సమ్మెటివ్‌పై రోజుకో ఉత్తర్వు
Published Sun, Mar 19 2017 1:29 AM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM
నల్లజర్ల : విద్యాశాఖలో భాగమైన ఎన్‌సీఈఆర్‌టీ ఉన్నతాధికారులు రోజుకోరకంగా తీసుకుంటున్న నిర్ణయాలు అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత బాహ్య మూల్యాంకనం (సమ్మెటివ్) విషయంలో తీసుకున్న నిర్ణయాలతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 6,7,9 తరగతుల విద్యార్థుల వార్షిక పరీక్షల జవాబు పత్రాలను పాఠశాల స్థాయిలో మూల్యాంకనం చేయాలని, వీటిలో ఐదు శాతం మాత్రమే, 8వ తరగతి విద్యార్థుల జవాబు పత్రాలు పూర్తిగా మండల కేంద్రానికి పంపాలని ముందుగా ఉత్తర్వులిచ్చారు. అయితే దీనిని సవరిస్తూ 8, 9 తరగతుల జవాబు పత్రాలన్నింటినీ మండల కేంద్రానికి పంపాలని తాజాగా ఉత్తర్వులిచ్చారని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇదే నిర్ణయం ముందే తీసుకుంటే ఉపాధ్యాయులకు వ్యయప్రయాసలు తప్పేవని చెబుతున్నారు. పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను ఏరోజుకారోజు మండల విద్యావనరుల కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీని వల్ల ఆచరణలో ఎదురయ్యే సమస్యలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడంపై ఉపాధ్యాయవర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. విద్యాబోధన కన్నా బోధనేతర పనులే ఎక్కువైపోయాయని పిల్లలకు చదువు చెప్పడం కంటే కాగితాలపై రాతలకే గం టల సమయం తీసుకుంటున్నామని అంటున్నారు. పదో తరగతి పరీక్షల విధుల్లో చాలామంది ఉపాధ్యాయులు ఉండటంతో పాఠశాలల్లో ఉన్న కొద్దిమంది సమ్మెటివ్ ఉత్తర్వులతో సతమతమవుతున్నారు.
Advertisement
Advertisement