సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల (ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల) విదేశీ పర్యటనల పట్ల గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ పథకాలు, కార్యక్రమాల అధ్యయనం పేరుతో విదేశీ పర్యటనలకు అనుమతించాల్సిందిగా ఫైళ్లు రావటంతో ఆయన మండిపడ్డారు. విభజన ప్రక్రియ ఒకపక్క, మరోపక్క స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విదేశీ పర్యటనలకు వెళ్లటం ఏమిటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగులు ఎవ్వరికీ విదేశీ పర్యటనలకు అనుమతితో పాటు సెలవులు కూడా మంజూరు చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గవర్నర్ ఆదేశించారు.
ఇక నుంచి విభజన ప్రక్రియ ముగిసే వరకూ ప్రభుత్వఉద్యోగులు ఎవ్వరికీ గవర్నర్ అనుమతి లేకుండా సెలవులూ మంజూరు చేయరు. దీనికి సంబంధించి సీఎస్ మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయనున్నారు. కాగా, విభజన ప్రక్రియ నేపథ్యంలో గవర్నర్ 22న ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు, పోలీసు విభాగాల ఉద్యోగుల విభజనపై, 24న సాగునీరు, ఇంధన, ఆదాయ వనరుల విభజనపై, 26న శాశ్వత ఆస్తుల అంశాలపై సంబంధిత కమిటీల ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు.