్యారు. కలెక్టర్లు, ఎస్పీలు, ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ ఇందులో పాల్గొన్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు! మనకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం అధికారులు, ప్రజాప్రతినిధులు సఖ్యతగా ముందుకు సాగాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో వాటిని ప్రజలకు సంపూర్ణంగా అందించేందుకు పనిచేయాలన్నారు. అహంభావానికి తావు ఇవ్వవద్దని, ప్రజాప్రయోజనాలే అంతిమమని స్పష్టం చేశారు. జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం కోసం తరచూ సమావేశమవ్వాలని, సీఎం కార్యాలయ అధికారులు సహకరిస్తారని సీఎం చెప్పారు. కృష్ణా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల విందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సీఎస్, డీజీపీ 1 నుంచి గ్రామాల బాట జనవరి 1 నుంచి గ్రామ సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, అధికారులు గ్రామాల బాట పట్టాలని ఆదేశించారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను పరిశీలించాలని కోరారు. పథకాల లబ్ధిదారుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తామని, పేరు లేకపోతే అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా సూచిస్తున్నామన్నారు. మనకు ఓటు వేయని వారికి కూడా అర్హులైతే పథకాల ప్రయోజనాలు అందించాలన్నారు. ఉదయం 8 గంటల్లోపు, రాత్రి 9 గంటల తర్వాత అధికారులకు ఫోన్లు చేసి వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలిగించొద్దని ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రజాప్రతినిధులు ఫోన్ చేసినప్పుడు అధికారులు కచ్చితంగా స్పందించాలన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, అధికారుల విందులో సీఎం జగన్, సీఎస్, డీజీపీ -
వైఎస్ జగన్‌తో భేటీ కానున్న ఉన్నతాధికారులు
-
సమ్మెటివ్‌పై రోజుకో ఉత్తర్వు
నల్లజర్ల : విద్యాశాఖలో భాగమైన ఎన్సీఈఆర్టీ ఉన్నతాధికారులు రోజుకోరకంగా తీసుకుంటున్న నిర్ణయాలు అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత బాహ్య మూల్యాంకనం (సమ్మెటివ్) విషయంలో తీసుకున్న నిర్ణయాలతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 6,7,9 తరగతుల విద్యార్థుల వార్షిక పరీక్షల జవాబు పత్రాలను పాఠశాల స్థాయిలో మూల్యాంకనం చేయాలని, వీటిలో ఐదు శాతం మాత్రమే, 8వ తరగతి విద్యార్థుల జవాబు పత్రాలు పూర్తిగా మండల కేంద్రానికి పంపాలని ముందుగా ఉత్తర్వులిచ్చారు. అయితే దీనిని సవరిస్తూ 8, 9 తరగతుల జవాబు పత్రాలన్నింటినీ మండల కేంద్రానికి పంపాలని తాజాగా ఉత్తర్వులిచ్చారని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇదే నిర్ణయం ముందే తీసుకుంటే ఉపాధ్యాయులకు వ్యయప్రయాసలు తప్పేవని చెబుతున్నారు. పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను ఏరోజుకారోజు మండల విద్యావనరుల కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీని వల్ల ఆచరణలో ఎదురయ్యే సమస్యలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడంపై ఉపాధ్యాయవర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. విద్యాబోధన కన్నా బోధనేతర పనులే ఎక్కువైపోయాయని పిల్లలకు చదువు చెప్పడం కంటే కాగితాలపై రాతలకే గం టల సమయం తీసుకుంటున్నామని అంటున్నారు. పదో తరగతి పరీక్షల విధుల్లో చాలామంది ఉపాధ్యాయులు ఉండటంతో పాఠశాలల్లో ఉన్న కొద్దిమంది సమ్మెటివ్ ఉత్తర్వులతో సతమతమవుతున్నారు. -
కడపలోనూ బ్లాక్ మేనేజర్లు!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజానీకానికి చేరాల్సిన కరెన్సీ పక్కదారి పట్టింది. బ్లాక్ మనీ¯ని చెలామణి చేసుకోవడంలో అధికారులు సఫలీకృతులయ్యారు. ఉన్నతాధికారి సిఫార్సులకు కీలక అధికారి తలొగ్గారు. ఆనక బ్యాంకర్లపై ఒత్తిడి పెంచి క్యాష్ చేసుకున్న ఉదంతం జిల్లాలో జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధాని రూ.1000, రూ.500 పెద్దనోట్లు రద్దు చేయడం సామాన్యుల నుంచి ధనికుల వరకూ కుదిపేసింది. ఈ క్రమంలో అధికారులు సైతం బాధితులయ్యారు. అప్పటివరకూ పోగుచేసుకున్న ధనం ఒక్కమారుగా చెల్లుబాటు కాదని తేలడంతో, నగదు మార్పిడికోసం వారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఉన్నతస్థాయి అధికారి ఒకరు బ్యాంకుల కీలక అధికారి ద్వారా సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఆమేరకు కరెన్సీ మార్పునకు సదరు కీలక అధికారి చీఫ్ మేనేజర్లపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. ఈ వ్యవహారం తొలిదశ కరెన్సీ సరఫరాలోనే సాగినట్లు తెలుస్తోంది. ఉన్నతస్థాయి అధికారి తర్వాత అదే పంథాను మరికొంతమంది అధికారులు అనుసరించినట్లు సమాచారం. ఇలా నూతన కరెన్సీ జిల్లాకు చేరిన ప్రతిమారు కొంతమొత్తం పక్కదారి పట్టినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. కాగా ఎంత మొత్తాన్ని పక్కదారి పట్టించారనే విషయంలో స్పష్టత లేకపోవడం గమనార్హం. బ్లాక్ బాబుల్లో సీబీఐ గుబులు తెలుగు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా బ్యాంకుల నుంచి నగదు పక్కదారి పట్టిందని వెలుగుచూడటంతో జిల్లాలో కొందరికి సీబీఐ గుబులు పట్టుకుంది. ధ్రువీకరణ జిరాక్స్‌ల ద్వారా నగదు పక్కాగా దారిమళ్లించిన వైనం వెలుగులోకి రానుందని తెలిసి వారిలో ఆందోళన మొదలైనట్లు సమాచారం. కీలక అధికారి సిఫార్సులకు తలొగ్గి సర్దుబాటు చేస్తే చివరికి అది తమ మెడకు చుట్టుకుంటోందని కొందరు బ్యాంక్ చీఫ్ మేనేజర్లు మథనపడుతున్నారు. జిల్లాలోని కొందరు ఉన్నతాధికారులు బ్యాంకర్ల ద్వారా స్వయంగా నూతన కరెన్సీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తం జిల్లాలో రూ.2,000 కోట్లు దాటినట్లు సమాచారం. ప్రతిరోజు దాదాపుగా రూ.100 కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్దఎత్తున డిపాజిట్లు ఖాతాదారులు, ప్రజానీకం స్వయంగా చేస్తున్నారా? నగదు పక్కదారి పట్టించి, బ్లాక్మనీదారులకు బ్యాంకర్లు అవకాశం కల్పిస్తున్నారా? అనే అంశాన్ని క్షుణ్ణంగా సీబీఐ పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వెలుగుచూసిన ’బ్లాక్ మేనేజర్లు’ జిల్లాలో కూడా ఉన్నట్లు వెల్లడికావడంతో సదరు సార్లు ఎలా తప్పించుకోవాలా అని మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. -
విమర్శలకు తావిస్తున్న నిర్ణయాలు
దామెర పీహెచ్సీ వివాదంపై మళ్లీ విచారణ మహిళా ఉద్యోగికి ఇబ్బందులు ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు రామన్నపేట : వైద్య, ఆరోగ్య శాఖలో మహిళా సిబ్బం దిపై వేధింపుల విషయంలో ఉన్నతాధికారుల నిర్ణయాలు విమర్శలకు తావిస్తున్నాయి. ఒక ప్రభుత్వ వైద్యుడు, మహిళా సిబ్బందిని వేధిం చినట్లు ఉన్నతాధికారులే నిర్ధారించి చర్యల కోసం ఉత్తర్వులు జారీ చేసిన నెలల తర్వాత ఇదే అంశంలో మరోసారి విచారణ జరపాలని నిర్ణయం తీసుకోవడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వైద్యు లు, ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి కింది స్థాయి మహిళా ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. ఆత్మకూరు మండలం దామెర పీహెచ్సీ వివాదంపై వైద్య ఆరో గ్య శాఖ జాయింట్ డైరెక్టర్(ఎపిడమిక్) సుబ్బలక్ష్మీ శనివారం విచారణ చేపట్టారు. ఇందులో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసిన డాక్టర్ గోపాల్‌రావు అసభ్యకరంగా ప్రవరిస్తూ, వేధింపులకు గురిచేశారని మహిళా ఫార్మాసిస్టు, ఇతర సిబ్బంది ఆయనను ఈ ఏడాది మార్చి నెలల్లో నిలదీశారు. గోపాలరావు ఆ సమయంలో క్షమాపణ చెప్పా రు. ఆ తర్వాత అదే తరహాలో వ్యహరిస్తూ సెల్మెసేజ్లతో వేధింపులకు పాల్పడుతుండడం తో మహిళా ఫార్మసిస్టు ఈ ఏడాది మార్చి 22న జిల్లా వైద్యాధికారి సాంబశివరావుకు ఫిర్యాదు చేసింది. ఫార్మాసిస్టు అభియోగాలపై విచారణ కోసం అదనపు జిల్లా వైద్యాధికారి శ్రీరాం, డాక్టర్ పద్మజలను నియమిస్తూ జిల్లా వైద్యాధికారి నిర్ణయం తీసుకున్నారు. దామెర పీహెచ్సీలో ఈ ఏడాది మార్చి 31న అధికారులు విచారణ నిర్వహించి జిల్లా వైద్యాధికారికి నివేదిక అందజేశారు. ఈ అంశంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టరు కార్యాలయానికి జిల్లా వైద్యాధికారి నివేదిక పంపారు. అనంతరం డాక్టర్ గోపాల్‌రావును సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 21న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఫార్మాసిస్టును పీహెచ్సీ నుంచి బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తుర్వులు జారీ చేశారు. అన్యాయం జరిగిందని తాను చేసిన ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహించి వైద్యుడిని సస్పెండ్ చేసిన అధికారులు తనను బదిలీ చేయడం ఏమిటని ఫార్మసిస్టు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.ఆమె బదిలీని నిలిపివేస్తూ ట్రిబ్యునల్ ఉత్తర్వులు చేసింది. దామెర పీహెచ్సీ ఘటనలో ట్రిబ్యునల్ నిర్ణయంతో కొందరు వైద్యులు కొత్త ప్రణాళిక రచించారు. వైద్యుడిపై ఫిర్యాదు చేసిన మహిళా ఫార్మసిస్టును బదిలీ చేయించాలనే ఉద్దేశంతో ఈ అంశంపై మళ్లీ విచారణ జరిపిం చాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. విచారణ అధికారులు తనపై తప్పుడు నివేదిక ఇచ్చారని, మళ్లీ విచారణ జరపాలని డాక్టర్ గోపాలరావు కోరడంతో దీనిపై పునఃవిచారణకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయంలో జెడీ సుబ్బలక్ష్మీ శనివారం వరంగల్‌లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి వచ్చి విచారణ నిర్వహించా రు. పీహెచ్సీలో పని చేస్తున్న మొత్తం సిబ్బం దిని విచారించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని దామెర పీహెచ్సీలో విచారణ జరపకపోవడంపైనా చర్చ జరుగుతోంది. విచారణతో సంబంధలేని ఒక ప్రభుత్వ వైద్యుడు ఈ ప్రక్రియ జరుగుతున్నంత సేపు అక్కడే ఉండడం విమర్శలకు తావిస్తోంది. కింది స్థాయి వారికి న్యాయం జరగదా? పీహెచ్సీ ఘటనతో వైద్య ఆరోగ్య శాఖలో కింది స్థాయి మహిళా సిబ్బందికి న్యాయం జరగదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక శాఖలో మహిళకు ఇబ్బంది అయినప్పుడు ఐదుగురితో ఒక కమిటీ వేయాలి. ఈ కమిటీలో కచ్చితంగా ముగ్గురు మహిళలు ఉండాలి. జిల్లాలో ఈ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదు. మొదటిసారి విచారణ నిర్వహించిన సమయంలో ఫార్మసిస్టు. డీఎంహెచ్‌వోను, ఆరోగ్య శాఖ డైరెక్టరును కలిశారు. వైద్యుడి మానసిక ఆరోగ్య పరిస్థితి తీరు సరిగాలేదని రాజీ చేసుకోవాలని ఇద్దరు ఉన్నతాధికారులు ఫార్మసిస్టుకు చెప్పారు. ఇలాంటప్పుడు మళ్లీ విచారణ ఏమిటి, విచారణ తీరు ఇలా ఉంటే కింది స్థాయి సిబ్బంది ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రారు. – జానపట్ల సునీత, జిల్లా అధ్యక్షురాలు, మెడికల్ హెల్త్ ఉమె¯ŒS అసోసియేష¯ŒS -
వర్సిటీలో సంస్కరణలు
- ప్రవేశ ద్వారం వద్ద నుంచే ప్రారంభం - అమలులోకి మూడు రకాల పాస్‌ల విధానం - ఒకే వసతి గృహంలో..ప్రథమ సంవత్సం విద్యార్థులు - విద్యార్థుల నడుమ స్నేహభావం వెల్లివిరిసేలా చర్యలు - కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్‌గా ఆర్డీవో భాస్కరనాయుడు - వర్సిటీని సందర్శించి ఇన్చార్జి వీసీతో చర్చించిన ఐజీ, అర్బన్ జిల్లా ఎస్పీ ఏఎన్‌యూ/సాక్షి గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పలు సంస్కరణలకు ఉన్నతాధికారులు నాంది పలుకుతున్నారు. దీనిలో భాగంగా తొలుత వర్సిటీలో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. ఈ మేరకు వర్సిటీలోని కళాశాలలు, కార్యాలయాలు, వసతి గృహాలపై యూనివర్సిటీ, రెవెన్యూ, పోలీసు శాఖల ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతికి వర్సిటీ వ్యవస్థలో నెలకొన్న తీవ్రమైన లోపాలే కారణమని విద్యార్థి సంఘా లు, స్వచ్ఛంద సంస్థలు, మహిళ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలోని యూనివర్సిటీపై దృష్టి సారించిన ప్రభుత్వం వర్సిటీ, పోలీసు, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులకు యూనివర్సిటీని సంస్కరించే బాధ్యతలను అప్పగించింది. ర్యాగింగ్ నిర్మూలనతోపాటు, విద్యార్థులకు కల్పించాల్సిన వసతి, సౌకర్యాలపై దృష్టి సారించారు. శుక్రవారం యూనివర్సిటీకి వచ్చిన గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఆర్డీవో భాస్కర్ నాయుడులు ఇన్చార్జి వీసీ ఆచార్య కె.ఆర్.ఎస్. సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్‌లతో సుదీర్ఘంగా చర్చించారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం, బాలుర, బాలికల వసతి గృహాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో తీసుకో వాల్సిన భద్రతాచర్యలు, మౌలిక వసతుల అభివృద్ధి అంశాలను పరిశీలించారు. మూడు రకాల పాస్‌ల విధానం అమలు ఇక మీదట యూనివర్సిటీలో మూడు రంగుల పాస్‌ల విధానాన్ని అమలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అధ్యాపకులు, సిబ్బందికి ఓ రకం, విద్యార్థులు, పరిశోధకులకు ఒక రకం, అతిథులకు ఒక రకం పాస్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఐజీ సంజయ్ పలు సూచనలు చేశారు. వర్సిటీలోకి ప్రవేశించే ప్రతి వ్యక్తి తన వాహనాన్ని ప్రధాన ద్వారం వద్ద కుడివైపున పార్కు చేసుకుని పాస్ చెక్ చేయించుకుని వాహనాన్ని తీసుకుని లోపలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే ప్రధాన ద్వారం కుడివైపున ఉన్న చెట్టును తొలగించి పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్సిటీకి వచ్చే వివిధ విశ్వ విద్యాలయాల అధ్యాపకులు, అతిథులు, సాధారణ సందర్శకులకు కూడా తప్పనిసరిగా విజిటింగ్ పాస్ ఉండాల్సిందేనని ఐజీ సూచించారు. యూనివర్సిటీలో ప్రత్యేక కమిటీలు ... వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు స్నేహభావంతో మెలిగే విధంగా, విద్య, క్రీడ, సాంస్కృతిక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేయాలని ఐజీ సూచించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులంతా కోర్సులతో నిమిత్తం లేకుండా ఒకే వసతి గృహంలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహాల విద్యార్థుల్లో విద్య, క్రీడ స్ఫూర్తిని పెంపొందించేందుకు కల్చరల్, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కర్క్యూలర్ యాక్టివిటీస్ తదితర కమిటీలను నియమించి ఆయా అంశాల్లో విద్యార్థులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూనివర్సిటీ మ్యాప్ అందజేయండి బాలికల వసతి గృహాలను సందర్శించిన సందర్భంలో ఐజీ యూనివర్సిటీ అధికారులతో మాట్లాడుతూ వర్సిటీలో చేపట్టాల్సిన చర్యలు, ప్రభుత్వ శాఖలతో సమన్వయం వంటి అంశాలపై ఏర్పాటు చేసిన కో ఆర్డినేషన్ కమిటీకి గుంటూరు ఆర్డీవో భాస్కరనాయుడు కన్వీనర్‌గా వ్యవహరిస్తారన్నారు. ప్రతిమూడు రోజులకొకసారి ఈ కమిటీ సమావేశమై యూనివర్సిటీలో చేపట్టిన పనులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. అనంతరం వర్సిటీ మ్యాప్‌ను అందజేయాలని ఐజీ సూచించారు. -
తెలంగాణ బ్లాకుల్లో ఇంకా ఏపీ ప్రభుత్వ శాఖలా?
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న విభజన తీరుపై ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా విభజన ప్రక్రియ వేగవంతంగా జరగడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజన ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించిన బ్లాకులలో ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలు కొనసాగడంపై ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. త్వరితగతిన తెలంగాణ సచివాలయంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని రాజీవ్ శర్మ ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా అన్ని శాఖలు ఎస్టాబ్లిష్మెంట్ ఫైళ్లు పూర్తి చేయాలని రాజీవ్ శర్మ ఉన్నతాధికారులకు సూచించారు. -
ఉద్యోగుల పంపకాలపై ఉన్నతాధికారుల భేటీ
-
సచివాలయంలో గవర్నర్ సలహాదారు
హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ సలహాదారు ఏఎన్ రాయ్ బుధవారం సచివాలయానికి విచ్చేశారు. డి బ్లాక్‌లోని తన ఛాంబర్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం సాధారణ పరిపాలన శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. కాగా మరో సలహాదారు సలావుద్దీన్ ఈరోజు మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా గవర్నర్ నరసింహన్‌కు సలహాదారులుగా ఇద్దరు ఉన్నతాధికారులను కేంద్ర హోంమంత్రిత్వశాఖ నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మహారాష్ట్ర డీజీపీగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఎ.ఎన్.రాయ్, అలాగే రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి సలావుద్దీన్ అహ్మద్‌లు నియమితులయ్యారు. రాష్ట్రపతి పాలనతోపాటు రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండనుండడం, ఇక్కడి పాలన పగ్గాలు గవర్నర్ చేతిలోకి వెళ్లనున్నందున.. ఆయన సలహాదారులుగా వీరిద్దరినీ కేంద్ర హోంమంత్రిత్వశాఖ నియమించింది. ఉమ్మడి రాజధాని పాలన అంశాల్లో వీరు గవర్నర్‌కు సహకరిస్తారు. ఇదిలా ఉండగా వీరిద్దరికీ నగరంలోని దిల్‌కుశ్ అతిథిగృహంలో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దిల్‌కుశ్ అతిథిగృహం రాజ్‌భవన్‌కు పక్కనే ఉన్నందున.. గవర్నర్‌కు అందుబాటులో సలహాదారులుంటారనే అభిప్రాయంతో వారికి ఇక్కడే కార్యాలయాలను కేటాయించనున్నారు. -
గవర్నర్‌కు ఇద్దరు సలహాదారులు
-
గవర్నర్‌కు ఇద్దరు సలహాదారులు
ఎ.ఎన్.రాయ్, సలావుద్దీన్ అహ్మద్ నియామకం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు సలహాదారులుగా ఇద్దరు ఉన్నతాధికారులను కేంద్ర హోంమంత్రిత్వశాఖ నియమించింది. ఈ మేరకు మహారాష్ట్ర డీజీపీగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఎ.ఎన్.రాయ్, అలాగే రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి సలావుద్దీన్ అహ్మద్‌లు నియమితులయ్యారు. రాష్ట్రపతి పాలనతోపాటు రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండనుండడం, ఇక్కడి పాలన పగ్గాలు గవర్నర్ చేతిలోకి వెళ్లనున్నందున.. ఆయన సలహాదారులుగా వీరిద్దరినీ కేంద్ర హోంమంత్రిత్వశాఖ నియమించింది. ఉమ్మడి రాజధాని పాలన అంశాల్లో వీరు గవర్నర్‌కు సహకరిస్తారు. ఇదిలా ఉండగా వీరిద్దరికీ నగరంలోని దిల్‌కుశ్ అతిథిగృహంలో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దిల్‌కుశ్ అతిథిగృహం రాజ్‌భవన్‌కు పక్కనే ఉన్నందున.. గవర్నర్‌కు అందుబాటులో సలహాదారులుంటారనే అభిప్రాయంతో వారికి ఇక్కడే కార్యాలయాలను కేటాయించనున్నారు. -
'ప్రజాపంపిణీ వ్యవస్థలో ఇబ్బందులు లేకుండా చూడండి'
-
'ప్రజాపంపిణీ వ్యవస్థలో ఇబ్బందులు లేకుండా చూడండి'
హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థలో ఇబ్బందులు లేకుండా చూడాలని గవర్నర్ నరసింహన్ ఆదేశించారు. ప్రజాపంపణీ వ్యవస్థ, ఫించన్లు, విత్తనాలు తదితర అంశాలకు సంబంధించి ఆయన రాజ్ భవన్ లో ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు. ఈ భేటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి కూడా హాజరైయ్యారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో లోపం లేకుండా చూడాల్సిన బాధ్యతను సక్రమంగా అమలు పరచాలని గవర్నర్ తెలిపారు. మే15లోపు పునర్ వ్యవస్థీకరణ పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు నరసింహన్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల విదేశీ పర్యటనల పట్ల రెండు రోజుల క్రితం గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వివిధ పథకాలు, కార్యక్రమాల అధ్యయనం పేరుతో విదేశీ పర్యటనలకు అనుమతించాల్సిందిగా ఫైళ్లు రావటంతో ఆయన మండిపడ్డారు. విభజన ప్రక్రియ ఒకపక్క, మరోపక్క స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విదేశీ పర్యటనలకు వెళ్లటం ఏమిటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగులు ఎవ్వరికీ విదేశీ పర్యటనలకు అనుమతితో పాటు సెలవులు కూడా మంజూరు చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఈ రోజు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి ప్రజా కార్యక్రమాలకు మరింత దగ్గర ఉండాలని తెలిపారు. -
ఎన్నికల మధ్య విదేశీ పర్యటనలా?
-
రాష్ట్ర విభజన, ఎన్నికల మధ్య విదేశీ పర్యటనలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల (ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల) విదేశీ పర్యటనల పట్ల గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ పథకాలు, కార్యక్రమాల అధ్యయనం పేరుతో విదేశీ పర్యటనలకు అనుమతించాల్సిందిగా ఫైళ్లు రావటంతో ఆయన మండిపడ్డారు. విభజన ప్రక్రియ ఒకపక్క, మరోపక్క స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విదేశీ పర్యటనలకు వెళ్లటం ఏమిటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగులు ఎవ్వరికీ విదేశీ పర్యటనలకు అనుమతితో పాటు సెలవులు కూడా మంజూరు చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గవర్నర్ ఆదేశించారు. ఇక నుంచి విభజన ప్రక్రియ ముగిసే వరకూ ప్రభుత్వఉద్యోగులు ఎవ్వరికీ గవర్నర్ అనుమతి లేకుండా సెలవులూ మంజూరు చేయరు. దీనికి సంబంధించి సీఎస్ మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయనున్నారు. కాగా, విభజన ప్రక్రియ నేపథ్యంలో గవర్నర్ 22న ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు, పోలీసు విభాగాల ఉద్యోగుల విభజనపై, 24న సాగునీరు, ఇంధన, ఆదాయ వనరుల విభజనపై, 26న శాశ్వత ఆస్తుల అంశాలపై సంబంధిత కమిటీల ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. -
జగన్ నిరాహార దీక్షపై ఉన్నతాధికారుల సమీక్ష
హైదరాబాద్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై జైలు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. జైళ్ల శాఖ డీజీ ఆధ్వర్యంలో అధికారులు గురువారం సమావేశమైయ్యారు. జగన్ ఆరోగ్య స్థితిపై అధికారిక బులెటెన్ విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేయడంతో అధికారులు సమావేశమైయ్యారు. ఈ సమీక్షా సమావేశంలో డీజీ సాంబశివరావుతో పాటు ఐజీ సునీల్ కుమార్, డీఐజీ చంద్రశేఖర్, చంచలగూడ సూపరిండెంట్ సైందయ్య పాల్గొన్నారు. రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో ఆయన ఆమరణదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ చేపట్టిన దీక్ష 5వ రోజుకు చేరడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి ఓ నివేదికను పంపారు.