సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రంగా అన్ని బాలారిష్టాలను దాటుకొని తెలంగాణ ప్రగతిపథంలో పరుగులు తీస్తోందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సాగు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ గణనీయమైన పురోగతిని నమోదు చేస్తూ దూసుకెళ్తోందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ నేడు ఒక సఫల రాష్ట్రంగా, జాతి నిర్మాణంలో చక్కటి పాత్ర పోషిస్తోందన్నారు. రాష్ట్రంలో రూ.40 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, మరే రాష్ట్రంలోనూ సంక్షేమానికి ఇంత పెద్ద భారీగా నిధులను కేటాయించటం లేదన్నారు.
ప్రభుత్వం 1.25 కోట్ల ఎకరాలకు సాగు నీరు అందించే బృహత్తరమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని, అంతర్రాష్ట్ర వివాదాలను అధిగమించి, అటవీ, పర్యావరణ అనుమతులన్నీ సాధించి శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం సాగిస్తోందన్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు ఈ వర్షాకాలం నుంచే ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోందని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, డిండి తదితర ప్రాజెక్టుల నిర్మాణ æపనులు అనతికాలంలో పూర్తిచేసేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందన్నారు. ఒక్క తెలంగాణలోనే... మిషన్ కాకతీయతో రాష్ట్రంలో వేలాది చెరువులు పునరుద్ధరణకు నోచుకుని కళకళ్లాడుతున్నాయన్నారు. తెలంగాణలో ఇంటింటికీ తాగునీరు అందించే మిషన్ భగీరథ వచ్చేనెల పూర్తవుతుందని నరసింహన్ పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా ఒక్క తెలంగాణలోనే వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా అవుతోందన్నారు. రైతుబంధు, రైతుభీమా పథకాలతో తెలంగాణ దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణమని.. రైతుబంధు ఏకంగా ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందుకోవడాన్ని గవర్నర్ గుర్తుచేశారు. కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ వర్గాల కోసం 542 రెసిడెన్షియల్ స్కూళ్ళను ప్రారంభించిందని, ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రంలో కొత్తగా మరో 119 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించబోతోందని గవర్నర్ ప్రకటించారు.
‘డబుల్ బెడ్రూం’వేగవంతం...
పేదల నివాసాలు నివాసయోగ్యంగా, గౌరవ ప్రదంగా ఉండాలనే సదుద్దేశ్యంతో ఇప్పటికే 2.72 లక్షల డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పురోగతిలో ఉందన్నారు. మెరుగైన రవాణా కోసం 3,150 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను సాధించిందని, రాష్ట్రం ఏర్పడే నాటికి 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే, నేడు రాష్ట్రంలో 5,677 కిలోమీటర్ల జాతీయ రహదారులు సమకూరాయని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ ప్రస్తుతమున్న ఔటర్ రింగు రోడ్డు అవతల 340 కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగు రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడంతోపాటు రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామాలకు ఖచ్చితంగా బీటీ రోడ్డు ఉండాలని నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోందని, పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు వచ్చేలా టీఎస్–ఐపాస్ చట్టం తీసుకొచ్చారని.. ఐటీ రంగంలో నూతన అన్వేషణలకు వేదికగా నెలకొల్పిన ‘టీ–హబ్’అంకుర సంస్థలకు అండగా నిలుస్తోందన్నారు.
పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు, గ్రామాలను ఏర్పాటు చేసిందని, కొత్తగా ఏర్పాటు చేసుకున్న 21 జిల్లాలకు తోడుగా త్వరలోనే నారాయణపేట, ములుగు జిల్లాలు కూడా అస్తిత్వంలోకి రాబోతున్నాయని చెప్పారు. అడవుల రక్షణ కోసం కలప స్మగ్మర్ల పై ఉక్కుపాదం మోపాలని సర్కారు నిర్ణయించిందని, కాలుష్యమయంగా మారిన మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం నడుం బిగించిందని, కాళేశ్వరంతో మూసీ నదీ పరీవాహక ప్రాంతాన్ని అనుసంధానం చేయాలని సంకల్పించిందని గవర్నర్ వివరించారు. దేశంలో మరే రాష్ట్రానికి సాధ్యం కాని రీతిలో స్థిరమైన ఆదాయాభివృద్ధి రేటును తెలంగాణ సాధిస్తోందని ఆయనవెల్లడించారు.
అమర జవాన్లకు కేసీఆర్ నివాళి...
అంతకుముందు పరేడ్ మైదానానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ముందుగా ఆర్మీ రిజిస్టర్‌లో సంతకం చేశారు. అనంతరం భద్రతా దళాలు వెంటరాగా అమరజవాన్ల స్థూపం వద్దకు వెళ్లారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరసైనికులకు నివాళులర్పించారు. తర్వాత ప్రాంగణం వద్దకు చేరుకున్న గవర్నర్ నరసింహన్ దంపతులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పుష్ఫగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ జాతీయ పతాకాన్ని ఎగరేసి భద్రతా దళాల గౌరవవందనం స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment