
'ప్రజాపంపిణీ వ్యవస్థలో ఇబ్బందులు లేకుండా చూడండి'
హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థలో ఇబ్బందులు లేకుండా చూడాలని గవర్నర్ నరసింహన్ ఆదేశించారు. ప్రజాపంపణీ వ్యవస్థ, ఫించన్లు, విత్తనాలు తదితర అంశాలకు సంబంధించి ఆయన రాజ్ భవన్ లో ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు. ఈ భేటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి కూడా హాజరైయ్యారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో లోపం లేకుండా చూడాల్సిన బాధ్యతను సక్రమంగా అమలు పరచాలని గవర్నర్ తెలిపారు. మే15లోపు పునర్ వ్యవస్థీకరణ పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు నరసింహన్ సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల విదేశీ పర్యటనల పట్ల రెండు రోజుల క్రితం గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వివిధ పథకాలు, కార్యక్రమాల అధ్యయనం పేరుతో విదేశీ పర్యటనలకు అనుమతించాల్సిందిగా ఫైళ్లు రావటంతో ఆయన మండిపడ్డారు. విభజన ప్రక్రియ ఒకపక్క, మరోపక్క స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విదేశీ పర్యటనలకు వెళ్లటం ఏమిటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగులు ఎవ్వరికీ విదేశీ పర్యటనలకు అనుమతితో పాటు సెలవులు కూడా మంజూరు చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఈ రోజు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి ప్రజా కార్యక్రమాలకు మరింత దగ్గర ఉండాలని తెలిపారు.